పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా!
ABN, First Publish Date - 2020-02-08T10:21:51+05:30
ఒకప్పుడు ఓ టీవీఛానల్‌లో ప్రసారమయిన ‘కలర్స్’ ప్రోగ్రామ్‌ను తన ఇంటి పేరుగా మార్చుకున్న స్వాతి ‘డేంజర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయింది.
ఓ సందర్భంలో ఫీల్డ్ పై అసహ్యం వేసింది
మ్యారేజ్ ప్రపోజల్స్ చాలా వస్తున్నాయి
అబ్బాయిలు చాలా తెలివిమీరారు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కలర్స్ స్వాతి
ఒకప్పుడు ఓ టీవీఛానల్‌లో ప్రసారమయిన ‘కలర్స్’ ప్రోగ్రామ్‌ను తన ఇంటి పేరుగా మార్చుకున్న స్వాతి ‘డేంజర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయింది. తెలుగులో ‘అష్టాచెమ్మా’, ‘స్వామిరారా’ సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతం తమిళం, మలయాళం సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. ఇటీవలే పెళ్లికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన స్వాతి, 20-10-2014న జరిగిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణతో ముచ్చటించింది..
సిల్వర్ స్ర్కీన్ జర్నీ ఎలా ఉంది? కలర్‌ఫుల్‌గా ఉందా?
కలర్‌ఫుల్‌గానే ఉంది. కాకుంటే కొన్ని నచ్చని ‘కలర్స్’ కూడా ఉన్నాయి. ఈ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ విమర్శించే వారే. మిగతా ఏ రంగంలోనూ ఇలా ఉండదు. ఏమీ తెలియని వారు కూడా రివ్యూలు రాసేస్తుంటారు. అలాంటివి కొన్ని తప్పితే మిగతా అంతా కలర్‌ఫుల్‌గానే ఉంది.
మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన కామెంట్ ఏంటి?
కామెంట్ కాదు గానీ... కొన్ని రూమర్స్ బాగా బాధపెట్టాయి. నా మొదటి సినిమా ‘డేంజర్’. ఆ సినిమా సమయంలో నరేష్ గారితో క్లోజ్‌గా మూవ్ అయినట్లు వీడియోలు ఉన్నాయని రూమర్స్ వచ్చాయి. అలాంటివి విన్న తరువాత ఈ ఫీల్డ్‌పైన అసహ్యం వేసింది.
మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్?
మా నాన్న నేవీలో సబ్‌మెరైన్‌లో పనిచేశారు. మా అన్నయ్య పైలట్. మా అమ్మ ప్రెసిడెంట్ ఆఫ్ ది హౌజ్. నేను ఇంటర్ పూర్తయ్యాక ఎంసెట్ రాశాను. ఏవో కారణాల వల్ల కౌన్సెలింగ్ చాలా ఆలస్యమయింది. ఆ సమయంలో మాటీవీలో మాకు తెలిసిన ఆంటీ ఒకావిడ యాంకర్ అవకాశం ఉందని చెప్పింది. ఒకసారి వస్తే మేకప్ టెస్ట్ చేద్దామన్నారు. నిజానికి అసలు ఇష్టం లేదు. అందులో తెలుగు చానెల్‌లో అంటే అసలు ఇష్టం లేదు. కౌన్సెలింగ్ మొదలయ్యే వరకు చేయమని అడిగారు. దాంతో సరే అన్నాను. మేకప్ టెస్ట్ చేసి ఓకే అన్నారు. అలా మాటీవీలో ‘కలర్స్’ ప్రొగ్రామ్ ద్వారా యాంకర్‌గా మారాను.
టీవీ నుంచి సినిమాకి వచ్చారు. ప్రతీ ఒక్కరు ఇండసీ్ట్రలో ఒక స్థాయికి రావడానికి సినిమా కష్టాలు ఎదుర్కొంటారు. మీరు కూడా అలాంటివి ఫేస్ చేశారా?
నేను అవకాశాల కోసం ఎవ్వరి దగ్గరికి వెళ్లి అడగలేదు. అందుకేనేమో నే నంటే చాలా మందికి చిరాకు. ‘కలర్స్’ వల్ల పాపులారిటీ సులభంగా వచ్చింది. కానీ ఆ తరువాత కాలంలో పాపులారిటీ రావడం, కాపాడుకోవడం ఎంత కష్టమో తెలిసొచ్చింది. ఫ్లాప్‌లు వచ్చినపుడు కష్టాలు తెలిసి వచ్చాయి.
తెలుగులో కంటే తమిళంలో, మలయాళంలో సినిమాలు ఎక్కువ చేస్తున్నట్టున్నారు. ఎందుకని అక్కడ ఇంప్రెస్ చేయగలిగారు? ఇక్కడ చేయలేకపోయారు?
నాకన్నా బాగా ఎక్కువగా మీకే తెలుసు. మీరే చెప్పాలి. తమిళంలో, మలయాళంలో పర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉండే పాత్రలు ఉంటాయి. గ్లామర్ రోల్స్ ఉన్నా కొంత బ్యాలెన్సింగ్ ఉంటుంది. అందుకే అక్కడికెళ్లాను. తెలుగు వాళ్లకి తెలుగు వారు నచ్చరు అది కూడా కారణం.పేమెంట్ ఇవ్వకపోతే షూటింగ్‌కు రానని చెప్పేదాన్ని
తమిళం, మలయాళం నేర్చుకున్నారా?
తమిళం వచ్చు. మలయాళం అర్థమవుతుంది. తమిళంలో నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. మలయాళంలో కూడా డైలాగ్స్ చెబుతాను. ఏబీసీడీలు చెప్పను.
డబ్బింగ్ చెబుతారు, పాటలు కూడా పాడతారు కదా?
నేనే కాదు, అందరూ పాడతారు.
ఫిలసాఫికల్‌గా ఏం నేర్చుకున్నారు?
అంతా మంచే జరుగుతుంది. నిజం ఎప్పుడూ దాగదు. ఎన్ని సంవత్సరాలైనా బయటకొస్తుంది. అది పదేళ్లు కావచ్చు, పది నిమిషాలు కావచ్చు. నిజం బయటకు వచ్చే వరకు ఓపికగా ఉండాలి. ఇదీ నేర్చుకున్నా.
ఏయే సందర్భాల్లో ఇంత తత్వం బోధపడింది?
ఉదాహరణకి సినిమా సైన్ చేశాక ఫస్ట్ షెడ్యూల్ తరువాత కొంత, సెకండ్ షెడ్యూల్ తరువాత కొంత రెమ్యునరేషన్ ఇస్తుంటారు. కానీ షూటింగ్‌కు వెళుతూనే ఉన్నా... రెమ్యునరేషన్ మాత్రం ఇవ్వడం లేదు. అప్పుడేం చేస్తాం. డైరెక్టర్‌కు చెబుతాం. అయితే డైరెక్టర్ ఎప్పుడైనా నిర్మాతకే సపోర్టు చేస్తాడు. ఆ హీరోయిన్ డబ్బు మనిషి అని బయట ప్రచారం చేస్తారు. నా విషయానికొస్తే డబ్బింగ్ కూడా నేనే చెబుతాను కాబట్టి ఆ సమయంలో డబ్బులన్నీ తీసేసుకునేదాన్ని. కానీ స్టాఫ్‌కు ఎప్పటికప్పుడు పేమెంట్ ఇవ్వకపోతే మాత్రం షూటింగ్‌కు రానని చెప్పేదాన్ని. అయితే అన్ని ప్రొడక్షన్ హౌజ్‌ల్లో ఇలా ఉండదు. కొన్ని చాలా బాగుంటాయి. సమయానికి పేమెంట్స్ చేస్తుంటాయి.
ఇన్‌కంటాక్స్ కట్టే స్టేజ్‌కు వచ్చారా?
ఆ వచ్చాను. సర్వీస్ టాక్స్ కూడా కడుతున్నాను.
తమిళంలో, మలయాళంలో రెమ్యునరేషన్ పెంచారా?
లేదు. మలయాళంలో చాలా తక్కువ ఇస్తారు. ఇక్కడ మాదిరిగా రెమ్యునరేషన్స్ ఉండవు. సినిమాలు ఎక్కువ తీస్తారు. రెమ్యునరేషన్లు తక్కువ ఉంటాయి.
సినిమాకు రెండు లక్షలిస్తారా?
ఇస్తారు.
కలర్స్ నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లయింది?
తొమ్మిదేళ్లు. 2005లో డేంజర్ సినిమా వచ్చింది.
ఈ తొమ్మిదేళ్లలో జీవితానికి సరిపడా అనుభవం వచ్చిందా?
అనుకుంటా. కానీ రేపు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం కదా.
మీ నాన్నగారి నేటివ్ ప్లేస్ ఎక్కడ?
ఆంధ్రానే. సరిగ్గా తెలియదు. పెనుకొండ అనుకుంటా. అక్కడ ఇప్పుడెవరూ మావాళ్లు లేరు. మా మమ్మీ, డాడీది లవ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా.
మమ్మీ ఏం చదివారు?
బీకాం. చెన్నైలో కాన్వెంట్ ఎడ్యుకేషన్.
మీకు కవిత్వం కూడా వచ్చట కదా?
వచ్చు, వైరాగ్యం ఎక్కువ కాబట్టి.
ఏది ఒకటి రెండు చెప్పండి?
అప్పటికప్పుడు చెప్పలేను. ఏదో ఒక సందర్భంలో, ఖాళీగా కూర్చున్నప్పుడు రాస్తుంటాను.
మీకు లవ్ ప్రపోజల్స్ కన్నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఎక్కువ వచ్చాయంటారు. నిజమేనా?
ఈ మధ్య బాయ్స్ చాలా తెలివి మీరారు. లవ్ ప్రపోజల్ కన్నా మ్యారేజ్ ప్రపోజల్‌తో వె ళితే పడిపోతుందని అలా వస్తున్నారు. స్వాతిని పటాయించాలంటే మ్యారేజ్ ప్రపోజల్‌తోనే వెళ్లాలి, లేకపోతే పడదు మొండిదని తెలుసుకున్నారు. మ్యారేజ్ ప్రపోజల్స్ అన్నీ అలా వచ్చినవే. నేను మాత్రం అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను.
నెక్ట్స్ ప్లానేంటి?
సంతోషంగా గడిచిపోవాలి అంతే.
కెరీర్ ప్లాన్ లేదా?
సినిమా అవకాశాలు మన చేతిలో ఉండవు. సినిమా అవకాశాలు లేకపోయినా బాధపడను. ఆర్జేగా చేస్తాను. డబ్బింగ్ చెబుతాను. క్రియేటివ్‌గా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయగలను. న్యూస్ చెప్పగలను. ఈ కాన్ఫిడెన్స్ ఉంది. సినిమాలు లేకపోతే ఏం చేయలేననే బాధైతే లేదు.
పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని మా అమ్మానాన్నలు ఒకటే పోరు. అందుకే మొన్నే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చా. ఇప్పుడు వాళ్లు అబ్బాయిని వెతికే పనిలోనే ఉన్నారు.
రావాల్సిన పేరు రాలేదని ఎప్పుడైనా అనిపించిందా?
చాలామంది అంటుంటారు. నువ్వు స్టార్ హీరోయిన్ కాలేదు. నీకు రావాల్సిన అవకాశాలు రాలేదని. నిజానికి నేనిక్కడి వరకు వస్తాననే అనుకోలేదు. అలాంటప్పుడు పేరు గురించి ఆలోచించే చాన్సే లేదు.
మీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ కలర్‌ఫుల్‌గా ఉండాలని కోరుకుంటూ థాంక్యూ వెరీమచ్.
Updated Date - 2020-02-08T10:21:51+05:30 IST