రాజకీయాల్లోకి రమ్మని చంద్రబాబు ఆహ్వానించినా వద్దనుకున్నాను
ABN, First Publish Date - 2020-02-08T00:56:27+05:30
యాభై వేల పెట్టుబడితో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన రియల్ శ్రీమంతుడు. వరుస నష్టాలతో నడుస్తున్న సిమెంట్ కంపెనీలను లాభాల బాట పట్టేలా చేసిన బిజినెస్ టైకూన్. ఆయనే మైహోం అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు.
చినజీయర్‌స్వామిజీని ఒక్కటే అడిగా
సిమెంట్ కంపెనీపైన నమ్మకంతో 100 కోట్లు ఇన్వెస్ట్ చేశా
ఆ పన్నెండు రోజులు నా జీవితాన్ని చాలా మార్చాయి
సైట్ చూడగానే కొనాలా వద్దా అని తెలిసిపోతుంది
స్మార్ట్‌సిటీ నా డ్రీమ్‌ప్రాజెక్ట్
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావు
యాభై వేల పెట్టుబడితో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన రియల్ శ్రీమంతుడు. వరుస నష్టాలతో నడుస్తున్న సిమెంట్ కంపెనీలను లాభాల బాట పట్టేలా చేసిన బిజినెస్ టైకూన్. ఆయనే మైహోం అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు. తన జీవితప్రయాణంలోని అనుభవాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ 27-11-2016న నిర్వహించిన ‘ఓపెన్‌హార్ట్ విత ఆర్కే’ కార్యక్రమం ద్వారా పంచుకున్నారు. ఆ సంభాషణలు ఇవి...
ఆర్కే: మిమ్మల్ని జూపల్లి రామేశ్వర్‌రావుగా మర్చిపోయి మైహోం రామేశ్వర్‌రావుగా పిలుస్తున్నారు. అయితే ఇండస్ట్రీయలిస్ట్ అంటే డిఫరెంట్‌గా ఉంటారని అనుకుంటారు కానీ, మిమ్మల్ని చూస్తే సాధువుగా ఉంటారు. పరమభక్తుడుగా కనిపిస్తారు. ఎక్కడ మొదలయింది ఈ భక్తిభావం?
రామేశ్వర్‌రావు: చిన్నప్పటి నుంచి ఉంది. మా ఊర్లో రోజూ రామాలయంకు వెళ్లడం, ఆంజనేయస్వామి ప్రదక్షిణ చేయడం పదోతరగతి నుంచి దినచర్యగా అలవాటయింది. స్కూల్ డేస్‌లో టెంపుల్ యాక్టివిటీస్‌ను లీడ్ తీసుకుని చేసే వాణ్ణి. 1990లో చినజీయర్‌స్వామితో పరిచయం అయింది. మా దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి ఒకసారి జీయర్‌స్వామిని కలవండి సార్ అంటూ తీసుకెళ్లాడు. ఒక గంటసేపు స్వామితో ఇంటరాక్ట్ అయ్యాను. వ్యాపారరంగం చూశావు, స్పిరిచువల్‌రంగాన్ని కూడా చూద్దామని అనుకుంటున్నావా? అని అడిగాడు. అప్పుడు స్వామిని ఒక్కటే అడిగా. 12 రోజులు ప్రోగ్రాం వేయండి. మొత్తం బాధ్యతలు నేనే తీసుకుని చేస్తా అని చెప్పా. సరే అన్నారు కాని వెంటనే డేట్స్ ఇవ్వలేదు. అయితే నేను వదల్లేదు. చివరకు స్వామి వారు ఒప్పుకున్నారు. మొదటి రోజు గవర్నర్ కృష్ణకాంతగారిని అతిథిగా పిలిపించా. రోజూ ఒక మంత్రిని కార్యక్రమానికి ఆహ్వానించా. చివరిరోజు ముఖ్యమంత్రి వచ్చారు. పన్నెండు రోజుల కార్యక్రమం విజయవంతంగా పూర్తిచేశా. ఆ పన్నెండు రోజులు నా జీవితాన్ని చాలా మార్చాయి. అప్పటి నుంచి ఎక్కడ మేజర్ ప్రోగ్రామ్స్ జరిగినా వెళ్లడం, పాల్గొనడం చేస్తూ వచ్చా. తరువాత నాన్‌వేజ్ మానేయడం, చక్రాంతరాలు వేయించుకోవడం జరిగింది.
ఆర్కే: వ్యక్తిగత జీవితంలో ఇంత సింపుల్‌గా ఉండే మీరు వ్యాపారరంగంలో అగ్రెసివ్‌గా ఉంటారని అంటారు. ఈ రెండింటిని ఎలా మ్యాచ్ చేసుకుంటారు?
రామేశ్వర్‌రావు: మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబం మాది. ఏడోతరగతి వరకే మా ఊర్లో స్కూల్ ఉండేది. ఆ పై చదువులకు కొల్లాపూర్ వెళ్లాల్సి వచ్చేది. ముగ్గురం బ్రదర్స్. ఈ వ్యవసాయం మీద బతలేము, ఏదో ఒకటి చేయాలని అప్పుడే ఉండేది. కొల్లాపూర్‌లో పదోతరగతి పూర్తయ్యాక ఇంటర్‌లో చేరా. మెడిసిన్‌లో చేరాలని ఉండేది. మా బ్రదర్‌కేమో బీఎస్సీ, ఎంఎస్సీ చేసి లెక్చరర్ ఉద్యోగం వైపు వెళ్లాలని ఉండేది. నాకేమో అది ఇష్టంలేదు. దాంతో బీఎస్సీ సెకండియర్‌లో ఉండగా హోమియోపతి కాలేజ్ నోటిఫికేషన్ పడితే అప్లై చేశా. వారంరోజుల్లోనే సెలక్ట్ అయ్యానని లెటర్ వచ్చింది. ఇంట్లో చెబితే ఒప్పుకోలేదు. హోమియో ఎవ్వరికీ తెలియదు, వెళ్లి బీఎస్సీలో మళ్లీ చేరు అని మా అన్నయ్య ఆర్డర్. ఆయనకు ఎదురుచెప్పే ధైర్యం లేక మహబూబ్‌నగర్ వెళ్లిపోయా. బీఎస్సీలో చేరాలంటే మళ్లీ ఫస్టియర్‌లో చేరాలట అని మా అన్నయ్యకు అబద్దం చెప్పా. దాంతో నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు. వెంటనే సామానుసర్దుకుని హైదరాబాద్ వచ్చేశా. కాలేజ్ దగ్గరలో రూమ్ తీసుకున్నా. వంట నేనే చేసుకునే వాణ్ణి. తెలుగు మీడి యం నుంచి ఇంగ్లిష్ మీడియం వచ్చే సరికి కొంత ఇబ్బంది. అయినా ఎక్కడా ఫెయిల్ కాలేదు. ఫోర్త్‌ఇయర్‌లో కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యా. కాలేజ్ సమస్యలపై ధర్నాలు కూడా చేశా. చదువు పూర్తయ్యాక దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టా. దిల్‌సుఖ్‌నగర్ అప్పుడు మొత్తం పొలాలే ఉండేవి. కోణార్క్ థియేటర్, బస్‌డిపో అప్పుడే నిర్మాణం జరుగుతోంది. అప్పుడే రియల్‌ఎస్టేట్ భూమ్ మొదలయింది. మొయిన్‌రోడ్‌కైతే 80 రూపాయలకు గజం, లోపలికైతే 30 రూపాయాలకు గజం ఉండేది. సత్యనారాయణచౌదరి అని గుడివాడ అతను గేదెల వ్యాపారం చేస్తుండేవాడు. రియల్‌ఎస్టేట్ ఏజెంట్‌గాకూడా చేసేవాడు. ఆయన రోజూ నా దగ్గరకు వచ్చి సార్, మీరు యాభై వేల రూపాయల పెట్టుబడి పెట్టండి. మనం ప్లాట్ తీసుకుందాం అని ప్రపోజల్ పెట్టేవాడు. నాకేమో రియల్‌ఎస్టేట్ గురించి ఏమీ తెలియదు. సరే ప్రయత్నం అయితే చేద్దామని మా అమ్మని అడిగా. మా అమ్మ దగ్గర లేవు. మా మేనమామను అడిగితే బంగారం ఇచ్చాడు. అది బ్యాంకుకు తీసుకెళితే నలభైవేలే వస్తాయని చెప్పారు. దాంతో మా మామకు తెలియకుండా బంగారం అమ్మేశా. 95 వేల రూపాయలతో హయతనగర్ మెయిన్‌రోడ్‌కు ఎకరం భూమి తీసుకున్నా. 50వేలు కట్టిన. ఆరు నెలలు టైం పెట్టిన. 75 పర్సెంట్ నాది. 25 పర్సెంట్‌కు చౌదరిని వర్కింగ్ పార్ట్‌నర్‌గా పెట్టుకున్నా. మొత్తం పెట్టుబడి నాదే. మొత్తం రెండునెలల్లో అన్ని ప్లాట్లు అమ్మేశాడు. రెండు లక్షలు లాభం వచ్చింది. ఇది బాగానే ఉందనుకుని ఒక ఆఫీస్‌ను ఓపెన్ చేశా. మార్నింగ్ ప్రాక్టీస్ మానేసి ఆ పనులన్నీ చూసుకునే వాణ్ణి. తరువాత ఎల్‌బీనగర్ చౌరస్తాలో 9 ఎకరాలు తీసుకున్నా. హయగ్రీవాచారిని తీసుకొచ్చి ఓపెన్ చేయించా. ఆయన పేరుమీదే హయగ్రీవాచారినగర్‌ని అని పేరుపెట్టా. తరువాత సరూర్‌నగర్‌లో తీసుకున్నాం. అలా...అలా...ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చా. 1980లో పెళ్లి సెటిలయింది.
ఆర్కే: కాలేజ్‌లో ఉండగా ప్రేమించడంలాంటిది ఏం చేయలేదా?
రామేశ్వర్‌రావు : లేదు..లేదు..(నవ్వులు). ఆ ఆలోచనే లేదు. మా కాలేజ్‌లో కూడా అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ ఉండేది. మా భార్య వాళ్లది పెద్ద ఫ్యామిలీ. అమ్మాయి బీఎస్సీ చదివింది. బాగానే ఉంటుందికదా అని ఒకే చెప్పా. 1980 జూన్‌లో పెళ్లయింది. 1982లో ఇల్లు కట్టుకున్నా. మూడు నాలుగేళ్లలో ఫాస్ట్‌గ్రోత్ వచ్చింది. పటాన్‌చెరువు దగ్గర 40 ఎకరాలు తీసుకుని లేఅవుట్ చేసి అమ్మేశా.
ఆర్కే: అప్పుడు ఏం పేరు పెట్టారు?
రామేశ్వర్‌రావు: శ్రీవాణి కో-ఆపరేటివ్ సొసైటీ. సత్యనారాయణగారి మనవరాలు పేరుపైన సొసైటీ పెట్టాం. అదే సమయంలో సత్యనారాయణగారికి బైపాస్ సర్జరీ అవసరమైతే 15 రోజులు దగ్గరుండి చేయించుకొచ్చా. ఆపరేషన్ అయిన పదిహేను రోజుల తరువాత ఆయన బాతరూమ్‌లో జారిపడి చనిపోయారు. ఆయనకు ఒక్కతే కూతురు. సత్యనారాయణగారు 84లో చనిపోయారు. అప్పటి వరకు నేను ఓపెన్‌ప్లాట్ బిజినెస్ చేశా. 86లో కన్‌స్ట్రక్షన్ రంగంలోకి వచ్చా. మైహోం అని పేరు పెట్టా.
ఆర్కే: రియల్‌ఎస్టేట్‌లో టాప్‌కొచ్చేశారు...
రామేశ్వర్‌రావు: 86లో నిర్మాణరంగంలోకి వచ్చినపుడు రాజ్‌భవన్ ఏరియాలో బిఎన్‌రెడ్డిగారి కాంప్లెక్స్ ఒకటే ఉండేది. మిగతా మొత్తం ఖాళీ ఉండేది. ఒక ఎకరం ల్యాండ్‌లో చిన్న ఇల్లు ఉండేది. 1400 రూపాయలు గజం ఉండేది. రాజ్‌భవన్‌రోడ్‌లోనే పక్కన 4వేల గజాలు తీసుకున్నా. రాజీవ్‌సర్కిల్‌లో మైహోం హిల్ వ్యూ అని...ఆ ఏరియాలో చాలా కట్టా. నేనెప్పుడు లొకేషన్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చేవాణ్ణి. లొకేషన్ బాగుంటే వంద రూపాయలు ఎక్కువ పెట్టి తీసుకునే వాణ్ణి. అప్పుడెంత స్క్వేర్‌ఫిట్ 250 రూపాయలు, కార్‌పార్కింగ్ 8వేలు. మాకు స్క్వేర్‌ఫిట్‌కు 45 రూపాయలు మిగిలేది. జలగం మంగాయమ్మ మొదటి డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్. రెండేళ్లలో ఏడెనిమిది ప్రాజెక్టులు పూర్తిచేశా.
ఆర్కే: మధ్యలో ఇబ్బందులెందుకొచ్చాయి?
రామేశ్వర్‌రావు: గ్రేట్ సక్సెస్ తరువాత టఫ్ఫెస్ట్ టైమ్‌ను ఎదుర్కొన్నా. సిమెంట్ కంపెనీని టెకోవర్ చేసినప్పుడు వరుస నష్టాలొచ్చాయి. నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల బాట పట్టించడానికి రెండేళ్లు రాత్రింబవళ్లు కష్టపడ్డా. ఉన్న ఇంటిని అమ్మేసి ఫ్లాట్‌కు మారిపోయా. స్థలాలు మొత్తం తీసేసి ఆ కంపెనీపైనే పెట్టా. జూబ్లీహిల్స్‌లో పది, పదిహేను ప్లాట్లు ఉంటే అమ్మేశా. మలక్‌పేట్‌లో ఉంటే అమ్మేశా. ఫంక్షన్లకు కూడా అటెండ్ కాకుండా డే అండ్ నైట్ కష్టపడ్డా. మూడేళ్ల తరువాత కంపెనీ లాభాల్లోకొచ్చింది. సిమెంట్ కంపెనీపైన నమ్మకంతో 100 కోట్లు ఇన్వెస్ట్ చేశా. రియల్‌ఎస్టేట్‌ను పక్కన పెట్టా. ఒక్క నవదీప్ ఒక్కటే అప్పుడు రన్నింగ్‌లో ఉంది. మొత్తం దృష్టంతా సిమెంట్ కంపెనీపైనే పెట్టా. 2006-07 బ్యాలెన్స్ షీట్‌లో 140 కోట్లు ప్రాఫిట్ డిక్లేర్ చేశా. 2007-08లో 357 కోట్లు ప్రాఫిట్ డిక్లేర్ చేశా. ఆ సమయంలో నా బ్యాలెన్స్ షీట్ చూసి ఫారిన్ ఇన్వెస్టర్లు వచ్చారు. టోటల్ కంపెనీకి 3350 కోట్లు కోట్ ఇచ్చారు. దాంతో 50 శాతం స్టేక్ డైల్యూట్ చేశా. సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం .2 మిలియన్ నుంచి 10 మిలియన్లకు చేర్చా. బ్రాండ్ బిల్డప్ చేశా.
ఆర్కే: సుమారు 1700 కోట్లు వచ్చింది కదా, ఏం చేశారు?
రామేశ్వర్‌రావు: టాక్స్ సుమారు 400 కోట్లు పోను 1300 కోట్లు వచ్చింది. ఆ డబ్బును మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టా. మూడునాలుగేళ్ల పాటు మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఉంచా. అప్పటి వరకు అంత రిస్క్ తీసుకున్న నేను క్యాష్ వచ్చాక సేఫ్ గేమ్‌లోకి వెళ్లిపోయా. తరువాత చిన్నగా రియల్‌ఎస్టేట్‌పై మళ్లీ ఫోకస్ పెట్టా. డీఎల్‌ఎఫ్ దగ్గర నుంచి 700 కోట్లు పెట్టి అవుట్‌రైట్‌కి కొనేశా. ప్రభుత్వంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మేం థర్డ్‌పార్టీ. డీఎల్‌ఎఫ్ వాళ్లు 2007లో ఆక్షన్‌లో తీసుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి మేం కొన్నాం. తెల్లాపూర్‌లో 300 ఎకరాలు కొన్నాం. ప్రస్తుతం అన్ని ప్రాజెక్టులు కలుపుకుని 1కోటి80లక్షల స్క్వేర్‌ఫిట్ ఏరియా అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది.
ఆర్కే: డిమానిటైజేషన్ ప్రభావం పడుతుందా?
రామేశ్వర్‌రావు: డెఫినెట్‌గా పడుతుంది. ప్రాజెక్ట్ లోన్స్, బ్యాంక్ లోన్స్...ఉన్న వాళ్లు ఇబ్బంది పడతారు. కొంచెం రిజర్వ్స్ ఉండి, డెట్ ఫ్రీ ఉండి మూడు నాలుగు నెలలు అటు ఇటూ అయినా తట్టుకోగలిగినపుడు ఇబ్బంది ఉండదు. అవతార్ లాంచ్ చేసినపుడు మొదటిరోజే 1000 బుకింగ్స్ అయ్యాయి. మా ప్రాజెక్టుకు మొదటిసారి అడ్వర్‌టైజ్ చేసింది కూడా అప్పుడే.
ఆర్కే: మొన్నటి వరకు లోప్రొఫైల్. ఇప్పుడు తెలంగాణ వచ్చా క్లోజ్ టు సీఎం అని టాక్ వచ్చింది కదా..
రామేశ్వర్‌రావు: ఇంతకుముందు కూడా పొలిటికల్‌గా పరిచయాలున్నాయి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక ఫేస్‌లిఫ్ట్ వచ్చింది. దాక్కుందామన్నా దాక్కునే పరిస్థితి లేదు.
ఆర్కే: ఇద్దరు సీఎంలతో రిలేషన్ బాగుందా?
రామేశ్వర్‌రావు: బాగుంది. అక్కడా మేజర్ ఫ్యాక్టర్‌లున్నాయి. ఇక్కడ మేజర్‌గా ఉంది.
ఆర్కే: భూజ లాంటి ప్రాజెక్ట్ అమరావతిలో ప్లాన్ చేస్తున్నారా?
రామేశ్వర్‌రావు: అడిగారు. ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్ చేపట్టడం టూ ఎర్లీ అవుతుంది. ఇంకో నాలుగేళ్లు పోయాక ప్లాన్ చేసుకోవచ్చు. బిజినెస్‌లో రైట్ టైంలో ఎంట్రీ, ఎగ్జిట్ చాలా ముఖ్యం.
ఆర్కే: సక్సెస్‌ఫుల్ ఇండస్ట్రీలియలిస్ట్‌గా బోలెడు డబ్బు సంపాదించారు కదా. మీకు ఎవరైనా రియల్ టైమ్ శ్రీమంతుడు అని బిరుదిచ్చారా?
రామేశ్వర్‌రావు: ఇవ్వలేదు. షష్ఠిపూర్తి సమయంలో టీవీల్లో శ్రీమంతుడు అని టైటిల్ పెట్టి ప్రోగ్రాం వేశారు.
ఆర్కే: శ్రీమంతుడు సినిమాలో మాదిరిగా సోషల్ సర్వీస్ చేస్తున్నారా?
రామేశ్వర్‌రావు: మా విలేజ్‌లో ఉండే యంగ్ జనరేషన్ పీపుల్ అందరికీ ఉద్యోగాలు ఇచ్చా. పదో తరగతి ఫెయిన్ అయిన వారికి కూడా ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో జాబ్స్‌లో చేర్చా. ఊర్లో ప్రభుత్వ స్కూల్‌ను అడాప్ట్ చేసుకుని డెవలప్ చేయించా. సిమెంటు రోడ్లు వేయించా. మా ఫ్యాక్టరీలు ఎక్కడుంటే అక్కడ చుట్టు పక్కల ఇరవై, ముప్పై ఊర్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటా.
ఆర్కే: మీడియాలోకి వచ్చే ఆలోచన చేస్తున్నారా?
రామేశ్వర్‌రావు: ఎస్టాబిలిష్‌లో ఉన్న మీడియాను తీసుకోవాలని అనుకున్నా కానీ వర్కవుట్ కాలేదు. ఇన్వెస్ట్‌మెంట్ తక్కువే కానీ తలనొప్పులు ఎక్కువుంటాయని తెలిసింది. దాంతో వద్దని అనుకున్నాం.
ఆర్కే: ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్లడం వల్ల మేలు జరిగిందని అనుకుంటారా లేక స్వయంకృషి అంటారా?
రామేశ్వర్‌రావు: స్వయంకృషికి కూడా ఇది బాగా పనికొచ్చింది. సెల్ఫ్ డిసిప్లిన్ ఏర్పడింది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. క్లారిట్ ఆఫ్ థాట్ వచ్చింది. స్పిరిచువల్ లైఫ్ వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలోనూ బాగా ఉపయోగపడింది.
ఆర్కే: ఆధ్యాత్మికం, బిజినెస్ కాకుండా ఇంకా సరదాలు ఏంటి?
రామేశ్వర్‌రావు: సినిమాలు చూస్తాను. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నాలుగు షోలు చూసిన సందర్భాలున్నాయి. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం.
ఆర్కే: రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానాలొస్తున్నాయా?
రామేశ్వర్‌రావు: చాలా మంది చేశారు. ఆరేడేళ్ల క్రితం బాబుగారు కూడా ఆహ్వానించారు. కానీ వద్దనుకున్నాను. ఏ నిర్ణయం మంచిదో తెలుసుకోవడానికి స్పిరిచువల్ లైఫ్ బాగా ఉపయోగపడింది.
ఆర్కే: మిగిలిన యాంబిషన్ ఏంటి?
రామేశ్వర్‌రావు: నేను ఉన్నప్పుడే స్మార్ట్‌సిటీని ఓ స్థాయికి తీసుకెళ్లాలి. బెటర్ ఎన్విరాన్‌మెంట్ కోసం దాన్ని పూర్తి చేయాలి.
ఆర్కే: మీ యాంబిషన్ నెరవేరాలని కోరుకుంటూ థాంక్యూ వెరీ మచ్.
***********************************************
పిల్లలు కూడా చాలా డిసిప్లిన్‌గా ఉంటారు. వర్క్, వర్షిప్ తప్ప మరొకటి తెలియదు. వెల్త్, సర్కిల్ ఉన్నప్పుడు పిల్లలు చెడిపోతుంటారు. కానీ మా పిల్లల విషయంలో అలా జరగలేదు. పిల్లల విషయంలో నేను చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాణ్ణి. మా మిసెస్ చూసీ చూడకుండా ఉన్నా నేను మాత్రం ఊరుకునే వాణ్ణికాదు. తమ్ముడు, వాళ్ల పిల్లలు అందరం కలిసే ఉంటాం.
మా సంస్థలో కల్చర్ బిల్డప్ చేశా. ఒక ఇల్లు కట్టి అమ్మినపుడు ఆ ఇంటావిడ బిల్డర్ బాగా కట్టించి ఇచ్చాడని నలుగురికీ చెప్పాలి. ఇంటికొచ్చిన నలుగురికీ చూపించాలి. ఆ సూత్రాన్నే నేను బలంగా నమ్మా. ఇల్లు కట్టించి ఇచ్చిన రెండేళ్ల తరువాత కూడా ఏదైనా సమస్య వస్తే వెళ్లి చూసేవాణ్ణి.
ఇప్పుడు సైట్ చూడగానే కొనాలా వద్దా అని తెలిసిసోతుంది. 30 సంవత్సరాల అనుభవం ఇందుకు బాగా ఉపయోగపడుతుంది.
మా మేజర్ ప్రాజెక్ట్ భూజ. ఇందులో 1600 ఫ్లాట్లు. అన్ని బిగ్‌సైజు. రెండు నుంచి నాలుగు కోట్ల వరకు ధర ఉంది. బెస్ట్ ల్యాండ్ మార్కింగ్ లొకేషన్. రెండు లార్జ్ ఫూల్స్. ఒక్కోఫ్లాట్‌కు నాలుగు కార్ పార్కింగ్‌లు ఇస్తున్నాం. దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచనతో చేస్తున్నాం. ప్రొఫెషనల్ శాటిస్‌ఫాక్షన్ కోసం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం.
నిర్ణయం నేనే తీసుకుంటా. అడ్వైజర్స్‌తో డిస్కషన్స్ చేసినా ఫైనల్ నిర్ణయం నాదే. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే ఫైనల్.
స్మార్ట్‌సిటీ నా డ్రీమ్‌ప్రాజెక్ట్. అమెరికాలో పేరొందిన మాస్టర్‌ప్లానర్ కార్లేగాట్‌తో డిజైన్ చేయిస్తున్నాం.ఎక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ కట్టాలి. హాస్పిటల్స్ ఎక్కడ కట్టాలి. రెండు, మూడు డిగ్రీలు టెంపరేచర్ ఎలా తగ్గించాలి. ఇవన్నీ కంప్లీట్ ప్లానింగ్‌తో చేయాలి. 2018లో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలని ఆలోచన చేస్తున్నాం. త్రీ ఫేజెస్‌లో చేస్తాం.
డిమానిటైజేషన్ ఆలోచన చాలా మంచిది. కానీ ప్రజల అవసరాలకు సరిపడా నగదును అందుబాటులోకి తెచ్చాక చేయాల్సింది. డిమానిటైజేషన్ ప్రభావం సామాన్యుని దగ్గర నుంచి ఇండస్ట్రీలియలిస్ట్ వరకు అందరిపైనా పడింది.
పదిహేను, ఇరవై కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టాం. మాకు దొరికిన కొద్ది టైం అక్కడ స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతో పేదవాళ్లకు అక్కడ ట్రీట్‌మెంట్ దొరుకుతోంది. అక్కడికొచ్చే వారికి తక్కువ డబ్బుతో ఎక్కువ ప్రయోజనం అందుతోంది. ప్రతినెలా పది, పదిహేను లక్షలు షార్టేజ్ అయినా నేను పెడుతూ వస్తున్నాను. మెడికల్ కాలేజ్ కూడా కట్టించాం.
Updated Date - 2020-02-08T00:56:27+05:30 IST