ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప‌వ‌న్ సీటిస్తే పోటీ చేస్తా. గెలుస్తా. 2019లో వార్‌ వన్‌సైడే..

ABN, First Publish Date - 2020-02-08T08:30:06+05:30

అగ్రహీరోలతో భారీ బడ్జెట్‌ సినిమాలు నిర్మించి బడా ప్రొడ్యూసర్‌గా పేరొందాడు బండ్లగణేష్‌. గబ్బర్‌సింగ్‌, టెంపర్‌ వంటి బ్లాక్‌బస్టర్‌లు నిర్మించిన ఆయన తాజాగా మరో ఐదు మెగా మూవీస్‌ను నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగ్రహీరోలతో భారీ బడ్జెట్‌ సినిమాలు నిర్మించి బడా ప్రొడ్యూసర్‌గా పేరొందాడు బండ్లగణేష్‌. గబ్బర్‌సింగ్‌, టెంపర్‌ వంటి బ్లాక్‌బస్టర్‌లు నిర్మించిన ఆయన తాజాగా మరో ఐదు మెగా మూవీస్‌ను నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో సేఫ్‌ గేమ్‌ మాత్రమే ఆడతానని అంటున్న ఆయన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో 26-2-2017న జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత ఆర్కే’ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. ఆ సంభాషణలు ఇవి...

 

ఆర్కే: గణేష్‌ ఎలా ఉన్నావు? 

బండ్ల గణేష్: సంతోషంగా ఉన్నాను. మీ ముందు కూర్చోవడం కన్నా సంతోషం ఏముంటుంది.

 

ఆర్కే:సినిమాలు తీయకుండా ఖాళీగా ఎందుకున్నావు?

బండ్ల గణేష్: మంచి సినిమాలు తీయాలని కొంతకాలం గ్యాప్‌ తీసుకున్నాను. ఇప్పుడు వరుసగా ఐదు సినిమాలు ప్లాన్‌ చేస్తున్నాను.

 

ఆర్కే: పెద్ద హీరోలతోనా.. చిన్న హీరోలతోనా?

బండ్ల గణేష్: చిన్న హీరోలతో అయితే పది సినిమాలు తీసే వాణ్ణి. పెద్ద హీరోలు కాబట్టే ఐదు సినిమాలు ప్లాన్‌ చేస్తున్నా.

 

ఆర్కే: బండ్లగణేష్‌ అనగానే వివాదాలు వినిపిస్తాయి ఎందుకు?

బండ్ల గణేష్: వివాదాలు కొందరు కావాలనే పుట్టిస్తారు. బండ్లగణేష్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌. నేనెవరితోనూ పెట్టుకోను. నాతో పెట్టుకుంటే చూస్తూ ఊరుకోను. గాంధీ మహాత్ముడిలా గొప్పోడిని కాదుగా. నేనూ మామూలు మనిషినే. నాతో జర్నీ చేసిన వారెవరూ నా గురించి తప్పుగా అనుకోరు.

 

ఆర్కే: కెరీర్‌ మొదలుపెట్టింది ఆఫీస్‌బాయ్‌గా అంటారు నిజమేనా?

బండ్ల గణేష్: లేదు. కె.ఎస్‌ రామారావుగారి దగ్గర మేనేజర్‌గా పనిచేశాను.

 

ఆర్కే: మరి బాయ్‌గా చేశారని ప్రచారం జరిగింది ఎందుకు?

బండ్ల గణేష్: నేను బాయ్‌గా చేసే పరిస్థితి ఎప్పుడూ లేదు. ఎందుకంటే ముందు నుంచి పౌల్ట్రీ రంగంలో బాగా స్థిరపడి ఉన్నాం. సినిమా మీద పిచ్చితో ఇటువైపు వచ్చాను. ముందుగా మధు పిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాను. మా రిలేటివ్‌ ఒకతను డిస్ట్రిబ్యూషన్‌ రంగంలో ఉన్నాడు. సినిమా రంగంలో పరిచయాలు పెరుగుతాయని కె.ఎస్‌ రామారావుగారి దగ్గర ప్రొడక్షన్‌ మేనేజర్‌గా చేర్పించారు.

 

ఆర్కే: అప్పటికే మీకు పౌల్ట్రీ పరిశ్రమ ఉందా?

బండ్ల గణేష్: 1983 నుంచి ఉంది.

 

ఆర్కే: ఆ బిజినెస్‌ చూసుకోకుండా సినిమా వైపు ఎందుకొచ్చారు?

బండ్ల గణేష్: సినిమా మీద పిచ్చితో వచ్చాను. ఊర్లో మా నాన్న నాటకాలు వేసే వాడట. వంశపారంపర్యంగా కూడా వచ్చుంటుంది.

 

ఆర్కే: నిర్మాతగా ఎలా మారారు?

బండ్ల గణేష్: సుస్వాగతం సినిమా సమయంలో పవన్‌కళ్యాణ్‌ గారితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత కొమరం పులి సమయంలో సినిమా తీస్తావా గణేష్‌ అని అడిగాడు. మీరు అడిగాక సినిమా తీయకుండా ఎవరైనా ఉంటారా బాబు అన్నాను. అదే సమయంలో షాద్‌నగర్‌లో కోళ్ల పరిశ్రమ బాగా పుంజుకుంది. అన్ని రకాలుగా డెవలప్‌ అయ్యాం. 2005-06లో బూమ్‌ బాగా ఉంది. లిక్విడ్‌ క్యాష్‌ ఉంది. దాంతో సినిమా నిర్మాతగా మారాను.

 

ఆర్కే: ఇన్‌కమ్‌టాక్స్‌ దాడుల తరువాత వెనకడుగు వేశారని అంటున్నారు?

బండ్ల గణేష్: వెనకడుగు వేశానని ఎందుకు అనుకుంటున్నారు. బేస్‌మెంట్‌ స్ట్రాంగ్‌గా ఉండాలని ఆగి వస్తున్నాను. పది, పదిహేను ఫ్లోర్‌లు కట్టినా బిల్డింగ్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. సినిమా తీయాలంటే డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. పెద్ద హీరోల డేట్సే సినిమాకు డబ్బులు. సినిమా తీయడం ఒక కళ. డబ్బులున్నొళ్లందరూ సినిమాలు తీయలేరు.

 

ఆర్కే: బొత్సా సత్యనారాయణకు మీరు బినామీ అని పేరొందుకొచ్చింది?

బండ్ల గణేష్: నేను ఎవ్వరికీ బినామీ కాను. రోజూ ఆయన దగ్గరకు వెళ్లే వాణ్ణి. అదే సమయంలో సినిమాలు మొదలుపెట్టడంతో ఆయనకు బినామీ అని పేరొచ్చింది. అది తెలిశాక ఆయన దగ్గరకు వెళ్లడం మానేసాను. కానీ పేరు మాత్రం పోలేదు.


ఆర్కే: ఒకసారి స్టేజ్‌ పైన నేను మర్డర్‌ చేసొస్తే బొత్స సత్యనారాయణ కాపాడతాడు అన్నావట?

బండ్ల గణేష్: ఆ మాటే నాకు శాపమయింది. తెలిసీ తెలియనితనంతో వాగాను. గబుక్కున నోరు జారాను. పక్కన పవన్‌కళ్యాణ్‌ ఉన్నాడన్న ధైర్యం.. ఎదురుగా జనం... మైక్‌ ఇస్తే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. స్టేజ్‌ దిగాక తెలిసింది. మనం ఎక్కువ మాట్లాడేసామని. దాన్ని తట్టుకోవడానికి పదేళ్లు పట్టింది.(నవ్వులు)


ఆర్కే: ఆయన బినామీ కాకపోయినా వాటా ఉండేదా? 

