కేరళ కుట్టి
ABN, First Publish Date - 2020-12-02T06:01:45+05:30
సీన్ ఓపెన్ చేస్తే హీరో రామ్, ఒక అమ్మాయి నోటికి గుడ్డ కట్టి, కారు డిక్కీలో పడేసి ఎక్కడికో తీసుకెళుతుంటాడు. ఆ కారు డ్రైవింగ్ చేస్తూ హీరో తన కథ చెప్పడం మొదలుపెడతాడు. రామ్, రమేశ్, లక్ష్మి... ముగ్గురూ స్నేహితులు. పారిశ్రామికవేత్తలు కావాలన్నది వారి కల...
సీన్ ఓపెన్ చేస్తే హీరో రామ్, ఒక అమ్మాయి నోటికి గుడ్డ కట్టి, కారు డిక్కీలో పడేసి ఎక్కడికో తీసుకెళుతుంటాడు. ఆ కారు డ్రైవింగ్ చేస్తూ హీరో తన కథ చెప్పడం మొదలుపెడతాడు. రామ్, రమేశ్, లక్ష్మి... ముగ్గురూ స్నేహితులు. పారిశ్రామికవేత్తలు కావాలన్నది వారి కల. పెట్టుబడి కోసం రామ్, వాళ్ల నాన్నను అడిగితే, ఆయన ఇవ్వకపోగా ‘ఏ ఉద్యోగమో చేసుకోక ఇలా తెలిసీ తెలియక వ్యాపారమంటూ డబ్బులు తగలేయడమేమిటి’ అంటూ చికాకు పడతాడు. ‘వద్దని చెబితే... డబ్బు ఇవ్వనంటే వదిలిపెడతామా’ అని చెబుతూ మళ్లీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళతాడు హీరో.
కలలు కన్న స్టార్టప్‌ను ప్రారంభిస్తారు ముగ్గురు స్నేహితులు. వారి ఆఫీసులో పనిచేయడానికి ఒక గ్రాఫిక్ డిజైనర్ కోసం వెతుకుతుంటే, ‘ఓ కేరళ కుట్టి ఉంది’ అంటూ చెబుతాడు స్నేహితుడు. రామ్ ఓకే అంటాడు. మరుసటి రోజు ఉదయం ఆఫీసుకు వస్తుంది ఆ కేరళ అమ్మాయి పార్వతి. ఆమెను చూడగానే తనను తాను మర్చిపోతాడు హీరో. ఆఫీసులో ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంటికెళితే... వద్దన్నా వ్యాపారం మొదలెట్టాడన్న కోపంతో కొడుకును దూరం పెడతాడు కథానాయకుడి తండ్రి. అయితే మనోడు అవేవీ పట్టించుకోడు. పనిలో పడిపోతాడు. పార్వతి కూడా తమతో కలిసిపోయిందనుకుంటారు అంతా. కానీ వాళ్లకు పని పట్ల పెద్దగా శ్రద్ధ లేదనే పార్వతి భావన. అదే విషయాన్ని తన స్నేహితుడితో ఛాటింగ్‌లో చెబుతుంది... ‘వాళ్లలో ప్రొఫెషనలిజమ్ లేద’ని. తను పనిలో ఉండడంవల్ల ఆ మెసేజ్‌ను తన రూమ్‌మేట్‌ను పెట్టమంటుంది. అయితే రూమ్‌మేట్ పొరపాటున ఆ మెసేజ్‌ను రామ్‌కు పంపుతుంది. ఇక స్టార్టప్‌లో ఉద్యోగం నుంచి తప్పుకోవడం ఒక్కటే మార్గమనుకుంటుంది పార్వతి. ఉదయాన్నే వెళ్లి రామ్‌కు సారీ చెప్పి, రిజిగ్నేషన్ లెటర్ ఇస్తుంది. అప్పుడు రామ్... ‘కలిసి పనిచేసే ఉద్యోగులతో సరదాగా, స్నేహితుల్లా ఉండటాన్ని ప్రొఫెషనలిజమ్ కాదని ఎలా అంటావు’’ అంటాడు. వాళ్లని తప్పుగా అర్థం చేసుకున్నందుకు పార్వతి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
తిరిగి వచ్చి... ‘కార్పొరేట్ ప్రపంచంలో పడి కొట్టుకుపోవడం వల్ల టార్గెట్లు తప్ప ఇలాంటి స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని అర్థం చేసుకోలేకపోయాను’ అంటూ తన రిజిగ్నేషన్ లెటర్ తీసుకుని చించేస్తుంది పార్వతి. ఆ తరువాత రామ్, పార్వతిల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ మధ్యలో ఇద్దరు ముగ్గురు ఇన్వెస్టర్టు స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టడానికి వచ్చినా, వాళ్లు రామ్ ఆత్మాభిమానం దెబ్బతినే ప్రతిపాదనలు ముందు పెట్టడంతో దానికి అతడు ఒప్పుకోడు. దీంతో ఇలాగైతే కంపెనీ ముందుకు నడవదన్న బాధతో రమేశ్, లక్ష్మి బిజినెస్ నుంచి తప్పుకొంటారు. ఆ సమయంలో పార్వతి రామ్‌కు అండగా ఉంటుంది. కొన్నాళ్లకు రామ్ ప్రాజెక్ట్‌కు ఫైనాన్సియర్లు ఎవరూ దొరక్కపోతే రమేశ్, లక్ష్మిలే డబ్బు తెస్తారు. రామ్‌ను ప్రోత్సహిస్తారు. ప్రాజెక్ట్ విజయవంతమవుతుంది. పార్వతి తన ప్రేమను రామ్ ముందు పెట్టబోతున్న క్షణంలో అనుకోని ఓ ట్విస్ట్. అదేంటన్నది ‘కేరళ కుట్టి’ లఘుచిత్రంలో చూడాల్సిందే. దీనికి రచన, దర్శకత్వం చందు. ఎడిటింగ్ కూడా అతడే. ఎంతో అనుభవం ఉన్నవాడిలా ఈ నలభై ఐదు నిమిషాల షార్ట్ ఫిలిమ్‌ను తెరకెక్కించాడు. నటీనటులు కొత్తవారైనా తడబాటు లేకుండా నటించారు. ఒక్కసారి మొదలు పెడితే చివరి దాకా చూడకుండా వదిలిపెట్టరీ చిత్రాన్ని.
Updated Date - 2020-12-02T06:01:45+05:30 IST