ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామారావుగారి తర్వాతే ఎవరైనా! అంత అందగాడు ఇండియాలో ఉన్నారాండి?

ABN, First Publish Date - 2020-02-08T07:49:10+05:30

నోట్లో పవిటచెంగు కుక్కుకుంటూ ఆమె కంట తడి పెట్టిందంటే ప్రేక్షకుల కళ్లు చెమర్చాల్సిందే! సెంటిమెంట్‌ సన్నివేశాలు రక్తి కట్టాలంటే ఆమె పాత్ర కచ్చితంగా ఉండాల్సిందే!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నోట్లో పవిటచెంగు కుక్కుకుంటూ ఆమె కంట తడి పెట్టిందంటే ప్రేక్షకుల కళ్లు చెమర్చాల్సిందే! సెంటిమెంట్‌ సన్నివేశాలు రక్తి కట్టాలంటే ఆమె పాత్ర కచ్చితంగా ఉండాల్సిందే! నాలుగున్నర దశాబ్దాలుగా తల్లి పాత్రలతో ప్రేక్షకులను మెప్పించినా అవేవీ తనను వెతుక్కుంటూ వచ్చిన వేషాలు కావు. వాటిని తానే ఏరి కోరి ఎంచుకున్నానంటున్న సీనియర్‌ నటి ‘అన్నపూర్ణ’. తన సినీ, వ్యక్తిగత విశేషాలను ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్‌ హార్ట్‌ విత్ ఆర్కే కార్యక్రమంలో వివరించారు. ఆ ముచ్చట్లు మీకోసం..


ఆర్కే: వెల్‌కమ్‌ టు ఓపెన్‌హార్ట్‌! నమస్కారం అన్నపూర్ణమ్మ గారూ! బాగున్నారా?

అన్నపూర్ణ: నమస్తే! బాగున్నానండీ!


ఆర్కే: దాదాపు నాలుగున్నర శతాబ్దాలు ఏకధాటిగా నటించారు కదా బోరు కొట్టి విశ్రాంతి తీసుకున్నారా?

అన్నపూర్ణ: నటనంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇది నేను చాలా ప్రేమించిన వృత్తి కదా! కాబట్టి బోరు కొట్టటం అనేది ఇంతవరకూ రాలేదు.


ఆర్కే: ఈమధ్య సినిమాలు తగ్గాయి కదా?

అన్నపూర్ణ: ఇప్పటి సినిమాల్లో నేను కనబడట్లేదంటే మాకాలం హీరోలందరూ ఓల్డ్‌ అయిపోయారు. ఇప్పటివాళ్లంతా యంగర్‌ జనరేషన్‌. వాళ్లతో నటించాలంటే బామ్మ వేషం వేయాలి. ఇప్పుడు తల్లి పాత్ర వేశానంటే పిల్లల్లేక గుళ్లలో పూజలకు తిరిగి లేటుగా కన్నట్టు ఉంటుంది. పేక్షకులు కూడా తలుల్ని గ్లామర్‌గా చూడాలనుకుంటున్నారు. వాళ్లకు తగ్గట్టే పెళ్లైపోయి తిరిగొచ్చిన హీరోయిన్లే తల్లుల పాత్రలు పోషిస్తున్నారు. నన్ను కూడా అప్పుడప్పుడూ పిలుస్తున్నారు.


ఆర్కే: అయితే బోలెడంత అసంతృప్తి ఉంది.

అన్నపూర్ణ: నాకు పెద్దగా అసంతృప్తి లేదండి. ఎందుకంటే మంచి మంచి సినిమాల్లో నటించాను. మంచి నటులతో కలిసి పని చేశాను. ఇప్పటి పిల్లలందరూ కూడా తెలిసినవాళ్లే! వాళ్ల నాన్నలతో కలిసి నటించాను. కానీ హీరోల పిల్లలు హీరోలయ్యారుగానీ డైరెక్టర్ల పిల్లలెవరూ డైరెక్టర్లు కాలేదుగా! అలా అయ్యుంటే నేను ఇప్పటికీ నటించేదాన్నేమో! ఇప్పుడు వీళ్లతో కూడా నటించాలని ఉంది. కొత్త రకం యాక్టింగ్‌ కూడా నేర్చుకోవాలని ఉంది. ఇక ఆయుష్షు ఉండి, ఙ్ఞాపకశక్తి కూడా ఉంటే 80 ఏళ్లవరకూ పని చేయొచ్చు. అల్లు రామలింగయ్యగారు చేయలేదా?


ఆర్కే: అవును.

అన్నపూర్ణ: అలా పెద్దపెద్దవాళ్లంతా చేశారు. అలా నేనూ కోరుకోవటం అత్యాశ కాదేమో!


ఆర్కే: మీతరం వాళ్లు చాలామంది సంపాదించింది జాగ్రత్త చేసుకోవటంలోగానీ, నిలబెట్టుకోవటంలోగానీ దృష్టి పెట్టలేదు. మరి మీరు కాస్త జాగ్రత్త చేసుకోగలిగారా?

అన్నపూర్ణ: మా అమ్మగారిది కృష్ణా జిల్లా! ఒక రూపాయొస్తే ఓ పావలా దాచే మెంటాలిటీ. ఇప్పుడు ఆ పావలాలన్నీ మిగిలిపోయాయి. అంటే మా కుటుంబమంతా చెన్నై వెళ్లలేదండీ! నేనొక్కదాన్నే చెన్నైలో ఉన్నాను. మావాళ్లంతా వచ్చి వెళ్తుండేవాళ్లు. మేము మొత్తం ఐదుగురం ఆడపిల్లలం. నాముందామె, వెనకామె లేరు. ముగ్గురం మిగిలాం. మాకో తమ్ముడు. అందుకని మా అమ్మగారు కొంచెం జాగ్రత్త పడేవారు.


ఆర్కే: వాళ్లంతా ఇక్కడే ఉంటున్నారా?

అన్నపూర్ణ: వాళ్లంతా విజయవాడలోనే ఉన్నారు. అప్పట్లో కూడా అమ్మ, నేను మాత్రమే విజయవాడకు చెన్నైకి తిరుగుతూ ఉండేవాళ్లం. అక్కడే ఓ రూమ్‌ తీసుకుని ఒక సూట్‌కే్‌సతో వచ్చి వెళ్తుండేవాళ్లం. వంట కూడా అమ్మే చేసేది. ఎందుకంటే అప్పట్లో మాకు భాష రాదు. తెలిసిన వాళ్లు లేరు. అందుకే కిరసనాయలు దగ్గర్నుంచి అన్నీ పట్టుకెళ్లేవాళ్లం.


ఆర్కే: అసలు మిమ్మల్ని మద్రాసు చేర్చిందెవరు?

అన్నపూర్ణ: నాకు పదమూడేళ్లప్పుడు మా అమ్మానాన్నలకు గొడవైంది. అప్పుడు మా అమ్మ ‘బియ్యం డబ్బాలో ఓ ఏడు రూపాయలున్నాయి. లోపలికెళ్లి ఆ డబ్బులు పట్రా!’ అని పంపింది. వాటిని లంగా చెంగులో దోపేసుకుని బయటికొచ్చాను. ఆ డబ్బులతో తెనాలిలోని మా బంధువుల దగ్గరికి వెళ్లిపోయాం. అక్కడ ఓ నాటకాలేసే అతను నన్ను చూసి వేషం వేయించమని మా అమ్మతో అన్నాడు. బోయ భీమన్నగారిది పాలేరు అని ఓ నాటకం. దాన్లో చిన్న పిల్ల పాత్ర. 1967, జనవరి నెలలో ఆ వేషం వేశాను. ఇంట్లో ఉంటే పనులు చెప్తారు. ఇదేదో బాగుంది. అమ్మకెలాగైనా చెప్పేయాలని ‘అమ్మా! నేనిక నాటకాలే వేస్తాను’ అని చెప్పేశాను. ఆ తర్వాత మళ్లీ అందరం బెజవాడ వెళ్లిపోయినా నేను మాత్రం నాటకరంగంలో పాతుకుపోయాను.


ఆర్కే: మొదటి నాటకానికి ఏమైనా డబ్బులిచ్చారా?

అన్నపూర్ణ: ఇరవై ఐదు రూపాయలిచ్చారు. ఆ తర్వాత మద్రాసులో కూడా వాణీమహల్‌లో నాటకాలు వేసేవాళ్లం. అలా సినిమాల్లోకొచ్చాను. అయితే సినిమావాళ్లు పైనుంచి కిందకి చూస్తూ ప్రశ్నలేసేవాళ్లు. వాళ్ల ధోరణి నచ్చక నాటకాలే వేసుకుందాం అని వెళ్లిపోయాను. కానీ తర్వాత వాళ్ల ఆహ్వానం మీదకే సినిమాల్లోకొచ్చాను.


ఆర్కే: సినిమా రంగానికి మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు?

అన్నపూర్ణ: నవశక్తి గంగాధరరావు గారు ‘నీడ లేని ఆడది’ సినిమా తీశారు. దాన్లో ప్రభ హీరోయిన్‌. అప్పుడు నాతో నాటకాలేసిన మురళీమోహన్‌ ‘ఉమా! ఓ వేషముంది సినిమాలో అన్నారు’.


ఆర్కే: మీ అసలు పేరు ఉమా!

అన్నపూర్ణ: అవును. నా ఒరిజినల్‌ పేరు ఉమ! అలా ఆయన అడగ్గానే ముందు వద్దన్నాను. కానీ మురళీమోహన్‌ టిక్కెట్‌ కొనిస్తాను. వెళ్లు అన్నారు. మా అమ్మ కూడా వెళ్లు. నచ్చితే చేయి. లేదంటే నాటకాలతోనే సరిపెట్టుకోవచ్చు అంది. దాంతో అమ్మను తీసుకుని విశాఖపట్నం షూటింగ్‌కి వెళ్లాను. బి.వి.ప్రసాద్‌గారు డైరెక్టర్‌. అది ఓ అమ్మాయి వేషం. ట్రైన్‌ ప్రాబ్లమ్‌ వల్ల మద్రాసునుంచి రాలేకపోతే ఆ పాత్ర కోసం నన్ను పిలిచారు. అలా మొదటిసారి సినిమాలో నటించాను. ఆ తర్వాత పెళ్లైపోయింది.


ఆర్కే: అంత తొందరగా మీరు పెళ్లెందుకు చేసుకున్నారు?

అన్నపూర్ణ: వేకెంట్‌గా ఉంటే ఎవడుబడితే వాడు ప్రేమిస్తాడు.


ఆర్కే: అంతేగా? ఆ గొడవంతా ఎందుకని పెళ్లి చేసుకున్నారా?

అన్నపూర్ణ: అసలు నేను ఒరిజినల్‌గా ప్రేమించింది నా నటనని. ముఖానికి రంగుండాలి. చుట్టూ జనముండాలి. ఇదే నా యాంబిషన్‌. దీని తర్వాతే ఎవరైనా. దాంట్లో ఉన్నప్పుడు ఈ లవ్వులు నాకు చిరాకు పుట్టించేవి. అందుకే పెళ్లి చేసుకుంటే పెళ్లైపోయిందని వదిలేస్తారుగా! అందుకే పెళ్లి చేసుకున్నాను.


ఆర్కే: ఒకే!

అన్నపూర్ణ: మొదట్లో మేకప్‌ టెస్ట్‌లో ఫెయిలయ్యాను. తర్వాత మేకప్‌ తక్కువేయించి ఒకే చేశారు. తర్వాత మిక్కిలినేని జగదీష్‌, దాసరి నారాయణ రావు గారు తీయబోయే సినిమా గురించి చెప్పారు. ఆ సినిమాలో నటించాను. మోహన్‌బాబు హీరో! ఇక చాలు. సినిమాల్లో ఈ యంగ్‌ వేషాలకు బదులు నాటకాలే వేసుకుందాం అనుకున్నాను.


ఆర్కే: అంటే...యంగ్‌ లేదంటే ముసలి ముతకా వేషాలనా?

అన్నపూర్ణ: నాటకాల్లో ముసలి వేషాలు కూడా వేశాను. అలా ఏం లేదు. కాకపోతే సినిమాల్లో కొన్ని కండిషన్లు పెట్టుకున్నాను. ఇంకోసారి వేషం వేయమని అడిగితే ఒకటి చెప్పేదాన్ని. ‘ఏమండీ! నన్నేం అనకూడదు. అక్క, తల్లి పాత్రలే వేస్తా. యంగ్‌గా ఉండి పరిగెత్తటాలు, విలన్లు వెంటబడి జాకెట్లు చింపించుకోవటాలు లాంటి పాత్రలు చేయను.


ఆర్కే: హ..హ్హహ్హ!

అన్నపూర్ణ: అవునండీ! మళ్లీ నేను వెళ్లి బెజవాడలో ఉండాలి. రిక్షాల్లో తిరగాలి. ఇప్పుడు కదా టాక్సీలు వచ్చాయి. జాకెట్లు చిరిగిన వేషం వేసి రిక్షాలో తిరిగితే కుర్రాళ్లు ఊరుకుంటారా చెప్పండి?


ఆర్కే: అవును!

అన్నపూర్ణ: అలా ముందు జాగ్రత్త కోసం నేను చేయనండీ అని చెప్పేశాను. కానీ లక్‌ కుదిరింది మాత్రం, వి.మధుసూదనరావు గారి అంగడిబొమ్మ సినిమాలో. అందులో ఒక సాంగు, రెండు చిన్న సీన్లు. నాది మదర్‌ వేషం. వెంకటరత్నంగారు కెమెరామ్యాన్‌. మేకప్‌ లేకపోయినా అద్భుతంగా తీశారు. నా అదృష్టం. ఆ సినిమా చూసిన జి.వరలక్ష్మి నన్ను పిలిపించి ‘బాగున్నావే! చాలా బాగా చేశావ్‌. ఒక జీవితకాలం నువ్వే మదర్‌’ అని ఆశీర్వదించేశారు. అది సూపర్‌ బ్లెస్సింగ్‌.


ఆర్కే: అప్పటికి మీ వయసెంత?

అన్నపూర్ణ: 22 ఏళ్లుంటాయేమో!


ఆర్కే: మరి అన్నపూర్ణ అని పేరెవరు పెట్టారు?

అన్నపూర్ణ: దాసరి నారాయణరావు గారు. ఆయన సినిమాకి ప్రెస్‌ మీట్‌ పెట్టినప్పుడు సి.నారాయణరెడ్డి గారితో నాకు అన్నపూర్ణ అని పేరు పెట్టించారాయన. పెద్దవాళ్లు ఆశీర్వదిస్తూ ఏవైనా మాటలంటే జరుగుతాయండి.


ఆర్కే: మీకు నమ్మకముందనమాట! 

అన్నపూర్ణ: బాగా! వరలక్ష్మిగారి ఆశీర్వాదం బాగా పనిచేసింది. అలా సినిమాల్లో బిజీ అయ్యాక ఊరికి మద్రాసుకి తిరగలేక ఓ బ్యాచిలర్‌ రూమ్‌లాగా ఏర్పాటు చేసుకున్నాం. షూటింగ్‌ అయిపోతే మెయిల్‌ ఎక్కేసేదాన్ని.


ఆర్కే: పెళ్లి చేసుకున్నా ఫ్యామిలీ అంతా విజయవాడలోనే ఉండేవాళ్లా?

అన్నపూర్ణ: అంతా విజయవాడే! మా మదర్‌ కూడా కొంతకాలమే తోడొచ్చింది. ఆ తర్వాత ఆమె కూడా మానేసింది. ఆ తర్వాత మొండిఘటం, రామానాయుడుగారి ముందడుగు సినిమాల్లో నటించాను. అనురాగ దేవతలో ఎన్‌టీఆర్‌గారికే అమ్మగా నటించాను.


ఆర్కే: ఏఎన్నార్‌గారికి కూడా మదర్‌గా వేశారుగా?

అన్నపూర్ణ: ఆయన చెల్లో, అక్కో వేయించుకున్నాడు గానీ మదర్‌ పాత్ర వేయించుకోలేదు.


ఆర్కే: ఎందుకు?

అన్నపూర్ణ: యంగ్‌గా ఉన్న మనిషి తనకు మదర్‌గా వేస్తే తనని ఏజ్‌డ్‌ అనుకుంటారనేమో! ఆయనకి అందం మీద కాన్షియస్‌ నెస్‌ ఎక్కువ కదా! అవునంటారా! కాదంటారా? తిడతారేమో జనమంతా నన్ను! తిట్టకండి బాబోయ్‌!


ఆర్కే: పర్లేదులెండి!

అన్నపూర్ణ: ఇక ముందడుగు సినిమాకి రామానాయుడు గారు నన్ను డబ్బింగ్‌ చెప్పనివ్వకపోతే రామారావు గారి దగ్గరకెళ్లి ఏడ్చాను. పిలిచి వేషం ఇచ్చి నాచేత డబ్బింగ్‌ చెప్పించకపోతే నాకు అవమానం కదా! అన్నాను. ఈసారికి వదిలేయమ్మా! అని ఆయన కవర్‌లో రెండున్నర వేయి ఇప్పించి పంపించారు. ఆ తర్వాత బాపయ్యగారు ఎలాగోలా డబ్బింగ్‌ చెప్పించారు. అలా ఆ సినిమాలో నా వేషం ఎస్టాబ్లిష్‌ అయిపోయింది. ఆ తర్వాత తీరుబడి దొరకలేదు.


ఆర్కే: ఇక వెనక్కి తిరిగి చూసుకోలా?

అన్నపూర్ణ: చూసుకోలా!


ఆర్కే: ఎంతిచ్చారు ఆ సినిమాకి?

అన్నపూర్ణ: పదకొండున్నర వేలు.


ఆర్కే: మీరు ఎప్పుడూ ఎక్కువ డిమాండ్‌ చేయరా?

అన్నపూర్ణ: ఇప్పుడు చేస్తున్నానండీ! ఇప్పుడు ప్రిస్టేజ్‌ అనిపిస్తోందండీ! నాకంటే చిన్న పిల్లలు రోజుకి 30, 40 వేలు డిమాండ్‌ చేస్తుంటే నేను తక్కువకి చేస్తే ఏం ప్రిస్టేజి?


ఆర్కే: తల్లి క్యారెక్టర్లేసే మీరు సడెన్‌గా నాగార్జున సినిమా హల్లోబ్రదర్‌లో మోడర్న్‌ అత్తగారి వేషం ఎందుకు వేశారు?

అన్నపూర్ణ: ఇవివిగారి అప్పుల అప్పారావు. ఆ సినిమా అంతకంటే ముందుది. దాన్లో సోమయాజులగారికి సెట్‌పగా, చిరంజీవి ఫ్యాన్‌గా చేశాను.


ఆర్కే: మీరు చాలామంది హీరోలకి తల్లిగా నటించారు కదా! వాళ్లలో ఏ కొడుకంటే మీకు చాలా ఇష్టం?

అన్నపూర్ణ: ఇష్టం ఒకళ్ల మీద పెట్టుకోలేదండీ! వృత్తి మీదే నా ఇష్టం. కాబట్టి ఒకళ్ల మీద ఎక్కువ ఒకళ్ల మీద తక్కువ లేదండీ!


ఆర్కే: ప్రొఫెషనల్‌గా చెప్పాల్సివస్తే?

అన్నపూర్ణ: రామారావుగారి తర్వాతే ఎవరైనా! ఆయనంటే నాకిష్టమండి. అంత అందగాడు ఇండియాలో ఇంకెవరైనా ఉన్నారాండి?

ఆర్కే: ఇప్పుడు ఇండసీ్ట్రలో అన్ని ట్రెండ్స్‌ మారిపోయినై కదా? ఇప్పుడు పరిస్థితులను చూస్తుంటే ఏమనిపిస్తోంది?

అన్నపూర్ణ: ఇప్పుడు పెద్దగా ఎక్స్‌ప్రెషన్స్‌ వద్దంటున్నారు. మేకప్‌ వద్దంటారు. ఇప్పటి జనరేషన్‌కి తగ్గ మార్పే ఇది.


ఆర్కే: మీరు ఎన్నో భారీ క్యారెక్టర్లు వేశారుకదా? వీటిలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్‌ ఏది? 

అన్నపూర్ణ: మనిషికో చరిత్ర.


ఆర్కే: ఆ రోజులతో పోలిస్తే ఇప్పుడు రెమ్యునరేషన్‌ బాగా పెరిగిందిగా?

అన్నపూర్ణ: దాంతోపాటే ఖర్చులు కూడా పెరిగాయి. ఆరోజుల్లో వెయ్యి ఇస్తే వందన్నా మిగిలేది. ఇప్పుడు 20,30 వేలు పట్టుకెళ్లినా వెయ్యి కూడా మిగలట్లేదు.


ఆర్కే: మీకు పిల్లలెంతమంది?

అన్నపూర్ణ: నాకు పిల్లల్లేరండి. ఓ పాపని పెంచుకున్నాను. పెళ్లి చేశాను. ఇప్పుడు ఆ పాపకో పాప.


ఆర్కే: ఆర్ధిక విషయాల్లో మీవారి ప్రమేయం ఎంతవరకూ ఉండేది?

అన్నపూర్ణ: డబ్బు విషయంలోగానీ, నటన విషయంలోగానీ ఆయన కలగజేసుకోరండీ. అంతా అమ్మా, నేనే చూసుకుంటాం.


ఆర్కే: తీరని కోరికలున్నాయా?

అన్నపూర్ణ: పెద్ద కోరికలేం లేవు. ఇప్పుడున్న అందం ఇలాగే ఉండి, బోలెడంత వార్ధక్యం రాకుండా ఆరోగ్యంగా ఉండి ఇలా వర్క్‌ చేస్తూనే వెళ్లిపోవాలని కోరిక. ఆఖరి క్షణం వరకూ పని చేస్తూ ఉండాలి.


కిటికీల జాకెట్‌ తెచ్చిన తంటా

ఇవివిగారి అప్పుల అప్పారావు సినిమా విజయవాడలో షూటింగ్‌. అందరూ హోటల్‌లో ఉంటే మా ఇల్లు ఆ ఊర్లోనే కాబట్టి ఇంట్లోనే మేకప్‌ వేసుకుని రెడీ అవుతున్నాను. ఈలోగా ఒకతను కాస్ట్యూమ్స్‌ పట్టుకొచ్చాడు. వాటిలో ఓ జాకెట్‌ వెనకాలంతా కిటికీ ఊచల్లాంటి డిజైన్‌. ఛీ! ఇదేంటి? ఇంకెవరివో కాస్ట్యూమ్స్‌ పట్టుకొచ్చినట్టున్నాడు అనుకుని తీసుకెళ్లిపోమన్నాను. మా అమ్మేమో అతన్ని వెళ్లకుండా ఆపి నా దగ్గరికొచ్చింది. సినిమాల్లో మనకేమీ బంధువులెవరూ లేరు కదా? ఏదో ఆ కాసేపూ వేసుకుని డైలాగులు చెప్పి వచ్చేయ్‌. ఈ జాకెట్‌ గురించి సినిమా వద్దన్నావంటే నీకు బాగా బలిసింది. డబ్బులు బాగా సంపాదించి అవకాశం వదులుకుంది. అంటారు. కాబట్టి చేయి. ఒకవేళ అదే వేషం క్లిక్‌ అయితే అలాంటి అవకాశాలు కూడా వస్తాయి అని నచ్చజెప్పి జాకెట్‌ వేయించింది. ఏలూరులో బాపినీడుగారి చిరంజీవి సినిమా విజయోత్సవ సభ. నన్ను ఇద్దరు కెమెరామెన్లను ఇచ్చి అక్కడికి పంపించి చిరంజీవి మెడలో దండ వేయమన్నారు. చిరంజీవికి అది షూటింగ్‌ అని తెలియదు. ఆ తర్వాత చిరంజీవిగారు అది సినిమా షూటింగ్‌ అని ఎందుకు చెప్పలేదని నన్ను అడిగారు. నాకేం తెలుసండీ! మీకు తెలుసేమోననుకున్నాను అన్నాను. కానీ ఆయనకి మనసులో ఏదో పడిందండి. అలా జరగటంతో ఇంటికొచ్చి అమ్మని చెడామడా తిట్టేశాను.

 

ఆర్కే: ఆరోగ్యంగా ఉండాలి. ఆఖరి క్షణం వరకూ పని చేస్తూ ఉండాలి. సరే! అలాగే జరగాలని కోరుకుందాం! థ్యాంక్యూ అమ్మా! నమస్తే!

అన్నపూర్ణ: నమస్తే అండీ!

Updated Date - 2020-02-08T07:49:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising