ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరి ముందు ఎన్టీఆర్ ఓ మాటన్నారు. చాలా ఇన్‌సల్ట్‌గా ఫీలయ్యా

ABN, First Publish Date - 2020-02-08T01:20:38+05:30

తొలితరం వైద్యుల్లో ఆయన ప్రముఖుడు. సాధారణ ఆసుపత్రిగా ఉన్న ‘నిమ్స్‌’ను కార్పొరేట్‌ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కృషి మరువలేనిది. ఆయనే డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ ఉద్యమంలో మా ద్రాక్షతోటను నరికేశారు, మా ఇల్లు కూడా తగలబెట్టారు

ప్రొఫెసర్‌ సహాయంతో భార్యా పిల్లలను తీసుకుని అమెరికా వెళ్లిపోయా

ఎన్టీఆర్ పిలుపుతో అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చేశా

ఎన్టీఆర్ మరణం సహజమే.. కానీ..

కాల్పుల సమయంలో బాలకృష్ణను కాపాడా.. ఇంకొకరికి ఆ ఐడియా తట్టేది కాదు

గ్రామాల్లో వైద్యుడే దేవుడు.. పండగ చేసుకుంటే అన్నీ పంపిస్తారని ఎన్టీఆర్ అనేవారు

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు


తొలితరం వైద్యుల్లో ఆయన ప్రముఖుడు. సాధారణ ఆసుపత్రిగా ఉన్న ‘నిమ్స్‌’ను కార్పొరేట్‌ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కృషి మరువలేనిది. ఆయనే డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు. 93 ఏళ్ల వయసులోనూ డాక్టర్లకు పాఠాలు బోధిస్తూ ప్రొఫెసర్‌ వృత్తిలోని ఆనందాన్ని ఇంకా అందుకుంటున్నారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌హార్ట్‌ విత్ ఆర్కే’ కార్యక్రమం కోసం 14-05-2017న కాకర్లతో సంభాషించారు. ఆ ముచ్చట్లు ఇవి..


ఆర్కే: ఓపెన్‌హార్ట్‌ విత్ ఆర్కే  షోలో ఇంత అనుభవం, వయస్సు ఉన్న వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం ఇదే మొదటిసారి. ఇప్పుడు మీ వయస్సు?

సుబ్బారావు: 93


ఆర్కే: మీది చాలా సుదీర్ఘప్రయాణం. ఇప్పటికీ అలుపు లేకుండా పని చేస్తూనే ఉన్నారు. ఎవ్వరి మీద ఆధారపడరు. ఈ లాంగ్‌ జర్నీ ఎలా అనిపిస్తుంది?

సుబ్బారావు: విసుగుపుడుతోంది. ఎందుకంటే కోలీగ్స్‌ చాలా మంది చనిపోయారు. శిష్యులు కూడా పోయారు. నా భార్య ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. అకడమిక్స్‌కు వచ్చేటప్పటికీ ఉత్సాహం వచ్చేస్తుంది. స్టూడెంట్స్‌కు సమాధానాలు చెప్పడం, వాళ్లు నన్ను ఛాలెంజ్‌ చేయడం చేసేటప్పటికీ హుషారు పుట్టుకొస్తుంది.

 

ఆర్కే: స్టూడెంట్స్‌ ఛాలెంజ్‌ చేస్తుంటారా?

సుబ్బారావు: కాన్ఫరెన్స్‌లో చేస్తుంటారు. ఒపీనియన్‌ ఏంటని అడుగుతుంటారు. తరువాత అది కరెక్టా కాదా ఆధారాలు చూపుతారు.

 

ఆర్కే: మెజార్టీ మీరు కరెక్ట్‌ అవుతారా? వాళ్లా?

సుబ్బారావు: మెజార్టీ నేనే కరెక్ట్‌ అవుతాను. అందుకే సంతోషం. కొత్తతరంలో కూడా మేధావులు వస్తున్నారు. అయితే తక్కువ. బ్యాచ్‌కు ఇద్దరుంటారు.

 

ఆర్కే: టీచింగ్‌ సంతృప్తినిస్తుందని ఎంచుకున్నారా?

సుబ్బారావు: నాకు మొదటి నుంచి ప్రొఫెసర్‌ కావాలని కోరిక. చిన్నప్పుడైతే పండితున్ని కావాలని ఉండేది.

 

ఆర్కే: మీరు ఎంత మంది పిల్లలు?

సుబ్బారావు: నలుగురు అన్నదమ్ములం. అందులో నేనే చిన్న వాన్ని. పిల్లలను ఎలాగైనా చదివించాలని మా నాన్నకు ఉండేది. అందుకే మా ఇంటి వరండాలోనే స్కూల్‌ పెట్టించారు.

 

ఆర్కే: మెడిసిన్‌ వైపు వెళ్లడానికి ప్రేరణ ఎవరు?

సుబ్బారావు: మెడిసిన్‌ చేయాలని అనుకోలేదు. మొదటి నుంచి నాకు లెక్కలంటే ఇష్టం. మా ఇంట్లో వాళ్లు కూడా ఇంజనీరింగ్‌ చదువు అనే వారు. అప్పట్లో ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఒకటే ఉండేది. నాకు సీటు వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. దాంతో బి.ఎలో జాయిన్‌ అయ్యాను. అంతకుముందు మెడిసిన్‌ కోసం తెచ్చిన అప్లికేషన్‌ ఫామ్‌ నా దగ్గర అలానే ఉంది. సరే అప్లై చేద్దాం అని చేశాను. సీటొచ్చింది. దాంతో తర్జనభర్జన. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. ఆ రోజుల్లో ఆరేడు సంవత్సరాలు పట్టేది. నాకేమో ఇష్టం లేదు. అయితే నేను, నా స్నేహితుడు కలిసి వెళ్లి 450 రూపాయలు ఫీజు కట్టి వచ్చా. ఇక ఫీజు కట్టాక ఏం చేస్తారు. అలా కంటిన్యూ అయిపోయాను.

 

ఆర్కే: కమ్యూనిస్టు భావాల పట్ల, రాజకీయాల పట్ల మొదటి నుంచి ఆసక్తి ఉందా?

సుబ్బారావు: నేను హైస్కూల్‌లో ఉండగా గాంధీగారు మాఊరు దగ్గరకు వచ్చారు. ఆయనను చూసి నేను చాలా ప్రభావితమయ్యాను. అంతేకాకుండా మా స్కూల్‌లో సాయంత్రం కాస్లులు చండ్ర రాజేశ్వర్‌రావు చెప్పే వారు. అందువల్ల కొద్దిగా రాజకీయాలంటే అభిరుచి ఏర్పడింది.

 

ఆర్కే: కాలేజ్‌కు వచ్చే సరికి జయప్రకాశ్‌ నారాయణ పట్ల ఆకర్షితులయ్యారా?

సుబ్బారావు: నేను కాలేజ్‌లో ఉన్న సమయంలో క్విట్‌ ఇండియా మూమెంట్‌, గాంధీ గారి సత్యాగ్రహం జరిగాయి. అందులో చురుగ్గా పాల్గొన్నాము. తరువాత జయప్రకాశ్‌నారాయణ పట్ల ఆకర్షితులయ్యాం.

 

ఆర్కే: స్వాతంత్య్రం పూర్వం చూశారు, స్వాతంత్య్రం తరువాత సుమారు 70 ఏళ్లు చూశారు. ఎలా అనిపిస్తుంది?

సుబ్బారావు: ఆ రోజుల్లో ఉన్న తపన, త్యాగం ఇప్పుడు లేవు. ఎంతసేపు డబ్బు సంపాదనపైనే ధ్యాసంతా. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి, పేరు తెచ్చుకోవాలి. ఎట్లా పేరొచ్చినా ఫరవాలేదు.

 

ఆర్కే: వైద్యరంగంలో దాదాపు 70 ఏళ్లు పనిచేశారు. బోధన వైపు కాకుండా ప్రాక్టీస్‌ చేసి ఉంటే బాగా డబ్బు సంపాదించి ఉండే వాణ్ణి అని ఎప్పుడైనా అనిపించిందా?

సుబ్బారావు: నాకు ఎప్పుడూ ప్రాక్టీస్‌ మీద శ్రద్ధ లేదు. అమెరికా వెళ్లి వచ్చిన తరువాత కొన్ని రోజులు ఆబిడ్స్‌లో ప్రాక్టీస్‌ పెట్టాను. ఆ సమయంలో ఉస్మానియాలో క్లాసులు కూడా చెప్పే వాణ్ణి.


ఆర్కే: మీరు అమెరికా వెళ్లిన సమయంలో అమెరికా గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు?