బండ్ల గణేష్: లేదు. ఒకసారి పొలం కొంటే ఎదో లిటిగేషన్‌ ఉంటే సహాయం అడిగితే చేశాడు. అంతే... వాళ్ళకు మనుషులు లేనట్లుగా మనను బినామీ ఎందుకు పెట్టుకుంటారు. నేనైతే ఎవ్వరినీ బినామీగా పెట్టుకోను. నా డబ్బు నా ఇష్టం.

 

ఆర్కే: సినిమాల్లో ఎంత సంపాదించావు. పోనీ టాక్స్‌ ఎంత కట్టావో చెప్పు?

బండ్ల గణేష్: పది కోట్లు పైనే కట్టాను.

 

ఆర్కే: ఎన్ని సినిమాలు తీశావు?

బండ్ల గణేష్: ఎనిమిది తీశాను.

 

ఆర్కే: చిరంజీవి ఫ్యామిలీ అంటే ఎందుకు అభిమానం?

బండ్ల గణేష్: చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమానిని.

 

ఆర్కే: ఆయనతో పరిచయం ఎప్పుడు అయింది?

బండ్ల గణేష్: మాస్టర్‌ సినిమాలో చేసినపుడు పరిచయం అయింది. అంతకుముందు స్టేట్‌ రౌడీ సినిమా సారథీ స్టూడియోలో జరుగుతుంటే వెళ్లి చూశాను. అదే మొదటి సారి చూడటం.

 

ఆర్కే: పవన్‌కళ్యాణ్‌ అంటే ఎందుకంత అభిమానం?

బండ్ల గణేష్: నాకు లైఫ్‌ ఇచ్చాడు. నిర్మాతను చేస్తానన్నాడు, చేశాడు. ఒక సినిమా పోతే మరో సినిమా చేశాడు.

 

ఆర్కే: పవన్‌కళ్యాణ్‌కు ఇష్టం లేదు. గణేష్‌ అలా చెబుతుంటాడు అని అంటుంటారు, ఎందుకు?

బండ్ల గణేష్: నాకు గణేష్‌ అంటే చాలా ఇష్టమని ఒకసారి స్టేజ్‌ పైన కూడా చెప్పాడు. ఆయన ఎప్పుడు ఎక్కడా అలా చెప్పడు. అలాంటిది నా విషయంలో చెప్పాడు.

 

ఆర్కే: గబ్బర్‌సింగ్‌లాంటి హిట్‌ సినిమా వచ్చాక మళ్లీ ఆయనతో ఎందుకు తీయలేదు?

బండ్ల గణేష్: అప్పటికే రెండు సినిమాలు ఇచ్చాడు. శరతమరార్‌ అనే నిర్మాత 20 ఏళ్ల నుంచి జర్నీ చేస్తున్నాడు. ఇప్పుడాయనకు సినిమాలు చేస్తున్నాడు. ఆయనతో సినిమాలు చేయాలని ఎంత మంతి తిరుగుతున్నారో తెలుసా? ఇక్కడ ఏమైనా జరగవచ్చు.


ఆర్కే: పవన్‌కళ్యాణ్‌కు నీకు మధ్య గ్యాప్‌ వస్తే త్రివిక్రమ్‌ రాజీ చేశారని అంటుంటారు, నిజమేనా?

బండ్ల గణేష్: పవన్‌కళ్యాణ్‌తో రాజీ చేసుకునే దమ్ము, ధైర్యం నాకైతే లేవు. నాకు తెలిసి ఎవరికీ ఉండవు. నేనైతే హీరోగారి దగ్గరకు రెండేళ్లు వెళ్లలేదు. అప్పుడు త్రివిక్రమ్‌ నన్ను తీసుకెళ్లి పవన్‌ కళ్యాణ్‌ దగ్గర ఉండు అని చెప్పొచ్చాడు.


ఆర్కే: డబ్బుందా? 

బండ్ల గణేష్: డబ్బు ఎంతైనా తెస్తా. పెద్దహీరో డేట్లు ఇస్తే డబ్బుదేముంది.

 

ఆర్కే: డేట్స్‌ ఎందుకివ్వడం లేదు?

బండ్ల గణేష్: ఎందుకివ్వడం లేదని కాదు గానీ ఎందుకు చేయడం లేదు అని అడగండి.

 

ఆర్కే: ఎందుకు చేయడం లేదు?

బండ్ల గణేష్: మంచి సినిమాలు చేద్దామని. ఏది పడితే అది చేసి డబ్బులు పోగొట్టుకోకూడదు. ఇండస్ట్రీలో 99 శాతం మంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్లే కనిపిస్తారు. రావడమే గానీ పోకూడదన్నది నా పాలసీ. రిస్క్‌ షాట్‌ నా జీవితంలో పెట్టుకోను. సేఫ్‌ గేమ్‌ అడతాను. ఒక సినిమా తీస్తే ఇంటికి ఎంత తీసుకెళ్తాం అని ఆలోచించాలి. లేకపోతే నెలకు నాలుగైదు లక్షలు ఖర్చవుతాయి. పౌల్ట్రీ ఉంది. హ్యాపీగా బెంజ్‌లో తిరగొచ్చు.

 

ఆర్కే: మీ పౌల్ట్రీ తెలంగాణలో నెంబర్‌వనేనా?

బండ్ల గణేష్: అవును. రెండు వేల కోళ్లతో మొదలుపెట్టాం. ఇప్పుడు 25 లక్షలున్నాయి.

 

ఆర్కే: టాప్‌హీరోలతో సినిమాలు చేశారు కదా. అయినా బండ్లగణేష్‌ అంటే చిన్న పిల్లాడ్ని చూస్తున్నట్టుగా చూస్తారు. బాధనిపించదా?

బండ్ల గణేష్: చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పటి వరకు ఎవ్వరూ అడగలేదు. ఒకటి నేను చిన్న చిన్న వేషాలు వేయడం. రెండోది అందరితో చనువుగా ఉండటం.

 

ఆర్కే: పెద్ద హీరోల డేట్స్‌ బాగా సంపాదిస్తావు. ఆ టెక్నిక్‌ ఏంటి?

బండ్ల గణేష్: ఆ టెక్నిక్‌ ఏంటో చెబితే అందరూ తెచ్చుకుంటారు. నేను మంచి వంట వండానని ఆ వండే టెక్నిక్‌ చెప్పమంటే ఎలా.(నవ్వులు) వ్యాపారదక్షతను ఎలా షేర్‌ చేసుకుంటాము.

 

ఆర్కే: పూరీ జగన్నాథ్‌తో అంత స్నేహం ఎలా?

బండ్ల గణేష్: ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ దగ్గర నుంచి మేం ఫ్రెండ్స్‌. పాతికేళ్ల స్నేహం. ఆయనతో రెండు సినిమాలు చేశాను.

 

ఆర్కే: గణేష్‌ దృష్టిలో కృష్ణవంశీ ఎందుకు సాఫ్ట్‌ కాదు?

బండ్ల గణేష్: ఇంకా... ఎంటీ సార్‌ కబుర్లు.

 

ఆర్కే: పర్లేదు చెప్పు?

బండ్ల గణేష్: నేనెప్పుడు ఆయనను తిట్టలేదు. గోవిందుడు అందరివాడే సినిమా నష్టాలు రాలేదంటే అందుకు కారణం రాంచరణ్‌, చిరంజీవి గారే.

 

ఆర్కే: ఇంతకుముందు గణేష్‌కు, ఇప్పుడు గణేష్‌కు బాగా తేడా ఉంది. బాగా ముదిరిపోయావు?

బండ్ల గణేష్: లేదు గురుగారు.(నవ్వులు)

 

ఆర్కే: నువ్వు వచ్చిన నేపథ్యం, నువ్వు తీసిన సినిమాలు, నువ్వు ఎంచుకున్న హీరోలు.. వీరిని చూస్తే చెప్పొచ్చు నువ్వెంత ముదిరిపోయావో?

 బండ్ల గణేష్: కాంప్లిమెంటా గురువుగారు. అయితే ఓకే.(నవ్వులు)

 

ఆర్కే: పవన్‌కళ్యాణ్‌ను సుస్వాగతం సినిమా నుంచి చూస్తున్నావు కదా. ఆయనలో రాజకీయ నాయకుడు ఉన్నాడా?

బండ్ల గణేష్: 200 శాతం ఉన్నాడు. యాక్టర్‌ కన్నా రాజకీయ నేతనే ఎక్కువ కనిపిస్తాడు. 2019లో చూడండి వార్‌ వన్‌సైడ్‌ అవుతుంది.

 

ఆర్కే: మరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తావా?

బండ్ల గణేష్: సీటిస్తే పోటీ చేస్తా. గెలుస్తా. ఎంపీ కావాలనుంది. దానికంటే ముందు పవన్‌కళ్యాణ్‌ గెలిస్తే చూడాలనుంది. అదే నాకు ఎక్కువ సంతోషాన్నిస్తుంది.


ఆర్కే: పిల్లలేం చదువుతున్నారు?

బండ్ల గణేష్: అమ్మాయి 9వ తరగతి చదువుతోంది. అబ్బాయిలు ట్విన్స్‌. ఆరో తరగతి చదువుతున్నారు. ఒకడ్ని నిర్మాతను చేస్తా. ఇంకొకడు పౌల్ట్రీ చూసుకుంటాడు. మా అన్నయ్య కొడుకును హీరో చేస్తా. వాడిలో హీరో క్వాలిటీస్‌ ఉన్నాయి.


ఆర్కే: సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా నిన్ను తిట్టారా? 

బండ్ల గణేష్: వందల అవమానాలు జరిగాయి. ఒకటి చెప్తాను. ఫిల్మ్‌ఇనిస్టిట్యూట్‌ నుంచి బయటకు వచ్చాక సినిమాల్లో నటించాలని ప్రయత్నిస్తున్నా. మాజీ మంత్రి శ్రీపాదరాజేశ్వర్‌రావుగారు నిర్మాతగా ఒక సినిమా తీశారు. వాళ్లను కలుద్దామని హోటల్‌కెళ్లాను. రూమ్‌లో వెయిట్‌ చేయమన్నారు. రూమ్‌లో వాళ్లు బాగా తాగి వాంతులు చేసుకున్నారు. రాత్రి సమయం నేను బయటకు వెళ్లలేను. కాగితాలతో మొత్తం తుడిచేసి అక్కడే పడుకున్నాను.

 

ఆర్కే: నెక్ట్స్‌ సినిమా ఎప్పుడు మొదలవుతుంది?

బండ్ల గణేష్: సెప్టెంబర్‌లో స్టార్ట్‌ అవుతుంది.

 

ఆర్కే: ఏయే సినిమాల్లో నష్టం వచ్చింది?

బండ్ల గణేష్: ఒక్క బాద్‌షాలోనే నష్టం వచ్చింది.

 

ఆర్కే: సినిమా హిట్టన్నావు?

బండ్ల గణేష్: సినిమా హిట్టే. ఆ రోజుల్లోనే 60 కోట్లు అయింది. కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ బాగా పెరిగింది. 54 కోట్లకు అమ్ముడుపోయింది. 6 కోట్లు నష్టం.

 

ఆర్కే: ఇలాంటి తప్పు మళ్లీ చేయకూడదు అని నిర్ణయానికొచ్చావా?

బండ్ల గణేష్: వచ్చాను.

 

ఆర్కే: ఎలాంటి తప్పులు?

బండ్ల గణేష్: నేనెందుకు చెబుతాను.

 

ఆర్కే: వేరే వాళ్లకు పాఠంగా ఉంటుంది కదా?

బండ్ల గణేష్: వాళ్లు కూడా తప్పు చేయనివ్వండి. ఎవ్వడి బాధ వాడు పడాల్సిందే.(నవ్వులు)

 

ఆర్కే: గోల్స్‌ ఏమున్నాయి?

బండ్ల గణేష్: పార్లమెంట్‌లో అధ్యక్షా అని పిలవాలి. మా ఫ్యామిలీని బాగా సెటిల్‌ చేయాలి. ఓ పదివేల మందికి ఉపాధి కల్పించాలి. నేను పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదు.

 

ఆర్కే: తీసిన సినిమాల్లో బాగా డబ్బులు దేనికొచ్చాయి?

బండ్ల గణేష్: గబ్బర్‌సింగ్‌, టెంపర్‌లో వచ్చాయి.

------------------------------------

 చిన్న సినిమా తీస్తే డిస్ట్రిబ్యూటర్‌ దగ్గర నుంచి అందరినీ బతిమాలుకోవాలి. పెద్ద హీరో అయితే ఒక్క హీరోను బతిమాలుకుంటే చాలు. మిగతా వాళ్లందరూ మన దగ్గరకొస్తారు. అందుకే పెద్దహీరోలతోనే చేస్తాను. పెద్ద హీరోల డేట్స్‌ తెచ్చుకోవడం ఒక కళ. అది అందరికీ సాధ్యం కాదు.

 

నా సొంత ఖర్చుల కోసం సినిమా డబ్బు వాడను. ఇంటి దగ్గరి నుంచి పౌల్ట్రీ డబ్బులను అకౌంట్‌లో వేస్తారు. వాటితోనే కారులో పెట్రోల్‌ కొట్టించుకుంటాను. సినిమావి వడ్డీ డబ్బులు. వాటిని సొంత ఖర్చులకు ఎలా వాడుకుంటాం.

 

డబ్బులు ఉన్నాయి కదా అని సొంత డబ్బు పెట్టి సినిమా తీయడం కరెక్ట్‌కాదు. వడ్డీకి తీసుకురావాల్సిందే. టైలర్‌ ఖర్చులు మిగులుతాయని షర్ట్‌ మనమే కుట్టుకుంటే మొత్తానికే పనికిరాకుండా పోతుంది. ఒక్కసినిమా పోతే షాద్‌నగర్‌ వదిలేసి కర్ణాటక బోర్డర్‌కు వెళ్లాల్సి వస్తుంది.

 

జూనియర్‌ ఎన్టీఆర్‌తో నాకు మనస్పర్థలు ఏమీ లేవు. ఎవరో చెప్పుడు మాటలు విని మనస్పర్థలు వచ్చాయి. తరువాత తెలుసుకుని మీరే కరెక్ట్‌ అని చెప్పాను. అభిమానులకు క్షమాపణ చెప్పాను.

 

ఇండస్ట్రీలో మంచి చెడూ చెప్పుకోవడానికి కొంతమంది స్నేహితులు ఉన్నారు. డైరెక్టర్లలో త్రివిక్రమ్‌, పూరీ జగన్నాథ్‌. హీరోల్లో పవన్‌కళ్యాణ్‌.

 

నిర్మాతకు విలువ లేకుండా పోయిందని అంటున్నారు కానీ అందులో నిజం లేదు. ఆ విషయాన్ని నేనొప్పుకోను.

 

సినిమాను సినిమాగానే చూస్తా, తీస్తా. ఒక పెద్ద కళాఖండాన్ని తీయాలనే ఆలోచన నాకుండదు.

 

ఇంత అమాయకుణ్ణి ఎట్లా బతుకుతానా? అని ఒక్కోసారి ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏడుస్తుంటాను.

 

ఎప్పటికైనా చిరంజీవితో సినిమా తీస్తా.

Updated Date - 2020-02-08T08:30:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising