ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శరత్‌కుమార్ కూతురిని క్లోజ్ ఫ్రెండ్‌గా లవ్ చేస్తా

ABN, First Publish Date - 2020-02-08T08:17:25+05:30

తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న నటుడు విశాల్. 15-05-2016న జరిగిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తన జీవితంలోని ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న నటుడు విశాల్.  15-05-2016న జరిగిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తన జీవితంలోని ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రామ్ గోపాల్ వర్మ తీసిన ‘శివ’ సినిమా చూసి డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయినట్లు చెప్పారు. నాన్నకు మాత్రం తనను హీరోగా చూడాలని ఉండేదని విశాల్ చెప్పాడు. మోహన్‌బాబు తనను చిన్నప్పుడు చూసి హీరో అవుతావని అన్నారని... ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు. తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు తన బాల్య స్నేహితురాలని... స్నేహితులను ఎవరైనా ప్రేమిస్తారు కదా అని విశాల్ చెప్పుకొచ్చాడు. బాలా ‘వాడు వీడు’ సినిమాలో నటించేందుకు చాలా ఇబ్బంది పడ్డానని... మెల్ల కన్నుతో సినిమా అంతా నటించడం చాలా కష్టమని తెలిపాడు. మెల్ల కన్నుతో చేయలేక నొప్పి వచ్చేదని... ఆ నొప్పి నుంచి బయటపడటానికి ఆల్కహాల్‌కు అలవాటు పడ్డానని విశాల్ చెప్పాడు. పెళ్లి ఆలోచన ఇప్పుడప్పుడే లేదంటున్న ఈ ‘పందెం కోడి’ హీరో చెప్పిన మరెన్నో ఆసక్తికర విషయాలు మీకోసం...

 

ఆర్కే : హలో విశాల్‌. తమిళ, తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల అభిమానం ఎలా ఉంది?

విశాల్‌: నైస్‌ సర్‌. సినిమా షూటింగ్‌, ప్రమోషన్స్‌తో బిజీగా గడిచిపోతోంది. వీటికోసం హైదరాబాద్‌కు రావడం, పోవడం జరుగుతూనే ఉంది.


ఆర్కే : ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రమోషన్‌ చేయాలి కదా?

విశాల్‌: రాయుడు సినిమా ప్రమోషన్‌ కోసం వైజాగ్‌ రావాలనుకున్నాం. అయితే టైం తక్కువగా ఉంది కాబట్టి హైదరాబాద్‌లోనే ప్లాన్‌ చేశాం. లాస్ట్‌టైం సక్సెస్‌టూర్‌లో వైజాగ్‌ వరకు వెళ్లాం. నెక్ట్స్‌ టైం ఆడియో రిలీజ్‌ వైజాగ్‌లో ప్లాన్‌ చేయాలని అప్పుడే అనుకున్నా. కానీ షూటింగ్‌లో డిలే వల్ల చేయలేకపోయాం.


ఆర్కే : తెలుగువాడై ఉండి తమిళ్‌లో హీరోగా నిలదొక్కుకోవడం అంటే మాటలు కాదు. ఎలా సాధ్యమయింది?

విశాల్‌:నేను పుట్టింది, పెరిగింది, చదివింది మొత్తం చెన్నైలోనే. నాకు డైరెక్టర్‌ అవ్వాలని ఉండేది. రామ్‌గోపాల్‌వర్మ ‘శివ’ చూశాక నాన్న దగ్గరకు వెళ్లి డైరెక్టర్‌ అవ్వాలనుకుంటున్నా, వర్మ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేర్పించండని అడిగా. అప్పుడు నేను 12 స్టాండర్డ్‌ చదువుతున్నా. అప్పటి వరకు ఏమవ్వాలనేది నాకు క్లారిటీ లేదు. యావరేజ్‌ స్టూడెంట్‌ని. అయితే ముందు డిగ్రీ పూర్తి చేయి ఆ తరువాతే సినిమాలని అమ్మ కండిషన్‌ పెట్టింది. దాంతో విజువల్‌ కమ్యునికేషన్‌లో డిగ్రీ చేద్దామని జాయిన్‌ అయిపోయా. థర్డ్‌ ఇయర్‌లో ఉండగా ముంబై వెళ్లి రామ్‌గోపాల్‌వర్మ దగ్గర చేరుదామనుకున్నా. అప్పుడు కూడా అమ్మే వద్దంది. నువ్వు ముంబై వెళ్లిపోతే ఫ్యామిలీ నుంచి దూరమైపోతావు. మళ్లీ రావు. ఇక్కడే ఎవరి దగ్గరైనా చేరిపో అంది.

 

దాంతో అర్జున్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరా. ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్‌. అయితే నాన్న గారు ముందు నుంచి నువ్వు హీరో అవ్వాలి అనే వారు. నాన్న డ్రీమ్‌ అది. నాన్న ప్రొడక్షన్‌లో యమధర్మరాజు సినిమా షూటింగ్‌ జరుగుతుండగా మోహన్‌బాబు గారు నన్ను చూసి ఈ అబ్బాయి తప్పకుండా హీరో అవుతాడని అన్నాడు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. ఆ తరువాత ఒకసారి షూటింగ్‌లో వినీతపై షాట్‌ పూర్తయ్యాక నన్ను ఆ షాట్‌ అలాగే నటించమని అన్నారు. వెళ్లి చేశాను. పదిరోజుల తరువాత ఎడిటింగ్‌ రూమ్‌కి పిలిపించారు. ఈ షాట్‌ చూశావు కదా. నీది ఫొటోజెనిక్‌ ఫేస్‌. వెళ్లి హీరోగా ట్రై చేయి అన్నారు. ఆ సమయంలో కొత్త వాళ్ల బూమ్‌ నడుస్తోంది. అప్పుడే ప్రేమచదరంగం సినిమాలో అవకాశం వచ్చింది. రెండో సినిమా పందెంకోడితో బ్రేక్‌ వచ్చింది.

 

ఆర్కే :చేతికి ఆ దెబ్బ ఎలా తగిలింది?

విశాల్‌: షూటింగ్‌లో... దెబ్బలు తగలడం నాకు మామూలే. ఇదే కాదు వందకు పైగా దెబ్బలు తగిలాయి.


ఆర్కే : అంత రిస్క్‌ ఎందుకు. డూప్‌ పెట్టుకోవచ్చుగా?

విశాల్‌: నేను సెట్‌లో ఉండగా నా కాస్ట్యూమ్‌ వేసుకుని మరొకరు కనిపించడం నాకిష్టం ఉండదు. నేను ఉన్నప్పుడు నా డూప్‌ ఉండకూడదు, నేనే చేస్తాను.

 

ఆర్కే : తెలుగులో పాపులర్‌ అయిన మీ సినిమా ‘పందెంకోడి’. మరి మీ మెంటాలిటీ కూడా అలానే ఉంటుందా?

విశాల్‌: ఈ మధ్యకాలంలో అలా ఉంటున్నాను. సినిమా నాకు అన్నం పెట్టిన దేవుడు. ఆ సినిమా ఇండస్ట్రీకి ఎవరైన తప్పు చేశారంటే ఊరుకోను.

 

ఆర్కే :హీరోయిన్లతో సీన్లు చేసేటప్పుడు నర్వస్‌గా ఫీలైన సందర్భాలున్నాయా?

విశాల్‌:నా మొదటి సినిమా ప్రేమచదరంగంలో రీమాసేన్‌ హీరోయిన్‌. అందులో మేం కపుల్‌గా నటించాం. ఆవిడతో ఫస్ట్‌నైట్‌ సీన్‌లో నటించినపుడు చాలా ఇబ్బంది పడ్డా. ఎన్ని ఫైట్స్‌ అయినా పెట్టండి కానీ ఇవి చేయలేనని డైరెక్టర్‌తో చెప్పా. హీరో అంటే అన్నీ చేయాలి కదా. రెండు, మూడు రోజులు నర్వస్‌గా ఫీలయ్యా. ఇప్పుడు మాత్రం రొమాన్స్‌ సీన్‌ చేయడంలో కింగ్‌నే.

 

ఆర్కే :మీ ఫాదర్‌ నిర్మాత కాబట్టి మీరు హీరోగా నిలదొక్కుకున్నారు, లేదంటే అయ్యేవారు కాదంటారు, నిజమేనా?

విశాల్‌: ఒక్క పందెంకోడి సినిమా కోసమే మా నాన్న డబ్బులు పెట్టాడు. ఆ సినిమా తరువాత ఇక మళ్లీ నా గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదు. పందెంకోడి సినిమా వచ్చి పదేళ్లయింది. ఆ టైంలో ఆ సినిమా కోసం 6 కోట్లు ఖర్చు పెట్టాడు. తెలుగులో నన్ను నిలబెట్టడానికి నాన్న చేసిన కృషి అది. మంచి ఆఫర్‌ వచ్చినా రైట్స్‌ అమ్మకుండా రిలీజ్‌ చేశాడు. ఆ సినిమా వల్లే టాలీవుడ్‌లోనూ ఉండగలిగాను. గుర్తింపును తీసుకొచ్చిన సినిమా అది. 


ఆర్కే : తమిళ్‌, తెలుగు ప్రేక్షకుల్లో ఎవరితో ఎక్కువ కంఫర్ట్‌ ఉంటుంది?

విశాల్‌: రెండు చోట్ల ప్రేక్షకులది ఒకే ఆలోచన, ఒకే వెవ్‌లెంగ్త్‌ ఉంటుంది. తమిళ్‌లో హిట్‌ అయితే తెలుగులో హిట్‌ అవుతుంది. తమిళ్‌లో పోయిందంటే తెలుగులో కూడా కచ్చితంగా పోతుంది.


ఆర్కే :సినిమా ప్రొడ్యూసర్‌గా బ్యాలెన్స్‌ షీట్‌ ఏంటి?

విశాల్‌: ప్రొడ్యూసర్‌గా నేను గెలిచాను. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారంటే అండర్‌వరల్డ్‌లానే ఉంటుంది. లాస్‌ అయినా సరే, మళ్లీ తీయాల్సిందే.


ఆర్కే : ఎలా అలవాటైంది?

విశాల్‌: అది ఓ ప్రాసెస్‌. అదీ రెండు కళ్లు కాదు ఒక కన్ను మాత్రమే మెల్లకన్నులా పెట్టాలి. అది చాలా కష్టం. కొందరు అభిమానులు మెల్లకన్నుతో యాక్ట్‌ చేసి వీడియోలు పంపించారు. తిడుతూ వారికి వీడియోలు తిప్పి పంపించా. భరించలేని నొప్పి ఎవరూ పడకూడదు. మా ఫ్యామిలీ డాక్టర్‌ ‘సినిమాలో బాగా నటించావు, జీవితంలో ఇక అలా చేయకు’ అన్నారు.

 

ఆర్కే : శరత్ కుమార్‌ గారితో మీకెందుకు గొడవ?

విశాల్‌:గొడవేం కాదు. ఇద్దరి కోరికలు వేరు వేరంతే. బిల్డింగ్‌ వస్తుందని అందరినీ ఏమారుస్తున్నారు. యంగ్‌స్టర్స్‌కు అవకాశం ఇవ్వండని మేం అడిగాం. పదవికోసం మాత్రం కాదు.


ఆర్కే : ఆయన కూతురు వరలక్ష్మిని ప్రేమించడంతో ఆయన మీతో గొడవని టాక్‌?

విశాల్‌: అది మానసిక పరిణతి లేకపోవటమే. వరలక్ష్మి నాకు బాల్య స్నేహితురాలు.


ఆర్కే : ఆమెపై మీకు లవ్‌ ఉందా?

విశాల్‌: స్నేహితులంటే నాకు ప్రేమే. ఒకమ్మాయిని అడ్డుపెట్టుకుని వాళ్ల నాన్నను ఎదిరించటం నాకైతే తెలీదు. ప్రతి అమ్మాయి నాన్ననూ ఇష్టపడతాను.

 

ఆర్కే : మీరు ఆ బిల్డింగ్‌ కట్టారా?

విశాల్‌: ఈ మధ్యే పాతవారు చేసిన రెండుకోట్ల అప్పు తీర్చాం. బిల్డింగ్‌లో కల్యాణమండపం లాంటివి కట్టాలంటే 25 కోట్లు కావాలి. స్థలం ఉంది, బిల్డింగ్‌ కోసం నేను, కార్తీ కలిసి ఉచితంగా ఓ సినిమా చేస్తున్నాం. సినిమా అసోషియేషన్‌కు డబ్బుల్లేవు కాబట్టి వెయ్యి రూపాయలే ఇస్తున్నాం. పెంచాలని ఉంది. ఆ వైపు దృష్టి సారిస్తాం.

 

ఆర్కే : ఆ కళ్యాణమండపంలో మీరు పెళ్లి చేసుకుంటారా?

విశాల్‌: అదేం లేదు. నేనిప్పుడే పెళ్లి చేసుకోను. అసలా మైండ్‌సెట్‌ ఇంకా రాలేదు.

 

ఆర్కే : చిత్రసీమ రాజకీయాల్లోంచి రెగ్యులర్‌ రాజకీయాల్లోకి వస్తారా?

విశాల్‌: అదేం లేదు. పాలిటిక్స్‌తోనే మంచి చేయాలని రూల్‌ లేదు. డబ్బు, పవర్‌ ఉంటుంది. స్కోప్‌ ఎక్కువ ఉండచ్చు. ప్రస్తుతం నా ట్రస్ట్‌తో అలా చేస్తున్నా. ఫ్యాన్‌క్లబ్‌లో అందరికీ చెప్పాను, ‘మీ జిల్లాలో ఎవరైనా డబ్బులేకున్నా బాగా చదివే పిల్లలకి సహాయం చేయండి’ అని చెప్పాను. రాజకీయాల్లో పోలింగ్‌ పర్సెంటేజ్‌ ఎక్కువ ఉండాలి.


ఆర్కే : జీవితంలో బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌? 

విశాల్‌:ఎలక్షన్స్‌ రోజున ఫస్ట్‌ నా పేరు అనౌన్స్‌ చేయటం మర్చిపోలేను. ‘వాడు వీడు’ చిత్రంలో నేను పోషించిన పాత్ర మర్చిపోలేను.

 

ఆర్కే : ‘వాడు వీడు’లో మెల్లకన్నుతో డీగ్లామర్‌ రోల్‌ ఎందుకు చేశారు?

విశాల్‌:అలాంటి చిత్రాల్లో అవకాశం రావటమే అరుదు. అందునా బాలా గారి దర్శకత్వంలో నటుడిగా నిరూపించుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఆ చిత్రంలో నటించాను.

 

ఆర్కే : అసలు మెల్లకన్నుతో ఎలా చేయగలిగారు?

విశాల్‌: అలాంటి ప్రయత్నం చేయకూడదు. అది చాలా ప్రమాదం. స్టార్ట్‌ కెమెరా అంటూనే మెల్లకన్నులోకి వెళ్లిపోయాను. ‘వాడు వీడు’ చిత్రం షూటింగ్‌ 230 రోజులు జరిగింది. ఈ సినిమా ప్రారంభించాక మెల్లకన్నులో నటించాలని స్ర్కిప్ట్‌లో లేదు. ఆ షూటింగ్‌ పదహారో రోజు బాల గారు నన్ను పిలిచి ‘నేను అనుకున్నట్లు నువ్వు లేవు విశాల్‌’ అంటూ ‘మెల్లకన్నుతో ఇలా చేయి’ అనే ఆలోచన చెప్పారు. వెంటనే అది చేసి ప్రయత్నించాను. దీంతో బాలగారు ఏడ్చారు, ఏదో ఇన్వెన్షన్‌ చేసినట్లు షూటింగ్‌లో ఉండే అందరినీ పిలిచి ప్రశంసించారు. ఆ మెల్లకన్ను ఉన్నట్లు చేయటం వాంతి వచ్చింది. ఆ రోజు ఫుల్‌ హెడ్‌ ఏక్‌ వచ్చింది.

 

‘పదిరోజులు చెన్నైలోనే ఉండి లెన్సుతో ఏమైనా మెల్లకన్నుతో సాధ్యమవుతుందేమో వెళ్లు’ అని పంపించారు. మా ఫ్యామిలీ డాక్టరుకు చెబితే ‘నీకేమైనా పిచ్చిపట్టిందా, మెల్లకన్ను పోగొట్టుకోవడానికి వస్తారు, షూటింగ్‌ కోసం ఇలాంటివి చేయటం ప్రమాదకరం’ అన్నారాయన. ఎవరైనా ఇలా చేశారా అని యూట్యూబ్‌లో వెతికాను. ప్రపంచంలో ఎవరూ చేయలేదు. ఒక్క వీడియో కూడా దొరకలేదు. దీంతో ఎలాగైనా మెల్లకన్నుతో నటించాలి. ఎవరికైనా రిఫరెన్స్‌ కావాలంటే నా వీడియో చూడాలనుకున్నా.

 

షూటింగ్‌కు వెళ్లాను. మెల్లకన్ను పెట్టి నటిస్తుంటే తల నొప్పించేది. కళ్ళ దగ్గర ఉండే నరాలు నొప్పి పుట్టేవి. కన్నీళ్లొచ్చేవి. బాల గారితో విపరీతమైన తలనొప్పి గురించి ఏరోజూ చెప్పలేదు. అయితే తోటి నటుడు ఆర్యతో చెప్పేవాడ్ని. యాభైయ్యవ రోజు వచ్చేసరికి కెమెరా, స్టార్ట్‌ అంటూనే మెల్లకన్నులోకి వెళ్లిపోయేవాడ్ని. ఆ సమయంలోనే నొప్పిని భరించడానికి ఆల్కహాల్‌ తీసుకున్నా. ఇలా షూటింగ్‌ జరిగినన్ని రోజులూ తలనొప్పి భరించలేక ఆల్కహాల్‌ తీసుకునేవాన్ని. షూటింగ్‌ అయిపోయాక కూడా ఆల్కహాల్‌ను తీసుకున్నా. భయమేసింది. ఎక్కడికెళ్లినా మెల్లకన్ను చేయటం ఆల్కహాలిక్‌ అయింది. ఇంట్లో అమ్మ భోజనం పెడుతుంటే అనుకోకుండా షూటింగ్‌ ట్రాన్స్‌లోనే ఉన్నట్లు మెల్లకన్ను పెట్టాను. అమ్మ భయపడిపోయింది. ఈ ఆల్కహాలిక్‌ అలవాటును మానుకోలేక.. విక్రమ్‌ గారిని ‘మీరు ఎలా క్యారెక్టర్స్‌లోంచి బయటికి ఎలా వస్తారు’ అని అడిగాను. ‘ నీకోసం నువ్వు గడుపు, ఎక్కడికైనా దూరంగా వెళ్లు’ అన్నారు. దీంతో నేను హిమాలయాలకు వెళ్లాను.

 

ఆర్కే : జీవితంలో ఎక్కువ కష్టపడింది ‘వాడు వీడు’ పాత్రకోసమేనా?

విశాల్‌: అవును ‘వాడు వీడు’ పాత్రను మించిన కష్టం లేదు. ఇదే బార్డర్‌. ఇది అయిన తర్వాత చావు.

 

ఆర్కే : మీకు కాంప్లిమెంట్స్‌ వచ్చాయా?

విశాల్‌: అవార్డుల మీద నమ్మకం లేదు. కానీ అనేకమంది నన్ను నటునిగా గుర్తించారు. అదే చాలు. టామ్‌క్రూయిజ్‌ అయినా, లోకల్‌ హీరో అయినా మెల్లకన్నుతో నటించాలంటే నన్ను చూసి నేర్చుకోవాలి.


ఆర్కే : జీవితం అంటే?

విశాల్‌:ఒక సినిమా హిట్‌ అయితే బయటినుంచి 99 బొకేలు వస్తాయి. ఒక్క బొకే ఇంటి దగ్గరనుంచి వస్తుంది. వరుసగా మూడు ఫ్లాపులొస్తే బయటినుంచి ఒక్కబొకే కూడా రాదు, ఇంటినుంచి మాత్రమే బొకే వస్తుంది. నాలుగేళ్ల కితం ఆహా.. స్ర్కిప్టులు ఎలా చూస్‌ చేసుకుంటున్నాడో అన్నవారే ఫ్లాపులొస్తే ‘కథ అయిపోయింది, వేస్ట్‌’ అన్నట్లు చూస్తారు. ఇలా అనుభవం నుంచి చాలా నేర్చుకున్నా. అన్ని ప్రొఫెషన్స్‌లో సె్ట్రస్‌ ఉంటుంది. సినిమా అలా కాదు.. ఇది ఓ గేమ్‌లాంటిది. బయట ఏం జరుగుతుందో తెలీదు. బెల్లీ డ్యాన్స్‌లాగా దానిమీదే ఉండాలి. లెజెండ్‌ కమెడియన్‌ నగేష్‌ గారు ‘నిద్రపోయేటప్పుడు కూడా కాలు కదపాలి. లేకుంటే అయ్యో.. పోయాడని అంటారు’ అంటూ ఆయన ఓ జోక్‌ వేశాడు. అలాంటిది సినిమా ప్రపంచం.


ఆర్కే : మీ డ్రీమ్‌ ఏంటి?

విశాల్‌: ఎన్ని కష్టాలొచ్చినా 2018 జనవరికి ఆ బిల్డింగ్‌ కట్టాలి. అదే నా డ్రీమ్‌. ఆ తర్వాత లైఫ్‌లో స్థిరపడతా.

 

విశాల్ కుటుంబ నేపథ్యం... బంధాలు... అనుబంధాల గురించి

నాన్న గారు హెవీ వెహికిల్‌ ఫ్యాక్టరీ, అవడిలో పనిచేశారు. ఆయనకు సినిమాల్లో నటించాలని ఉండేది. కానీ ఉద్యోగం మూలంగా కుదరలేదు. పెద్ద కొడుకును హీరో చేద్దామనుకున్నారు. సాధ్యం కాలేదు. చిన్నకొడుకును హీరో చేసి సక్సెస్‌ అయ్యారు. తరువాత ఈ మధ్యనే ఒక సినిమాలో నటించి తన డ్రీమ్‌ను నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

మా గ్రానైట్‌ ఎక్స్‌పోర్ట్‌ బిజినెస్‌ వ్యవహారాలను అన్నయ్య చూసుకుంటున్నారు.

నాన్న నా గురించి పేపర్లో ఏ చిన్న వార్త దాన్ని కట్‌ చేసి పెడతారు. అలా ఇప్పుడు అది పెద్ద ఫైల్‌ అయింది.


దెబ్బ తగిలిందంటే ఆ సినిమా సూపర్‌ హిట్‌

షూటింగ్‌లో నాకు దెబ్బ తగిలిందంటే ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందని నమ్మకం కూడా ఉంది. సినిమా ఇండస్ట్రీకి మంచి చేయాలి. థియేటర్‌ ఆర్టిస్టులకు, ఇతర నటీనటులకు అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేశాం. ఆ బిల్డింగ్‌ పూర్తయితే దానిపై వచ్చే రెంట్‌తో సినిమా ఆర్టిస్టులకు మెడిక్లెయిమ్‌, పెన్షన్‌లాంటివి అందుతాయి.


షూటింగ్‌, సినిమా ప్రమోషన్‌ మరోవైపు జనరల్‌ సెక్రెటరీ బాధ్యతలు. ఇవన్నీ పర్సనల్‌ లైఫ్‌ లేకుండా చేశాయి. వారానికొకసారి ఫ్యామిలీ అంతా బయటకు డిన్నర్‌కు వెళ్లే వాళ్లం. ఈ మధ్యకాలంలో అది కూడా లేకుండా పోయింది. తమిళ ప్రజలు నన్నెప్పుడూ నాన్‌లోకల్‌గా చూడలేదు. ఆ విషయాన్ని అక్కడి ప్రజలు పట్టించుకోరు.


నా రంగే నా బలం. ఈ కలర్‌కు ఒక వాల్యూ ఉంది. తమిళ్‌లో ఒక మాస్‌ హీరోకి ఇది అడ్వాంటేజ్‌. ఈ విషయాన్ని నేనెప్పుడూ మైనస్‌గా తీసుకోలేదు. హీరోయిన్‌ ఎంపికను డైరెక్టర్‌ చాయిస్‌కే వదిలేయాలి. ఈ హీరోయిన్‌ అయితే బాగుంటుంది అని చెప్పొచ్చు. అంతేకానీ ఆమెనే తీసుకో అని చెప్పకూడదు. నేనెప్పుడూ ఈ హీరోయిన్‌ను తీసుకో అని సూచించలేదు.


ఆ హీరో హీరోయిన్‌ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది అని అంటారు కానీ ఆ పదమంటేనే నాకు చిరాకు. సినిమా, ప్రేమ... ఈ రెండింటిలో నీకు ఏది కావాలో తేల్చుకో అనే పరిస్థితి వచ్చింది. ఆ టైంలో సినిమా వైపే మొగ్గు చూపాను.


నేను ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు చాలా హ్యాపీ. ఎందుకంటే నాకంటే మంచి అబ్బాయి భర్తగా దొరికాడు. తెలుగు మాట్లాడతాను, చదవడం, రాయడం రాదు.


విశాల్ చెప్పిన మనసులో మాటలు

 

ఇప్పటివరకూ ఇంటినుంచి ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు.

బాల గారితో వర్క్‌ చేయటం చాలా కష్టం. ఎంత బాగా చేసినా ఆయన కన్విన్స్‌ కారు. ‘వాడు వీడు’ లో అమ్మాయి గెటప్‌లో నటించినపుడు ‘నువ్వు అమ్మాయిలా’ కనిపించలేదని అన్నారు. ఐదు రోజుల తర్వాత ‘అమ్మాయిలాగా కనిపిస్తున్నావు. ఇరగదీయ్‌’ అన్నారు బాల. పదికోట్లు ఇచ్చినా అలాంటి ఎక్స్‌పీరియన్స్‌ రాదు.

 

‘వాడు వీడు’ చిత్రంలో అమ్మాయిగా డ్యాన్స్‌వేసేటప్పుడు కెమెరామన్‌ దగ్గరికి వచ్చి ‘ అక్కడ.. కొంచెం ఎక్స్‌పోజ్‌ ఇవ్వాలి’ అన్నారు. ‘కుదరదు’ అంటున్నా, నన్ను చూసి బాల సర్‌ ఒకటే నవ్వులు. ఆరోజు అనుకున్నా.. మానిటర్‌ దగ్గర హీరోయిన్స్‌ పేరెంట్స్‌ కూర్చుని ఉంటారు.. వారెలా చేస్తారో’ అనిపించింది. ఎక్స్‌పోజ్‌ అనేది సినిమా సర్వైవల్‌ కాబట్టి ఎవరేం చేయలేరు.

 

‘శౌర్యం’ రీమేక్‌ తమిళ్‌లో చేశాను. సమీరారెడ్డి కథానాయిక. ఆమెను మెల్లకన్నుతో చూశాను. ఎక్కడో చూస్తున్నానని దర్శకుడు ప్రభుదేవా పదిరోజులు తర్వాత షూటింగ్‌కు వచ్చెయ్‌ అన్నారు.

 

నేను ఏనాడూ పదిమంది రష్యన్‌ డ్యాన్సర్స్‌ పాటలో ఉండాలి, అమెరికాలో తీయాలని నేనెపుడూ అనను.నేనూ, అన్నయ్య చిన్నపుడు ఎక్కువగా పోట్లాడేవాళ్లం. అన్నయ్యను హాస్టల్‌లో పెట్టేశారు. రీల్‌లైఫ్‌లో ఫైట్‌ చేస్తాను కానీ రియల్‌లైఫ్‌లో ఎవరిపై కోప్పడలేదు.

 

జనరల్‌ సెక్రటరీ అయ్యాక బాధ్యతలు పెరిగాయి. ట్రెజరర్‌గా ఉండే కార్తీ అయితే సరిగా నిద్రపోలేదని వాళ్లింట్లో కంప్లయింట్‌. ఏది కొన్నా దాన్ని ఫొటో తీసి పెడతాడు. ‘ఫ్యూచర్‌లో ఎవరూ ప్రశ్నించకూడదు’ అంటాడు.

 

Updated Date - 2020-02-08T08:17:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising