సింగపూర్‌లో భారత మహిళకు ఆరేళ్ల జైలు.. కారణమిదే!
ABN, First Publish Date - 2020-12-22T22:24:23+05:30
ఎనిమిదేళ్ల కాలంలో మూడు భారీ మోసాలకు పాల్పడిన భారతీయ మహిళకు సింగపూర్ కోర్టు సోమవారం ఆరేళ్ల జైలు శిక్ష విధించింది.
సింగపూర్ సిటీ: ఎనిమిదేళ్ల కాలంలో మూడు భారీ మోసాలకు పాల్పడిన భారతీయ మహిళకు సింగపూర్ కోర్టు సోమవారం ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. మూడు సార్లు కలిపి సుమారు రూ. 5 కోట్లు ఆమె మోసగించినట్లు విచారణలో తేలింది. వివరాల్లోకి వెళ్తే... కవీనా జయ కుమార్(42) అనే భారతీయ మహిళ ఇలా ఈ భారీ మోసానికి పాల్పడింది. ఆమె ఎదుటివారిని బోల్తా కొట్టించడమే తన వృత్తిగా మార్చుకుందని విచారణ సందర్భంగా డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టాన్ జహి హోవో న్యాయస్థానానికి తెలియజేశారు. ఎనిమిదేళ్ల కాలంలో ఆమె చీటింగ్ కేసుల్లో మూడుసార్లు జైలుకు వెళ్లినట్లు ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ఈ మూడుసార్లు కలిపి ఆమె బాధితులను ఏకంగా 9 లక్షల సింగపూర్ డాలర్లు(రూ. 4.98కోట్లు) మోసగించినట్లు తెలిపారు. ట్రావెల్ ఏజెన్సీలు ఇచ్చే విమాన టికెట్ల ధరల కంటే తక్కువ రేటుకు తాను టికెట్లు ఇప్పిస్తాని చెప్పి.. చివరకు ప్రయాణికులను మోసం చేయడం, అటు ట్రావెల్ ఏజెన్సీలకు కూడా చెక్స్ ఇచ్చి భారీ మొత్తంలో మోసగించినట్లు కోర్టు విచారణలో తేలింది. సోమవారం వీడియో లింక్ ద్వారా స్థానిక డిస్ట్రిక్ట్ కోర్టులో కవీనా విచారణకు హాజరు కాగా.. దోషిగా తేలిన ఆమెకు న్యాయస్థానం 6 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
Updated Date - 2020-12-22T22:24:23+05:30 IST