11 ఏళ్ల వయసున్నప్పుడు.. నాన్న నన్ను తాతయ్య దగ్గరకు తీసుకెళ్లారు..: ఎన్టీఆర్
ABN, First Publish Date - 2020-05-20T14:33:38+05:30
పేరు నందమూరి తారక రామారావు. పేరే కాదు.. రూపం కూడా అచ్చం ఎన్టీఆరే. కాకపోతే గుర్తుకోసం కొన్నాళ్లు జూనియర్ అని కొండగుర్తు పెట్టుకున్నారు అభిమానులు. సినిమాల్లో యమగోలతో పెద్ద ఎన్టీఆర్‌ను మరిపించిన ఈ యమదొంగ.. పార్ట్‌టైంగా అయినా పాలిటిక్స్ కోసం తాతగారి ఖాకీ డ్రెస్ వేశాడు.
నా వంశోద్ధారకుడు నీ కడుపున పుట్టాడని ఆయన అన్నారు..
నా పేరు మార్చి.. ఆయన పేరును నాకు పెట్టారు..
నాకు నాన్న అంటే పిచ్చి ఇష్టం.. ఆయన కడుపున పుట్టడం మా అదృష్టం
తాతయ్యతో కలిసి నటించే అదృష్టం నాకు దక్కింది
నుదుటిపై రాసుంటే సీఎంనవుతా.. సీఎం అవ్వాలంటే అంత ఈజీ కాదు
తాతయ్యను దించేయడం కార్యకర్తల నిర్ణయం
బాలయ్య బాబాయ్ చాలా మంచి మనిషి
చనిపోయేంత వరకూ టీడీపీ కార్యకర్తనే
16-11-2009న జరిగిన ఓపెన్ హర్ట్ విత్ ఆర్కేలో జూనియర్ ఎన్టీఆర్
పేరు నందమూరి తారక రామారావు. పేరే కాదు.. రూపం కూడా అచ్చం ఎన్టీఆరే. కాకపోతే గుర్తుకోసం కొన్నాళ్లు జూనియర్ అని కొండగుర్తు పెట్టుకున్నారు అభిమానులు. సినిమాల్లో యమగోలతో పెద్ద ఎన్టీఆర్‌ను మరిపించిన ఈ యమదొంగ.. పార్ట్‌టైంగా అయినా పాలిటిక్స్ కోసం తాతగారి ఖాకీ డ్రెస్ వేశాడు. 1..2..3.. నేనో కంత్రీ అని తన పాట తానే పాడుకుని, తన క్యారెక్టర్ ఏంటో చెప్పాడు. ‘నాకు సీఎం కావాలని ఆశ లేదు. జీవితంలో రాని పేజీ గురించి ఇప్పుడే మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు.... నా ఈ జీవితం తాతయ్య ఆశీర్వాద ఫలితమే.. ఎందుకో మందు నా ఒంటికి పడదు... ధైర్యం లేనివారు తాగి ఏదో వాగుతారు.. నాకు ధైర్యం ఉంది... నేను తెలివైన వాడినే గానీ ముదురును మాత్రం కాదు... ’ అంటూ తన మనస్సును 16-11-2009న జరిగిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆవిష్కరించారు. ఆ వివరాలు
ఆర్కే: సినీ పరిశ్రమలో ఓ స్థాయికి వెళ్లాక, పీక్‌గా ఉన్నపుడు ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ప్రవేశించారు. తర్వాత ప్రచారం ఉధృతంగా చేయడం, దురదృష్టవశాత్తు ప్రమాదం.. తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ. మీ అనుభవాలేంటి?
ఎన్టీఆర్: మళ్లీ సినిమాల్లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా నా బతుకుతెరువు. పాలిటిక్స్ నా బాధ్యత. టీడీపీకి ప్రచారం చేయడం నా బాధ్యత. ఎన్టీఆర్‌కు మనవడిగా పుట్టినందుకు నావంతు బాధ్యత నెరవేర్చా.
ఆర్కే: ప్రజలు ఆమోదించ లేదు కదా..
ఎన్టీఆర్: అధికారంలోకి వస్తామా.. లేదా అన్నది వేరు. ఓట్లు ఎక్కడ చీలాయో, ఎక్కడ పడ్డాయో.. ఆ లెక్కలు నాకు తెలీదు. కానీ ఓ ప్రయత్నం చేశాం. అధికారంలోకి రానంత మాత్రాన అది తెలుగుదేశం పార్టీకి ముగింపు కాదు. ప్రచారబాధ్యతలను నిరంతరం కొనసాగిస్తా. ఎన్టీఆర్ ఆశీర్వాదం నాకు ఆస్తి. బాబాయ్, నాన్న, నేను, కళ్యాణ్‌రామ్, తారకరత్న.. మేమంతా టీడీపీకి ఆస్తిపాస్తులం.
ఆర్కే: పెద్ద ఎన్టీఆర్ పేరే కాదు.. రూపం కూడా వచ్చింది. ఎలా ఫీలవుతావు?
ఎన్టీఆర్: ఆయనంత గొప్పవారి పేరు, రూపం ఉండటం అనుక్షణం నామీద ఓ బరువు, బాధ్యత. నామీద ఎంత బరువున్నా అదో స్వీట్ థింగ్‌లా ఉంటుంది. ఎవరికీ రాని అవకాశం, రూపం, పేరు నాకొచ్చాయి. రోజూ ఆయనతో మాట్లాడాలనిపిస్తుంది. ఆయన్ని నేను చాలా మిస్సయ్యాను.
ఆర్కే: చిన్నవయసులోనే స్టార్‌డమ్ వచ్చింది. దాన్ని కొనసాగించడం కష్టం కదా?
ఎన్టీఆర్: కాలేజీ రోజులు, ఫ్రెండ్స్‌తో షికార్లు వెళ్లడం, కాలేజీకి బంక్ కొట్టి బయటకు వెళ్లడం అన్నీ మిస్సయ్యాను. కానీ, 26 ఏళ్ల వయసులో ఎంతమందికి ఇలాంటి అవకాశం వస్తుంది? ఇందుకు గర్వంగా ఉంటుంది.
పెద్దాయనతో తొలి పరిచయం
ఆర్కే: పెద్దాయనతో తొలి పరిచయం ఏ వయసులో, ఏ సందర్భంలో?
ఎన్టీఆర్: నా పదకొండో ఏట.. ఓసారి 104 జ్వరం వచ్చింది. పడుకుని ఉంటే నాన్న నుంచి ఫోన్ వచ్చింది. వాణ్ని రెడీ చెయ్యి.. పెద్దాయన చూడాలనుకుంటున్నారు అన్నారు. తాతగారు చూడాలంట.. అని అమ్మ చెప్పగానే ఏదో తెలియని ఆనందం. తాతగారి పీఎస్ మోహన్ వచ్చి కారులో తీసుకెళ్లారు. నేనొక్కణ్నే వెళ్లాను. ఆ ఇంట్లోకి వెళ్లగానే చుట్టూ ఏదో తెలియని దైవత్వం. ఓ గదిలోంచి ఏదో ధగధగా మెరిసే కాంతి. కాషాయవస్త్రాల్లో మహానుభావుడు కింద కూర్చుని.. ‘రండి’ అన్నారు. నాకేమీ అర్థంకాలేదు. పిచ్చి పుట్టింది. వెళ్లి ఆయన ముందు కూర్చున్నాను. వాటీజ్ యువర్‌నేమ్ అంటే.. మై నేమీజ్ తారకరామ్ అన్నాను. అలా చూసి.. నాన్నా హరీ అని పిలిచారు. ‘అబ్బాయి పేరు మార్చాలి, తారకరామారావు అని పెట్టండి’ అన్నారు. అప్పటి నుంచి ఏడాదిపాటు ఆయనతో అనుబంధం. పొద్దున్నే వెళ్లేవాడిని. అద్భుతంగా చూసుకునేవారు. ఏ మనవడికీ దక్కని అదృష్టం.. ఆయనతో నటించే అదృష్టం నాకు దక్కింది.
ఆయన విశ్వామిత్ర లాంటి పాత్రలు చేసేటపుడు నాన్‌వెజ్ తినేవారు కారు. రాత్రి ఏడింటికల్లా పడుకునేవారు. నాకు మాత్రం నాన్‌వెజ్ లేకపోతే ముద్ద దిగదు. ఆ తర్వాత 8.30కి నాన్‌వెజ్ వచ్చేది. ఆయన ‘తాతా.. మీ భోజనం వచ్చింది’ అని లేపేవారు. పొద్దున్నే ఆయనకు మసాజ్ అయిన తర్వాత అతను వచ్చి నన్ను తోమేవాడు. మీగడతో స్నానం చేయించేవారు. ఓరోజు అమ్మ దగ్గర నుంచి ఆయనకు క్యారేజి వెళ్లగా, ఆ వంట బాగా న చ్చింది. తర్వాత ఆమెను పిలిపించారు. అమ్మ అలా కూర్చుని ఉంది. ‘ఇంతకాలం దూరంగా ఉన్నాము.. దాని గురించి పట్టించుకోవద్దు. నా వంశోద్ధారకుడు నీ కడుపున పుట్టాడు. నా అంతటివారిగా అతడిని తీర్చిదిద్దడంలో నీవంతు బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను’ అన్నారు. కొంతకాలానికి చనిపోయారు. ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలు, తన పోలిక ఇచ్చి తన బాధ్యత నిర్వర్తించారని అర్థమైంది. ఈ జీవితం ఆయన ఆశీర్వాద ఫలితమే.
ఆర్కే: ఊహ తెలిసినపుడు ఎలా ఉండేవాడివి? జీవితం ఎలా ఉండేది?
ఎన్టీఆర్: ఆటలు, అల్లరి మామూలే. అమ్మ ఇరగ్గొట్టేసేది. (ఆర్కే: ఏం అంత కోతి పనులు చేసేవాడివా) నమ్మండి.. పన్నెండేళ్లపుడు ఓరోజు బాలరామాయణం షూటింగ్‌కి వెళ్లాలి. ముందురోజు ఏదో పెంట జరిగింది. వెంటపడి బాదేసింది. నేను తనని తోశాను. బెల్టుతీసి.. ఇరక్కొట్టేసింది. బెల్టు విరిగిపోయింది. హ్యాంగర్ తీసుకుని కొట్టేసింది. దొరక్కూడదని గుడి వెనక దాక్కున్నాను. రాత్రంతా తిరుగుతూనే ఉన్నాం. మళ్లీ రాత్రి పట్టుకుని ఓ అరగంట కొట్టి, తర్వాత దెబ్బల మీద క్రీమ్ రాస్తూ ఏడ్చింది. ఇలాంటివి తరచు జరిగేవి. చిన్నప్పుడు నేను చాలా వరస్ట్‌బాయ్‌ని. పిచ్చిపిచ్చి పనులుచేసేవాడిని. ఓసారి మెయిన్ ట్రాన్స్‌ఫార్మర్‌కి చిన్న బల్బు పెట్టేశాను. ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయి కాలనీకి మూడురోజులు కరెంటులేదు. నేను పెరిగిన పరిస్థితులు మా అమ్మ చిన్నపుడే చెప్పేసింది. ప్రపంచానికి నువ్వేమిటో నిరూపించుకో.. అంటూ ఐదో యేటే చెప్పింది. దాంతో కూచిపూడి మొదలుపెట్టాను. 12 ఏళ్లు సాధన చేశాను. మా సుధాకర్ మాస్టారు ఇపుడు ఆసే్ట్రలియాలో స్థిరపడ్డారు. ఆయనకు ఈ సందర్భంగా చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఇంటర్‌లోకి వచ్చేసరికి.. హాస్టల్‌కి వెళ్లనంటే దానికే పంపారు. వడ్లమూడి విజ్ఞాన్‌లో రత్తయ్యగారి దగ్గర. అక్కడ చదవనని కమోడ్‌కేసి కాళ్లు విరగ్గొట్టుకున్నాను. ఫ్రాక్చర్ అయింది. నాకు అమ్మనొదిలి ఉండటం ఇష్టం లేదు. గుడివాడ పక్కనే ఉండేది కాబట్టి నాని అన్న (కొడాలి నాని)కు ఫోన్ చేసేవాడిని. ఆయనొచ్చి తీసుకెళ్లేవారు. కాళ్లు విరగ్గొట్టుకుంటే అక్కడే కట్టుకట్టి, హాస్టల్లో రెస్ట్ తీసుకోమన్నారు. చివరకు రత్తయ్యగారు.. గెటౌటాఫ్ మై కాలేజ్.. అన్నారు. ఆనందంగా వచ్చేసి, ఇక్కడ సెయింట్ మేరీస్‌లో చదివాను. బీబీఎం కోసం వైజాగ్ వెళ్దామనుకుంటే సినిమా ఆఫర్ వచ్చింది. ఇక అంతే.
ఆర్కే: కుటుంబం నిలదొక్కుకోడానికి నాన్న సాయం చేసేవారా?
ఎన్టీఆర్: నాన్నే చేసేవారు. జయీభవ ఆడియో ఫంక్షన్‌కు వెళ్లినపుడు మోహన్‌బాబు .. అంకుల్ ఇలాంటి కొడుకుల్ని కన్నావు.. నువ్వు అదృష్టవంతుడివి హరికృష్ణా అని ఆయనంటే, అలాంటి తండ్రి కడుపున పుట్టడం మేం చేసుకున్న అదృష్టమని చెప్పాను. మొదట్నుంచి నాన్న చాలా సపోర్టివ్‌గా ఉండేవారు. ఆయన కూడా తాతగారిలాగే చాలా బోళా మనిషి. బాలయ్య బాబాయ్ కూడా అంతే.
ఆర్కే: స్టార్‌డమ్ వచ్చే వరకు ఆయన.. ఎన్టీఆర్ నా కొడుకు అని చెప్పలేదుకదా?
ఎన్టీఆర్: ఎప్పుడూ సందర్భం రాలేదని అనుకోవచ్చు కదండీ. నాకు నాన్న అంటే పిచ్చి ఇష్టం. మాదీ తప్పు కాదు, వాళ్లదీ తప్పుకాదు. పరిస్థితుల ప్రభావం అంతే.
ఆర్కే: ఈ స్టార్‌డమ్ రాకపోతే ఆ ఫ్యామిలీ మిమ్మల్ని అంత ఓన్ చేసుకునేదా?
ఎన్టీఆర్: పోన్లెండి.. నేను హీరోను కాను, ఏదో బిజినెస్ చేసుకుంటున్నా అనుకోండి.. సడన్‌గా బిజినెస్‌లో రైజ్ అయినా పలకరించేవారు కదండీ.. పోనీ ఇదంతా లేదు. తాతగారు నన్ను పలకరించడానికి 11 ఏళ్లు పట్టింది. మా బాబాయ్‌లు, అత్తలు, పిన్నిలు కూడా పలకరించడానికి కొంత టైం పట్టేదేమో! ఎప్పటికైనా కలిసేవాళ్లమేమో.. కానీ ప్రతీదీ నెగెటివ్‌గా కాక పాజిటివ్‌గా తీసుకుంటే బాధ ఉండదు. (ఆర్కే: ఇది అనుభవాన్ని బట్టి వచ్చింది)
ఆర్కే: తొలి సంపాదన ఎప్పుడు?
ఎన్టీఆర్: నిన్ను చూడాలని.. దానికి 4 లక్షలనుకుంటా పారితోషికం... ఆ కవర్‌ను అందుకున్న తర్వాత ఇంట్లో కింద ఎక్కడో దాచిపెట్టాను. అక్కడ సేఫ్ కాదనుకొని, బాత్రూమ్‌లో పెట్టాను. అక్కడ కూడా బాగాలేదని, తీసి మొత్తం లెక్కపెట్టాను. ఇంట్లో పెడితే పనోళ్లు తీసేస్తారని, కారు డాష్ బోర్డులో పెట్టాను. కారు డ్రైవర్ తీస్తాడేమో అని అక్కడ నుంచి కూడా తీసేశాను. నెలంతా ఇదే పని. చివరికి ఏం చేయాలో తెలియక, ఇదంతా నీకోసమేగా అని మా అమ్మకు ఇచ్చేశాను.
ఆర్కే: మీరు స్నేహితులను తరచూ మారుస్తుంటారనే ఆరోపణ ఉంది.
ఎన్టీఆర్: లేదండీ అది తప్పు... కొడాలి నాని కోసం నా ప్రాణమైనా ఇస్తాను. స్నేహల్ అని కేజీ నుంచి ఫ్రెండ్. ఇండస్ర్టీలో రాజీవ్‌కనకాల. అంతే... నాని కేర్‌టేకర్ కంటే కూడా ఫ్రెండే. దర్శకుల్లో వీవీ వినాయక్, రాజమౌళి. మిగతా స్నేహితులున్నారు. నేను చనిపోయేదాకా వీరిని గుర్తు పెట్టుకుంటాను.
ఆర్కే: మీ నాయకుడికి మీ మీద ఎంత నమ్మకముంది...
ఎన్టీఆర్: మామయ్యకా... భలే అడిగారండీ.. నమ్మకముంది కాబట్టి నన్ను పంపించారు కదా.. ఆయనపై నాకు బాగా నమ్మకముంది.. ఆయన అర్హత కలిగిన నాయకుడు. ఆయన నాతో చాలా బాగా ఉంటారు.
ఆర్కే: ఎన్టీఆర్ కుటుంబంలో ఎవరంటే ఎక్కువ ఇష్టం?
ఎన్టీఆర్: బాలయ్య బాబాయ్.. చాలా మంచి మనిషి.. అద్భుతమైన మనిషి...
ఆర్కే: ఎన్నికల ప్రచారం చేసి వస్తుండగా అనుకోకుండా ప్రమాదం జరిగింది. ఆక్షణంలో ఏమనిపించింది?
ఎన్టీఆర్: కారు నా పైన ఉంది. కాళ్లు విండోస్ నుంచి లోపలికున్నాయి. సగం బాడీ బయట ఉంది. చిన్న సైలెన్స్. సడన్‌గా కళ్లు తెరిచాను. అమ్మ గుర్తుకొచ్చింది. ఆమెను చూడడానికే వెళ్తున్నాను. ఉగాది ఉందని వస్తున్నాం. ఇంటికి వెళితే నాతో ఉన్న వారందరికీ రెస్ట్ ఇచ్చినట్టు అవుతుందని భావించాను. ప్రమాదం జరిగింది. దేవుని దయ.. ఏమైందో గానీ రెండు చేతులు అలా పెట్టి కారును నెట్టి.. మెల్లగా పాక్కుంటూ బయటకు వచ్చాను. తడుముకున్నాను. రక్తం తగిలింది. ఊపిరాడటం లేదు. మా కజిన్ కూడా ఉన్నాడు. వెంటనే వాళ్ల ఫ్రెండ్‌కు ఫోన్ చేసి సూర్యాపేట ఆస్పత్రికి బయలుదేరాం. కారులో వెళ్తూ వాడితో డిస్కస్ చేస్తూంటే ఏం జరగలేదంటూనే ఏడ్చేస్తున్నాడు.. నేను చచ్చిపోతానా అని అడిగాను.. ఇంకా చాలా చూడాల్సింది ఉందిరా అన్నాను. ఛ ఛ అలా జరగదు తారక్ అన్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరాం. రిబ్‌కు లుంగీలాంటిది గట్టిగా కట్టుకుని మరో కజిన్ ఒడిలో పడుకున్నాను. అప్పుడు ఒక్కొక్కటి గుర్తుకొచ్చాయి. నా ప్రసంగాలు. మా చెల్లెళ్లు.. ఇలా అన్నీ... వాళ్ల పెళ్లిళ్లు నేనే చేస్తానని చెప్పాను. కిమ్స్ ఆస్పత్రి దగ్గర అరుపులు.. అలా స్ర్టెచర్ మీద పడుకోబెట్టారు. నాకు భయం లేదు. చిన్న కన్ఫ్యూజన్. ఆస్పత్రికి రాగానే ఇంక ఏం కాదనిపించింది. అమ్మను చూశాను. ఒక్కసారి ముద్దు పెట్టుకోమన్నాను. దీని వల్ల నేను తెలుసుకున్నది ఒక్కటే. ఎవరికి ఎప్పుడు చావొస్తుందో తెలియదు. బతికినంత కాలం వాడ్ని తిట్టడం.. వీడు వాడిని అణగదొక్కేయడం.. ఇలాంటివన్నీ ట్రాష్.. మనం ఆనందంగా ఉన్నామా లేదా... చనిపోయే క్షణం వరకూ ఆనందంగా ఉండాలి.
ఆర్కే: ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసిన ఎపిసోడ్ చూసినప్పుడు మీకేమనిపించింది..?
ఎన్టీఆర్: అప్పుడు నా వయసు చాలా చిన్నది. ఎలా జరిగిందో తెలియదు. కార్యకర్తలంతా కలిసి తీసుకున్న నిర్ణయమది.. ప్రజాస్వామ్యంలో ఇదంతా సాధారణం..
ఆర్కే: యాక్సిడెంట్ అయినప్పుడు తాగి డ్రైవ్ చేశారని మీడియాలో వచ్చాయి.
ఎన్టీఆర్: దొరికిందే అవకాశం.. ఏదో ఒకటి మాట్లాడేద్దామనుకునే వారు చాలా మందే ఉన్నారు. నేను తాగి ఉంటే ఎనస్తీషియా ఎందుకిస్తారు.. నేను అబద్దాలు ఆడను. శుభ్రంగా భోంచేశాం. అంతే కనురెప్ప మూసేలోగా జరిగిపోయిందంతే.. తాగితే నాకెందుకో పడదు.
ఆర్కే: మందెక్కువయ్యి అతిగా ప్రవర్తించిన సందర్భాలేమైనా ఉన్నాయా?
ఎన్టీఆర్: మందు తాగి అతిగా ప్రవర్తించే వాళ్లంటే నాకు చిరాకు. నాకు మందు పడదు. ఆ వీడియో చూశారా.. నేను తాగానా... పక్కన వాళ్లంతా అలా గ్లాసులు సిప్ చేశారు. కంత్రిలో ఓ డైలాగ్ ఉంది.. మందు తాగకుండానే కిక్‌లో ఉంటానని..నాది ఆ టైప్.
ఆర్కే: పార్టీలో కూడా ఎన్టీఆర్ వారసత్వాన్ని ఎప్పుడు పుచ్చుకుంటారు?
ఎన్టీఆర్: నా జీవితంలో అప్పుడే రాని పేజీ గురించి ఇప్పుడే ఆలోచించను. ఎప్పుడూ నేను ఆ పార్టీ కార్యకర్తనే... బతికినంత కాలం తెలుగుదేశం పార్టీ ఉప్పు తినే బతకాలి. భవిష్యత్తు అంటారా.. అది ఎవరూ ఏమీ చెప్పలేం. దాని గురించి ఇప్పుడే మాట్లాడి ప్రయోజనం లేదు.
ఆర్కే: ఎప్పుడో ఒకప్పుడు సీఎంగా చూడొచ్చా?
ఎన్టీఆర్: తెలియదు సార్.. నిజంగా తెలియదు.. ఆ ఆలోచన లేదు. ఇంతవరకు అలా లేదు... ఒకవేళ ఆ ఆలోచన మొదలైతే ముందు మీకే ఫోన్ చేస్తాను.. ఇది తప్పా, ఒప్పా అని మీకే అడుగుతాను. ఒకవేళ నుదుటిపై రాసుంటే జరుగుతుందంతే.. సీఎం అవ్వాలంటే అంత ఈజీ కాదు.
ఆర్కే: 15 సినిమాలు చేశారు... ఏ హీరోయిన్ సరైన జోడీ అనుకుంటున్నారు?
ఎన్టీఆర్: శ్రీదేవి.. అంతే... ఆమెకు వీళ్లెవరూ సాటి రారండి.. ఒక మాట. ఒక భార్య. ఒక బాణం అంటారు కదా. అలా నా మైండ్‌లో ఆమె ఫిక్స్ అయిపోయిందంతే. ఇప్పటికీ ఆమె హీరోయిన్‌గా చేయడానికి రెడీ అంటే నేను రెడీ. ఆమె అంటే నాకు పిచ్చి. ఆ తర్వాత రమ్యకృష్ణ. సో ఆమెతో నటించాను కాబట్టి ఆమే మంచి జోడీ అనుకోండి.
ఆర్కే: మీ నాని అన్నయ్యకు చెప్పి శ్రీదేవితో సినిమా ప్లాన్ చేయమని చెప్పండి. వెరైటీగా ఉంటుంది.
ఎన్టీఆర్: ఆమె మనతో చేయరండి. ఎక్కడో ఓ చోట ట్రై చేయాలి. ఏదో ఒక సందర్భంలో కనీసం ఒక సాంగైనా... నా శక్తి మేరకు ట్రై చేస్తాను. కుదిరితే ఓకే... అంటూ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు జూనియర్ ఎన్టీఆర్..
Updated Date - 2020-05-20T14:33:38+05:30 IST