మాస్క్‌లు మైమరిపించే డ్రెస్‌లు
ABN, First Publish Date - 2020-12-30T06:06:35+05:30
2020... ప్రపంచ గతిని మార్చిన ఏడాది. ప్రతి మనిషి జీవితాన్ని మలుపు తిప్పి... ప్రతి రంగాన్నీ ప్రభావితం చేసి...
2020... ప్రపంచ గతిని మార్చిన ఏడాది. ప్రతి మనిషి జీవితాన్ని మలుపు తిప్పి... ప్రతి రంగాన్నీ ప్రభావితం చేసి... మునుపెన్నడూ లేని జీవన విధానానికి నాంది పలికిన సందర్భమిది. కరోనా అందరి గుండెల్లో కల్లోలం రేపినా... వినూత్న ఆవిష్కరణలు, విభిన్న ఆలోచనలకు స్ఫూర్తినిచ్చింది. అలా స్ఫూర్తి పొందిన రంగాల్లో ఫ్యాషన్ ముందుంటుంది. లాక్‌డౌన్‌లతో ‘రూపు’ మార్చుకున్నా... అదే వైవిధ్యంతో అలరించింది. ‘రంగు రంగుల’ కలబోతలతో ఆకట్టుకున్న స్టయిల్స్ ఎన్నో! వాటిల్లో కొన్ని...
సస్టెయినబుల్ ట్రెండ్
మునుపెన్నడూ లేని అనుభవాలను, జీవిత పాఠాలను నేర్పిన సంవత్సరం ఇది. గతంలో ఎలాంటి శ్రమా లేకుండా పొందినవే ఈ ఏడాది అతిముఖ్యమైనవయ్యాయి. జనం సొంతూళ్లకు వెళ్లారు. పాత స్నేహితులను కలిశారు. ఇంటి పట్టునే ఇంత వండుకుని తిన్నారు. మారిన ఈ జీవన విధానంలో అందం నుంచి ఆహార్యం వరకు మనం నేర్చుకున్న పాఠం... పరిమితిగా జీవించడం. ఇందులో నుంచి పుట్టిందే సస్టెయినబుల్ ఫ్యాషన్. 2020లో అత్యధికంగా అనుసరించిన ట్రెండ్ ఇదొక్కటే. పాతవాటిని పారేయకుండా రీడిజైన్ చేయడం, వాటినే ట్రెండ్ సెట్టర్‌గా మలుచుకోవడం... తెర వేల్పులు, బడా పారిశ్రామికవేత్తలు, అతిసామాన్యులు... అందరి రూటూ అదే!
మలాయ్ కలెక్షన్
కొబ్బరిబోండాలో కమ్మని నీళ్లతో పాటు... టెంకకు అతుక్కొని లేలేత కొబ్బరి కూడా ఉంటుంది కదా! ఎంతో రుచిగా... నోరూరిస్తుంటుందా కొబ్బరి. ఆ స్ఫూర్తితోనే ఓ సంస్థ తమ ఫ్యాషన్ బ్రాండ్‌కు ‘మలాయ్’ అని పేరు పెట్టుకుంది. వినూత్నమైన డిజైన్లతో ఓ కలెక్షన్ కూడా రూపొందించింది. ‘లాక్మే ఫ్యాషన్ షో’లో వాటిని ప్రదర్శించింది. మగవారే కాదు... ఆడవారు కూడా ఈ ‘లుంగీ’లేసుకుని అదరగొట్టారు. పువ్వులు, గ్రాఫిక్స్, మెరిసే అంచులు... లుంగీ అదే... కానీ దానిపై డిజైన్లు మాత్రం ఎన్నో. విశేషమేమంటే ఇవన్నీ పరిపక్వత చెందిన కొబ్బరికాయ నీళ్లలోని సెల్యులోజ్ బ్యాక్టీరియా ఆధారిత బయోకంపోజిట్ మెటీరియల్‌తో తయారుచేసినవే.
పలాజో ప్యాంట్స్
ఒంటికి అతుక్కుని ఉండే చుడీదార్స్‌ను మరిపించాయి పలాజో ప్యాంట్స్. ఇంకా చెప్పాలంటే వీటి ధాటికి ఒకప్పుడు ట్రెండీ అయిన స్కిన్నీ చుడీదార్స్ తెరమరుగయ్యాయి. అతితక్కువ కాలంలోనే ఫ్యాషన్ ప్రియుల ఫేవరెట్ డ్రెస్‌లు అయ్యాయి ఇవి. సౌకర్యంగా ఉండడం, గాలి తగిలేలా ఉండడమే కాకుండా ఏ టాప్ వేసుకున్నా మ్యాచింగ్ కుదరడం, చుడీదార్‌లా సంప్రదాయ సొగసులు విరజిమ్మడం దీని ప్రత్యేకత. ఇవన్నీ మగువలను ఎక్కువగా ఆకర్షించాయి. ఇంట్లో వేసుకోవడానికైనా... అకేషన్‌లో మెరిపించడానికైనా పలాజో ప్యాంట్స్‌కు మించింది లేదన్నది యువతుల మాట.
మ్మమ్మ మాస్క్
కరోనా కాలంలో పుట్టుకొచ్చిన ట్రెండ్ ముఖానికి మాస్క్‌లు. వైరస్ బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఇవి తప్పనిసరయ్యాయి. ముక్కు, మూతి కప్పేసినా... వాటిలోనే వైవిధ్యాన్ని వెతికారు ఫ్యాషన్ డిజైనర్లు. దాని ఫలితమే వేసుకున్న డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా, చూడగానే ఆకట్టుకొనేలా లెక్కకు మించి ఫ్యాన్సీ మాస్క్‌లు మార్కెట్‌ను ముంచెత్తాయి. మరికొందరైతే మరో అడుగు ముందుకు వేసి, వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే మాస్క్‌లు రూపొందించారు. వధూవరుల పెళ్లి దుస్తుల్లోనూ ఇవి భాగమయ్యాయి. విందులు, వినోదాలే కాదు... చివరకు నిరసన ప్రదర్శనలు, ఉద్యమాల్లో కూడా ప్లకార్డులై కదిలించాయి.
మామ్ జీన్స్
ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకొంటాం? ఫ్యాషన్‌ను పక్కన పెట్టి, కాస్త లూజుగా ఉండేటివే కదా! ఇప్పుడు ఈ ఆహార్యమే సెలబ్రిటీల స్టయిల్ స్టేట్‌మెంట్‌లో భాగమైంది. స్కిన్ టైట్ జీన్స్‌కు 2020లో పెద్దగా ఆదరణ లేదనే చెప్పాలి. లాక్‌డౌన్ ప్రభావంతో ఇప్పుడు ‘మామ్ జీన్స్’ ట్రెండ్ నడుస్తోంది. హాలీవుడ్... బాలీవుడ్... పరిశ్రమ ఏదైనా ఇదే స్టయిల్. ఓవర్‌సైజ్, బ్యాగీ ఫిట్స్ ఈ ఏడాది ఫ్యాషన్‌ను అధికంగా ఆక్రమించాయి. డెనిమ్స్‌కు కూడా ఈ స్టయిల్ పాకింది. ఫార్మల్ లేదా క్యాజువల్... సూట్ ఏదైనా ‘మామ్ జీన్స్’ కామన్‌గా మారింది.
టైగర్ అండ్ జీబ్రా ప్రింట్స్
పాపులర్ డాక్యుమెంటరీ చిత్రం ‘టైగర్ కింగ్’తో ఈ ట్రెండ్ ఆదరణ పొందిందా! అనేది పెద్ద చర్చ. దీన్ని పక్కన పెడితే... కరోనానామ సంవత్సరంలో తెరపైకి వచ్చి, విశేషంగా అలరించిన మరో ఫ్యాషన్ ‘టైగర్ అండ్ జీబ్రా ప్రింట్స్’. అంటే పులి, చారల గుర్రాన్నీ తలపించే డిజైన్ అన్నమాట. యానిమల్ ప్రింట్ ఇప్పటిది కాకపోయినా... గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఆదరణ పొందింది. చుట్టూ ఎంతమంది ఉన్నా... కళ్లన్నీ మనపైనే వాలిపోయేంతగా ఆకట్టుకుంటుందీ అవుట్‌ఫిట్. సింపుల్ డ్రెస్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవాలనుకొనేవారికి సరైన సూట్ ఇది.
టై అండ్ డై
లాక్‌డౌన్‌తో ఈ ఏడాది అధిక సమయం ఇళ్లలోనే గడిచిపోయింది. దీంతో చాలామంది డిజైనర్లు పాత ఫ్యాషన్లనే కొత్తగా పరిచయం చేశారు. అందులో బాగా పాపులర్ అయింది ‘టై అండ్ డై’ ప్రింట్స్. అరవైల్లో మొదలైన ఈ ట్రెండ్ రెండేళ్ల కిందట ఒక ఊపు ఊపి వెళ్లిపోయింది. మళ్లీ కరోనా కాలంలో సామాన్యులనే కాదు, సెలబ్రిటీలకూ ఇష్టమైన స్టయిల్‌గా మారింది. ఇందులోనే వైవిధ్యం చూపేందుకు ఇళ్లలోనే ప్రయోగాలు చేశారు చాలామంది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి మురిపించారు. ప్రముఖ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ అయితే తన బ్రాండ్ నుంచి ‘డ్రూ హౌస్’ పేరుతో ఒక కలెక్షన్‌నే వదిలాడు.
టాప్ క్రియేటర్స్
క్యారీ మినాటీ
టోటల్ గేమింగ్
టెక్నో గేమర్జ్
జేకేకే ఎంటర్‌టైన్‌మెంట్
ఆశిష్ చంచ్లానీ వినెస్
రౌండ్ 2 హెల్
టెక్నికల్ గురూజీ
కుకింగ్ షుకింగ్ హిందీ
దేశీ గేమర్స్
ది మ్రిదుల్
Updated Date - 2020-12-30T06:06:35+05:30 IST