ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ నలుగురు

ABN, First Publish Date - 2020-11-04T06:15:48+05:30

బంధాలు, రక్తసంబంధాలు, స్నేహాలను మాయం చేసిన మహమ్మారి కాలం ఇది. కరోనా పేరు చెబితేనే అల్లంత దూరం పారిపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్ధరాత్రి సమయం... పెన్నా నది తీరం...  ఓ అంబులెన్స్‌ వచ్చి ఆగింది. అందులో నుంచి మూట కట్టి ఉన్న మూడు కరోనా మృతదేహాలను బయటకు తీశారు సిబ్బంది. వాటిని ఈడ్చుకెళెతూ గోతిలో పడేసి మట్టి కప్పేశారు. అటుగా వెళుతున్న కొందరు యువకులు ఆ దృశ్యాన్ని వీడియో తీసి... సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఆ హృదయవిదారక దృశ్యం ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా’ స్వచ్ఛంద సంస్థ కుర్రాళ్లను కదిలించింది. మేమున్నామని ముందుకొచ్చి... కరోనా మృతులకు అంతిమసంస్కారాలు చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.


బంధాలు, రక్తసంబంధాలు, స్నేహాలను మాయం చేసిన మహమ్మారి కాలం ఇది. కరోనా పేరు చెబితేనే అల్లంత దూరం పారిపోతున్నారు. బాధితులను ఊళ్లో నుంచి... ఇంట్లో నుంచి గెంటేసిన సందర్భాలూ కొల్లలు. ఆ వైరస్‌ నుంచి కోలుకోలేక... విగతజీవులుగా మారిన ఎందరో... అందరూ ఉన్నా అనాథలుగానే వెళ్లిపోతున్నారు. ఇలాంటి చిత్రాలు చూసి నెల్లూరుకు చెందిన ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా’ యువకుల మనసు ద్రవించింది.


ఎవరూ లేకపోతేనేమీ... ‘దేవుడిచ్చిన బిడ్డలం’ మేమున్నామంటూ కులమతాలకతీతంగా... మృతుల ఆచారవ్యవహారాలకు అనుగుణంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఎంతో బతుకు బతికి... చివరకు పాడె మోసేందుకు ఆ నలుగురూ లేనివారికి ‘ఆత్మ’బంధువులవుతున్నారు. అలా ఇప్పటివరకు 140 మృతదేహాలకు అంతిమసంస్కారాలు నిర్వహించారు. 


సదా సేవలో... 

సేవ, న్యాయం, రక్షణ నినాదంతో 2007లో ఆవిర్భవించింది ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా’. బడుగు, బలహీన వర్గాలవారి హక్కులు, ఆరోగ్యం కోసం కృషి చేస్తుందీ స్వచ్ఛంద సంస్థ. వారు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందేందుకు సహకరిస్తోంది. నెల్లూరులోనే కాదు... దేశవ్యాప్తంగా ఈ సంస్థ కార్యకలాపాలు నడుస్తున్నాయి. 2015లో నెల్లూరును వరద ముంచెత్తినప్పుడు సంస్థ సభ్యులు బాధితులకు సహాయం అందించారు. 




కదిలించిన వీడియో... 

సేవకు ఎప్పుడూ ముందుండే సంస్థ సభ్యులను ఓ వీడియో కలచివేసింది. నెల్లూరు శివారు ప్రాంతంలోని జాతీయ రహదారి పక్కన... పెన్నా నది ఒడ్డున కరోనా మృతదేహాలను విచక్షణారహితంగా పూడ్చిపెట్టిన వీడియో అది. ఆ క్షణమే వారు తమ ప్రాంతంలో ఇకపై ఇలాంటి ఘటనలు జరగకూదని నిర్ణయించుకున్నారు. కానీ కరోనా మృతులకు అంతిమసంస్కారాలంటే ప్రాణంతో చెలగాటమే. అయినా వారు వెనకాడలేదు.


మహారాష్ట్రలోని తమ సంస్థ ప్రతినిధులను అడిగి ఖననం ఎలా చేయాలో, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు. ఆ తర్వాత జాయింట్‌ కలెక్టర్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ను కలిసి కరోనా మృతదేహాల దహన సంస్కారాలు చేసే అవకాశం కల్పించమని అభ్యర్థించారు. వారి అనుమతితో పీపీఈ కిట్లు, బ్లీచింగ్‌, శానిటైజర్లు... ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు పాటిస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 


మానవత్వమే మతం...  

కరోనా మృతదేహాల అంత్యక్రియల కోసం సంస్థ సభ్యులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. జిల్లా మొత్తం వంద మంది వరకు సభ్యులు ఉండగా, సోమవారం నుంచి ఆదివారం వరకు బ్యాచ్‌లుగా విభజించుకున్నారు. ఒక్కో బ్యాచ్‌కు ఎనిమిది మంది నుంచి పది మంది సభ్యులు ఉంటారు. జిల్లా పరిధిలో ఎక్కడి నుంచి సమాచారం అందినా శ్రమ అనుకోకుండా అక్కడికి వెళతారు. కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు. మృతుల బంధువులు డబ్బు ఇవ్వబోయినా వారు సున్నితంగా తిరస్కరిస్తారు. మరణించినవారు ఏ మతం, ఏ కులం వారన్నది సంస్థ సభ్యులు పట్టించుకోరు. వారి దృష్టిలో అంతా మనుషులే. ఎవరైనా తమవారేననే ఆత్మీయ భావంతో సేవలు అందిస్తున్నారు.


 గోళ్ల రామకృష్ణ, నెల్లూరు

ఫొటోలు: ఎస్‌డీ జాకీర్‌





భయపడిపోయేవారు...

కరోనాతో మృతి చెందిన వారి దగ్గరకు రావాలంటేనే హడలిపోయేవారంతా. ఆ సమయంలో మేము ముందుకు వచ్చాం. మొదట్లో రోజుకు పది మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేశాము. ఇప్పుడు మరణాలు బాగా తగ్గాయి. మృతుల కుటుంబ సభ్యులు కూడా సహకరించేవారు. అయితే అవగాహనా రాహిత్యంతో చుట్టుపక్కల వారు మమ్మల్ని దూరం పెట్టారు. మేము అవేమీ పట్టించుకోలేదు. క్రమంగా అందరిలో అవగాహన పెరిగింది. 

- సయ్యద్‌ ఖాసీఫ్‌, సంస్థ జిల్లా అధ్యక్షుడు




ఆ గౌరవం దక్కాలి...

మనిషి బతికున్నప్పుడే కాదు.. మరణించిన తరువాత కూడా అదే గౌరవం దక్కాలి. కరోనా మృతులను గౌరవించండి. మేము ఇప్పటికి 140కి పైగా ఖనానాలు చేశాం. దీనిని గొప్ప కార్యంగా భావిస్తున్నాం. కరోనాకు భయపడి పారిపోవద్దని, బంధాలు, బాంధవ్యాలు మరచిపోవద్దని మమ్మల్ని దూరం పెట్టినవారికి చెప్పాం. అందరినీ కోరేది కూడా అదే: కరోనాను ధైర్యంగా ఎదుర్కొందాం. మానవత్వాన్ని పరిమళించనిదాం.  

- షేక్‌ ఇమామ్‌భాషా, సంస్థ కార్యదర్శి


Updated Date - 2020-11-04T06:15:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising