మీ శరీరం మీ గురించి చెబుతుంది
ABN, First Publish Date - 2020-11-04T06:20:07+05:30
మీ పెదాలు మాట్లాడతాయి. ఇందులో వింతేముందనేగా? పెదాలే కాదు... మీ శరీరంలోని ప్రతి భాగాన్నీ చదివేయవచ్చు.
మీ పెదాలు మాట్లాడతాయి. ఇందులో వింతేముందనేగా? పెదాలే కాదు... మీ శరీరంలోని ప్రతి భాగాన్నీ చదివేయవచ్చు. వాటిని బట్టి మీ వ్యక్తిత్వం ఏమిటో, స్వభావం ఎలాంటిదో చెప్పేయవచ్చు. నమ్మలేకపోయినా ఇది నిజం అంటోంది ప్రముఖ దినపత్రిక ‘ది సన్’ కథనం. ఎలాగంటారా? మీరే చదవండి...
మెరిసే చర్మం
సంపన్నులైన మగవారికి ఆరోగ్యకరమైన జీవన శైలి, మంచి ఆహారపు అలవాట్లు కూడా ఉంటాయనేది ఓ అధ్యయన సారాంశం. వీటివల్ల వారి చర్మం కాంతివంతంగా మారుతుందట. అయితే అలాంటి మగవారితో జత కట్టాలనుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలట కూడా! ఎందుకంటే ఆ తరహా వ్యక్తులు ఎదుటివారిపై ఆధిపత్యం సాధించాలనే ధోరణిలో ఉంటారట!
పొడవైన ముక్కు
పొడుగాటి ముక్కు ఉన్నవారు అబద్దాలకోరులనే అపోహ ఒకటి ఉండేది. ఇది నిజం కాదు. అయితే వీరు ఉన్నత స్థితిలో ఉండాలనే గాఢమైన వాంఛతో ఉంటారు. పొట్టి ముక్కువారు ముక్కోపులట. స్నబ్‌నోస్ వారిలో పరిణతి తక్కువట. గ్రీక్, హాక్, రోమన్, నుబియన్... మొత్తం 1300 మంది ముక్కులపై అధ్యయనం చేసిన తరువాత ఇజ్రాయెల్‌లోని బెన్-గురియన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అబ్రహమ్ తమీర్ ఈ అంచనాకు వచ్చారు.
పుష్టిగా ఉండే ముఖం
ఈ తరహా ముఖం ఉంటే శృంగార పురుషులట. ‘యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో’ బయాలజిస్ట్ ర్యాండీ థార్న్‌హిల్ అధ్యయనం ప్రకారం సిమెట్రికల్ ఫేస్ గలవారిలో మగువలను మెప్పించగల సామర్థ్యం ఉంటుంది. అందుకే ఇలాంటి వారిని చూడగానే అమ్మాయిలు మనసు పారేసుకుంటారట.
హై చీక్స్
మలార్ బోన్ కళ్లకు దగ్గరగా ఉన్నవారిలో దూకుడు ఎక్కువట. వీరికి కోపం ముక్కు మీదే ఉంటుంది. చీక్ బోన్స్‌కు, ముక్కుకు మధ్యనున్న దూరాన్ని బట్టి వారు ఎంత కోపిష్టో చెప్పవచ్చనేది ఆంటారియోలోని ‘బ్రోక్ యూనివర్సిటీ’ శాస్త్రవేత్తల అధ్యయన సారాంశం. చీక్‌బోన్స్ పెద్దవిగా, అత్యధిక స్థాయిలో టెస్టోస్టెరాన్ గలవారైతే మరింత దూకుడుగా
ఉంటారట.
పొడవాటి వేళ్లు
ఉంగరం వేలు పొడవుగా ఉన్నవారికి సరైన కొలతలున్న మగువ తోడు దొరికే అవకాశాలు ఎక్కువట. ఇది పోలండ్‌లోని జగిలోనియన్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలిన అంశం. గర్భంలో ఉండగా టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా విడుదల కావడం వల్ల ఈ పురుషోచిత లక్షణాలు రూపుదిద్దుకుంటాయనేది వారి అభిప్రాయం.
చబ్బీ టమ్మీ
ఇలాంటివారు శృంగారాన్ని ఎక్కువసేపు ఆస్వాదిస్తారట. టర్కీలోని ‘ఎర్సియస్ యూనివర్సిటీ’ ఆచార్యుల పరిశోధనలో అధిక బరువుకు, శృంగార సామర్థ్యానికి మధ్య సంబంధం ఉందని తేలింది. భారీకాయుల్లో సెక్స్ హార్మోన్ అత్యధిక స్థాయిలో ఉండడం వల్ల ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొంటారనేది పరిశోధకులు చెబుతున్నారు.
పొడవాటి కాళ్లు
ఎదుటివారు వీరికి ఇట్టే ఆకర్షితులవుతారట. ఇలాంటి మగవారిని సరైన జోడీగా ఆడవారు భావిస్తారని ‘కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం’ శాస్త్రవేత్తల పరిశోధన చెబుతోంది. పొట్టి కాళ్లున్నవారికి మధుమేహం, హృదయ సంబంధిత రోగాలు, బీపీ, డెమెన్షియా వంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు.
‘పది’ దాటిన పాదాలు
పదో నంబర్, దాని కంటే ఎక్కువ సైజు పాదాలున్న మగవారితో కాస్తంత జాగ్రత్తగా ఉండమంటున్నారు పరిశోధకులు. ఏడో నంబర్ నుంచి తొమ్మిదో నంబర్ సైజు పాదాల వారితో పోలిస్తే వీరిలో మోసగించే లక్షణాలు అధికమట. పెళ్లయినవారి సరికొత్త బంధాల కోసం ఏర్పాటు చేసిన ఓ డేటింగ్ సైట్ అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడించింది. మరి మీ ఛాయిస్ ఏమిటి!
Updated Date - 2020-11-04T06:20:07+05:30 IST