ఒకప్పుడు వైఎస్‌ను పంచలూడదీసి కొడతానంది.. ఇప్పుడు బాబునూ తిడుతోంది
ABN, First Publish Date - 2020-05-21T23:29:10+05:30
పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత మృదుస్వభావి. మంచి చదువరి. ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తతరం మహిళ. ఈమధ్యనే అసెంబ్లీలో రోజాకు, అనితకు వాగ్యుద్దం జరిగింది.
రోజాపై పరువునష్టం దావా వేస్తా
అగ్రవర్ణ ఎమ్మెల్యేను అంటే ఆమె అసెంబ్లీ దాటగలదా..
ఆవిడ బిహేవియర్‌ను ఎత్తి చూపడమే నా తప్పు అయ్యింది.
నేను ఏ తప్పు చేయలేదు.
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో టీడీపీ ఎమ్మెల్యే అనిత
పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత మృదుస్వభావి. మంచి చదువరి. ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తతరం మహిళ. ఈమధ్యనే అసెంబ్లీలో రోజాకు, అనితకు వాగ్యుద్దం జరిగింది. రోజా అభ్యంతరకర పదజాలంతో తనను దూషించారంటూ కన్నీళ్లు కూడా పెట్టుకుంది అనిత. దీంతో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఎబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ 03-01-2016న జరిపిన ఓపెన్‌హార్ట్ విత ఆర్కేలో అనిత చెప్పిన విశేషాలు మీకోసం..
ఆర్కే: అసెంబ్లీలో రోజా వ్యాఖ్యల నుంచి బయటపడ్డారా?
అనిత : అంత సులువుగా బయట పడేటట్టు మాట్లాడలేదు కదా! కొంత టైమ్ పడుతుంది. ఆ రోజు ఇంటికొచ్చినా బాధ పోలేదు. పాలిటిక్స్‌లోకి వచ్చే ముందు మా నాన్నతో ఒక మాట అన్నాను.. ఎథిక్స్ పోగొట్టుకోను. అవి పోగొట్టుకునే రోజు వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను’ అని. రోజా నా గురించి వ్యక్తిగత దూషణలకు దిగినా నేను ఆ స్థాయిలో మాట్లాడలేదు. మా నాన్న చెప్పిన మాట ఇప్పటికీ గుర్తు. విమర్శ అనేది ఒక పెంపుడు పావురం లాంటిది. దాన్ని వదిలి పెట్టినా మళ్లీ మన ఇంటికే వస్తుంది. జాగ్రత్త’ అన్నది నాన్న మాట.
ఆర్కే: రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
అనిత : రాజకీయాలంటే ఆసక్తి ఉంది. పాయకరావుపేటలోని బెస్తపల్లెలో టీచర్‌గా చేస్తున్నప్పుడు.. అనితా నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లకూడదూ అన్నారు మిత్రులు. పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక రాజకీయాల్లోకి వచ్చాను. టీడీపీలో ఎత్తుకుపైఎత్తు వేయాల్సిన అవసరం రాలేదు. ఎవరికి ఏ సమయంలో ఇవ్వాల్సిన ప్రాధాన్యం వారికి చంద్రబాబుగారు ఇస్తున్నారు.
ఆర్కే: రోజాకు, మీకు మధ్య ఎందుకు వైరం వచ్చింది?
అనిత : ఆవిడ సినిమా నటి, రాజకీయాల్లోకి వచ్చారు అన్నదే తెలుసు. నా నేపథ్యం గురించి ఆమెకు ఏమీ తెలియదు. ఆవిడ బిహేవియర్‌ను ఎత్తి చూపడమే నా తప్పు అయ్యింది. ఇదివరకు బుచ్చయ్యచౌదరి గారికి చెప్పు తీసి చూపించింది రోజా. ఇదేంటండీ ఆయన పెద్దాయన. రాజకీయ అనుభవజ్ఞుడు. ఆయనకు చెప్పు చూపించడమేంటండీ’ అన్నాను. ఆ మాట ఆవిడకు నచ్చలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారి గురించి రోజా గొప్పలు చెబుతున్నప్పుడు నేను కలుగుజేసుకుని - ఏంటి రోజాగారు మీరు ఒకప్పుడు అదే రాజశేఖర్‌రెడ్డిని పంచెలు ఊడదీసి తంతాను అన్నారు. ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నావే’ అన్నాను. ఇక, మొన్న చంద్రబాబును అసభ్యకరమైన మాటలు అన్నారామె.
అసెంబ్లీలో అలాంటి ఆమెను సస్పెండ్ చేయమని మేము అందరం స్పీకర్‌గారిని అడిగాము. వెంటనే ఆమె నన్ను.. భర్తను వదిలిపెట్టింది అంటూ లేనిపోని మాటలు అనడం మొదలుపెట్టింది. ఒక్క నిమిషం నేను డిస్ట్రబ్ అయ్యాను. బాధతో ఇంటికి వెళ్లిపోయాను. నేను మూడు పీజీలు చేశాను. గౌరవప్రదమైన ఉపాధ్యాయవృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. పన్నెండేళ్లు సామాజిక సేవలో ఉన్నాను. అలాంటిది నా గురించి రోజాకు ఏమి తెలుసని అంత మాటలు అంది అని నాలో నేను మధనపడ్డాను. నన్ను రాజకీయంగా విమర్శించవచ్చు. కాని నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడాలి? నా కుటుంబంలో జరిగిన విషయాలు ఆమెకు తెలియవు కదా! దళిత కమ్యూనిటీలో ఉన్నవాళ్లను మరింత చులకన చేసి మాట్లాడే తీరు సహించలేకపోయాను.
ఆర్కే : 4 రోజుల తరువాత మీరు ఏడ్చారని రోజా అంటున్నారు?
అనిత : ఎదుటివాళ్లు ఏదైనా చిన్న బురద జల్లిన వెంటనే రెండ్రోజులు అలా ఉండిపోతాము. అలాంటిది అసెంబ్లీలో నన్ను రోజా అన్న మాటలకు స్పందించటానికి అంత టైమ్ పట్టింది. నేను కాబట్టి తనను ఏమీ చేయలేకపోయాను. అదే ఇంకో అగ్రవర్ణాల మహిళలను, గట్టి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్లను అనమనండి. అసెంబ్లీ దాటి ఆమె బయటికి వెళ్లగలుగుతుందా? కేవలం నేను దళిత మహిళను కాబట్టి ఏమీ చేయలేనన్న ధైర్యం. అందుకే అదే అసెంబ్లీలో నాకు న్యాయం జరగాలని మా ముఖ్యమంత్రిగారిని అడిగాను. ఆయన అనుమతితో స్పందించాను.
ఆర్కే: అసెంబ్లీలో అంత మంది మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా! కేవలం అనిత మాత్రమే ఎందుకు ముందుకు వస్తున్నారు? రోజాకు పోటీగా మిమ్మల్ని వెళ్లమన్నారా?
అనిత : అలాంటిదేమీ లేదు. ఈ రోజు నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చున్నానంటే అది చంద్రబాబునాయుడు గారి వల్లే.
ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ని రోజా నానా మాటలు అన్నప్పుడు తట్టుకోలేకపోయాను. స్పందించాను.
ఆర్కే: మీ వైపు నుంచి కూడా కొందరు సభ్యులు రోజాను రెచ్చగొడుతున్నారన్నది ఆవిడ ఆరోపణ. ఆ మాటలు మైకుల్లో వినిపించడం లేదంటున్నారు?
అనిత : నిజంగా అలా జరిగితే స్పీకర్‌కు చెప్పవచ్చు కదా! ప్రజల ముందు పెట్టవచ్చు కదా! ఎందుకు అలా ఉండిపోతున్నారు.
ఆర్కే: చంద్రబాబునాయుడు దళితుల్ని ముందుకు పెట్టి రాజకీయం చేస్తున్నారు అంటున్నారు రోజా?
అనిత : దళితులు అంటే మీకు అంత భయమా? దళితులు అన్న పదాన్ని మీ పార్టీ ఉపయోగించుకుంటున్నది. ఆ అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు.
ఆర్కే: ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా మద్యవర్తిత్వం చేశారా?
అనిత : నాకు, రోజాకు ఎలాంటి వైరం లేదు. కేవలం అసెంబ్లీలో జరిగిన సంఘటన వల్లే ఈ సమస్య వచ్చింది. మా ఇద్దరి మధ్య సఖ్యతను నెరిపేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
ఆర్కే: ఇంత జరిగింది కదా! ఇక నుంచి రోజా జోలికి వెళ్లకూడదనుకుంటున్నారా?
అనిత : మా జోలికి వచ్చినా ఊరుకునేది లేదు. ఎందుకు తగ్గాలి? నేను ఏ తప్పు చేయనప్పుడు. అన్ని తప్పులు వైఎ్‌సఆర్‌సీపీ పార్టీవారే చేస్తున్నారు. ఈ రోజువరకు నా మీద ఒక చిన్న ఆరోపణ లేదు. రోజా అంత నీచంగా మరొకరు మాట్లాడరు. ఆవిడకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేప్పొద్దున వారు ఏంటమ్మా నువ్వు ఇలా అన్నావా? అంటే ఏమని సమాధానం చెబుతుంది. ఏ పిల్లలకు అయినా తల్లి రోల్‌మోడల్. అలాంటి తల్లివి నువ్వే ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా.
ఆర్కే: సభను సజావుగా నడిపించాల్సిన బాధ్యత అధికారపక్షం మీదనే ఉంటుంది కదా?
అనిత : కరవు, ధరల పెరుగుదల, కాల్‌మనీ ఇలా అన్ని సమస్యల మీద చర్చ అంటారు. మళ్లీ పక్కకు వెళ్లిపోతారు. వైఎ్‌సఆర్‌సీపీకి అసెంబ్లీలో ఒక ప్రణాళిక అంటూ లేదు. అదంతా వాళ్లు చేసుకుంటున్నదే. కాల్‌మనీ సంఘటనకు సంబంధించి చంద్రబాబుగారిని అన్ని మాటలు అన్నప్పటికీ మేము కాల్‌జగన్ అని పిలువలేదు. జగన్ ఎప్పుడైనా నిజాయితీ గురించి మాట్లాడినప్పుడు.. లక్షకోట్ల అవినీతి, చర్లపల్లి జైలు, అవినీతి కేసులు ఉన్న నువ్వా మాట్లాడేది? అంటాము తప్పిస్తే మరో వ్యక్తిగత ఆరోపణ చేయలేదెప్పుడూ. కాల్‌మనీ వ్యవహారం ఈ రోజు బయటికి వచ్చింది కాదు. ఇరవైఏళ్ల నుంచి ఉన్నదే. అందరికీ తెలుసు. ఇప్పుడు బయటికి వచ్చింది. దీనికీ, టీడీపీకి ఏమిటి సంబంధం.
ఆర్కే: మీరు ఉద్యోగం చేసేటప్పుడు దళితవివక్ష అనేది ఉందా?
అనిత : ఇప్పటికీ ఉంది. అయితే నేను ఎప్పుడూ వివక్షను ఎదుర్కోలేదు. నా పని నేను చేసుకుపోయేదాన్ని. మోడ్రన్ అన్‌టచ్‌బులిటీ మాత్రం ఉంది. దళితులకు ఇన్ని హక్కులు ఉన్నాయని దళితులకే తెలియదు. చట్టాలను మిస్‌యూజ్ చేస్తున్నవాళ్లు కూడా ఉన్నారు.
ఆర్కే: అంత గొప్ప అంబేద్కర్‌ను ఎందుకు ఒక వర్గానికే పరిమితం చేస్తున్నారు?
అనిత : అగ్రవర్ణాలు ఉండే చోట కూడా అంబేద్కర్ విగ్రహాలను పెట్టాలి. ఆయన అందరి మనిషి. ఇలా ఆయన్ని ఒకే వర్గానికి పరిమితం చేయడం తప్పు. అందుకు ప్రజాప్రతినిధులు అందరూ కృషి చేయాలి.
ఆర్కే: ఎమ్మెల్యేగా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
అనిత : మాది రిజర్వుడ్ నియోజకవర్గం. కాబట్టి కొందరిలో చిన్నచూపు ఉంది. అధికారుల దగ్గర నుంచి కూడా కొన్ని చోట్ల సమాచారం రావడం లేదు. ప్రజల్లో కూడా పదిశాతం మందికి వివక్ష ఉంది.
ఆర్కే : ఉన్నతస్థానాలకు చేరుకున్న దళితులు కిందికి చూడకుండా పైకి చూస్తున్నారన్న ఒక ఆరోపణ ఉంది?
అనిత : ఏ దళితుడు అయినా పైకొచ్చిన వెంటనే నా జాతికి ఏదో ఒకటి చేయాలన్న భావన ఉంటుంది. కొన్ని పరిస్థితుల వల్ల బయటికి చెప్పుకోలేకపోవచ్చు.
ఆర్కే : ఇసుక అక్రమ రవాణాలో మీరు మొదట్లో చాలా గట్టిగా పోరాడారు. మళ్లీ వెనక్కి తగ్గారు. ఎందుకని?
అనిత : మా నియోజకవర్గ ప్రజలకు చెప్పాను. ఇసుకకు సంబంధించి, రికార్డింగ్‌డ్యాన్సుల అనుమతికి సంబంధించి నా వద్దకు రావొద్దని. లిక్కర్, అబ్యూజింగ్ వంటి అంశాలను కూడా నా వద్దకు తీసుకురాకండి అని చెప్పాను. అప్పటి నుంచి నాకు ఫోన్లు రావడం మానేశాయి.
ఆర్కే : రేప్పొద్దున మీకు ఓట్లు రావడం కూడా మానేస్తే?
అనిత : ఇలా చెప్పడం వల్ల కొందరికి వ్యతిరేకం అవుతానేమో కాని.. మెజారిటీ ప్రజలకు దగ్గరవుతాను.
ఆర్కే : మీరు ప్రజలకు అందుబాటులో లేరని, వైజాగ్‌లో ఉంటున్నారని ఆరోపణ?
అనిత : వారంలో నేను మూడు రోజులు నియోజకవర్గంలో పర్యటిస్తాను. నా పిల్లల చదువులరీత్యా వైజాగ్‌లో ఉంటున్నాను. కేవలం నియోజకవర్గంలోనే కూర్చుంటే ఈ రోజు రెండొందల కోట్లు తెచ్చుండేదాన్ని కాదు కదా! హైదరాబాద్‌కూ వెళ్లక తప్పదు. మంత్రుల వద్దకు వెళ్లి నిధులు తెచ్చుకోవాలి.
ఆర్కే : రోజా మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానన్నారు?
అనిత : లాయర్లను సంప్రదిస్తున్నాను. పరువునష్టం దావా మాత్రం వేస్తున్నాను. నా మనస్సాక్షి చల్లారడం లేదు. నాలాంటి వారిని టచ్ చేస్తే ఎలాగుంటుంది అన్నది రోజాకు తెలియాలి.
ఆర్కే : మీది ప్రేమవివాహం. పోలీసుస్టేషన్‌లో పెళ్లి. మళ్లీ అదే పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు? ఎందుకొచ్చిందీ సమస్య?
అనిత : సాధారణ మహిళగా ఆలోచిస్తే ఇదంతా తలరాత అనుకోవాలి. 26 ఏళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగం మానేసి వచ్చాను. రాజకీయాల్లో నిలదొక్కుకోకపోతే నా పరిస్థితి ఏమిటని ఆలోచించాను. ఈ సమయంలో డిస్ట్రబెన్స్ జరిగితే ఎలా ఉంటుంది. కోడిపిల్లలను పట్టుకోవాలని చూస్తేనే తల్లి కోడి తిరగబడుతుంది. అలాంటిది మనం మనుషులం కదా. నా భర్త అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం, సూపర్ ఎమ్మెల్యేగా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు. ఆయనకు ఐదేళ్లు ఉద్యోగం లేకపోయినా నేను చూసుకున్నాను. ఇల్లీగల్ బిజినెస్ వైపు వెళ్లకు. నేను రాజకీయాల్లో ఉన్నాను. నాకు ఇబ్బందులు వస్తాయని చెప్పాను. అది వినలేదు. అందుకే భరించలేకపోయాను. భరిస్తే నా భవిష్యత్తు దెబ్బతింటుంది. దాంతో విడాకులకు అప్లయి చేశాను.
ఆర్కే: తెలుగుదేశంలో ఉన్నప్పుడు నా వ్యవహారశైలి నచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ వాళ్లకు ఎందుకు నచ్చలేదు? అంటున్నారు రోజా గారు?
అనిత : తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు అంటే చంద్రబాబునాయుడుగారు సహించరు.
ఆర్కే: టీడీపీలో ఉన్నప్పుడే కదా వైఎ్‌సఆర్‌ను పంచెలూడదీసి కొట్టాలని రోజా అన్నారు?
అనిత : అలా మాట్లాడటం తప్పు. అయితే టీడీపీలో ఒక మాట మాట్లాడాలంటే సీనియర్స్ సలహా తీసుకుంటుంటారు చాలామంది. రోజా మాత్రం అలాంటి నిబంధన పాటించేవారు కాదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం ఆమెకు అలవాటు. నేను జగన్‌గారిని ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను. ఇంతకు ముందు రోజా తెలుగుదేశంలో ఉన్నప్పుడు మీ తండ్రిని తిట్టారు. ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చి మా చంద్రబాబుగారిని తిడుతున్నారు. రేపు ఆమె మరో పార్టీకి మారి మీ తల్లిని, చెల్లిని ఇలాగే తిడితే పరిస్థితి ఏమిటి.
అప్పుడు కూడా మీరు ఇలాగే మౌనంగా ఉంటారా అని అడుగుతున్నాను. ఒక దళిత మహిళా ఎమ్మెల్యేనయిన నన్ను రోజా నానామాటలు అన్నప్పుడు జగన్ ఒక మనిషిగా ఆమెను మందలించిన దాఖలాలు లేవు. ఇలాంటి మిమ్మల్ని నమ్మి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు. ఒక్క రోజానే కాదు. జగన్ కూడా ప్రజలు నవ్వుకునేలా మాట్లాడుతున్నారు. కాల్‌మనీ కేసులో చంద్రబాబు, లోకే్‌షలకు సంబంధం ఉంది అని ఆయన అన్న ఆరోపణకు ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్ తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు.
Updated Date - 2020-05-21T23:29:10+05:30 IST