ప్రేమికులకు కొత్త రూల్స్
ABN, First Publish Date - 2020-06-17T05:49:02+05:30
చెయ్యీ చెయ్యీ కలిపి, చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తూ, కళ్లలో కళ్లు పెట్టి ఊసులు చెప్పుకుంటూ, ‘అడగక ఇచ్చిన మనసే ముద్దూ’ అని పాడుకుంటూ పరవశించే ప్రేమ జంటలకు కరోనా కాలం...
చెయ్యీ చెయ్యీ కలిపి, చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తూ, కళ్లలో కళ్లు పెట్టి ఊసులు చెప్పుకుంటూ, ‘అడగక ఇచ్చిన మనసే ముద్దూ’ అని పాడుకుంటూ పరవశించే ప్రేమ జంటలకు కరోనా కాలం... మా చెడ్డ కాలం! ‘ఎందెందు వెతికిన అందందే’ పొంచి ఉన్న ‘కొవిడ్-19’ దెబ్బకు భౌతిక దూరం తప్పనిసరి అయిపోవడంతో... ‘ఎంత చేరువో... అంత దూరమూ’ అని ప్రేమికులు విరహంతో విలవిలలాడుతున్నారు.
ఆస్తులూ, అంతస్తులూ, కులమతాలూ... ఇలా ప్రేమ కథల్లో ఎన్నో విలన్లు. ఇప్పుడు కొత్త విలన్ వచ్చి చేరింది. అదే కరోనా! చాలా మందిలో ఏ లక్షణాలూ కనబడకుండానే వాళ్ల శరీరాల్లో వైరస్ కాపురం చేసేస్తోందని తేలడంతో ప్రేమికులు దిగాలు పడిపోతున్నారు. దీంతో ఇప్పుడు డేటింగ్ రూల్స్ మారిపోతున్నాయి.
ముసుగు పడింది...
నచ్చినవారిని కలుసుకోవడానికి ముస్తాబవడమంటే అదో పెద్ద తతంగం. ఆకర్షించే దుస్తుల్ని ఎంచుకోవడం మాటలు కాదు. అమ్మాయిలైతే మేకప్ చేసుకోడానికే గంటలు పడుతుంది. ఇక అబ్బాయిలు హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ప్రతీదీ పదిసార్లు ఆలోచించాలి. ఇదంతా మూణ్ణెల్ల కిందటి మాట. ఇప్పుడు ఏ రంగు లిప్‌స్టిక్ వేసుకున్నారు, ఏ బ్రాండ్ సెంట్ పూసుకున్నారనేది కాదు... ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు? మాస్క్ వేసుకున్నారా?, శానిటైజర్ వాడుతున్నారా? అనేదే ముఖ్యమైపోయింది. మాస్క్ ఉంటేనే మాటామంతీ!
కలిసి ప్రయాణం.. కాదు వినోదం...
అమ్మాయీ, అబ్బాయీ ఊసులాడుకున్నాక బైక్ మీదో, కారులోనే అవతలి వ్యక్తిని ఇంటికి దగ్గర్లో దింపడం సర్వసాధారణం. కానీ ఒకే వాహనం మీద ప్రయాణిస్తే, ఒకరి నుంచి మరొకరికీ, తద్వారా వాళ్ల కుటుంబాలకూ, సహోద్యోగులకూ కరోనా వ్యాపించవచ్చు. కాబట్టి ఎవరి వాహనాలు వాళ్లు తీసుకువెళ్లాల్సిందే. లేదంటే ఇళ్లకు దగ్గర్లో కలుసుకోవాల్సిందే! ఇది ‘కొవిడ్-19’ వల్ల వచ్చిన కొత్త రూల్.
ముద్దంటే మోజే... కానీ..!
ప్రేమ అంటేనే ‘ముద్దు’ ముచ్చట! మాయదారి కరోనా ఆ ముచ్చటకి అడ్డుగా మారిపోయింది. ‘‘మీరు ఎంత గొప్ప ప్రేమికులైనా కావచ్చు, కానీ ముద్దులే కాదు కౌగిలింతలూ, కరచాలనాలూ కూడా వద్దే వద్దు. మరీ దగ్గరగా కూడా వెళ్లొద్దు’’ అని వైద్య నిపుణులు తెగేసి చెబుతున్నారు. దీంతో ‘పెదవులు దాటని ముద్దు.. ఇది కరోనా గీసిన సరిహద్దు’ అని పాడుకోవడం ప్రేమికుల వంతవుతోంది.
Updated Date - 2020-06-17T05:49:02+05:30 IST