ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనోడి బీట్‌... ఒబామా ఫేవరెట్‌

ABN, First Publish Date - 2020-12-02T05:52:08+05:30

శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంటే ఎవరి మనసైనా పరవశిస్తుంది. దానికి అర్థవంతమైన సాహిత్యం తోడైతే హృదయానికి చేరువవుతుంది. ఈ రెండు లక్షణాలూ సమపాళ్లలో మేళవించి ఉంటాయి యువ గాయకుడు, సంగీత దర్శకుడు ప్రతీక్‌ కుహాద్‌ గీతాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంటే ఎవరి మనసైనా పరవశిస్తుంది. దానికి అర్థవంతమైన సాహిత్యం తోడైతే హృదయానికి చేరువవుతుంది. ఈ రెండు లక్షణాలూ సమపాళ్లలో మేళవించి ఉంటాయి యువ గాయకుడు, సంగీత దర్శకుడు ప్రతీక్‌ కుహాద్‌ గీతాలు. ఎంతగా అంటే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మనసును హత్తుకొనేంతగా. అవును... అతడి బాణీ ఒబామా ఇష్టమైన  పాటల్లో ఒకటిగా నిలిచింది. ఏమిటా పాట? ఎవరీ ప్రతీక్‌? చదివేద్దాం రండి...


ప్రతీక్‌ కుహాద్‌... నిన్న మొన్నటి వరకు ఈ పేరు పెద్దగా తెలియదు. కానీ ఎప్పుడైతే అతడి పాట ఒబామాకు నచ్చిందో అప్పటి నుంచి ఒక్కసారిగా ప్రపంచమంతా ప్రతీక్‌ పేరు మారుమోగింది. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అతడికి మొదటి నుంచి సంగీతమంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆరేళ్లప్పుడే గిటార్‌ నేర్చుకున్నాడు. టీనేజీలోనే రాయడమూ ప్రారంభించాడు. అప్పటికి అది అతడి అభిరుచి మాత్రమే. కంపోజర్‌ కావాలనో, దాన్నే కెరీర్‌గా ఎంచుకోవాలనో ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ‘న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం’ నుంచి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందాడు. 


వదిలిపెట్టి మళ్లీ పట్టి... 

‘‘తెలిసీ తెలియని వయసులో గిటార్‌ పట్టుకున్నాను. ఐదారు రోజుల తరువాత వదిలిపెట్టేశాను. ఇష్టం లేక కాదు... కష్టం అనిపించింది. హైస్కూల్‌కు వచ్చాక మళ్లీ గిటార్‌ మొదలెట్టాను. అప్పుడూ కొనసాగలేదు. నాలో సంగీతాభిలాష మాత్రం అలానే పెరుగుతూ వచ్చింది. కొంత కాలం మా అక్క స్నేహితుల దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నాను. తను బెంగళూరులో ఉండేది. అక్కడి నుంచి క్యాసెట్లు పంపిస్తుండేది. వాటివల్ల ప్రపంచ ప్రఖ్యాత కళాకారుల పాటలు వినే అవకాశం దక్కింది’’ అంటూ ప్రతీక్‌ నాటి సంగతులు గుర్తు చేసుకున్నాడు. 


కళాకారుడిని మేల్కొలిపాయి...   

చదువైపోగానే ప్రతీక్‌ ఓ ఫైనాన్స్‌ సంస్థలో కన్సల్టెంట్‌గా చేరాడు. కొంత కాలం అక్కడ పనిచేశాడు. అయితే అమెరికాలో ఉండడంవల్ల అతడికి ఎలియట్‌ స్మిత్‌, లారా మార్లింగ్‌, నిక్‌ డ్రేక్‌ తదితర ప్రముఖ కళాకారుల సంగీతం వినే అవకాశం దక్కింది. అంతర్లీనంగా వారి ప్రభావం అతడిపై అధికంగా పడింది. అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. ‘‘ఆ పాటలు వింటూ మళ్లీ గిటార్‌ పట్టుకున్నాను. సొంతంగా పాటలు రాయడం మొదలుపెట్టాను. నిజానికి సంగీతాన్ని ఎప్పుడూ అంతగా పట్టించుకోలేదు. కానీ వారి ప్రతిభ నాలోని కళాకారుడిని మేల్కొలిపింది’’ అని చెప్పుకొచ్చాడు ఈ యువ సంగీతకారుడు. 


ఉద్యోగం వదిలి స్వదేశానికి... 

ప్రతీక్‌కు సంగీతంపై ప్రేమ రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. దీంతో కొలువు కొన్నాళ్లకే పరిమితమైంది. ఉద్యోగం వదిలేసిన వెంటనే అతడు స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. కెరీర్‌పై దృష్టి పెట్టాడు. 2011లో తొలి ఆల్బమ్‌ ‘సమ్‌థింగ్‌ రాంగ్‌’ విడుదల చేశాడు. దానికి మంచి పేరైతే వచ్చింది కానీ ఊహించినంతగా అవకాశాలు రాలేదు. నిరాశపడ్డాడు. కానీ వెనకడుగు వేయలేదు. రెండేళ్ల విరామం తరువాత ‘రాత్‌ రాజీ’ పేరుతో మరో ఆల్బమ్‌ తెచ్చాడు. ఈ హిందీ ఆల్బమ్‌లో పాటలు పక్కింటి కుర్రాడు పాడినట్టు ఉన్నాయి తప్ప, ప్రత్యేకంగా అనిపించవు. ‘‘ఆ సమయంలో ప్రముఖ సంగీతకారుడు జెఫ్‌ భాస్కర్‌ నాలో స్ఫూర్తి నింపారు. టేలర్‌ స్విఫ్ట్‌, రిహానా, మడోనాలతో కలిసి పనిచేసిన ఆయన... ‘ప్రసిద్ధ కళాకారులు పాటలు విని, మరింత శ్రావ్యంగా పాడటానికి ప్రయత్నించు’ అని సలహా ఇచ్చారు. దాంతో ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి మెలోడీలపై దృష్టి పెట్టాను’’. 




రాత మార్చిన సందర్భం... 

రాసి కోసం కాకుండా కంపోజ్‌ చేసిన ప్రతి పాటా జనం హృదయాలను చేరాలనేదే ప్రతీక్‌ ఆకాంక్ష. దాని కోసమే ఏడాదికి ఐదారు పాటలకు మించి చేయలేదు. అతడికి ప్రతి గీతం ప్రత్యేకమే. మనసు పెట్టి పనిచేస్తాడు. అలా కంపోజ్‌ చేసిందే... ‘కోల్డ్‌ ప్రెస్‌’. 2017లో విడుదల చేసిన ఈ పాట అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు తెగ నచ్చింది. 2019లో ఆయనకు ఇష్టమైన టాప్‌ 35 సాంగ్స్‌లో ‘కోల్డ్‌ ప్రెస్‌’ కూడా ఉంది. బాణీ, భావం రెండూ ఆయన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. ‘‘ఈ విషయం తెలిసి ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఢిల్లీలోని మా ఇంట్లో ఉన్నాను అప్పుడు. లేచి చూసే సరికి మొబైల్‌ ఫోన్‌లో వందల మెసేజ్‌లు ఉన్నాయి. ‘నువ్వు అద్భుతం. నీ ఘనత అమోఘం’ అంటూ ఆ సందేశాల్లో ఉంది. వాళ్లంతా ఎందుకలా అంటున్నారో మొదట అర్థం కాలేదు. తరువాత తెలిసింది... ఒబామా ఫేవరెట్‌ లిస్టులో నేను పాడిన ‘కోల్డ్‌ ప్రెస్‌’ పాట ఉందని’’ అంటూ ప్రతీక్‌ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇదే అతడి రాతను మార్చింది. అతడి సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. 


విరహ ప్రేమ గీతం...   

అమెరికన్లకు పెద్దగా పరిచయం లేని తన పాట ఒబామాకు ఎలా చేరిందో ప్రతీక్‌కు ఇప్పటికీ అంతుపట్టని విషయం. ‘‘ఏదిఏమైనా నా పాట ప్రఖ్యాత కళాకారులు బ్రూస్‌ స్ర్పింగ్‌స్టీన్‌, డబేబీ, లిజో, బియాన్సే గీతాల సరసన నిలిచింది. విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఇది నాకెంతో గర్వకారణం. నా కెరీర్‌కు ఊహించని ఊపునిచ్చింది. ఈ పాటలో బాలీవుడ్‌ బీట్‌లు, భాంగ్రా జాడలు కనిపించవు. చాలా ప్రశాంతంగా సాగిపోతుంటుంది. ఇరువురు ప్రేమికుల మధ్య తలెత్తే ఒడుదొడుకులను ప్రతిబింబిస్తుంది. ప్రేమగా మొదలై... విరహంతో ముగుస్తుంది’’ అని పాట గురించి వివరించాడీ యువ కళాకారుడు. మొదట దీన్ని ఓ కచేరీలో పాడాడు ప్రతీక్‌. అక్కడ అతిథుల నుంచి మంచి స్పందన రావడంతో, తరువాత రికార్డింగ్‌ చేశాడు. ప్రతీక్‌ సంగీతంలోని గొప్పతనం... ప్రతి పాటలో జీవిత బంధాలు ప్రతిబింబిస్తాయి. ఆశలు నింపడంతో మొదలై గుండెలు బద్ధలవ్వడంతో ముగుస్తాయి. 


ఆరు మిలియన్లు దాటేసింది... 

‘‘భారత్‌లో మంచి గాయకుడిగా పేరు తెచ్చుకోవాలంటే హిందీ పాటలు పాడాలంటారు. ఇంగ్లిష్‌లో పాడితే మెట్రో నగరాల్లోని వారికే చేరుతుందనే దురభిప్రాయం ఉంది. కానీ ‘కోల్డ్‌ మెస్‌’ ఆ వాదన తప్పని నిరూపించింది’’ అంటున్న ప్రతీక్‌ కొత్త సంవత్సరంలో సరికొత్త ఆల్బమ్‌ తెచ్చే పనిలో నిమగ్నమయ్యాడు. ఇక మొన్నామధ్య వదిలిన ‘కసూర్‌’ పాటను యూట్యూబ్‌లో ఇప్పటికి 62 లక్షల మందికి పైగా వీక్షించారు. స్టార్‌ హీరోలో టీజర్లు లాగా అతడి పాట కోసం ఎదురు చూసే అభిమానులూ అధికంగానే ఉండడం విశేషం.


Updated Date - 2020-12-02T05:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising