ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయన కళ్లలో కనిపించే వెలుగు చూడటం నాకిష్టం

ABN, First Publish Date - 2020-02-08T09:53:07+05:30

చదివింది ఇంజనీరింగ్‌ అయినా... అలతి పదాలతో ఆటాడేసుకుంటారు. అంత్యప్రాసలతో మైమరిపిస్తారు. జ్ఞానాన్ని, తర్కాన్ని, మనసులోని ప్రశ్నలనూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చదివింది ఇంజనీరింగ్‌ అయినా... అలతి పదాలతో ఆటాడేసుకుంటారు. అంత్యప్రాసలతో మైమరిపిస్తారు. జ్ఞానాన్ని, తర్కాన్ని, మనసులోని ప్రశ్నలనూ.. ‘ఎందుకో అసలెందుకో..’ అంటూ అక్షరాల సాక్షిగా మేల్కొల్పుతారు. ప్రేరణ కలిగించే పాటలనిధి, పదప్రయోగాల పెన్నిధి చంద్రబోస్‌.. 26-06-2016న  ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎం.డి. వేమూరి రాధాకృష్ణ చేసిన ‘ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కే’ కార్యక్రమంలో ఆయన తన పాటల ప్రయాణాన్ని పంచుకున్నారిలా..


ఆర్కే: మీ అసలు పేరేంటి?

చంద్రబోస్‌: కనుకుంట్ల సుభాష్‌ చంద్రబోస్‌. నన్ను పాటల రచయితగా పరిచయం చేసిన ముప్పలనేని శివగారు స్ర్కీన్‌ఫ్రెండ్లీగా ‘చంద్రబోస్‌’ పేరు బాగుందన్నారు.


ఆర్కే: పాటల రచయిత కంటే ముందు మీరు గాయకుడు కదా?

చంద్రబోస్‌: చిన్నప్పటి నుంచీ పాటలు పాడేవాడ్ని. మా ఊరు వరంగల్‌ జిల్లాలోని చల్లగరిగ. మా ఇంటి దగ్గర శివాలయం, గ్రంథాలయం ఉండేవి. శివాలయం మైక్‌లో వచ్చే పాటలు ప్రతిరోజూ తెల్లవారుజామున నాలుగు గంటలనుంచీ వినపడుతుండేవి. దాంతో త్వరగా కంఠస్తమయ్యాయి. హృదయస్తమూ అయ్యాయి. ప్రతి సోమవారం గుడిలో భజన చేసేవారు. వారితో వంత పాడేవాడ్ని. ఆ తర్వాత ప్రధాన గాయకుడినయ్యాను. బడినుంచి రాగానే గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు తిరిగేసేవాడ్ని. శివాలయం, గ్రంథాలయం.. అనే ఈ రెండు ఆలయాల పుణ్యమాని నాలో పాట, సాహిత్యం ప్రవేశించింది. సినిమా పాటలూ సాధన చేశాను. రేడియో పాటలు, సురభి కంపెనీవారు మైక్‌లో వేసే పాటల్ని విని పాడేవాడ్ని. ఉత్సవాల సమయంలో పాటలు రాసేవాడ్ని.


ఆర్కే: ఏ వయసులో పాటలు రాశారు?

చంద్రబోస్‌: పదకొండేళ్ల వయసులో పాడటం కోసం రాశాను. రాసిన దాన్ని పాడటంకోసం స్వరపరిచేవాడ్ని. ఆ తర్వాత పాడటంపైనే దృష్టిపెట్టాను. సినిమాల్లో ఎలాగైనా పాటలు పాడాలని నిర్ణయించుకున్నా. ఇంజనీరింగ్‌ చదివేసమయంలో శ్రీనాథ్‌ అనే మిత్రుడి సహకారంతో సినిమా పాటలు పాడటానికి చాలా చోట్లకు వెళ్లాను. ఎక్కడికెళ్లినా ఫలితం లేదు. ఆ వైఫల్యం తర్వాత శ్రీనాథన్న ‘తమ్ముడూ.. పాడటం కంటే కూడా రాయటంపై దృష్టిపెట్టు’ అన్నారు. ఆ తర్వాత ఆయన మిత్రుల సహాయంతో ముప్పలనేని శివగారిని కలిశాను. నేను రాసిన పాటలు విని బాగున్నాయని చెప్పటంతో పాటు ‘తాజ్‌మహల్‌’ సినిమాకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమాకు రామానాయుడు నిర్మాత. ఎం.ఎం.శ్రీలేఖ సంగీత దర్శకత్వం చేశారు. అలా ‘మంచుకొండల్లో చంద్రమా..’ నా తొలి పాటైంది.


ఆర్కే: మీ నేపథ్యం ఏంటి?

చంద్రబోస్‌: మా నాన్నగారు నాలుగోతరగతి చదువుకున్నారు. అప్పట్లో ప్రైమరీ స్కూల్‌ టీచర్‌గా తెలుగు, సోషల్‌ సబ్జెక్ట్‌లు బోధించేవారు. మా అమ్మకు చదువురాదు. మేం నలుగురం పిల్లలం. ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. నేనే చిన్నవాడ్ని. మా నాన్నకు వచ్చే జీతంతో ఇల్లు గడవటం కష్టమవ్వటంతో మా అమ్మ పొలంపనులకు కూలీగా వెళ్లేది. మా నాన్నగారి అనారోగ్యరీత్యా స్కూల్‌కు సెలవులెక్కువ పెట్టేవారు. దానివల్ల తక్కువ జీతం వచ్చేది. అది మా అమ్మపై పోషణభారం పడేలా చేసింది. దాంతో మాకు ఆకలి, వేదన, బాధ, బాధ్యత తెలిశాయి. మా అమ్మ సూటిగా ఏదీ చెప్పేది కాదు. ఆమెను చూసి జీవితమంటే ఏంటో అవగాహన వచ్చింది. అదే నేనురాసే పాటలకు ఉపయోగపడింది.


ఆర్కే: మీరు అమ్మ గురించి పాటలు రాశారు కదా?

చంద్రబోస్‌: ‘నాని’ చిత్రంలో ‘పెదవే పలికిన తీయని మాటే అమ్మ...’ పాట రాశాను. ఈ పాటంటే చాలా ఇష్టం. ‘మనం’లో రాసిన ‘కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా..’ పాట మంచి పేరు తీసుకొచ్చింది. 2015 సంవత్సరంలో దీనికి ఎనిమిది అవార్డులొచ్చాయి.


ఆర్కే: ట్యూన్‌ ఇస్తే రాసేందుకు ఎంత సమయం తీసుకుంటారు?

చంద్రబోస్‌: పూర్వం సాహిత్యం రాసిన తర్వాత భావం ప్రకారం రాగాన్ని స్వరపరిచేవారు. మాటల్లో చెప్పలేని విషయాలు పాట రూపంలో చెప్పేవారు. ఇప్పుడు భావం కంటే ఎక్కువ కథానాయకుల డ్యాన్స్‌ కోసం పాటలుంటున్నాయి. డ్యాన్స్‌కు బీట్‌ కావాలి. ఆ ట్యూన్స్‌లో ఇమిడేట్లుగా కవిత్వం రాయాల్సి వస్తోంది. విచిత్రమైన బాణీల కొలతల్లో కవి ప్రతిభను ప్రదర్శించుకోవాలి.


ఆర్కే: ఇలాంటి పాటల్లో సందర్భశుద్ధి ఉంటుందా?

చంద్రబోస్‌: హీరో అనుకునేమనసులో మాటని, బయటి వారికీ స్ఫూర్తిగా ఉండేట్లు రాయాలి కదా. సందర్భాలు రకరకాలుగా వస్తున్నా మేం మంచిపాటగా మలచుకోవాలి.


ఆర్కే: మీకు మంచి పేరు తెచ్చిన పాటలు బాణీ ఇస్తే రాశారా? రాసిన తర్వాత ట్యూన్‌ చేశారా?

చంద్రబోస్‌: ‘కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి..’, ‘మౌనంగానే ఎదగమని..’, ‘పెదవే పలికిన తీయని మాటే అమ్మ..’, ‘ఆకాశం అమ్మాయయితే..’ ‘కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా..’ ఇలా పేరొచ్చిన అన్ని పాటలూ బాణీలకు రాసినవే. కీరవాణిగారు, నా కాంబినేషన్‌లో వచ్చిన కొన్ని పాటలకే సాహిత్యం ముందు రాశాను.


ఆర్కే: ఇష్టం లేకుండా రాసిన పాటలున్నాయా?

చంద్రబోస్‌: నేను రాస్తాను అనుకున్నపుడు మాత్రమే ఆ పాటను అంగీకరిస్తా. ప్రతి పాట నా స్వహస్తాలతో బుర్ర, మనసు పెట్టి రాస్తాను.

 

ఆర్కే: మీ సాహిత్యంలో లోతైన భావనలుంటాయి. సీనియర్‌ గేయరచయితలేమైనా ప్రశంసించారా?

చంద్రబోస్‌: సీతారామశాస్త్రి గారు చాలాసార్లు మెచ్చుకున్నారు. ‘నేనున్నాను’ చిత్రం ఆడియో ఫంక్షన్‌కు నేను వెళ్లలేకపోయాను. ఆ రోజున వేదికపై సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ‘చీకటితో వెలుగే చెప్పెను..’ పాట గురించి ప్రస్తావిస్తూ..


 ‘అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని’ పంక్తి గురించి చెబుతూ మెచ్చుకున్నారు. గురుముఖంగా ఆయన దగ్గర నేను శిష్యరికం చేయకపోయినా.. ఆయన్ని గురుతుల్యుడుగా భావిస్తాను. అలాంటి ఆయన మెచ్చుకోవటం గొప్ప ప్రశంసే. అవే నాకు ఆశీస్సులు. ఆ పాటకు నంది అవార్డు కూడా వచ్చింది. 


ఆర్కే: మిమ్మల్ని ‘జూనియర్‌ వేటూరి’ అనేవారట ?

చంద్రబోస్‌: మద్రాస్‌లో ఉన్నపుడు లోకల్‌గా ఉండేవారు ‘లోకల్‌ వేటూరి’ అని పిలిచేవారు. ఎవరేమని పిలిచినా.. నాకంటూ ఓ పేరుంది, రూపం ఉంది, ఎత్తూబరువూ నాదే, నా బాణీ నాదే, నా పాట నాదే. కొంతమంది అభిమానంగా పిలిచినా దానికి ప్రాధాన్యత ఇవ్వను. పట్టించుకోను. స్వతంత్రంగా రాస్తున్నాను కాబట్టి నా పేరు నాకిష్టం.


ఆర్కే: మీరు పాటలు రాసిన సినిమాలు ఫ్లాపయితే బాధపడతారా?

చంద్రబోస్‌: బాధపడతాను. కుంగిపోతాను. భార్యతో, పిల్లలతో సరిగా మాట్లాడను. కష్టపడి రాసిన సినిమా అలా అయ్యిందే అని రెండు, మూడు రోజులు బయటికి కూడా రాను. ఆ తర్వాత నా సీడీలు, అవార్డులు చూసి ‘ఇదంతా సాధించాను కదా’ అని నాకు నేనే సర్దిచెప్పుకుంటాను.

 

ఆర్కే: పాతరోజుల్లోని గీతరచయితలు హోటల్‌ గదుల్లో రోజుల తరబడి ఉండి పాటలు రాసేవారు. ఇప్పుడూ అంతేనా?

చంద్రబోస్‌: అందరూ పాటకోసం పరితపించేవారే. వారి ఆయుష్షును త్యాగం చేసి పాటకు ప్రాణప్రతిష్ట చేశారు. ప్రాణాలను ఒడ్డి అంటారు కదా.. అలా. హోటల్‌రూమ్‌లో ఆత్రేయగారు కొన్నిరోజులు మంచంలో పడుకుని నిద్రపోతుండేవారట. అప్పుడప్పుడూ కాళ్లు కదిలించేవారట. పాటకు కనీసం పదిరోజులు ఆయుష్షు తగ్గిపోతుందేమో. వేటూరిగారు విపరీతమైన పాండిత్యం కలవారు. ఆయన కూడా పాటకోసం తపనపడేవారు. ఆయనలో జ్వలనం ఉన్నప్పటికీ బయటికి కనిపించేవారు కాదు. మహానుభావులు అంతా కష్టపడే రాశారు. అలవాట్లు అనేవి వ్యక్తిగతం. మనం ఒక రచయితను రచనపరంగానే చూడాలి.


ఆర్కే: సాహిత్యం మీద పట్టు రావటానికి కారణం?

చంద్రబోస్‌: నేను సున్నా నుంచి రాలేదు. మైన్‌స నుంచీ వచ్చాను. పత్రికల్లో, గ్రంథాల్లో, పుస్తకాల్లో ఉండే భాష నాకు రాదు. మారుమూల గ్రామంలో పెరిగిన నాకు మాండలికం వచ్చేది. ఇక్కడికొచ్చి పత్రికాభాష నేర్చుకుని, గ్రంథాలను అధ్యయనం చేశాను. కష్టపడ్డాను. మా మిత్రుడు శ్రీనాథన్నది రేపల్లె. వారి భాషను ఇంజనీరింగ్‌లో బాగా గమనించాను. సినిమాల్లో వాడే భాష వారు మాట్లాడే భాష దగ్గరిగా ఉండటంతో నాకది ఉపయోగపడింది. ఆ తర్వాత ఆధునిక, ప్రాచీనసాహిత్యాల్ని చదువుకున్నా. ఆసక్తి అనేది అగ్నిపర్వతం లాంటిది. దానిమీద అనుమానం మొలకెత్తదు. సినిమాల్లోకి ఆసక్తిగా వచ్చాను. అందుకే రాయలేననే అనుమానాలు ఎక్కడా రాలేదు. ఆసక్తే అన్నీ నేర్పింది.


ఆర్కే: వరంగల్‌ అంటే విప్లవాల పురిటిగడ్డ కదా. మీరు విప్లవాలకు ఆకర్షితులు కాలేదా?

చంద్రబోస్‌: నేను పెరిగిన వాతావరణం వేరు. వరంగల్‌లో ఉండి ఉంటే విప్లవపాటలు రాసి ఉండేవాడ్ని. మా పేదరికం, తల్లిదండ్రులు నాపై ఉంచిన ఆశలు లక్ష్యంవైపు నడిపించాయి. ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం పరీక్షలతో పాటు ‘తాజ్‌మహల్‌’ సినిమాకు పాట రాశాను. యూనివర్శిటీలో థర్డ్‌ ర్యాంకు వచ్చింది, పాట కూడా విజయం సాధించింది. ఇవాళ పట్టా, పాట నా చేతిలో ఉన్నాయి. జీవితంలో ఏం చేయాలని జంక్షన్‌ దగ్గర నిలబడి ఆలోచించినపుడు, పట్టా అందరికీ వస్తుంది. కాని పాట మాత్రం నాకే వచ్చింది కదా అనుకున్నా. ఈ అమూల్యమైన పాటను ఉపయోగించుకోవాలనుకున్నా. అన్నీ ఆలోచించాక సంవత్సరం గడువు పెట్టుకున్నా. ఆ సంవత్సరం ఊరికి వెళ్లకూడదు. అమ్మానాన్నలకు ముఖం చూపించకూడదనుకున్నా. నేనకున్నది జరగకుంటే ఎం.టెక్‌ చేయాలనుకున్నా. అలా ‘తాజ్‌మహల్‌’లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత రామానాయుడిగారి సినిమా ‘ధర్మచక్రం’లో నాలుగు పాటలు రాశాను. ‘పెళ్లిసందడి’కి రాఘవేంద్రరావుగారు పిలిచారు. ఆ తర్వాత ‘బొంబాయిప్రియుడు’ రాశాను. నేనేం నిర్ణయం తీసుకున్నానో మర్చిపోయేంత బిజీ అయ్యాను. సంవత్సరం తర్వాత ఓ పత్రికలో ఓ పెద్ద ఇంటర్వ్యూ వచ్చింది. టౌన్‌కు వచ్చిన మానాన్నకు ఓ షావుకారు ‘మీ అబ్బాయి వెలిగిపోతున్నాడు’ అన్నారట. అప్పుడు మా నాన్న నాకు ఫోన్‌ చేశారు. ‘ఇంటికిరా’ అన్నారు. మనకు సినిమా ఇండస్ట్రీలో ఎవరూ లేరు, అదో మహాసముద్రమని హెచ్చరించారు. మొత్తానికి ఉద్యమంవైపు ఆకర్షితుడ్ని కాలేదు. కానీ ఉద్యమానికి అతీతంగా ఒక మనిషి నిరాశనిస్పృహలకు లోనైనపుడు పాటతో ఆత్మస్థైర్యం, స్ఫూర్తి రగిలించాను. అలా మనిషి ఉన్నతికి దోహదపడే, అభివృద్ధిపథ ఉద్యమంగా చెప్పుకోవచ్చు. నాకు పాటతో ఆత్మసంతృప్తి దొరికింది.


ఆర్కే: మీ కెరీర్‌లో టేకాఫ్‌ సులువుగా జరిగిందా?

చంద్రబోస్‌: నా టేకా్‌ఫలో అవకాశం రావటం తేలిగ్గా జరిగింది. తొలిపాట తేలికగా రాయగలిగాను. ఇండసీ్ట్ర అంతా నావైపు చూసే పాటలు రాయాలనుకున్నా. ‘బొంబాయి ప్రియుడు’ సినిమాలో ‘చందనా చీరను కట్టి, బొమ్మనా బ్లౌజును చుట్టి..’ సందర్భానికి తగినట్లు విచిత్రమైన ప్రయోగం చేశాను. అందరూ కొత్తగా ఉందన్నారు. ఈ పాట నాకు ఓ ద్వారంలా ఉపయోగపడింది. మంచి అవకాశాలొచ్చాయి. అక్కడి నుంచి వెనక్కి చూసుకోలేదు. 

 

ఆర్కే: మనపై నేపథ్యం ప్రభావం ఉంటుంది కదా?

చంద్రబోస్‌: నేపథ్యమే మన పద్యం. అంతర్గతంగా ఉండే భావజాలం ఎప్పుడో ఒకసారి బయటికొస్తుంది. అదే పాట.


ఆర్కే: బెస్ట్‌ కాంప్లిమెంట్‌?

చంద్రబోస్‌: మౌనంగానే ఎదగమని.. పాటకు మంచి కాంప్లిమెంట్స్‌ వచ్చాయి. అమెరికాలో ‘నాటా’లో ఓ అబ్బాయి నా కాళ్లకు నమస్కారం చేశారు. ‘మీరు రాసిన ‘మౌనంగానే ఎదగమని..’ పాటతో నేనింత స్థాయికి వచ్చాన’ని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలాంటి సందర్భం ఎదురైనపుడు జీవితం ధన్యమనిపిస్తుంది. ఈ పాటను హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఓ అంధుల పాఠశాలలో ప్రార్థనాగీతంగా పాడుతారు. ‘నింగి నేల నాది’ చిత్రంలో ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత..’ పాటను పిల్లలకు స్కూల్లో చెబుతున్నారట. వరంగల్‌లో యాసిడ్‌దాడికి గురైన ఓ అమ్మాయి మృత్యువుతో పోరాడుతున్నపుడు కృంగిపోయి ‘మౌనంగానే..’, ‘చీకటితో వెలుగే..’ పాటలు విన్నదట. ఈ విషయం ఆమె ఓ పత్రికా ఇంటర్వ్యూలో చెప్పింది. ద్రోణవల్లి హారిక నా పాటను బలం పుంజుకోవటానికి వింటుందట. ఇలాంటివి విన్నప్పుడు ఆత్మసంతృప్తి కలుగుతుంది.


ఆర్కే: రాఘవేంద్రరావుగారితో మీకు అటాచ్‌మెంట్‌ ఎలా వచ్చింది?

చంద్రబోస్‌: ‘పెళ్లిసందడి’ చిత్రం నుంచి ఆయన చేసిన ‘సౌందర్యలహరి’ కార్యక్రమం టైటిల్‌సాంగ్‌ వరకు రాశాను. ‘పెళ్లిసందడి’లో సరిగమపదనిస పాట రాసినపుడు నాలో మెరుపు ఉందని ఆయన గమనించారట. ఆ తర్వాత వంటకాలపై ఆ సినిమాలోనే ఓ పాట రాయించారు. ఆ తర్వాత‘బొంబాయిప్రియుడు’ చిత్రంలో ఐదు పాటలు రాశాను. ‘పరదేశి’లో ఏడు పాటలు, ‘స్టూడెంట్‌ నంబర్‌వన్‌’లో అన్ని పాటలు రాశాను. ఆయన ప్రేమను, అభిమానాన్ని పొందుతూ ఆయన నీడలో ఎదిగాను. రామానాయుడు గారు సినిమారంగంలో జన్మనిస్తే, ఆ జన్మని చరితార్థం చేసే మంచి పాటలు రాఘవేంద్రరావుగారు నాతో రాయించారు. రాఘవేంద్రరావు చాలా మెత్తని మనిషి. ఆయనతో చాలా కాలం ప్రయాణించాను. ఓ పాట నా స్థాయిలో రాయకున్నా ‘సరేలే’ అంటారు. ఆ సమయంలో సిగ్గుపడిపోతుంటాను. ఇంటికి వెళ్లాక రాత్రంతా మేలుకుని పాట రాసి తీసుకెళ్లేవాడ్ని. ఆయన కళ్లలో కనిపించే వెలుగు చూడటం నాకిష్టం. నాకోసం ఇలా ప్రయత్నించాడే అని ఆయన మెచ్చుకునేవారు. అలా మా సినీ అనుబంధం అల్లుకుంది.


ఆర్కే: పాట బాగాలేదని దర్శకులు చెబుతుంటారా?

చంద్రబోస్‌: కోపంగా చెప్పరు. బాగాలేదని చెబితే చర్చించి కొత్త వెర్షన్స్‌ రాస్తాను. ‘మృగరాజు’ చిత్రంలో నేను రాసిన చాయ్‌పాట చిరంజీవిగారు పాడారు. శృతి, లయ బాగుంది. ఆయన కష్టపడి పాడారు. వినడానికి అందంగా ఉంది. శృతిలయల్లో తేడా ఉన్నా కరెక్ట్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ ఇప్పుడుంది. ఈ రోజుల్లో పాడటం కష్టం కాదు. ‘మాస్టర్‌’ చిత్రంలో ‘తమ్ముడు... అరె తమ్ముడూ..’ పాట సిరివెన్నెలగారు రాశారు. ఆ సినిమా దర్శకుడి కోరికమేరకు దగ్గరుండి చిరంజీవి గారితో ఆ పాట పాడించాను. చిరంజీవి గారు క్లోజ్‌ కాబట్టి నాకా అవకాశం వచ్చింది.


ఆర్కే: మాస్‌ రచయిత అనే ముద్ర పడలేదా?

చంద్రబోస్‌: వచ్చిన అవకాశాలతో పాటు కృషి చేశాను. ప్రేరణ, స్ఫూర్తి కాకుండా దైవభక్తి, దేశభక్తి, గ్రామీణ స్మృతులు, కాలేజీ గురుతులు, అమ్మ, లాలిపాట, రాఖీ పాట... ఇలా ఎన్నో రకాల పాట లు రాశాను. ‘బాలు’ చిత్రంలో ‘ఇంతే ఇంతే ఇంతే..’, ‘గోపాల గోపాల’ చిత్రం లో ‘ఎందుకో అసలెందుకో..’ పాటల్లో అహేతుకమైన విషయాల్ని ప్రశ్నించాను.


ఆర్కే: రచయితల్లో అందరికంటే మీకు ఆటిట్యూడ్‌ ఉందని అంటారు?

చంద్రబోస్‌: సన్నిహితులుగా లేని వారు అన్నమాటలేమో.

  

1995 మే 20 వ తేదీన ‘తాజ్‌మహల్‌’ చిత్రంలోని ‘మంచు కొండల్లోని చంద్రమా.. చందనాలు చల్లిపో’ పాట విడుదలైంది. అప్పటినుంచీ ఇప్పటివరకూ నా ప్రస్థానం కొనసాగుతోంది.

ఇండస్ట్రీలోకి వచ్చి 21 సంవత్సరాలైంది. దాదాపు 750 సినిమాల్లో, 3000 పైగా పాటలు రాశాను.

సినిమాలో పాట పుడుతుంది. అలా పుట్టిన పాట సినిమా కంటే పెరిగి పెద్దదవుతుంది. సినిమాలో కొన్ని పరిమితులు, పాత్రల మధ్య పాట ఉన్నా.. సినిమా నుంచి బయటికొచ్చినా ఆ పాట సార్వజనీనంగా ఉండాలని నా ఉద్దేశం.

‘కొమరంపులి’ చిత్రంలో ‘మారాలంటే లోకం..’ పాట కేవలం 45 నిమిషాల్లో రాసాను. సంగీత దర్శకుడు రెహ్మాన్‌గారే పాడారు. ఆ పాట చాలా నచ్చినపాట.

సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘1 నేనొక్కడినే’ చిత్రంలో ‘ఓ సయనొరా సయనొరా..’ పాటను రాయటానికి 40 రోజులు పట్టింది.

‘మార్చే మార్చే మాటలకు అర్థం మార్చే..’ అనే సానుకూల దృక్ఫథం పాటను ‘చేతులోన చెయ్యేసి’ అనే చిన్న సినిమాకు రాసాను. ఆ సినిమా బాగా ఆడి ఉంటే ఇంతమంచి పాట అందరికీ తెలిసేదని బాధపడ్డాను.

వేటూరిగారు, సిరివెన్నెలగారు రాస్తున్న సమయంలో ఇండస్ట్రీలోకి వచ్చిన బచ్చాను నేను. వారి తర్వాత నేనుండాలని బాగా సాధన చేశాను.

సినిమాల్లో మంచి పాటలు వస్తుంటాయి, చెడుపాటలు వస్తుంటాయి. నాణేనికి రెండు పార్శ్యాలుంటాయి. మనం మంచినే తీసుకుందాం.

సింగర్‌ అవుదామని వచ్చిన నా మనసులో పాడటం అనే ఆలోచన లేదు. అయితో నాలోని సింగర్‌ను చూసి ‘పెళ్లిసందడి’, ‘పరదేశి’ చిత్రాల్లో కీరవాణిగారు కొన్ని లైన్స్‌ పాడించారు. ‘ప్రేమాయనమః’ చిత్రంలో ‘అమెరికా అమెరికా..’ పాట పాడాను.

సంగీతదర్శకులు కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్‌ ‘ఓకే అంటే పాటలు పాడిస్తాం’ అంటుంటారు. రెహ్మాన్‌ గారికి నేను రాసే పాటలకు గాయకులకంటే ముందు నేను ట్రాక్‌ పాడతాను. రెహ్మాన్‌గారు ‘సింగిల్‌ టేక్‌ సింగర్‌’ అంటారు. ఆయన ప్రశంస అది. కానీ అంతకంటే ముందు నేను కొన్ని వందల సార్లు పాడుకుని ఉంటాను కాబట్టి సులువుగా పాడతానంతే.

ఒక పాటను ఇద్దరు, ముగ్గురు రచయితలతో రాయించుకోవటం మంచి సంస్కృతి కాదు. రచయితపై నమ్మకంతో పాట ఇస్తారు. ప్రస్తుతం ఇష్టం లేకుంటే వేరే రచయితతో రాయించుకుంటామని చెప్పి వెళతారు. మీరు గొప్పవారే, మీలో ఆ పాట పలకలేదని గౌరవంగా చెప్పేవారున్నారు.

రియాలిటీ షోల కోసం నెలకు మూడురోజులు పనిచేస్తా. పాటగురించి ఆలోచించే మాకు ఇలాంటి షోలు ఆటవిడుపుగా ఉంటాయి. అక్కడ పాటల గురించి పార్టిసిపేట్స్‌కు చెప్పాలి. ఆ పాట వెనుక ఉండే విషయాల్ని చెప్పడం వల్ల టీవీల్లో జడ్జిగా నాకు మంచి పేరొచ్చింది.

‘పరదేశి’ చిత్రానికి సుచిత్ర డ్యాన్స్‌ కంపోజ్‌ చేసింది. మొదటిసారి మేం ఓ ఫ్లయిట్‌లో కలిశాం. ఆ సినిమాలో నేను రాసిన పాటలో ‘పాటలు వందలు వేలున్నా..’ అంటూ కవితాత్మక పంక్తులు చెప్పింది. నా భావజాలానికి తను సరిపోతుందనుకున్నా. నేనే ప్రపోజ్‌ చేశా. నాకిద్దరు పిల్లలు. బాబు ఇంటర్మీడియెట్‌ చదువుతున్నాడు. కూతురు ఆరోతరగతి. గీతరచయితగానే మంచి పేరు తెచ్చుకోవాలనుంది. మరిన్ని గొప్ప పాటలు రాయాలి.

Updated Date - 2020-02-08T09:53:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising