ఈ హోటళ్లు ప్రేమికులకు ప్రత్యేకం
ABN, First Publish Date - 2020-10-14T05:17:57+05:30
ప్రేమకు ప్రేమికులు ఉంటే సరిపోతుంది. మరి వాళ్ల భావాలను ఒకరికొకరు వ్యక్తపరుచుకోవాలంటే..? కాస్తంత ఏకాంతం కావాలి! ఇంట్లో కుటుంబ సభ్యులు...
వెరైటీ
ప్రేమకు ప్రేమికులు ఉంటే సరిపోతుంది. మరి వాళ్ల భావాలను ఒకరికొకరు వ్యక్తపరుచుకోవాలంటే..? కాస్తంత ఏకాంతం కావాలి! ఇంట్లో కుటుంబ సభ్యులు... బయటికెళితే స్నేహితులు... కలిసి కమ్మగా నాలుగు మాటలు మనసు విప్పి మాట్లాడుకోవాలంటే ఎక్కడ కుదురుతుంది! అదీ హాంకాంగ్‌లాంటి మహానగరాల్లో అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. ఈ అసౌకర్యాన్ని అర్థం చేసుకున్నారు అక్కడి హోటళ్ల యజమానులు. అందుకే వారి ఏకాంతం కోసం ‘లవ్ హోటల్స్’ తెరిచారు. ఇప్పుడు వాటికి మాంచి గిరాకీ అక్కడ.
ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న మహానగరాల్లో హాంకాంగ్ ఒకటి. పర్యాటక ప్రాంతం కూడా కావడంతో ఇక్కడ మామూలు హోటళ్లకేం కొందవలేదు. లెక్కకు మించే ఉన్నాయి. అయితే స్థానికంగా నివసించే యువతీ యువకులతోనే అసలు సమస్యంతా. చూపూ చూపూ కలిసి... ప్రేమ పుట్టిన తరువాత... దాన్ని ఆసాంతం ఆస్వాదించలేకపోతున్నారట. ఇది ఇవ్వాల్టిది కాదు... ఎన్నో ఏళ్లుగా ఉన్న ఇబ్బంది. ఇల్లు ఇరుకైనది కావడం... అందులో కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉండడం, బయట ఎప్పుడూ చుట్టూ ఎవరో ఒకరు ఉండడం ఇందుకు ప్రధాన కారణాలు. దీంతో ఏకాంతానికి ఇంత చోటే దొరకడంలేదని ప్రేమికులు వాపోతున్నారు. ఇలా అసౌకార్యనికి గురవుతున్నవారిలో పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య జంటలే అధికం.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని స్థానిక హోటళ్ల యజమానులు ఓ ఆలోచన చేశారు. అదే ‘లవ్ హోటల్’. వాస్తవానికి ఇవి హాంకాంగ్‌లోనే పుట్టలేదు. జపాన్‌లోని ముఖ్యనగరాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. హాంకాంగ్‌లోనూ దశాబ్దాల కిందటే ప్రారంభమైనా... ఈ మధ్య వీటికి గిరాకీ బాగా పెరిగింది. ఒకటితో మొదలై ఇప్పుడు మూడొందలకు పైగా లవ్ హోటళ్లు ఆ నగరంలో నడుస్తున్నాయి. వీటిల్లో గంటకు ఇంత అని చెల్లించి గదులు బుక్ చేసుకోవచ్చు. ఎవరో చూస్తారనో... ఇంకెవరో ఏదో అనుకొంటారనో బెరుకు, భయం లేకుండా ప్రేమ జంటలు ప్రశాంతంగా తమ ముద్దు ముచ్చట తీర్చుకోవచ్చు. ఇటీవల అవర్లీ బేస్‌డ్ అనే కొత్త ట్రెండ్ కూడా మొదలైంది. అంటే రోజుల లెక్కన కాకుండా గంటల పద్ధతిలో రూమ్ అద్దెకు తీసుకోవడం. ధరలు కూడా అందుబాటులో ఉండడంతో అన్ని వర్గాల వారికీ లవ్ హోటళ్లు ఫేవరెట్ స్పాట్‌గా మారాయి. ఈ గదుల్లో టీవీ, వీడియో గేమ్‌లు కూడా ఉంటాయి.
ఇంకో విశేషమేమంటే కొత్తగా పెళ్లయిన జంటలు కూడా ఏకాంతం కోసం ఈ హోటళ్లను బుక్ చేసుకొంటున్నారట. వారిదీ అదే సమస్య. చిన్న చిన్న గదుల ఇళ్లలో తల్లితండ్రులు కూడా ఉండడంవల్ల ఏకాంతమనేదే దొరకడంలేదట. అందుకే వారికీ ఇవి తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. అయితే ఈ హోటళ్లలో గదులు దొరకడం అంత సులువేమీ కాదు. కొన్నిసార్లు గంటలతరబడి లైన్‌లో నిలుచోవాల్సి వస్తుంది. కరోనా ప్రభావంతో డెబ్భై శాతానికి పైగా పడిపోయిన వ్యాపారం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది.
Updated Date - 2020-10-14T05:17:57+05:30 IST