-జానపద గాయకుడు- కత్తులతో బెదిరించారు.. నా స్టూడియోనూ తగలబెట్టారు
ABN, First Publish Date - 2020-02-07T21:35:12+05:30
మీ కుటుంబం నేపథ్యం? మా తల్లి ఉద్యోగి. అయినా.. మా పొలంలో వరి వేసినప్పుడు, కట్ట మీద కూర్చుని ఆమె జానపద పాటలు పాడేది. అప్పటి నుంచే నాకు జానపదం మీద ఇష్టం పుట్టింది.
జానపదమే నా ఊపిరి
కళను కాపాడుకోవడం కోసమే అకాడమీ
మూడేళ్లు పస్తులున్నా
కళ కోసమే సినిమాలు తగ్గించా
31-12-12న ఓపెన్ హార్ట్‌లో జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్
మీ కుటుంబం నేపథ్యం?
మా తల్లి ఉద్యోగి. అయినా.. మా పొలంలో వరి వేసినప్పుడు, కట్ట మీద కూర్చుని ఆమె జానపద పాటలు పాడేది. అప్పటి నుంచే నాకు జానపదం మీద ఇష్టం పుట్టింది. మేముండేది గోల్కొండ మోతీ దర్వాజా ప్రాంతంలో. నాకు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు.. బడిలో మొదటిసారిగా పాడాను. అమ్మ ప్రోత్సాహంతో పాడడం కొనసాగించాను. మహారాష్ట్రలో 1985లో ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్‌లో జానపద విభాగంలో గోల్డ్‌మెడల్ కొట్టాను. నా భార్య పేరు ఇందిర. మాది ప్రేమ వివాహం.
ప్రొఫెషనల్‌గా ఎప్పుడు మారారు?
నేను మొదటి నుంచీ క్రీడాకారుడిని. కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్ ఆడేవాడిని. తొలుత నా లక్ష్యం మంచి కోచ్ కావాలనేది. కానీ, నా పాట విన్న వాళ్లు నన్ను తీసుకెళ్లి ప్రోగ్రామ్‌లలో పాటలు పాడించేవారు. ఎంతో కొంత సొమ్ము చేతికందేది. దాంతో ఓ టీమ్‌ను ఏర్పరచుకొని ప్రోగ్రామ్‌లు ఇవ్వడం మొదలుపెట్టాను. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం చేశాను. కొద్ది రోజులకు మిత్రుల ప్రోత్సాహంతో.. ‘కలికి చిలుకలు’ పేరుతో ఓ ఆల్బమ్ రూపొందించి, మేగ్నా ఆడియో సంస్థ ద్వారా విడుదల చేశాను. అది విజయవంతమైంది.
పోటీ ఎదురుకాలేదా?
ఎన్నో ఉద్యోగాలొచ్చాయి. కానీ, జానపదాన్నే నా ఊపిరిగా చేసుకున్నాను. మొదట్లో నేను ఏ కార్యక్రమానికి వెళ్లినా కొందరు అడ్డుకునేవారు. మా వాడికి పేరు రాదు. కొంతకాలం పాడొద్దంటూ.. కొందరు నన్ను కత్తులతో కూడా బెదిరించారు. దాంతో కొద్ది రోజులు బయటికే రాలేదు. హైదరాబాద్‌లో 32 లక్షలతో స్టూడియో పెడితే.. దానిని తగలబెట్టేశారు.
సినిమాల్లో అవకాశాలెలా వచ్చాయి?
మేగ్నాస్ ఆడియో సంస్థలో కాంట్రాక్టు గాయకుడిగా ఉన్నప్పుడు.. 1994లో ‘నమస్తే’ అనే ఓ సినిమాలో పాడాను. ఆ తర్వాత ఎర్రోడు సినిమాలో ‘ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్లు లేదు..’ పాడాను. తర్వాత ‘టైంపాస్’ సినిమాలో గాయకురాలు చిత్రతో పాడాను. ఆమె స్టూడియోకు వచ్చేటప్పటికి.. ఆరున్నొక్క రాగంతో (హైపిచ్)తో పాడుతున్నాను. అది విని ఆమె ఆశ్చర్యపోయింది. ‘అమ్మో ఈ రాక్షసులతో నేను పాడలేను’ అంటూ వెళ్లిపోబోయింది. వందేమాతరం శ్రీనివాస్ వెళ్లి.. ఎలాగోలా బతిమాలి తీసుకొచ్చారు. పాట అయిపోయన తర్వాత ఆమె నన్ను చాలా మెచ్చుకున్నారు.
సినిమాలకు ఎందుకు దూరమయ్యారు?
సినిమాల కన్నా మన జానపదాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం ఒక అకాడమీ పెట్టి.. 50 మందికి శిక్షణ ఇచ్చి దేశవ్యాప్తంగా ఇప్పటికి 14 వేల ప్రదర్శనలు ఇచ్చాను. తప్పెట గుళ్లు, థింసా, బోనాలు, పగటి వేషాలు, డప్పు నృత్యాలు, గురవయ్యలు, చెక్కభజన, గోండు, కోయ నృత్యాలు ఇలాంటి వాటన్నింటినీ నేర్పించి, కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. అంతరించిపోతున్న జానపదాలను బతికించాలి. ఆ కళాకారులను ప్రోత్సహించాలనేదే లక్ష్యం.
ఇటీవల పాడిన పాటలు..?
మేగ్నస్‌లో పనిచేసినప్పుడు సాహితిగారితో ఉన్న పరిచయంతో... కింగ్ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్. అయితే.. జానపద గాయకులకు తాళం తెలియదని, సంగీత పరిజ్ఞానం తెలియదని దేవీశ్రీ అనుకున్నారు. నాకు ఫోన్ చేసి.. ఓ పాట పాడుమని విన్నారు. నా పిచ్‌విని ఆశ్చర్యపోయారు. మళ్లీ గబ్బర్ సింగ్ సినిమాలో.. ‘గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల..’ పాట పాడించారు.
జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు?
1990 సమయంలో రెండు మూడేళ్ల పాటు ప్రోగ్రామ్స్ దొరకలేదు. చాలా సార్లు వారం వారం రోజులు ఉపవాసం కూడా ఉన్నాను. చదువుకున్న వాడివి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చుగా అని ఎందరో సూచించారు. కానీ, నా కళను నేను విడవలేదు. తర్వాత కొంతకాలానికి స్థిరపడ్డా.. ఇప్పుడు మళ్లీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను.
Updated Date - 2020-02-07T21:35:12+05:30 IST