సుబ్బారావు: నేను న్యూయార్క్‌లో ఉన్న సమయంలో ఐదారు ఫ్యామిలీస్‌ ఉండేవి. అందులో కొంతమంది స్టూడెంట్స్‌, కొంత మంది జాబ్స్‌ చేసే వారు.


ఆర్కే: అమెరికా ఆలోచన ఎలా వచ్చింది?

సుబ్బారావు: చిన్నప్పటి నుంచి అమెరికా వెళ్లాలని ఉండేది. జయప్రకాశ్‌నారాయణ వెళ్లిన తరువాత ఇక తప్పకుండా వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఒకసారి ఛాన్స్‌ వచ్చింది. అప్పుడే ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వారు ఒక అడ్వర్‌టైజ్‌మెంట్‌ వేశారు. ఏంటంటే అమెరికాలో వైద్యపోస్టులు ఖాళీగా ఉన్నాయి అప్లై చేసుకొమ్మని. నాకేమ్‌ హౌజ్‌ సర్జన్‌ పూర్తి కాలేదు. అప్లై చేసిన వాళ్లంతా ఎండిలు, ఎంఎస్‌లు, పది సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్లు. అందుకే నేను రేడియాలజీ, డెర్మటాలజీకి మాత్రమే అప్లై చేశాను. రేడియాలజీ విభాగంలో ఛాన్స్‌ వచ్చింది.

 

ఆర్కే: అమెరికా నుంచి మళ్లీ తిరిగి ఎందుకు వెనక్కొచ్చారు?

సుబ్బారావు: మొదటిసారి వెళ్లినపుడు ఐదేళ్లు ఉన్నాను. 1956లో చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం వచ్చింది. అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చే సమయంలో ఫస్ట్‌ పేపర్స్‌ లేవని పంపించారు. ఆ రోజుల్లో గ్రీన్‌కార్డ్‌ అనేది లేదు. అలా ఇండియాకి తిరిగొచ్చేశా. వచ్చాక మేదీ నవాజంగ్‌ను కలిశాను. ఆయన ఇంత అనుభవం ఉంది అని చెప్పి ఉస్మానియాలో హానరీ పోస్టు ఇచ్చారు. జీతం నెలకు ఒక రూపాయి. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌కు సర్వీస్‌ కమీషన్‌ వచ్చింది. అందులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా సెలక్ట్‌ అయ్యాను. అప్పుడు జీతం 325 రూపాయలు వచ్చేది.

 

ఆర్కే: ఆ తరువాత మళ్లీ అమెరికా ఎందుకెళ్లారు?

సుబ్బారావు: ఉస్మానియాలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరిన 14 ఏళ్ల తరువాత అంటే 1970లో మళ్లీ అమెరికా వెళ్లాను. దాని వెనకాల పెద్ద కథ ఉంది. మా మామగారు, అత్తగారికి ఒక్కతే కూతురు. వాళ్లు కూడా హైదరాబాద్‌ వచ్చేశారు. ఆ సమయంలో షేక్‌పేటలో పొలం కొన్నాను. ద్రాక్షతోట ఉండేది. అక్కడే ఇల్లు కట్టుకున్నాం. అప్పుడే నేను, కొందరు మిత్రులం స్కాలర్‌గా ఇంగ్లండ్‌ వెళ్లాం. తిరిగొచ్చేటప్పటికీ ఎయిర్‌పోర్టులో ఫుల్‌ సెక్యూరిటీ ఉంది. ఏంటీ విషయం అని అడిగితే తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉందని చెప్పారు. ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు మా ద్రాక్షతోటను నరికేశారు. ఆ రోజు ఇంట్లోనే ఉన్నాను. తరువాత పది, పదిహేను రోజులకు మా ఇల్లు కూడా తగలబెట్టారు. ఆ సంఘటనతో బాగా డిస్టర్బ్‌ అయ్యాను. పిల్లలను ఎక్కడ చదివించాలో అర్థం కాలేదు. ఆ సమయంలోనే ఓల్డ్‌ ప్రొఫెసర్‌ని కలిశాను. ఆయన సహాయంతో భార్యా పిల్లలను తీసుకుని అమెరికా వెళ్లిపోయాను.

 

ఆర్కే: మళ్లీ ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక తిరిగొచ్చారా?

సుబ్బారావు: అవును. ఎన్టీఆర్‌గారు అమెరికాలో ఆపరేషన్‌ చేయించుకున్నాక కళ్లు తెరిచి చూస్తే పక్కన అందరూ ఇండియన్సే. అనస్తీషియన్‌ ఇండియనే. సర్జన్‌ ఇండియనే. మీరంత ఇక్కడ ఏం చేస్తున్నారు? మీ అవసరం అక్కడ చాలా ఉంది. మీరు వెంటనే వచ్చేయండి అన్నారు. హాస్పిటల్స్‌ కట్టిస్తాను తప్పక రావాల్సిందే అని చెప్పి ఒక యాభై మంది డాక్టర్లను కలెక్ట్‌ చేశారు. తరువాత చికాగో వెళ్లారు. అక్కడొక వంద మంది డాక్టర్లను ఒప్పించారు. మీరు సీనియర్‌ తప్పకుండా రావాలని అన్నారు. ఆయన మాటతో వచ్చాం. హాస్పిటల్‌ కట్టుకుంటాం అని స్థలం అడిగితే సంగారెడ్డి దగ్గర చూపించారు. కేబీఆర్‌ పార్కు దగ్గర స్థలం అడిగితే అది ఇవ్వడానికి కుదరదు అన్నారు. దాంతో మళ్లీ అమెరికా వెళ్లిపోయాను. మరుసటి ఏడాది తానా సభలకు హెల్త్‌ మినిస్టర్‌ వచ్చారు. మీరు తప్పకుండా హైదరాబాద్‌ రావాలని మళ్లీ ఆహ్వానించారు. నాకు అప్పుడు ఏడాది లీవ్‌ మంజూరయి ఉంది. దాంతో సరే అని వచ్చా. మూడు నాలుగు నెలలు ఖాళీగా ఉన్నా. సెక్రటేరియట్‌కి తిరిగీ తిరిగీ విసిగిపోయా. అందరూ జోకులేసే వారు. ఇలాకాదు నేను వెళ్లిపోతానని ఎన్టీఆర్‌కి చెప్పా. అప్పుడాయన అందరినీ పిలిపించి మాట్లాడి హాస్పిటల్‌ చేతులో పెట్టారు. అప్పుడు మళ్లీ అమెరికా వెళ్లి రిజైన్‌ చేసి వచ్చి పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టా.

 

ఆర్కే: చివరి వరకు ఎన్టీఆర్‌తో అనుబంధం అలాగే కొనసాగిందా?

సుబ్బారావు: పదవి పోయాక ఎన్టీఆర్‌తో చెప్పాను. రిజైన్‌ చేస్తానండీ అని. అయితే లేదు లేదు మీరు చేయాల్సిన అవసరం లేదు అన్నారు.

 

ఆర్కే: చెన్నారెడ్డి సీఎం అయ్యాక మిమ్మల్ని తీసేశారు కదా. అప్పుడు వెళ్లిపోవాలని అనిపించలేదా?

సుబ్బారావు: అనిపించింది. ఇక్కడ కూడా చాలా ఆఫర్స్‌ వచ్చాయి. కానీ అంగీకరించలేదు. ప్రైవేటు హాస్పిటల్స్‌లో పనిచేయడం ఇష్టంలేదు. చారిటబుల్‌ హాస్పిటల్స్‌లో మాత్రమే పనిచేస్తాను అని చెప్పాను.

 

ఆర్కే: బొక్కల దవాఖానాగా పేరున్న నిమ్స్‌ను కార్పొరేట్‌ హాస్సిటల్‌ స్థాయికి తీసుకెళ్లారు. ఎలాంటి కష్టాలు పడ్డారు?

సుబ్బారావు: మా కష్టం ఏమిటంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. అడ్వాన్స్‌డ్‌ మిషన్‌ కొనడానికి నానా అవస్థలు పడ్డాం. ఒకసారి సీటీ కొనడానికి డబ్బులు కావాలని ఎన్టీఆర్‌ని అడిగాను. డబ్బు ఉంటే మీరే కావాలి అని అందరు ముందు అన్నారు. చాలా ఇన్‌సల్ట్‌గా ఫీలయ్యాను.

 

ఆర్కే: ఎన్టీఆర్‌కు కోపం ఎక్కువ కదా? అలాంటి సందర్భాలు ఎదురయ్యాయా?

సుబ్బారావు: ఇదొక్క సారే. ఎప్పుడూ లేదు. చాలా మర్యాదగా చూసే వాడు.

 

ఆర్కే: నిమ్స్‌ విషయంలో మీ మీద ఆరోపణలు చేసిన వారు తరువాత కలిసి మాట్లాడారా?

సుబ్బారావు: ఒకసారి పీజేఆర్‌ మెడ్విన్‌లో కలిసాడు. బాగా మాట్లాడాడు.

 

ఆర్కే: ఇప్పుడు హాస్పిటల్స్‌, డాక్టర్ల వ్యవహార శైలి ఎలా ఉంది?

సుబ్బారావు: అంతా కమర్షియలైజ్‌ అయిపోయింది. పబ్లిక్‌ హెల్త్‌ మీద గవర్నమెంట్‌కు కూడా ప్రయార్టీ లేదు. టీచింగ్‌ హాస్పిటల్స్‌ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇండివిడ్యువల్‌గా చూస్తే పేషెంట్‌, డాక్టర్‌ రిలేషన్‌షిప్‌ ఏమాత్రం లేకుండా పోయింది.

ఆర్కే: మీరు చాలా దేశాల్లో చూసి ఉంటారు కదా! ప్రత్యామ్నాయం ఏది బాగుంటుంది?

సుబ్బారావు: అందరికీ యూనివర్సల్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ ఇవ్వాలి. క్యాష్‌ లేకుండా హాస్పిటల్‌కు వెళ్లాలి. మరి ఇన్స్యూరెన్స్‌కు డబ్బెలా? అంటే ప్రతి ఒక్కరు జీతంలో ఐదు శాతం, పదిశాతం ఇన్స్యూరెన్స్‌కు కట్టాలి. పదివేలు జీతం ఉన్న వాడు ఐదొందలో, వేయి రూపాయలో కట్టాలి. బీదవాళ్లకి ప్రభుత్వం భరించాలి. అదే నా ఆశ. ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ బలోపేతం చేయాలి.


ఆర్కే: అమెరికా తెలుగు వాళ్లందరినీ ఏకం చేయాలని అసోసియేషన్‌ పెట్టారు కదా?

సుబ్బారావు: అవును. 1977లో మొదటిసారి అందరినీ కూర్చొబెట్టి తెలుగు వాళ్ల కోసం ఒక అసోసియేషన్‌ను ప్రారంభించాం. ఆ సమయంలోనే అమెరికాకు తెలుగు వాళ్లు రావడం ఎక్కువయింది.


ఆర్కే: ఇప్పుడు జరిగే సభలకు మిమ్మల్ని ఆహ్వానిస్తుంటారా?

సుబ్బారావు: పిలుస్తుంటారు కానీ, వెళ్లను. ప్రయాణాలు చేయడం లేదు.

 

ఆర్కే: 93 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా ఉన్నారు. మీ ఆరోగ్యరహస్యం ఏంటి?

సుబ్బారావు: 50 శాతం జీన్స్‌. మిగతాది సానుకూల ధృక్పథం. అసూయ పడటం, తిట్టడం, కొట్టడం నాకు నచ్చదు. పంక్చువాలిటీ చాలా ముఖ్యం. ఐదు గంటలకు రమ్మంటే నాలుగు నలభై ఐదుకే వచ్చేస్తాను. అన్నీ తింటాను.

  

ఆర్కే: ఇప్పటికీ మీరు క్లాసులు తీసుకుంటున్నారు కదా. ఎక్కడెక్కడ?

సుబ్బారావు: నిజామ్స్‌లో రెండు రోజులు, కిమ్స్‌లో రెండు రోజులు తీసుకుంటాను.

 

ఆర్కే: ఎన్టీఆర్‌ మరణించినపుడు జరిగిన వాటిపై పుస్తకంలో కొన్ని కామెంట్లు చేశారు కదా? ఎందుకని అవి రాయాలనిపించింది?

సుబ్బారావు: అది దురదృష్టం. తివారీ అని ‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’కి కో ఆథర్‌గా చేశాడు. ఇంటర్‌ప్రిటేషన్‌లో జరిగిన తప్పిదం అది. దానికి నేను అపాలజీ చెప్పాను.

 

ఆర్కే: ఎన్టీఆర్‌ మరణం సహజమా?

సుబ్బారావు: సహజమే అయితే ప్రెషర్‌ ఉంది.

 

ఆర్కే: అయనకెప్పుడైనా వైద్యం చేశారా?

సుబ్బారావు: లేదు. సలహాలు తీసుకునే వారు.

 

ఆర్కే: తొమ్మిది దశాబ్దాల జీవితంలో అసంతృప్తి కలిగించిన సంఘటనలున్నాయా?

సుబ్బారావు: చాలా ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు వాటిని మరిచిపోతుంటాను.

 

ఆర్కే: బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ ట్రస్ట్‌ విషయంలో గొడవలు వచ్చాయని అంటారు?

సుబ్బారావు: అది మిస్‌ అండర్‌స్టాండింగ్‌. నేను రిజైన్‌ చేసే వాణ్ణి. అప్పటి వరకు ఆగలేకపోయారు. కారు అద్దాలు పగలగొట్టారు.

 

ఆర్కే: అది చంద్రబాబు చేయించాడని అనుకుంటున్నారా?

సుబ్బారావు: ఆయన పేరుతో మరెవరో చేశారు.

 

ఆర్కే: కాల్పుల సమయంలో బాలకృష్ణను కాపాడారని అంటారు, నిజమేనా?

అవును. ఇద్దరు సైకియాట్రిస్ట్‌లను తీసుకెళ్లి చూపించాను. ఇంకొకరికి ఆ ఐడియా తట్టేది కాదు.

 

ఆర్కే: పిల్లలందరూ డాక్టర్‌ వృత్తిలో ఉన్నారా?

సుబ్బారావు: నా మొత్తం కుటుంబం 21 మంది. అందులో 11 మంది డాక్టర్లు. కాకపోతే యావరేజ్‌ డాక్టర్స్‌. టాప్‌ పొజిషన్‌కు చేరుకోలేదు. మా మనుమరాలొక్కతే కృషి చేస్తోంది.

మా అమ్మగారు అసలు చదువుకోలేదు. సంతకం చేయడం నేనే నేర్పించాను.

 

నాన్నగారు నాలుగో తరగతి వరకు చదువుకున్నారు. కాకపోతే రామాయణం, మహాభారతం బాగా చదివేవారు.

 

నిమ్స్‌లో రిజిసే్ట్రషన్‌ ఫీజు 5 రూపాయలు పెట్టాం. దానిపై చాలా ఆరోపణలు వచ్చాయి. వెంగళరావు, పిజేఆర్‌ లాంటి వాళ్లు కూడా హాస్పిటల్‌ ముందే ఉపన్యాసాలు ఇచ్చే వాళ్లు. ఎన్టీఆర్‌ బంధువును తీసుకొచ్చి పెట్టాడని చాలా ఆరోపణలు చేశారు. అమెరికాలో హాయిగా ఉన్న వాడివి ఇక్కడికి వచ్చి ఎందుకు కాంట్రవర్సీ పర్సన్‌ అయ్యావని అన్నారు. కానీ హాస్పిటల్‌ను ఎలాగైనా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆ నిర్ణయం తీసుకున్నా.

 

కామినేని శశిధర్‌, సోమరాజు నిమ్స్‌లో నుంచి వచ్చిన వారే. నాకు హాస్పిటల్‌ పెట్టాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు.

 

నా భార్య పదవతరగతి వరకు చదువుకుంది. అమెరికాలో తెలుగు అసోసియేషన్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్‌ చేశారు.

 

డాక్టర్స్‌ గ్రామాలకు వెళ్లమంటే వెళ్లరు. అక్కడ వైద్యులను దేవుడి మాదిరిగా చూస్తారు కదా! సత్యనారాయణవ్రతం చేస్తే పాలు, ప్రసాదం అన్నీ పంపిస్తారు కదా అని ఎన్టీఆర్‌ అనేవారు.

 

మానాన్న స్కూల్‌ పెట్టాడు కదా. నేనెందుకు పెట్టకూడదు అని స్కూల్‌ పెట్టాను. డాక్టర్లను సవరించడం చాలా కష్టం. చిన్నప్పటి నుంచే వాళ్లను సమాజానికి తగిన విధంగా తయారు చేయాలి. నాకందరూ మునిమనుమలే. మునిమనుమరాళ్లు లేరు.

 

ఆర్కే: శేషజీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ థాంక్యూ వెరీ మచ్‌.

Updated Date - 2020-02-08T01:20:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising