ఆ రెండు సినిమాలు కలపమన్నా... సమరసింహారెడ్డి ఇచ్చారు
ABN, First Publish Date - 2020-02-08T08:18:17+05:30
బీ.గోపాల్.. తన సినిమాలతో హీరోయిజానికి సరికొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి. సమరసింహారెడ్డి, నరసింహా నాయుడు, ఇంద్ర... వంటి పలు సినిమాలతో ఇండస్ట్రీని సరికొత్త పుంతలు తొక్కించారు
బీ.గోపాల్.. తన సినిమాలతో హీరోయిజానికి సరికొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి. సమరసింహారెడ్డి, నరసింహా నాయుడు, ఇంద్ర... వంటి పలు సినిమాలతో ఇండస్ట్రీని సరికొత్త పుంతలు తొక్కించారు ఎవరి దగ్గర ఏ బలముందో కనుక్కుని.. వాటన్నిటినీ తన బలంగా మలుచుకుని పవర్‌ఫుల్ చిత్రాలు తీయడంలో ఆయన దిట్ట. కెమెరా అంటే ఏంటో తెలియని తాను దర్శకుడిని అవడం, పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీయడం అంతా అదృష్టమేనంటున్నారు. నాగేశ్వరరావుతో సినిమా తీయగలిగాను కానీ... ఎన్టీఆర్‌తో తీయలేకపోయా అని వాపోయారు. పరుచూరి బ్రదర్స్‌తో తన అనుబంధం గురించి 05-06-2016న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొని వివరించారు. ఆ వివరాలు మీకోసం...
ఆర్కే: నాలుగు దశాబ్దాలపాటు అనేక హిట్లు ఇచ్చారు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది?
బి.గోపాల్ : చాలా సంతోషంగా ఉంది. నేను ముందు నుంచి సబ్జెక్ట్‌ను నమ్ముకున్న దర్శకుణ్ణి. కథ బాగుంటే ఏ హీరోతో అయినా తీయొచ్చు. ఈ విషయంలో రచయితలను హింస పెట్టేవాణ్ణి. పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలు, పెద్ద రచయితల కాలంలో నేను సినిమాలు తీశాను. కాలం కలిసొచ్చిందనే చెప్పొచ్చు.
ఆర్కే: మీలాంటి పాతతరం దర్శకులు.. కొత్త జనరేషన్‌కు ఎందుకు దూరం అవుతున్నారు?
బి.గోపాల్ : ఎవరైనా సరే అప్‌డేట్ కాకపోతే వచ్చే సమస్య ఇది. ఇప్పుడున్న ప్రేక్షకుల మనస్తత్వాన్ని క్యాచ్ చేయగలగాలి. థియేటర్లకు వెళ్లి నేడొస్తున్న సినిమాలను పరిశీలించాలి. కొత్తతరం ప్రేక్షకుల అభిరుచుల్ని తెలుసుకోవాలి. అప్పుడే సినిమాలు తీయగలం.
ఆర్కే: మీరు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు కదా.. కొత్తతరానికి ఏం కావాలో తెలుసుకుని వస్తున్నారా?
బి.గోపాల్ : అప్పట్లో నేను రామ్, హన్సికలతో ‘మస్కా’ అనే ఎంటర్‌టైనర్ తీశాను. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. కలెక్షన్లు పికప్ అయ్యేలోపు ‘అరుంధతి’ వచ్చింది. దాంతో కొంత ఇబ్బంది కలిగింది. అయినా ప్రొడ్యూసర్ హ్యాపీ. ఇది కొత్తతరం చిత్రమే.
ఆర్కే: ఒకప్పుడు దర్శకులకు ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు హీరోలకు ప్రాధాన్యం వచ్చింది. ఎందుకిలా?
బి.గోపాల్ : నేను మొత్తం చేసింది 31 చిత్రాలు. అందులో చాలా వరకు హిట్లు ఉన్నాయి. పెద్ద బ్యానర్లలో, పెద్ద హీరోలతో చేశాను. అందరం కలిసి పని చేసుకున్నాం. అప్పుడు ఏ ఇబ్బందీ రాలేదు.
ఆర్కే: మీరు ఇంత సాఫ్ట్‌గా ఉన్నారు కదా, షూటింగ్‌లలో ఇబ్బంది రాలేదా?
బి.గోపాల్ : సెట్‌లో కూడా నేను సౌమ్యంగా ఉండేవాణ్ణి. అయితే నాకు ఏది కావాలంటే దాన్ని స్పష్టంగా చెప్పి చేయించుకోవడం అలవాటు. ఏ విషయాన్ని అయినా పక్కనోళ్లకు వినిపించకుండా.. మెల్లగా చెబుతాను. అరిచి భయపెట్టే రకం కాదు.
ఆర్కే: ఏ బ్యాగ్‌గ్రౌండు లేకుండా మద్రాసు వెళ్లారా?
బి.గోపాల్ : నేను సినిమాల్లోకి వెళ్లాలని రాసిపెట్టారేమో అనిపిస్తుంది. లేకపోతే నాకు సినిమాలతో సంబంధమే లేదు. ఇండస్ట్రీలో నాకు తెలిసిన వాళ్లు ఒక్కరు కూడా లేరు. మాది ఒంగోలు దగ్గర ఎం.నిడమానూరు అనే పల్లెటూరు. నాన్నగారిది రైతు కుటుంబం. నా చదువు కారుమంచి అనే ఊర్లో సాగింది. బడికి రెండున్నర మైళ్లు నడిచి వెళ్లేవాణ్ణి. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు సైకిల్ కొనిచ్చారు నాన్న. అప్పట్లో అదే బెంజికారులా ఫీలయ్యాను. క్రీడల్లోను చురుగ్గా పాల్గొనేవాణ్ణి. చదువు మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. బట్టీ పట్టి చదివి పరీక్షలు రాశాను. నేను పాసయ్యానర్రో అంటే ఎవరూ నమ్మలేదు. అలాంటి సమయంలో - ఒక రోజు రూమ్‌లో చాప మీద పడుకుని ‘ఏమిటీ జీవితం, నాన్నగారేమో నేను డాక్టర్ కావాలని అనుకుంటున్నారు. నాకేమో చదవడానికి ఇష్టం ఉండటం లేదు. ఏం చేయాలి?’ అని మధనపడ్డాను. అప్పటికే సినిమాలు తెగ చూసేవాణ్ణి. మద్రాసు వెళ్లాలన్న ఆలోచన వచ్చింది. మద్రాసు వెళ్లే బస్సును చూసినప్పుడల్లా.. ‘ఆ బస్సు ఎంత అదృష్టం చేసుకుందో మద్రాసు నుంచి వస్తున్నది’ అనుకుని మురిసిపోయేవాణ్ణి.
ఆర్కే: వెంటనే మద్రాసు వెళ్లిపోయారా..
బి.గోపాల్ : మొదట మా ఊరికి వెళ్లాను. మాది పెంకుటిల్లు. నాన్న ఓ మూలన కూర్చున్నారు ఆరోజు. ‘‘నాన్నా నేను మద్రాసు వెళదామనుకుంటున్నాను’’ అన్నాను. ‘సరే, నేనే తీసుకెళతాలే’ అన్నారు నాన్న. మరుసటిరోజు మా ఊరికి చెందిన కోటయ్య అనే వ్యక్తితో లెటర్ రాయించుకుని మద్రాసు వెళ్లిపోయాను.
ఆర్కే: అసిస్టెంట్ డైరెక్టర్‌గా మీకు ఎంత ఇచ్చేవాళ్లు?
బి.గోపాల్ : నెలకు వంద రూపాయలు ఇచ్చేవాళ్లు. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. షూటింగ్ చూడటం అదే ఫస్ట్‌టైమ్. డీఎల్ నారాయణ వద్ద కొన్నాళ్లు చేశాను. మళ్లీ ఏడాది గ్యాప్ వచ్చింది. అప్పుడు ఇంటికి వచ్చేవాణ్ణి. నెలకు వంద రూపాయలతో మూడేళ్లు సినిమాల్లో చేశాను. అప్పుడు రాఘవేంద్రరావు గారి వద్ద చేయాలన్న ఆలోచన వచ్చింది.
ఆర్కే: రాఘవేంద్రరావు దగ్గర ఏ చిత్రానికి చేరారు?
బి.గోపాల్ : అప్పట్లో ఆయన ‘అడవిరాముడు’ తీస్తున్నారు. నేను వెళ్లగానే చేర్చుకున్నారు. సినిమా మొత్తానికి పదిహేను వందల రూపాయల ఒప్పందానికి కుదిరాను. నాలుగు నెలల్లోనే చిత్రం పూర్తయింది. రాఘవేంద్రరావు దగ్గర ఖాళీ లేకపోయినా పనిచేసే అవకాశం దొరకడం నా అదృష్టం. ఆ సినిమా షూటింగ్‌లోనే ఎన్టీఆర్‌ను తొలిసారి చూశాను. ‘అమరదీపం’, ‘వేటగాడు’, ‘కొండవీటి సింహం’ ఇలా వరుసగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసుకుంటూ పోయాను. పన్నెండేళ్లపాటు సహ దర్శకునిగానే నా ప్రయాణం సాగింది.
ఆర్కే: అన్నేళ్లు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎలా చేశారు? దర్శకత్వం చేయాలన్న ఆలోచన రాలేదా?
బి.గోపాల్ : అసలు నాకు దర్శకుణ్ణి అవుదామన్న ఆలోచనే రాలేదు. అసిస్టెంట్ డైరెక్షన్‌ను కేవలం ఉద్యోగంగానే భావించాను. మెల్లమెల్లగా ప్రమోట్ అవుతూ వచ్చాను. సినిమా తీయాలన్న ఆలోచన ఎప్పుడూ వచ్చేది కాదు. ఆ చిన్న బాధ్యతలతోనే రోజూ బిజీగా గడిచిపోయేది.
ఆర్కే: మీకు అలాంటి ఆలోచనే లేనప్పుడు తొలి అవకాశం ఎవరిచ్చారు?
బి.గోపాల్ : నాకు ఫస్ట్‌ఛాన్స్ ఇచ్చింది రామానాయుడు గారు. తొలినాళ్లలో ఆయన బ్యానర్‌లో చేరాలని ప్రయత్నం చేశాను. కుదరలేదు. రాఘవేంద్రరావుగారు ‘దేవత’కు నన్ను కో డైరెక్టర్‌గా పెట్టుకున్నారు. అప్పుడు రామానాయుడుగారిని కలిసే అవకాశం వచ్చింది. నేను రోజూ షూటింగ్ షెడ్యూల్ వేసేవాణ్ణి. ఏ రోజు ఏ సీన్ షూటింగ్ ఉండాలనే విషయంలో పక్కా ప్రణాళికతో ఉండేవారు నాయుడు గారు. నేను కూడా కచ్చితంగా షెడ్యూల్ వేసేవాణ్ణి. ఆర్టిస్టులను సౌమ్యంగా డీల్ చేసేవాణ్ణి. రోజూ రాఘవేంద్రరావుగారి ఇంటికి వెళ్లేవాణ్ణి. ఒక రోజు ఆయనే ‘గోపాల్.. నీకు రామానాయుడు గారు ఛాన్స్ ఇస్తానని చెప్పారు. మంచి సబ్జెక్ట్ రెడీ చేసుకో’ అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది.. నేనేంటి, దర్శకత్వం ఏమిటి అని.
ఆర్కే: మీకు కథలు, దర్శకత్వం ఆలోచనే లేదన్నారు కదా! మరి ఏలా చేశారు?
బి.గోపాల్ : అప్పటి నుంచి కథలు వినడం మొదలుపెట్టాను. కనీసం ముప్పయి కథలు వినుంటాను. సెల్వరాజ్ చెప్పిన ఒక కథ నచ్చింది. వెంటనే రామానాయుడుకు చెప్పాలన్న ఆనందంతో వెళుతుంటే.. మురళీమోహన్ అనే దర్శకుడు ఎదురొచ్చారు. ‘ఏంటి సెల్వరాజ్ చెప్పిన కథ నచ్చిందా?’ అన్నారు. ‘బాగా నచ్చింది’ అని చెప్పాను. ‘ఆ కథతో ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తవుతోంది. వేరేవాళ్లు తీస్తున్నారు’ అన్నారు నవ్వుతూ. వెంటనే ఆగిపోయాను. ఆ కథతో సినిమా వస్తోందన్న విషయం సెల్వరాజ్‌కు కూడా తెలియదట.
ఆర్కే: ఆ తరువాత సబ్జెక్ట్‌ను ఎవరిచ్చారు?
బి.గోపాల్ : ఒక రోజు శారదగారు ఫోన్ చేసి.. ‘పరుచూరి బ్రదర్స్ దగ్గర మంచి లైన్ ఉంది. అడిగితే ఇస్తారు’ అని చెప్పారు. వెంటనే రామానాయుడు గారు పరుచూరి బ్రదర్స్‌కు ఫోన్ చేసి.. ‘మీ దగ్గర మంచి కథ ఉందట కదా! మా గోపాల్‌కు ఇవ్వండి. ఆయనకు కథలు దొరకడం లేదు’ అన్నారు. వెంటనే నేను పరుచూరి ఇంట్లో వాలిపోయాను. వాళ్లు నాకు కథ ఇచ్చారు. ఆ కథ ‘ప్రతిధ్వని’.
ఆర్కే: పరుచూరి బ్రదర్స్‌కు మీరంటే ఎంతో ఇష్టం. మీ మధ్య బంధం ఎలా ఏర్పడింది?
బి.గోపాల్ : ‘అగ్నిపర్వతం’ చేస్తున్నప్పుడు బ్రదర్స్‌తో బంధం ఏర్పడింది. పరుచూరి గోపాలకృష్ణ నన్ను బాగా ఇష్టపడేవారు. ‘ప్రతిధ్వని’లో ఆయన బలగం పొట్టి సీతయ్య క్యారెక్టర్ కూడా వేశారు. సినిమా విజయానికి ఆ పాత్ర బాగా ప్లస్ అయ్యింది. ఈ చిత్రం కథా చర్చల్లో కొంత సంవాదం జరిగింది. తమ్ముడు గోపాలకృష్ణ ఒక ఆర్డర్ వేస్తే.. ఆయన అన్న వెంకటేశ్వరరావు మరో ఆర్డర్ వేసేవారు. అలా అయితే ఇలా.. ఇలా అయితే అలా అవుతుందని బ్రదర్స్ ఇద్దరి మధ్యా వాదం నడిచింది. అక్కడే కూర్చున్న రామానాయుడుగారు ‘ఇలా అయితే నేను సినిమా ఆపేస్తాన’న్నారు. ఆ తరువాత గోపాలకృష్ణ కన్విన్స్ చేశారు. పరుచూరి బ్రదర్స్ ఇద్దరూ స్ర్కీన్‌ప్లే దగ్గర బాగా దెబ్బలాడతారు. ఆ సంఘర్షణలో నుంచే మంచి సినిమాలు వస్తాయి. ఒకసారి గోపాలకృష్ణ కోపమొచ్చి ఫైల్ విసిరేసి వెళ్లిపోయారు. నాకు కూడా కోపమొచ్చి ఇంటికి వెళ్లిపోబోతూ.. ‘అవును, ఆయన ఫైల్ విసిరేసింది ఎవరిమీదో కోపంతో కాదు కదా! సబ్జెక్ట్‌లోనే ఎక్కడో పొరపాటు జరిగుంటుంది. ఒకసారి వెళ్లి కనుక్కుందాం’ అని పరుచూరి గోపాలకృష్ట ఇంటికి వెళ్లాను. ఆ తరువాత ఆయన చెప్పిన దానికి మేము కన్విన్స్ అయ్యాం.
ఆర్కే: అంతగా దెబ్బలాడుకునే పరుచూరి బ్రదర్స్ అంతకాలం ఎలా కలిసి పనిచేశారు?
బి.గోపాల్ : అదే వాళ్ల సక్సెస్ సీక్రెట్. సబ్జెక్ట్ వరకే ఫైర్ అవుతారు. గొడవపడతారు. ఒకసారి చర్చ ముగిసి బయటికి రాగానే ‘ఏరా పెద్దోడా, ఏరా చిన్నోడా..’ అనుకుని కలిసిపోతారు. వ్యక్తిగత జీవితానికి ఇబ్బందులు తెచ్చుకోలేదు.
ఆర్కే: ‘ప్రతిధ్వని’ రిలీజైనప్పుడు మీకేమనిపించింది?
బి.గోపాల్ : సినిమా విడుదలైనప్పుడు.. ఒక పరిచయస్తుడు ‘గోపాల్.. ఎక్కడో తప్పు జరిగింది. సినిమా బాగోలేదంటున్నారు జనం’ అన్నాడు. ఒక థియేటర్ మేనేజర్ కూడా అదే చెప్పాడు. నేను భయపడ్డాను. అప్పటికే నేను రామానాయుడుగారు రమ్మంటే విజయవాడ బయలుదేరాను. ఒంగోలు, తెనాలి, విజయవాడ ఇలా ప్రతిచోటా టాక్ వింటూ వెళుతున్నా. పాజిటివ్‌గానే జనాలు చెబుతూ వస్తున్నారు. అయినా నాలో ఏదో భయం మిగిలుంది. విజయవాడ వెళ్లగానే నన్ను చూసిన రామానాయుడుగారు ‘నువ్వు ఎవరి మాట నమ్మకు. మన సినిమా సూపర్ హిట్టు. ఏ రేంజ్ హిట్ అనేది మరుసటి రోజు చెబుతాను. నువ్వేమీ టెన్షన్ పెట్టుకోకుండా కోనసీమ తిరిగేసిరా’ అన్నారు. ఆయన చెప్పినట్లు ఆ చిత్రం ఊహించనంత హిట్ అయ్యింది. అదే చిత్రాన్ని భాష రాకపోయినా నాయుడుగారి పట్టుదల మేరకు హిందీలోనూ తీశా.
ఆర్కే: మొదటి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు?
బి.గోపాల్ : నాకు దర్శకత్వం అవకాశం ఇవ్వడమే గొప్ప. ఇక రెమ్యునరేషన్ అడగటమా.. (నవ్వులు). అయితే ‘ప్రతిధ్వని’కి రామానాయుడు గారు యాభైవేలు ఇచ్చారు. అదే హిందీ చిత్రానికి లక్ష ఇచ్చారు.
ఆర్కే: మూడో చిత్రానికి అవకాశం ఎలా వచ్చింది?
బి.గోపాల్ : యార్లగడ్డ సురేంద్ర అవకాశం ఇచ్చారు. ఆ చిత్రం నాగేశ్వరరావు, నాగార్జునల కాంబినేషన్‌తో వచ్చిన ‘కలెక్టర్‌గారి అబ్బాయి’.
ఆర్కే: మీ కెరీర్‌లో బ్రేక్ ఎక్కడ వచ్చింది?
బి.గోపాల్ : కంటిన్యూగా సక్సె్‌సలు వస్తున్నప్పుడు ‘విజయ్’ దగ్గరికి వచ్చేసరికి చిన్న గ్యాప్ వచ్చింది. అప్పట్లో విజయవాడలో రంగాహత్య జరిగినప్పుడు మా సినిమా మీద ప్రభావం పడింది. ఆ వెంటనే తీసిన ‘సీ్ట్రట్‌ఫైటర్’, ‘గ్యాంగ్‌మాస్టర్’ ఫ్లాప్ అయ్యాయి. ‘ఖైదీ ఇన్స్‌పెక్టర్’ కొంత వరకు ఆడింది. అదే టైమ్‌లో మోహన్‌బాబుగారు పిలిచి ‘అడవిలోఅన్న’ తీయమన్నారు. అది బాగా హిట్ అయ్యింది. ఆయనతోనే ‘కలెక్టర్‌గారు’ తీశాను. ఆ తరువాత ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘ఇంద్ర’లతో భారీహిట్లు నా ఖాతాలో పడ్డాయి.
ఆర్కే: ఇంత పెద్ద హిట్లు అందించారు కదా! హఠాత్తుగా ఎందుకు మీ గ్రాఫ్ పడిపోయింది?
బి.గోపాల్ : ‘ఇంద్ర’ తరువాత ‘అల్లరిరాముడు’ తీశాను. ఆ తరువాత హిట్లు పడలేదు. సబ్జెక్ట్‌లు మంచివి దొరకలేదు.. నేను ఎప్పుడూ భయం భయంగానే ఉంటాను. స్ర్కిప్టు బాగలేకపోతే ఒక పట్టాన నచ్చదు. నచ్చకపోతే నస పెడుతుండేవాణ్ణి. ఒక చిత్రానికి నిర్మాతలు కోట్లు ఖర్చు పెడతారు కాబట్టి.. ఫెయిలయితే నాకెక్కడ చెడ్డపేరు వస్తుందోనని ఫీలయ్యేవాణ్ణి.
ఆర్కే: మరి, మీ సినిమాల్లో ఎక్కువగా హింసకు ప్రాధాన్యం ఉంటుంది. మీ మీద రాఘవేంద్రరావు ప్రభావం లేదా?
బి.గోపాల్ : ఎక్స్‌ఫోజింగ్‌కు కాస్త ప్రాధాన్యమిస్తూ.. ‘బొబ్బిలిరాజా’ ఒక్కటే తీశాను. ఇదివరకు ఆయనే (రాఘవేంద్రరావు) మాగ్జిమమ్ తీసేశారు. ఇంకెవరికీ మిగల్చలేదు (నవ్వులు). ‘బొబ్బిలిరాజా’లో దివ్వభారతి ప్యాంటు లేకుండా షర్టు వేసుకునే నటిస్తుంది. సబ్జెక్ట్ అలాంటిది కాబట్టి అలా చేశాను.
ఆర్కే: ఆ జోనర్‌లోకి వెళ్లకుండా ఇటువైపు ఎందుకు వచ్చారు?
బి.గోపాల్ : శృంగారానికి తక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాను. కథకు ప్రాధాన్యం ఇస్తాను. ‘సమరసింహారెడ్డి’లో ముగ్గురు హీరోయిన్లు, ‘నరసింహానాయుడు’లోను హీరోయిన్లు ఉన్నారు. అయినా కథ మీదే నడుస్తాయి ఆ సినిమాలు. ప్రేక్షకులకు ఏమి కావాలో అవే ఆలోచిస్తాను.
ఆర్కే: ఏఎన్నార్‌తో రెండు చిత్రాలు చేశారు. ఎన్టీఆర్‌తో చేయలేకపోయారు. ఆ వెలితి ఉందా?
బి.గోపాల్ : బాగా వెలితి ఉంది. ఒక సినిమా తరువాత ఒక సినిమా చేసుకుంటూ వెళ్లిపోయాను. ఒకసారి ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆ రోజు - నేను మోహన్‌బాబుగారి ఇంట్లో ఉన్నాను. వడ్డే రమేష్‌గారు వచ్చారక్కడికి. ‘గోపాల్.. మనకు ఎన్టీఆర్‌తో ఒక అవకాశం వచ్చేట్లుంది. చేద్దామా’ అన్నారు. ‘అంతకంటే అదృష్టం ఏమి కావాలి’ అన్నాను. కానీ ఫలించలేదు.
ఆర్కే: తొలిపారితోషికం యాభై.. అత్యధిక పారితోషికం ఎంత తీసుకున్నారు?
బి.గోపాల్ : సుమారు కోటి రూపాయలకు పైగానే తీసుకున్నాను. ఎప్పటికప్పుడు నాకు ప్రొడ్యూసర్లు బాగానే ఇచ్చారు. ఒకప్పుడు నా జీతం నూరు రూపాయలు. అక్కడి నుంచి ఈ స్థాయికి రావడం అదృష్టమే.
ఆర్కే: మ్యూజిక్ మీద అవగాహన ఉందా..
బి.గోపాల్ : సరిగమలు అనేవే నాకు తెలియవు. కామన్‌సెన్స్‌తోనే బావుందీ, బాగలేదు అని చెబుతాను. ‘సమరసింహారెడ్డి’లో ‘అందాల ఆడబొమ్మ’ గురించి ఒక చర్చ వచ్చింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఐదారు పాటలు రాశారు. నాకు అవి నచ్చలేదు. ఆఖర్న ఒకే ఒక పాట రాయమని రిక్వెస్ట్ చేశాను. నేను అక్కడ ఉన్నప్పుడే.. అక్కడికక్కడే ‘అందాల ఆడబొమ్మ..’ అనే పాట రాశారాయన. వెంటనే నాకు తెగ నచ్చింది. ప్రేక్షకులను కూడా ఆ పాట భలే ఆకట్టుకుంది.
ఆర్కే: ఈ నలభై ఏళ్లలో మీరు నేర్చుకున్నది?
బి.గోపాల్ : నేను యావరేజ్ స్టూడెంట్‌ను. అలాంటిది పైకొచ్చాను. కష్టాన్ని నమ్ముకోవాలి. సిన్సియర్‌గా ఉండాలి. అదే నేను నమ్మిన సిద్ధాంతం.
ఆర్కే: ఎక్కువ కాలం రాఘవేంద్రరావు వద్ద పనిచేశారు కదా! ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు?
బి.గోపాల్ : ఆయన ఆరు తరువాత షూటింగ్ చేయరు. కొన్నిషాట్లు మమ్మల్ని చేయమని చెప్పేవారు. ఒకరకంగా అలా అందరికీ డైరెక్షన్ అలవాటు చేశారాయన. ‘ఆమెకథ’, ‘జ్యోతి’, ‘ప్రేమలేఖలు’, ‘అమరదీపం’, ‘దేవత’ ఎన్నో గొప్ప చిత్రాలను తీశారు. కమర్షియల్ వాల్యూస్‌ను, ఎంటర్‌టైన్‌మెంట్‌ను కలగలిపి ఎలివేట్ చేయడం ఆయనకే సాటి. కెమెరా యాంగిల్‌తో మాయ చేయగలరు. ‘జస్టిస్ చౌదరి’లో సిగార్ పట్టుకుని కుర్చీలో కూర్చున్న ఎన్టీఆర్‌ను ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేశారో మరచిపోలేము. ‘అడవిరాముడు’లో ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’, ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి..’ పాటలు షూటింగ్ అప్పుడు కళ్లారా చూశాను. అదొక మరపురాని జ్ఞాపకం. ఆయనకున్న మ్యూజిక్‌సెన్స్ మరెవరికీ లేదు. ఒక్కపాటను వందసార్లు విని మనసులోనే విజువలైజ్ చేసుకునేవారు. సెంటిమెంటును పండించడం, శృంగారాన్ని వడ్డించడంలో ఆయన తరువాతే ఎవరైనా.
ఆర్కే: ఈ మొత్తం జర్నీలో ఎవరితోనైనా మాట పడ్డారా?
బి.గోపాల్ : రాఘవేంద్రరావుగారితో ఒకసారి తిట్లు తిన్నాను. ఎన్టీఆర్ సినిమా ముదుమలై ఫారె్‌స్టలో షూటింగ్ నడుస్తోందప్పుడు. ఏ నటులతో ఎన్ని షాట్లు ఉన్నప్పటికీ.. ఎన్టీఆర్ వస్తూనే ఆయన షాట్‌లు ముందు పూర్తి చేసి పంపిస్తే కానీ.. రాఘవేంద్రరావుగారి మనసు కుదుటపడేది కాదు. అది క్లయిమాక్స్ సీను. సన్‌సెట్‌లో రామారావుగారితో ఆ షాట్ తీయాలి. ఆ సీన్‌లో ఒక బ్రీఫ్‌కే్‌స్‌ను ఆయన పట్టుకోవాలి. మేము సెట్‌లో బ్రీఫ్‌కేస్‌ను రెడీ చేయలేకపోయాము. అప్పుడు రాఘవేంద్రరావుగారు బాగా కోప్పడ్డారు. ఆయనతో తిట్లు తినడం అదే ఫస్టు, లాస్టు (నవ్వులు). మొత్తానికి అదే రోజు ఆ షాట్ ఎలాగో పూర్తయింది.
నాకు విజయేంద్రప్రసాద్ మూడు కథలు చెప్పినా నచ్చలేదు. ‘నీకు ఎలాంటి కథలు నచ్చుతాయో చెప్పు గోపాల్’ అన్నారు. ఆయనే మళ్లీ ‘కనీసం నీకు నచ్చే సినిమాలపేర్లు అయినా చెప్పు. దాన్ని బట్టి రాస్తాను’ అన్నారు. నేను వెంటనే అనాలోచితంగా ‘గుండమ్మకథకు, దుష్మన్‌కథను కలుపుతారా’ అన్నాను. ‘ఒకే’ అంటూ వెళ్లిపోయిన ఆయన వారం తరువాత వచ్చి ‘సమరసింహారెడ్డి’ కథ చెప్పారు. నేను చెప్పిన మాటకు ఈ కథకు సంబంధమే లేదు. నేను ఏదో మాట్లాడాలి కాబట్టి మాట వరసకు చెప్పానంతే. అలాంటిది అంత అద్భుతమైన కథను రాసిస్తారనుకోలేదు.
Updated Date - 2020-02-08T08:18:17+05:30 IST