విలువల పునాదిపైనే వ్యాపార సామ్రాజ్యం
ABN, First Publish Date - 2020-02-08T01:30:54+05:30
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐటి ఇంజనీరింగ్ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోటెక్ వ్యవస్థాపక చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి నాలుగు దశాబ్దాల ఉద్యోగ, వ్యాపార ప్రస్థానంలో ఆసక్తికరమైన ఘట్టాలెన్నో.
సత్యం ఎపిసోడ్ తర్వాత ఇండస్ట్రీ చాలా నేర్చుకుంది
సక్సెస్ అనేది ఓవర్‌నైట్ రాదు. కష్టపడాలి
ఇన్నోవేషన్ జరగాలన్నదే నా విజన్
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఇన్ఫోటెక్ చైర్మన్ మోహన్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐటి ఇంజనీరింగ్ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోటెక్ వ్యవస్థాపక చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి నాలుగు దశాబ్దాల ఉద్యోగ, వ్యాపార ప్రస్థానంలో ఆసక్తికరమైన ఘట్టాలెన్నో. ఒక చిరు కంపెనీగా ప్రారంభమైన ఇన్ఫోటెక్‌ను రెండు వేల కోట్ల రూపాయల సంస్థగా తీర్చిదిద్దటంలో మోహన్ రెడ్డి చవిచూసిన ఎత్తుపల్లాలు అనేకం.. ఇన్ఫోటెక్‌ను అంతర్జాతీయ ఇంజనీరింగ్ సర్వీసులకు తిరుగులేని బ్రాండ్‌గా మలచటంలో ఆయనకు ఎదురైన అనుభవాలు, ఆసక్తులు ఇంకా అనేక విశేషాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో పంచుకున్నారు 13-1-2014న ఏబీఎనలో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు..
ఆర్కే : ఇండస్ర్టీ ఎలా ఉంది?
బివిఆర్: ఇండస్ర్టీ బాగా పికప్ అవుతోంది. 2008 అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంతో భారత్ మీద కూడా ప్రభావం పడింది. గత పన్నెండు నెలల నుంచి అమెరికా ఎకానమీ బాగా పికప్ అయింది. జర్మనీ, యుకె బాగానే ఉన్నాయి. ఫ్రాన్స్, ఇటలీ ఇంకా పుంజుకోవాలి. సౌత్ ఈస్ట్ ఏషియా మెరుగ్గా ఉంది. జపాన్‌లో ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ అయిపోందని గ్రహిస్తున్నారు. అందుకని ఔట్‌సోర్సిం గ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. చైనా కన్నా భారత్‌పై జపాన్ కంపెనీలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. గత మూడు నె లల్లో వెయ్యి మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాం. బిజినెస్ బాగానే ఉంది.వచ్చేత్రైమాసికంలో వ్యాపారం బాగుంటుందను కుంటున్నాం.
ఆర్కే : చిన్న మొక్కని మహా వృక్షంగా చేశారు. ఇన్ఫోటెక్ యాక్టివిటీస్ ఏంటి?
బివిఆర్: ఇంజనీరింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకోసమని సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాం. ఇన్ఫోటెక్‌ను 1991లో స్థాపించాను. 1992 నుంచి వ్యాపారం మొదలైంది. అంతకు ముందు పదేళ్లు ఔంసి కంప్యూటర్స్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశాను. అందులో కాస్త షేరుండేది నాక్కూడా. ఔంసి.. ఫస్ట్ టైమ్ ఇండియాలో కంప్యూటరైజ్డ్ డిజైన్, కంప్యూటరైజ్డ్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను ప్రవేశపెట్టింది. అప్పటిదాకా ఇండియాలో ఎవరూ తీసుకురాలేదు. ఔంసి కంప్యూటర్ ఫౌండర్,వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ రాజిరెడ్డి గారితో కలిసి పని చేశాను. ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి, కంపెనీని ప్రారంభిద్దాం అనుకునేటప్పుడు ఇంజనీరింగ్‌లో చేస్తే బాగుంటుందని, దీనిమీద ఫోకస్ చేశాం. సాఫ్ట్‌వేర్ కొత్తగా డెవలప్‌మెంట్‌కు ఎక్కువగా కోడ్ రాయం. 20 శాతం వా ల్యూ అడిషన్ ప్రోగ్రామింగ్ చేస్తాం. ఉదాహరణకు ఎయిర్‌క్రాఫ్ట్‌కు ఇంజన్లు ఉంటాయి. ఇంజన్ డిజైన్ చేస్తాం. కానీ దాని డిజైన్‌ను ఫిజికల్‌గా ఏమీ చేయం. కొన్ని ప్రొటోటైప్ కూడా చేస్తాం. కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, సాఫ్ట్‌వేర్‌ను కస్టమైజ్ చేసి ప్రొడక్ట్స్‌ను డెవలప్ చేస్తాం. అదండీ బేసిక్‌గా మా స్ర్టెంత్, ఫోకస్.
ఆర్కే:మిగతా వాళ్లు ఎవరూ కాంపిటీటర్లుగా ఉన్నట్లు లేదు కదా?
బివిఆర్: ఉన్నారు. పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇదొక విభాగంగా పెట్టుకున్నాయి. ఇన్ఫోసిస్, టిసిఎస్ లాంటి వాటికి ఇంజనీరింగ్ సర్వీ సు డివిజన్‌గా ఉండిపోయింది. మా అంత పెద్దగా ఉండదు.
ఆర్‌కె : మీది ప్రకాశం జిల్లానా ?
బివిఆర్: మా అమ్మది ఖమ్మం. మా నాన్నది మోక్షగుండం అనే చిన్నగ్రామం. మా నాన్న పోలీస్ ఆఫీసర్. నా బ్యాగ్రౌండ్ చాలా విచిత్రంగా ఉంటుందండి. నేను మహబూబ్‌నగర్ జిల్లాలో పుట్టాను. ముల్కీ సర్టిఫికెట్ ఉందని జోక్‌గా చెబుతా. మా పూర్వీకులది అంతా రాయలసీమ. నేను పెరిగింది అంతా కోస్టల్ ఆంధ్రాలో... వేర్ ఆర్ యు ఫ్రం అంటే.. ఐ యామ్ ఫ్రమ్ ఇండియా అంటాను. మేము నలుగురు పిల్లలం. అక్క ఒక సంవత్సరం పెద్దది.. చెల్లెలు ఆరేళ్లు చిన్నది. తమ్ముడు ఏడేళ్లు చిన్నవాడు. 60ల్లో మిడిల్ క్లాస్‌లో పెద్ద డ్రీమ్ ఏంటంటే పిల్లలు డాక్టర్, ఇంజనీరు అయిపోవాలని ఉండేది.
మా వాళ్లకు అక్క మెడిసిన్ చదవాలని, నేనేమో ఇంజనీరు చదవాలని చాలా తాపత్రయం. నాన్న పోలీస్ ఆఫీసర్ కావడంతో ఆయన పనిలో బిజీగా ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్‌లో పని చేసేవారు. కొంత కాలం జమ్మూ కాశ్మీర్‌లో, ఏడేళ్లు నార్త్ ఈస్ట్‌లో ఉన్నారు. మేమేమో కాకినాడలో ఉండేవాళ్లం. అందుకే అమ్మతో అనుబంధం ఎక్కువ. అమె ప్రభావం మా మీద బాగా ఉంది. ఈ రోజుల్లో నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే మా అమ్మకే నేను రుణపడి ఉంటాను. ఆమె వాల్యూ సిస్టమ్స్ నాకు అలాగే వచ్చాయి. భగవంతుడు అంటే నమ్మకం, భయం ఉండేవి. అజీమ్ ప్రేమ్‌జీ (విప్రో చైర్మన్ ) గారు నాకు బాగా ఫ్రెండ్ . ఆయన విప్రో స్టార్ట్ చేశారు. నేను పాత కంపెనీ ఔంసి కంప్యూటర్స్‌లో ఉన్నప్పుడు బాగా మాట్లాడుకునే వాళ్లం.
ఒకప్పుడు నువ్వు వచ్చి నాదగ్గర పని చేయాలని చెప్పేవారు. ఒకరోజు అడిగాను ఎందుకు ఇంత ఇన్‌సిస్ట్ చేస్తున్నారంటే.. నీ వాల్యూ సిస్టమ్స్ నాకు చాలా ఇష్టం. అందులో మీకు ఏది ఇష్టం అని అడిగాను. ఆయ న నన్ను ‘ఎ తమిళ్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిణ్’ అని వర్ణించాడండి. విలువలనే నమ్ముతాం. మా కంపెనీలో కూడా విలువలే ఫస్ట్ అంటాం. ఎవరిని ఉద్యోగాల్లోకి తీసుకున్నా ఎఫ్‌ఐఆర్‌ఎస్‌టి. ఎఫ్ ఈజ్ ఫెయిర్‌నెస్. ఐ ఈజ్ ఇంటిగ్రిటీ, ఆర్ ఈజ్ రెస్పెక్ట్. ఎస్..సిన్సియారిటీ, టి ఈజ్ ట్రస్ట్. ఈ వాల్యూస్ ఉంటేనే మనం పైకి వస్తాం. మా అమ్మ అనుకున్నట్టుగానే మా అక్క డాక్టర్ అయింది. నేను ఇంజనీర్ అయ్యాను. చెల్లెలు ఎంఎ ఇంగ్లీష్ చేసి తర్వాత కంప్యూటర్స్‌లోకి దిగిపోయి ఇప్పుడు కాలిఫోర్నియా స్టేట్‌లో రివర్‌సైడ్ అనే కౌంటీకి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌కు డైరెక్టర్‌గా పనిచేస్తోంది. తమ్ముడు లాయర్ అయ్యారు. తర్వాత హెచ్‌ఆర్‌లో పని చేసి ఇప్పుడు మా కంపెనీకి హ్యూమన్ రీసోర్సెస్, కార్పొరేట్ అఫేర్స్ ఆయనే చూసుకుంటారు.
నలుగురు పిల్లలు ప్రయోజకులు అయ్యారని, ప్రయోజకులను చేశానని అమ్మకు చాలా తృప్తి. అదే వాల్యూసిస్టమ్స్ నేను నా పిల్లలకు కూడా చెబుతాను. 22 ఏళ్ల క్రితం ఈ కంపెనీని నలుగురు ఇంజనీర్లతో కలిసి మా డైనింగ్ టేబుల్ మీద స్టార్ట్ చేశాను. గత డిసెంబర్ 31 నాటికి మా కంపెనీలో 12వేల మంది ఇంజనీర్లున్నారు. 1992 లో కంపెనీకి రెవెన్యూ ఉండేది కాదు. 2013కి రెండు వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉంది. అప్పుడు కస్టమర్లు లేరు. ఇప్పుడు 400 మంది కస్టమర్లున్నారు. రెండు వేల కోట్ల రూపాయల్లో ఎగుమతుల ద్వారా వచ్చిందే 97 శాతం. భారత మార్కెట్ చాలా తక్కువ. అన్నీ మారాయి కానీ మా ఫ్యామిలీ వాల్యూస్ మాత్రం మారలేదు.
ఆర్కే : సో మీకు మెంటార్ మీ అమ్మ గారే.. అయితే..
బివిఆర్: నేను సెవెన్త్ క్లాసులో మార్కుల షీటు తీసుకుని అమ్మ దగ్గరకు వెళ్లాను. మార్కులు చూసి అమెకి చాలా కోపం వచ్చేసింది. చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ఆమె చాలా కోప్పడింది. మీ అక్క ఆడపిల్ల చదువుకుంటోంది. నీకేం తక్కువైంది..చదువుకోకపోతే పొలం దున్నాలి అంది. అదే నా జీవితంలో టర్నింగ్ పాయింట్. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు.అప్పుడే అనుకున్నా ఏది చేసినా పర్‌ఫెక్ట్‌గా చేయాలి. కష్టపడితే పైకి వస్తాం. నో షార్ట్‌కట్స్. ఇంజనీరింగ్‌లో క్లాస్‌లో ఫస్ట్ వచ్చానేను. నాన్నేమో సివిల్ సర్వీస్‌కోసం ప్రోత్సహించారు. నేను ఆలోచించి ఇంజనీరింగే బాగుంటుందని ఐఐటి కాన్పూర్‌లో ఎంటెక్‌లో చేరాను.
ఎంటెక్ తర్వాత పిహెచ్‌డి చేద్దామనుకున్నా. ఫారిన్‌కు కూడా అప్లయ్ చేశాను. అడ్మిషన్లు వచ్చాయి. స్కాలర్‌షిప్ రాలేదు. ఆ రోజుల్లో స్కాలర్‌షిప్ లేకుండా అమెరికా వెళ్లాలంటే కష్టం గా ఉండేది. అందుకని జాబ్స్‌కు అప్లయ్ చేయ డం మొదలుపెట్టాను. 1974లో ప్రముఖ కంపె నీ డిసిఎం గ్రూప్‌లో చేరాను. హైదరాబాద్‌లో శ్రీరామ్ రిఫ్రిజరేషన్ అనే కంపెనీ ఉండేది. అందులో రెండేళ్లు పని చేశాను. అయినా అమెరి కా వెళ్లాలనే ఉండేది. రోటరీ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ స్కాలర్‌షిప్‌తో యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్‌ను వెళ్లి మాస్టర్స్ ఇన్ ఇండస్ర్టియల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను.
నా లైఫ్‌లో హీరో ఎవరంటే మా నాన్నే. అలాంటి ఆయన 1976 అమెరికా వెళ్తానంటే కళ్లలో నీళ్లు పెట్టుకున్నారు. ఆ రోజుల్లో అమెరికా వెళ్లిన వారిలో 95 శాతం మంది అమెరికాలో ఉండిపోయేవారు. నేను తప్పకుండా వెనక్కి వస్తానని ఆయనకు మాట ఇచ్చాను. మాటకు కట్టుబడి కాన్వకేషన్ రోజు సాయంకాలమే ఫ్లైట్ ఎక్కి తిరిగి వచ్చేశాను. రాగానే జర్మనీ కంపెనీ మైకో బాష్‌లో చేరాను. ఇందులో కట్టుదిట్టమైన సిస్టమ్స్ ఉండేవి. ఇం దులో చాలా నేర్చుకున్నా ను. సొంతంగా చేయాలన్న కోరిక అలాగే ఉంది. అప్పట్లో.. హెచ్‌సిఎల్ చైర్మన్ శివ్‌నాడార్‌తో పరిచ యం ఉండేది. ఆ యన ఒక రోజు ఫోన్ చేసి తమ కంపెనీలో చేరమన్నారు. అది గొ ప్ప అవకాశంగా భావించి చేరిపోయాను. సేల్స్ కూడా వంటబట్టింది. డిసిఎం, మైకో బాష్, హెచ్‌సిఎల్... ఈ మూడు ఉద్యోగాలు విభిన్నం.
1982లో నేనే ఎంటర్‌ప్రెన్యూర్ అవుదామనుకున్నా. అన్నింటికీ అప్పుడు లైసెన్స్ ఉండేది. ఎపిడిసిలో లోన్‌కు వెళ్లాను. అందులో ఓ పెద్దమనిషి నన్ను, మోహన్ నీ దగ్గర చాలా స్పార్క్ ఉంది సొంతగా వ్యాపారం చేయాలంటే, ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.. కాకుంటే నా దగ్గరో ప్రపోజల్ ఉంది. రాజిరెడ్డి గారు టెక్నాలజీ తెస్తున్నారు. టాటాలు కూడా డబ్బు పెడుతున్నారు. ఆ కంపెనీకి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ కావాలి. ఆ రోల్ నీకు చాలా చక్కగా ఉంటుంది చేస్తావా.. అని అడిగారు. రాజిరెడ్డిగారితో మాట్లాడి ఆ కంపెనీలో చేరాను. 1982 నుంచి 1992 వరకు ఆ కంపెనీలో చేశాను. ఆ రోజుల్లో టాలెంట్ చాలా ఈజీగా దొరికేది. 90నాటికల్లా నేను నలభైల్లోకి వచ్చాను. ఎంటర్‌ప్రెన్యూర్ కావాలంటే లాస్ట్‌ఛాన్స్. అందుకే వాళ్లను ఒప్పించి బయటకు వచ్చాను. తర్వాత జరిగింది చరిత్ర. చిన్న కంపెనీ అనుకున్నాం. భగవంతుని అనుగ్రహంతో చరిత్ర సృష్టించాం.
ఆర్కే : ఆ టైమ్‌లో మీకు భయమేయలేదా.. ?
బివిఆర్: చాలా ఆలోచించాను రాధాకృష్ణ గారు. నా భార్య చాలా సహకరించింది. నిజానికి ఫ్యామిలీ భద్రత కోసం విడిగా అసెట్ క్రియెట్ చేసి, మిగులు డబ్బు దాదాపు 20 లక్షల రూపాయలతో రిస్క్‌కు సిద్ధపడ్డాను. ఇద్దరు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ పెట్టుబడి పెడతామన్నారు. ఆ రోజుల్లో డాలర్ 25 రూపాయలు. ఇద్దరు 5 లక్షలు ఇచ్చారు. ఐడిబిఐ దగ్గర వెంచర్ క్యాపిటల్.. 1.25 కోట్ల రూపాయలు లోన్ తెచ్చుకున్నాను.
ఇది కలిపి 1.5 కోట్ల రూపాయలతో ప్రారంభించాను. 1991 సంస్కరణల సమయంలో అవకాశాలను వినియోగించుకోవాలనుకున్నాం. తొలుత ఇంజనీరింగ్ సర్వీసులు స్టార్ట్ చేశాను. అమెరికాలో టెలికాం, పవర్ కంపెనీలకు జిపిఐ, జిఐఎస్ టెక్నాలజీ చాలా కీలకంగా మారింది. మాకు మంచి అవకాశాలు లభించాయి. చాలా కష్టపడ్డాం. నాణ్యతను పెంచాం. జియోగ్రఫిక్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ నాకు మదర్ లాంటిది. నేను నిలదొక్కుకోవడానికి మంచి అవకాశం కల్పించింది. 1993లో అమెరికాలో అదే పెద్ద అవకాశం. క్వాలిటీ, ఆన్‌టైమ్ డెలివరీ.. ఈ రెండు వాల్యూస్ మాకు కలిసివచ్చాయి. తొలిరోజుల్లోనే ప్రూవ్ చేసుకున్నాం.
2000లో ప్రాట్ అండ్ విట్నీ.. యునైటెడ్ టెక్నాలజీ కార్పొరేషన్ దీనికి పేరెంట్ కంపెనీ. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్లు, సికోర్‌స్కీ హెలికాప్టర్లు తయారు చేస్తారు. ఈ కంపెనీకి ఔట్‌సోర్సింగ్ పార్ట్‌నర్ కోసం వెతుకుతూ ఓ టీమ్ హైదరాబాద్‌కు వచ్చింది. ఓ స్నేహితుని ద్వారా వారిని కలిశాను. ఆ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌ను కలిసి మా కంపెనీకి తీసుకువెళ్లాను. అప్పుడు మాదాపూర్‌లో కొత్త బిల్డింగ్ కట్టాను. మా కంపెనీని చూశారు. తర్వాత వారి ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లాను. అది టర్నింగ్ పాయింట్. వారు చాలా సహకారం అందించారు. ఈ కంపెనీతో సంబంధాలు బాగా పెరిగాయి. హై టెక్నాలజీలో వారి నుంచి బాగా నేర్చుకున్నాం. మా కంపెనీలో 2002లో 15 శాతం ఈక్విటీ తీసుకున్నారు. ఇంజనీరింగ్‌లో ఇక వెనక్కి చూసుకునే పరిస్థితి రాలేదు. ఆ తర్వాత ఏరోస్పేస్ నుంచి ట్రాన్స్‌పోర్టేషన్‌లోకి తర్వాత హెవీ ఎక్విప్‌మెంట్‌లోకి ప్రవేశించాం. ఈ ప్రయాణంలో ఎన్నో మంచి, చెడు రోజులున్నాయి. మంచి రోజులున్నాయి, చెడు రోజులున్నాయి. ఎన్ని చేసినా ఇంకా చేయవలసింది ఎంతో ఉంది అనుకుంటాం...అదే మా మోటివేషన్.
ఆర్కే:మీ జర్నీలో నిరుత్సాహపడిన రోజులు ఉన్నాయా..
బివిఆర్: ఎదురైంది... భయం కూడా వేసింది. 1997లో మాకు కస్టమర్లకు మాకు మధ్య మరో కంపెనీ ఉండేది. ఆ కంపెనీ వ్యక్తి దివాలా తీశాడు. ఇక అదే ఎండ్ అనుకున్నాను. కానీ మళ్లీ నిలదొక్కుకున్నాం. పైకొచ్చాం. 2007లో ఇంజనీరింగ్ వర్క్ పీక్‌లో ఉంది. ఆ సమయంలోనే అమెరికాలో ఒక బ్లాక్ షోలో కారు బాంబు పేలుడు జరిగింది.
అందులో ఇన్‌వాల్వ్ అయిన ఒక అబ్బాయి మా కంపెనీలో పని చేసేవాడు. ఈ సంఘటనపై 2007 జూలై 30 న్యూ యార్క్ టైమ్స్‌లో ఆర్టికల్ వచ్చింది. బాంబుపేలుడులోని వ్యక్తి ఇం డియాలోని ఇన్ఫోటెక్‌లో పని చేసేవాడు అని రాయడమే కాకుండా.. కంపెనీ కస్టమర్ల పేర్లను కూడా రాశారు. అది చూసి చాలా భయం వేసింది. కానీ భగవంతుడు ఉన్నాడని నమ్మాం. కస్టమర్లకు ఫోన్ చేసి జరిగింది చెప్పాం. అందులో కెనడాకు చెందిన ప్రాట్ అండ్ విట్నీ కంపెనీ కూడా ఒకటి. వారు మా మాట నమ్మారు.
ఆర్కే : 40 ఏళ్ల బిజినెస్ కెరీర్‌లో ప్రతి 10 ఏళ్లకు మీకు ఒక డెవలప్‌మెంట్ జరిగింది. ఇప్పుడు నో లుక్ బ్యాక్ (నవ్వుతూ)...
బివిఆర్: నాకు 63 ఏళ్లండి. మనుషులకు జీవిత కాలం పరిమితంగా ఉంటుంది. మనం వృద్ధిలోకి తెచ్చిన సంస్థ మనతో పాటే వెళ్లిపోకూడదు. అందుకే సక్సెషన్ ప్లానింగ్ మీద ఎక్కువ సమయం కేటాయిస్తానండి. కంపెనీ ఫౌండేషన్ వ్యాల్యూస్‌లో..కస్టమర్, ఎంప్లాయర్, ఇన్వెస్టర్, సొసైటీ వంటి నాలుగు పిల్లర్లు కంపెనీ విజయంలో కీలమైనవి. వీటిలో ఏది బలహీనపడినా కంపెనీ ఇన్‌స్టేబుల్ అవుతుంది.
ఆర్కే : మీరు చాలా అసోసియేషన్స్‌కు చైర్మన్‌గా పని చేశారు. పరిశ్రమ వృద్ధికి పని చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడులు వెనక్కి పోతున్నాయన్న వాదన ఉంది. అది కరెక్టేనా?
బివిఆర్: అనిశ్చితి అయితే తప్పకుండా ఉంది రాధాకృష్ణగారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల బిజినెస్ సాఫీగా జరుగుతుందా లేదా అన్న అనుమానాలు ఉంటాయి. అనిశ్చితితో పెట్టుబడులు మందగించాయి. కానీ ఎవ్వరూ వెళ్లిపోలేదు. మూడేళ్లలో అనిశ్చితితో ఇబ్బంది ఏర్పడింది. ఏదో ఒకటి తేలిపోతే హైదరాబాద్, సీమాంధ్ర వృద్ధిలోకి వస్తుంది. మనకు వెల్త్ ఆఫ్ టాలెంట్ ఉందండి.
బాగా చదువుకున్న వారు, గుడ్ వాల్యూ సిస్టమ్స్, గుడ్ వర్క్ ఎథిక్స్ ఉండటం వల్ల బాగా వృద్ధి లోకి రావడానికి అవకాశం ఉంది. కాకినాడకు 2009లో వెళ్లాను. కాకినాడ కాలేజీలో నేను చదువుకున్నాను. అందుకే ఏదైనా చేయాలని అనుకున్నాను. అక్కడ ఎస్‌ఇజడ్ నిర్మించాం. అక్కడ 1100 ఇంజనీర్లు పని చేస్తున్నారు. కొన్ని సవాళ్లు అయితే ఉన్నా యి. ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. టాలెంట్ ఉంది. కానీ సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అంటే హాస్పిటల్స్, చదువు కోవడానికి స్కూళ్లు లేవు.
ఆర్కే : సాఫ్ట్‌వేర్ ఇండస్ర్టీ ఇంత గా విస్తరించింది కదా.. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నా దీని సరిపోయేంతగా స్కిల్స్ ఉన్న వారు మాత్రం రావడం లేదు. 25 శాతం మంది మాత్రమే దొరుకుతున్నారు. దీని నుంచి బయట పడేందుకు ఐఎస్‌బి తరహాలో సాఫ్ట్‌వేర్ ఇండస్ర్టీ వాళ్లు కలిసి ఒక ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ను ప్రమోట్ చేయొచ్చు కదా?
బివిఆర్: నాకు ఎడ్యుకేషన్ ఒక పాషన్. నేను ప్రస్తుతానికి ఐఐటి హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా ఉన్నాను. ట్రిపుల్ ఐటి, ఎన్‌ఐటిలో మెంబర్‌ని. ఇంజనీరింగ్ కాలేజీల గురించి రీసెర్చ్ చేశా ను. ఇంజనీరింగ్ కాలేజీలు ఇలాంటి పరిస్థితిలో ఉండటానికి ముఖ్య కారణం టీచింగ్ ఫ్యాకల్టీ లేకపోవడం. ఫ్యాకల్టీ ఎలాగూ తెచ్చుకోలేరు కాబట్టి ఇతర ప్రత్యామ్నాయాలను వినియోగించుకోమని కాలేజీలకు చెబుతున్నాం. లేకుంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా క్షీణించిపోతుంది. స్కిల్స్ ఎలా అభివృద్ధి చేయాలని కూడా చెబుతున్నాం.
ఆర్కే: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ విషయానికొచ్చే సరికి, ప్రభుత్వం నుంచి రాయితీలు తీసుకునేప్పుడు ఇచ్చే హామీలను కంపెనీలు అమలు చేయడం లేదన్న విమర్శలున్నాయి...
బివిఆర్: ఐటి కాకుండా ఇతర రంగాల్లో ప్రభుత్వ ప్రమేయం ఉంటుంది. ఇతర కంపెనీలకు చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి విధానం తగ్గాలి. లేకుంటే మనం అభివృద్ధిలోకి రాము. చైనా స్థాయి వృద్ధి రేటులోకి వెళ్లాలంటే బ్యూరోక్రాటిక్ అవరోధాలు చాలా తగ్గాలి. ప్రభుత్వ ప్రమేయం తక్కువగా ఉండటం వల్ల నే ఐటి పరిశ్రమ ఇంతగా వృద్ధిలోకి వచ్చింది. ఇప్పుడున్న స్థాయిలో ఎలక్ర్టానిక్ దిగుమతులు చేస్తే పదేళ్లలో ఆయిల్ దిగుమతులకన్నా వీటి దిగుమతులే ఎక్కువగా ఉంటాయి. ఎలక్ర్టానిక్ పరిశ్రమను పూర్తిగా చంపేశాం. మాన్యుఫ్యాక్చరింగ్ బేస్ పోయింది. దానివల్ల ఉద్యోగాలు పోయాయి. దిగుమతులు పెరిగి కరెంట్ ఖాతా లోటు పెరగడం మొదలైంది. ప్రభుత్వం ఇప్పుడు ఎలక్ర్టానిక్స్‌ను ప్రోత్సహిస్తోంది. పరిస్థితి మారుతుందని భావిస్తున్నాను. అయితే నోకియా వంటి కేసుల మూలంగా బహుళ జాతి కంపెనీలు కూడా కొద్దిగా భయపడుతున్నాయి.
ఆర్కే: ఇతర దేశాల్లో ఉన్నట్టుగా మన దగ్గర కంపెనీలు సొసైటీకి ఇచ్చేది ఇప్పుడు కొంచెం మొదలైంది. విప్రో ప్రేమ్‌జీ సమాజానికి ఇవ్వడం మొదలెట్టారు. దీని వల్ల అటు సమాజం , ఇటు కంపెనీ వృద్ది చెందుతుంది కదా..
బివిఆర్: సంపద ఎక్కువ ఉన్న వాళ్లు సమాజానికి ఎక్కువగా ఇస్తున్నారు. వెనకటి కాలంలో కూడా ఇలాంటి విధానం ఉంది. ఇప్పుడు కంపెనీ చట్టంలో మార్పులు చేశారు. కంపెనీల లాభంలో రెండు శాతం కార్పొరేట్ సామాజిక బాధ్యత కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఈ చట్టం రాక ముందే ఐదేళ్ల నుంచి మేము లాభంలో 1.5 శాతం ఇందుకోసం ఖర్చు చేస్తూ వస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటున్నాం. ప్రస్తుతం 13 ప్రభుత్వ స్కూళ్లు మా మేనేజ్‌మెంట్ కింద ఉన్నాయి. పది వేల మంది విద్యార్థులకు మేలు సహకారం అందిస్తున్నాం. స్కూళ్లలో దయనీయ పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిని తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్య ఎల్‌వి ప్రసాద్‌తో కలిసి ఐ కేర్ పేరుతో ఒక ఇన్షియేటివ్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 2.5 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. కార్పొరేట్లు అందరూ ముందుకు రావాలి. లాభాలు ఆర్జించడం కాదు సామాజికాభివృద్ధికి కృషి చేయాలి.
ఆర్కే: ఐటి పరిశ్రమలు అవసరానికి మించి స్థలాన్ని తీసుకున్నాయన్న విమర్శలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీకి వంద, యాభై ఎకరాలు అవసరమా?
బివిఆర్: సాఫ్ట్‌వేర్ కంపెనీకి తీసుకున్న వారు వినియోగించుకున్నారు. కానీ కొంత మంది సాఫ్ట్‌వేర్ సెజ్‌లు కట్టాలనుకున్నారు. అవి మాత్రమే డెవలప్‌మెంట్‌లోకి రాలేదు. వాటిపై కొన్ని కేసులున్నాయి. కానీ సాఫ్ట్‌వేర్ పరిశ్రమలో బాగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఒక్కోసారి అని పిలుస్తుంది. మేము సాఫ్ట్‌వేర్ కంపెనీని రన్ చేస్తున్నామా? లేక ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీని రన్ చేస్తున్నామా అనిపిస్తుంది. అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. 20-30 ఎకరాలున్న చోట బాగా ఉపయోగించుకున్నారు.500-800ఎకరాల సెజ్‌లుసమస్యల్లో ఉన్నాయి.
ఆర్కే: ఎవరైనా ప్రమోటర్ల కమిట్‌మెంట్‌ను చూడరు. వారి బ్యాలెన్స్ షీట్లు చూస్తారు. ఇది డ్రా బ్యాక్ కాదా?
బివిఆర్: ప్రైవేట్ ఈక్విటీ, ఫారిన్ ఫండింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్యాషన్ చూస్తారు. హైదరాబాద్ ఏంజెల్స్ అనే గ్రూప్ ఉంది. శ్రీని రాజు, జెఎ చౌదరి, నేను ఇందులో చాలా యాక్టివ్‌గా ఉన్నాం. ఎంటర్‌ప్రెన్యూర్లను ప్రోత్సహిస్తున్నాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రావాలని, ఇన్నోవేషన్ జరగాలన్నది నా విజన్. దీని వల్ల ఉద్యోగాలొస్తాయి.
ఆర్కే: పర్సనల్ లైఫ్ కొస్తే.. మీకు పిల్లలెంతమంది ?
బివిఆర్: ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి విద్యాభ్యాసం తర్వాత ఆరేళ్లు అమెరికాలో పని చేశాడు. నా దగ్గర పని చేయలేదు. కెల్లాగ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబిఎ చేశాడు. తర్వాత ఏం చేస్తావని అడిగితే ఉద్యోగం ఇస్తే వస్తానన్నాడు. ఇక్కడికి రప్పించా. నా దగ్గరే ఆరేళ్ల నుంచి పని చేస్తున్నాడు. అమ్మాయి అమెరికాలో మాస్ కమ్యూనికేషన్‌లో పూర్తి చేసింది. నిజామాబాద్ అబ్బాయితో పెళ్లయింది. డాక్టర్ భాస్కర్ రెడ్డి (ప్రముఖ గ్యాసో్ట్ర ఎంటెరాలజిస్ట్ నాగేశ్వర్‌రెడ్డి తండ్రి) మా మామ గారు. చాలా పాపులర్ డాక్టర్. నేను అమెరికా వెళ్లేప్పుడు మెడికల్ ఆఫీసర్‌గా ఉన్న భాస్కర్ రెడ్డి దగ్గరకు గెజిటిడ్ ఆఫీసర్ సంతకాల కోసం వెళ్లాను. నా మార్కుల షీటు చూసి నన్నే అల్లుడ్ని చేసుకోవాలన్న ఐడియా వచ్చింది ఆయనకు.
ఆర్కే: యంగర్ జనరేషన్‌కు మీరిచ్చే మెసేజ్ ఏంటి?
బివిఆర్: సక్సస్ అనేది ఓవర్‌నైట్ రాదు. కష్టపడాలి. సులభంగా వచ్చేది సులభంగా పోతుంది. కష్టపడితే నిలదొక్కుకుంటాం. షార్ట్‌కట్స్ కోసం చూడకండి. వాల్యూస్ విషయంలో కాంప్రమైజ్ చేయకండి. కష్టపడండి తప్పకుండా సక్సస్ అవుతారు. యంగ్‌స్టర్స్ ఇంటర్నెట్ ఏజ్‌లో పుట్టారు. చాలా అవకాశాలు వస్తాయి.
సంవత్సరానికి ఎంత మంది ఇంజనీర్లు కావాల్సి వస్తుంది?
బివిఆర్: మన రాష్ట్రంలో ఏడాదికి లక్ష మంది ఇంజనీర్ల అవసరం ఉంటుంది. 50 వేల మంది ఆంధ్రాలో ఉంటే.. మరో 50 వేల మంది బయట నుంచి తెచ్చుకుంటు న్నాం. ఏటా అందుబాటులోకి వచ్చే ఇంజనీర్లలో 25 మందిని తీసుకుంటున్నాం. మరో 25 శాతం మంది కూడా పరవాలేదు. ఇలాం టి వారికి ఆరు నెలలు ట్రెయినింగ్ ఇస్తాం. తక్కిన 50 శాతం మంది రోడ్లమీద ఉంటున్నారు. ఇలా ఉండకుండా చేయాలంటే బాగా చదువు చెప్పాలి. వారికి ఉద్యోగాలివ్వాలి. ఆ రెండు జరగకపోతే లాభం లేదు. ఒక ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌ను నడిపించేంత సామ ర్థ్యం పరిశ్రమ దగ్గర లేదు. ప్రభుత్వం ట్రిపుల్ ఐటి అనే ఒక స్కీమ్‌ను పెట్టింది. 20 కాలేజీలు పెట్టారు. ఇవి చాలా తక్కువ. శ్రీసిటీలో ఒక ట్రిపుల్ ఐటి పెట్టారు.
హైదరాబాద్‌లో ఒకటి ఉంది. కాకినాడలో పెట్టాలనుకుంటున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలతో పోల్చితే ఇవి చాలా తక్కువ. ఉచిత విద్య అని మొదలుపెట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకూ బాధ్యత తగ్గిపోతుంది. ఇంతకు ముందు కింది స్థాయిలో ఐటిఐ, తర్వాత డిప్లొమా తర్వాత డిగ్రీ ఉండేది. ఇప్పుడు ఐటిఐ, డిప్లొమాలో ఎవరూ దొరకరు. ఇప్పుడు రివర్స్ పిరమిడ్ అయి ఇంజనీర్లు పెరిగిపోయారు. కింది స్థాయిలో పని చేసే వారు దొరకడం లేదు. పశ్చిమ దేశాల్లో చాలా సిస్టమెటిక్‌గా ఉంటారు. అందుకే కొన్ని సంస్కరణలు తీసుకురావాలి. ఈ దేశం మారుతుందని అనుకున్నాను.
మీ లైఫ్ యాంబీషన్ ఏంటీ?
బివిఆర్: ఒకప్పుడు చాలా కష్టపడ్డాను. ఎంతో త్యాగం చేశాను. బిజినెస్ పనుల మీద ఎన్నో రోజులు ప్రయాణాలు చేసేవాణ్ణి. ఎడ్యుకేషన్ నాకు పాషన్.. చాలా సమయం దీని మీద వెచ్చిస్తున్నాను. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ఎంకరేజ్ చేయాలని చూస్తున్నాను. ఫండింగ్ చేస్తాను. గత ఇరవై ఏళ్లలో చాలా మిస్ అయ్యాను. చక్కగా కూర్చుని పాడుకుందామని అనుకునే వాణ్ణి. ఇప్పుడు సంగీతం నేర్చుకుందామని అనుకుంటున్నారు.
సత్యం ఎపిసోడ్ తర్వాత ఇండస్ర్టీ ఏమన్నా లెసన్స్ నేర్చుకుందా?
బివిఆర్: నేర్చుకుంది. సత్యం లాగా చేస్తే అన్ని కంపెనీలు పేకముక్కలా పడిపోతాయని నేర్చుకున్నారు. ఆ రోజు ప్రభుత్వం కల్పించుకోక పోయి ఉంటే 30-40 వేల మంది హైదరాబాద్ రోడ్లపై ఉండేవారు. ఇది ఆంధ్రప్రదేశ్ అదృష్టం. ఈ ఎపిసోడ్ వల్ల చాలా మంది మంచి పాఠాలు నేర్చుకున్నారు. ఇలాచేస్తే కొద్ది రోజులు మినుకుమినుకు మంటూ వెలిగిపోతాం తర్వాత పూర్తిగా నాశనమైపోతాం.
రెండు మూడు నెలల్లో మన రాష్ట్రం ఏంటో తేలిపోతుంది. ఒక వేళ విభజన అయిపోతే ఐటి వృద్ధికి ఏమీ ఎఫెక్ట్ కాదు కదా?
బివిఆర్: ఏమీ కాదండి. కాకపోతే రెసిడ్యుయల్ ఆంధ్రప్రదేశ్‌లో ఐటి ఇండస్ర్టీ రావ టం కొంత సమయం పడుతుంది. హెచ్‌ఎస్‌బిసి వాళ్లు వైజాగ్‌లో కాల్‌సెంటర్ నడిపిస్తున్నారు. అక్కడ మూడు నాలుగు వేలమంది పని చేస్తున్నారు. కాకినాడ ఇన్ఫోటెక్‌లో 1100 మంది పని చేస్తున్నారు. మొత్తంగా 20 వేల మంది వైజాగ్‌లో పని చేస్తున్నారు. వైజాగ్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. హైదరాబాద్ అభివృద్ధికి పదేళ్ల పాటు చాలా శ్రమపడ్డారు. చంద్రబాబులాంటి వారు అమెరికా వెళ్లి ప్రమోట్ చేసి, బాగా ఓపిక పట్టి అందరినీ పర్సనల్‌గా కలిసి అభివృద్ధికి కృషి చేశారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇంకా శ్రమ పడాలి. అందుకు సమయం పడుతుంది. ఆంధ్రాకు కోస్టల్ లైన్ ఉంది, ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. అక్కడ కూడా ఇండస్ర్టీలు వస్తాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
Updated Date - 2020-02-08T01:30:54+05:30 IST