ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎన్టీఆర్‌ను ప్రభావితం చేసేంత రాజకీయం నా దగ్గర లేదు’

ABN, First Publish Date - 2020-05-13T21:25:05+05:30

మేడసాని మోహన్. అవధానిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఒకప్పుడు బ్రాహ్మణ కులం వారికే ఇలాంటి అభ్యాసనలు సాధ్యమన్న కొందరి వాదనలకు భిన్నంగా అభ్యాసం ఉంటే ఎవరయినా అవధానిగా రాణించవచ్చని నిరూపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ నన్ను చూడగానే.. కీర్తికి తగిన మూర్తి కాదన్నారు

ఎన్టీఆర్ నాతో గద్యం పాడించుకుని.. అల్లసానితో పోల్చారు

సీత మాట వినుంటే రామాయణం అక్కడితో ఆగిపోయేది

ఎండమావులు, అంతరంగాలు, రుతురాగాలతో సోనియాగాంధీని వర్ణించాను

పెప్సీ, మాజా, కోకాకోలా, థమ్సప్‌..పద్యం నలభైసెకన్లలో చెప్పేశాను

నా తల్లిదండ్రులు నామీద ఆశలు కూడా వదులుకున్నారు

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో అవధాని మేడసాని మెహన్


మేడసాని మోహన్. అవధానిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఒకప్పుడు బ్రాహ్మణ కులం వారికే ఇలాంటి అభ్యాసనలు సాధ్యమన్న కొందరి వాదనలకు భిన్నంగా అభ్యాసం ఉంటే ఎవరయినా అవధానిగా రాణించవచ్చని నిరూపించారు. 2017వ సంవత్సరం ఆగస్టు ఆరో తారీఖున ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌హార్ట్‌ విత ఆర్కే’ కార్యక్రమంలో ఈ విభిన్న నటదర్శకుడు తన జీవిత విశేషాలను ఇలా పంచుకున్నారు. 

 

ఆర్కే: నమస్కారం మేడసాని మోహన్‌ గారు.

మేడసాని మోహన్‌: నమస్కారం.


ఆర్కే: ఎలా ఉన్నారు?

బాగున్నాను.

 

ఆర్కే: మీ అవధాన ప్రక్రియ ఎలా సాగుతోంది?

మేడసాని: బాగానే ఉంది.

 

ఆర్కే: కార్యక్రమాన్ని ఒక పద్యం, గద్యంతో మొదలుపెడదామా?

మేడసాని: ‘‘శ్రీమంజూషిక భక్తరక్షణ కళా శ్రీచుంచు

ఆనందవల్లీ మంజు ప్రసవంబు

చిద్‌ గగన ప్రారే ఆంశువున్‌

మోక్షలక్ష్మీ మాణిక్యవినూత్న మేఖల

కటాక్షీభూత నీహారరుక్‌

శ్రీమంతంబై పుంచు వెలుగు

ఒకడే సేవింతు విశ్వేశ్వరా’’

 

ఆర్కే: విశ్వనాథసత్యనారాయణ గారు రామాయణకల్పవృక్షంలో చెప్పిన మొదటి పద్యం ఇది. పద్యానికి గద్యానికి తేడా ఏంటి?

మేడసాని: పద్యం చందోబద్దంగా ఉంటుంది. అంటే చందస్సు, గణాలు, ప్రాస, యతి ఈ నియమాలన్నీ ఉంటాయి. గద్యంలో ఈ నియమాలుండవు. ధారాశుద్దిగా ఉండాలి. పదగాంభీర్యం, మాధుర్యగుణం ఉండాలి. వినడానికి ఇంపుగా ఉండాలి. గద్యం చెప్పడంలో కూడా మాధుర్యం ఉండాలి.

 

ఆర్కే: అవధాన ప్రక్రియను ఎక్కువగా బ్రాహ్మణ సమాజం నుంచి వచ్చిన పండితులు మాత్రమే చేసేవారు. దానికి భిన్నంగా మీరు ఎలా వచ్చారు?

మేడసాని: మీరన్నది సమాజంలో ఉన్నది గానీ అది సర్వేసర్వత్ర యధార్థం అని చెప్పలేం. సాధన ముఖ్యం గానీ సామాజిక వర్గం ముఖ్యం కాదు. భగవంతుని కరుణాకటాక్షం ముఖ్యం. త్రిపరనేని రామస్వామి గారు అవధానం చేయకపోవచ్చు గానీ వారు కూడా గొప్ప కవి.

 

ఆర్కే: సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన మీకు ఈ సాధన ఎలా అబ్బింది?

మేడసాని: మాది చంద్రగిరి మండంలంలో నడింపల్లి అనే గ్రామం మాది. అతి సామాన్యమైన కుటుంబం మాది. మా కుటుంబంలో చదువుకున్న వ్యక్తినినేనే. వాళ్లు చదువుకోకపోయినా దైవభక్తి ఉండేది. నా చిన్నతనంలో అనారోగ్యం వల్ల ఒకటిన్నర రోజు కోమాలో ఉన్నాను. రెండు, మూడేళ్లు నా ఆనారోగ్యం వల్ల తల్లిదండ్రులు బాధపడ్డారు. ఒక దశలో నామీద ఆశలు కూడా వదులుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరో శివానంద మౌనగురువు దేవుడు గురించి చెప్పారు. ఆయన అవదూత. అక్కడ ఆశ్రమం ఉండేది. అక్కడ చేర్పిస్తే ఆయన నాకు ధ్యానం నేర్పించారు. అక్కడి నుంచి సంస్కృతం నేర్చుకోవడం, ఆధ్యాత్మిక భావన, జ్ఞాపకశక్తి పెరగడం జరిగింది. పదవతరగతి పూర్తికాగానే మొట్టమొదటి అవధానం చేశాను. పాఠశాల గురువులే నాకు చంధస్సు నేర్పించారు. ముందుగా పాఠశాలల్లో, కాలేజీల్లో చేశాను. తరువాత జిల్లాల్లో, రాష్ట్రస్థాయిలో, విదేశాల్లో చేశాను.

 

ఆర్కే: ప్రారంభంలో మిమ్మల్ని బాగా ఎంకరేజ్‌ చేసింది ఎవరు?

మేడసాని: చంద్రగిరి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు బాగా ఎంకరేజ్‌ చేశారు. తిరుపతి వెంకటేశ్వర ప్రాచ్యకళాశాలలో చదువుకుంటున్న మిత్రుడు పులిపాటి రజనీకాంతనాయుడు, ఆవుల వెంకటరత్నం, లింగంశెట్టి వేణుగోపాల్‌. ఈ ముగ్గురు ఒక పండితత్రయం, మిత్రత్రయం. నన్ను బాగా ప్రోత్సహించారు.


ఆవధానం కాకుండా ప్రవచనం చెబితే వింటామంటున్నారు


ఆర్కే: అవధానం చేసే వారిలో అసూయ కూడా ఉంటుందని అంటారు. మీకు అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయా?

మేడసాని: సమాజంలో అందరికీ ప్రబోధం చేసే వాడు అవధాని. ఈర్ష, అసూయలు వదిలేసి మంచిని పెంచుకొమ్మని చెప్పే వృత్తి, ప్రవృత్తి కవి, పండితునిది. అలాంటి సన్నివేశాలు ఎదుర్కొన్న సంఘటనలు నాక్కూడా ఉన్నాయి.


ఆర్కే: ఎన్టీఆర్‌గారు మిమ్మల్ని బాగా ఎంకరేజ్‌ చేశారంటారు. నిజమేనా? 

మేడసాని: ఆయన విద్యతపక్షపాతి. విజయవాడలో నేను శతావదానం చేసింది చూసి దేవినేని సీతారామయ్యగారు, గాలి ముద్దుకృష్ణమనాయుడు గారు, చల్లా కొండయ్య గారు నన్ను ఎన్టీఆర్‌గారి దగ్గరకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్‌గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన దగ్గరకు వెళితే నన్ను చూసి కీర్తికి తగిన మూర్తి కాదే అన్నారు. సుమారు నలభైఐదు నిమిషాలు మాట్లాడారు. నాతో గద్యం పాడించుకున్నారు. మీ కవితాస్ఫూర్తికి తాదాత్మ్యం చెందాను తమ్ముడు అన్నారు. మీ ప్రతిభకు తగిన గౌరవం ఇవ్వాలి అని తెలుగు విశ్వవిద్యాలయం మీకు మంచి వేదిక అవుతుందేమో అన్నారు. కానీ నాకేమో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయాలని ఉండేది. ఆ మాటే అంటే మీవంటి ప్రతిభామూర్తులు ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదు. సమాజానికి అంకితం కావాలి అన్నారు. అలాగే అన్నగారు అన్నాను. అప్పుడు చల్లా కొండయ్య గారుండి యూనివర్సిటీలో ఉద్యోగం ఇవ్వాలంటే కష్టం. అన్నమయ్య ప్రాజెక్టు డైరెక్టర్‌ పోస్టు ఖాళీ ఉంది. ఆ పోస్టుకు కావాల్సిన అర్హతలన్నీ ఈయనకు ఉన్నాయి అంటే అన్నగారు సరే అన్నారు. అలా రీసెర్చ్‌ అసిస్టెంట్‌ నుంచి నేరుగా డైరెక్టర్‌ పోస్టులోకి వెళ్లిపోయాను.

 

ఆర్కే: మీకు ఎన్ని పద్యాలు కంఠస్తా వచ్చు?

మేడసాని: పద్యాలు, గద్యాలు, శ్లోకాలు, దండకాలు, రగడ అన్నీ కలిపి లక్ష దాటి ఉంటాయి.

 

ఆర్కే: అంత ధారణ శక్తి ఎలా వచ్చింది?

మేడసాని: ధ్యానం వల్లనే వచ్చింది. ఇప్పటికీ ధ్యానం చేసిన తరువాతే బయటకు వస్తాను.

 

ఆర్కే: అవధానం చేసే వారిని తికమక పెట్టడానికి ప్రశ్నలు వేస్తుంటారు. మీరు అవధానం చేసే సమయంలో ప్రశ్నలతో ఇబ్బంది పడ్డ సందర్భాలున్నాయా?

మేడసాని: లేదు. అలా అనిపించినపుడు అవధానం ఆపేస్తారు. ఇప్పటికీ నాకు ధారణ శక్తి ఉంది. ధారణ కష్టంగా ఉంది అన్నప్పుడు అవధానం విరమించేయడమే. ఇప్పటివరకు అప్రతిహతంగానే జరిగింది.

 

ఆర్కే: అవధానం చేస్తే సంభావన బాగానే ఇస్తారా?

మేడసాని: కొన్ని సంస్థలు బాగానే ప్రోత్సహిస్తాయి. కొన్నిసంస్థలు ఫండ్స్‌ తక్కువగా ఉంటే తక్కువ ఇస్తాయి. గరిష్టంగా అమెరికాలో తెలుగువాళ్లు స్పందించి పదిలక్షలు ఇచ్చిన సందర్భాలున్నాయి.

 

ఆర్కే: రాను రాను అవధాన ప్రక్రియకు ఆదరణ తగ్గిపోతోంది కదా?

మేడసాని: వాస్తవమే. ప్రవచనాలు వింటున్నారు. ఆవధానం కాకుండా ప్రవచనం చెబితే వింటామని అంటున్నారు. అవధానాలకన్నా ప్రవచనాల పట్ల ఆసక్తి పెరిగింది.

 

ఆర్కే: మీరూ కొన్ని ప్రవచనాలు చెప్పారు కదా. వచ్చేవాళ్లంతా భక్తితోనే వస్తున్నారని నమ్ముతున్నారా?

మేడసాని: ప్రవచనం చెప్పేవాళ్లు భక్తి కోసమే చెప్పాలి. అది సంప్రదాయం. మరొక ప్రయోజనం ఆశించి చెప్పకూడదు. భాగవతంలో ప్రధానంగా చెప్పింది భక్తి తత్వమే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన దేవాధిదేవుడు, ఆయన లీలా విభూతి ఇలా ఉంటుంది. అని ఏదో ఒక ఉపాఖ్యానం ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాం. అక్కడ మనం తాదాత్మ్యంతో చెప్పాలి. వినేవారికి కూడా ఆ తన్మయత్వం కలిగేలా చెప్పాలి. అది అవసరం. ఇప్పటి రోజులకు అనుగుణంగా కూడా చెప్పాలి. ఏదో ప్రాచీన కాలంలో అలా జరిగింది. అదే ఇప్పుడూ చేద్దాం అంటే కుదరదు. రామాయణాన్ని అధునాతన కాలానికి ఎలా చెప్పాలి అనేది ముఖ్యం. దానికి అనుగుణంగానే మహా కవులు రాశారు. వాల్మీకి మహర్షి, వ్యాసాదులు కూడా అవి ఏ కాలానికైనా అన్వయించుకునే విధంగా చెప్పారు.


తెలుగులోనే ఈ పరిస్థితి ..కన్నడ, తమిళంలో ఇలాంటి పరిస్థితి లేదు


ఆర్కే: అవసరమైతే కాంటెంపరరీ రాజకీయాలు కూడా జోడించచ్చు.

మేడసాని: జోడించాలి. నిజానికి ఇప్పటి రాజకీయాలు అప్పుట్లో కూడా ఉన్నాయి. ఒకసారి బదరీ క్షేత్రానికి వెళ్లాను. అక్కడ కృష్ణ భగవానుడి గురించి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. అక్కడ వ్యాస మహర్షి గుహలో కొందరు పండితులతో మాట్లాడే అవకాశం కలిగింది. వారు చెప్పిన అంశాలతో ‘కృష్ణ నవనీతం’ అనే పుస్తకం రాశాను.


అందులో శకునికి యుద్ధ విద్యలు పెద్దగా రావు. యుద్ధానికి ముందురోజు రహస్యంగా వెళ్లి కృష్ణుడి పాదాలపై పడతాడు. కౌరవులను అందరినీ చంపిన తరవాతే తనను చంపాలని కోరతాడు. 99 మందిని చంపిన తరవాతే నిన్ను చంపుతామని కృష్ణుడు వరం ఇస్తాడు. తన కుమారుడిని కూడా అప్పుడే చంపాలని కోరతాడు. వీడు మాత్రం పుత్రశోకం తట్టుకోలేడు. వీడి తోబుట్టువుకే పుత్రశోకం కలగాలి. అదీ స్వార్థం అంటే. ఇప్పుడు కూడా ఆ స్వార్థం ఉంది. ఇవ్వన్నీ ఈనాటికి కూడా పనికొచ్చేవే. మహాభారతం మానవ మనస్తత్వానికి దగ్గరగా ఉన్న ఇతిహాసం. రామాయణంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. మనకు కొన్ని వందల రామాయణాలు ఉన్నాయి. యోగ రామాయణంలో ప్రతి సన్నివేశానికి ఒక యోగం ఉంటుంది. ఇదీ మానవ జీవితానికి అవసరమే. ప్రవచనాల్లో అవన్నీ సరిగ్గా అన్వయించగలగాలి.


ఆర్కే: వర్తమానానికి వస్తే, తెలుగు భాషకే దిక్కు మొక్కులేని పరిస్థితి వచ్చింది. ఇక ఈ శ్లోకాలు, పద్యాలు, గద్యాలు ఎవరూ ఆలకించే పరిస్థితి లేదు. తెలుగు మీద మీకు అభిమానం కదా. ఈ పరిస్థితి బాధగా అనిపించడంలేదా?

మేడసాని: బాధ ఉంది. ఆవేదన ఉంది. సమకాలీన పరిస్థితులను చక్కబెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మీడియా చొరవ తీసుకుంటే భాషా పోషణ జరుగుతుంది. ప్రభుత్వం ద్వారా ఎంతో జరగచ్చు. ఇంటర్‌మీడియెట్‌ వరకు తెలుగు తప్పనిసరి చేయాలని మంచి నిర్ణయం తీసుకుంది. అది కొంతలో కొంత ఉపశమనం. నేను ఆశావాదిని కాబట్టి మంచి రోజులు వస్తాయని అనిపిస్తుంది. కానీ ఇక్కడికంటే భాషపై ఆసక్తి విదేశాల్లో బాగుంది. సింగపూర్‌, మలేసియా, అమెరికాలో బాగా ఆదరిస్తున్నారు. వింటున్నారు. అవధానాలు చేయిస్తున్నారు. మన దగ్గర తెలుగులోనే ఈ పరిస్థితి ఉంది. కన్నడంలో, తమిళంలో ఇలాంటి పరిస్థితి లేదు. కర్ణాటక ఇతిహాస అకాడమీ ద్వారా కన్నడ భాషకు చాలా సేవ చేస్తున్నారు. భాషపట్ల మనకు పెద్దగా అనురాగం లేకపోవడానికి కారణం ప్రాచీన సాహిత్యం పట్ల ఆదరణ చూపించడం లేదు.


ఆర్కే: ఇప్పటి తరానికి మీరు చెప్పే పద్యాలు, ఉపయోగించే పదాల అర్థం కూడా తెలియదు. ప్రయోగం తెలియదు. ఆ పదాలు ఎప్పుడూ విని కూడా ఉండరు.

మేడసాని: నేను స్వచ్ఛందంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లి పిల్లలకు భాష గురించి చెప్పి వస్తుంటాను. ఏ చదువు చదివినా మాతృభాష పట్ల కొంత అభిమానం కలిగి ఉండండి అని చెబుతుంటాను. ఇది నేను ఒక్కడిని చెబితే సరిపోదు. సమాజాన్ని సంస్కరించి భాషవైపు ఆకర్షించాల్సిన అవసరం ఉంది. భాషా సంస్కృతిని నిలుపుకోకపోతే మన మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది.


ఆర్కే: భాషా పాండిత్యం ఉన్నవాళ్లు వారి పాండిత్య ప్రదర్శనకే ప్రాధాన్యం ఇస్తున్నారు కానీ మనకున్న ప్రాచీన సాహితీ సంపదను సామాన్యమైన తెలుగులోకి...

మేడసాని: ఇప్పుడు చేయవలసిన పని అదే. యదార్థంగా కూడా. నేను ప్రవచనాలు, అవధానాలు చేసేటప్పుడు పాండిత్య ప్రకర్ష కోసం ఒక పద్యమో, శ్లోకమో చెప్పినా... మళ్లీ దాని అర్థం, తాత్పర్యం చెప్పాలి. లేకపోతే నిలవదు. మానవుని ఆలోచనా ప్రస్థానంలో ఎంత సమున్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉందో నిరూపించింది సంస్కృత భాష. వ్యాసమహర్షి రాసిన భాగవతంలోని కథాభాగంలో సంస్కృతంలో రాసిన మొదటి శ్లోకాన్ని పోతన సీస పద్యంలోకి అనువదించారు.


‘‘విశ్వజన్మస్థితివిలయంబు లెవ్వని

వలన నేర్పడు ననువర్తమున

వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుడై

తాన రాజగుచుఁ జిత్తమునఁజేసి

వేదంబు లజునకు విదితముల్‌ గావించె

నెవ్వఁడు బుధులు మోహింతురెవ్వ

నికి నెండమావుల నీటఁగాచాదుల

నన్యోన్యబుద్ధి దా నడరునట్లు

త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము

భంగిఁదోఁచు స్వప్రభానిరస్త

కుహకుఁడెవ్వఁడతని గోరి చింతించెద,

ననఘు సత్యుఁబరుని ననుదినంబు.

ఇదీ అనువాదం.


ఆర్కే: ఒక స్టేజీ నుంచి ఈ స్టేజీకి తీసుకొచ్చారు కదా పోతన. ఇంతకంటే కిందకు తీసుకు రావాలి కదా?

మేడసాని: అన్నమయ్య ఇదే భావంతో ఒక సంకీర్తన చెప్పాడు. ఇంచుమించు ఆ భావాన్నే అక్కడక్కడా కొద్ది మార్పులతో చెప్పాడు. అయితే దానికి కూడా ఇప్పుడు అర్థం, తాత్పర్యం చెప్పాల్సి వస్తోంది.


ఆర్కే: కాలానుగుణంగా సంస్కృతం నుంచి అప్పటి భాషలో పద్యాలు రాశారు. ఇప్పుడు తెలుగులో సామాన్యుడికి అర్థమయ్యేలా మీబోటివారెందుకు చేయకూడదు?

మేడసాని: ఆ ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే అన్నమయ్య సంకీర్తన సంపుటిలన్నింటిలోనూ సంకీర్తన సారాంశం, క్లిష్ట పదాలకు అర్థం కూడా ఇస్తున్నాం. ఇప్పటికే అన్నమాచార్య నిఘంటువును కూడా తీసుకొచ్చాం. పండితులూ ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.


ఆర్కే: అన్నమాచార్య ప్రాజెక్టుకు మీరు సుదీర్ఘకాలం డైరెక్టర్‌గా ఉండి కూడా పెద్ద సాధించిందేమీ లేదనే విమర్శ ఎందుకొచ్చింది?

మేడసాని: అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌గా గణనీయమైన కృషి చేశానని అనుకుంటున్నాను. చాలా ప్రశంసలు కూడా ఉన్నాయి. ఆహోబల మఠం జీయర్‌ లాంటివాళ్లు ‘అన్నమయ్య సేవకరత్న’ బిరుదు ఇచ్చారు. మీరు అనుకున్న అభిప్రాయం కూడా ఒక కోణంలో ఉంది. అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌కు ఉన్న స్థాయి, పరిమితి ఎంత? నేను ఏం చేయాలనుకున్నా నాపై ఒక యంత్రాంగం ఉంది. అనుమతులు కావాలి. నా పరిధిలో... రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అన్నమయ్య సదస్సులు చేశా. ప్రప్రథమంగా అమెరికాలో అన్నమాచార్య ప్రాజెక్టును చికాగో దేవాలయానికి అనుబంధంగా ప్రారంభించాం. అన్నమయ్య లఘుకృతులు ప్రింట్‌ చేయించా. ఈవోలు అందరూ బాగా ప్రోత్సహించారు. ఒక పరిపాలకుడిగా, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకుడిగా నేను చేయాల్సిన కృషి బాగానే చేసానని అనుకుంటున్నాను.


ఎన్టీఆర్‌ను ప్రభావితం చేసేంత రాజకీయం నా దగ్గర లేదు


ఆర్కే: అన్నమాచార్య 32 వేల కీర్తనలు రచించాడని చెబుతారు కదా. మీరు ఎంతవరకూ సేకరించగలిగారు?

మేడసాని: నాకంటే ముందే సేకరణ అయిపోయింది. మేం తీసుకుంది ప్రచారం బాధ్యతలు. పునర్ముద్రణ బాధ్యతలే. ప్రభాకరశాస్త్రి, రాళ్లపల్లి వారి సమయంలో సేకరణ చాలావరకు అయిపోయింది. అహోబలంలో ఉన్న కొన్ని రేకులు, శ్రీరంగంలో ఉన్న కొన్ని రేకులు తితిదే వారికి ఇచ్చేశారు. అన్నీ చూసుకుంటే అన్నమయ్య కీర్తనలు 12 వేలు, ఆయన కుమారులు, మనుమలు చెప్పినవి 2000 తేలింది. ఈ 14 వేలు కీర్తనల పునర్ముద్రణ చేయించడం, ప్రచారం చేశాం. సేకరణ ఇక జరగాల్సిందేమీ లేదు.


ఆర్కే: రాజకీయ ప్రాబల్యం వల్ల పైకొచ్చారని ఒక విమర్శ ఉంది?

మేడసాని: నిజానికి చెప్పాలంటే, రామారావుగారికి నామీద ఉన్న వాత్సల్యం అంతా ప్రతిభ గురించి వచ్చిందే. రాజకీయం గురించి వచ్చింది కాదు. ఆయన్ను ప్రభావితం చేసేంత రాజకీయం నా దగ్గర లేదు. అలాగే ఏ ముఖ్యమంత్రినీ ప్రభావితం చేసేంత రాజకీయవేత్తను కూడా కాదు. ఒక సాహితీవేత్తనే. కాబట్టి రాజకీయ ప్రాబల్యం నాకేమీ లేదు. నా ఉద్యోగ బాధ్యతల్లో ఈవోలు అందరూ బాగా ప్రోత్సహించారు. నేను చేయగలిగినంతా చేశాను. 2013 రిటైర్‌ అయిన తరవాత కూడా అక్కడే కొనసాగి సేవ చేయాలని ఉన్నా, శ్రీనివాస వాఙ్మయ సంస్థ బాధ్యతలు ఇచ్చారు. ఏ పని ఇచ్చినా ఆత్మ సంతృప్తిగా చేస్తున్నాను. రామాయణ కల్పవృక్షం 14 వేల పద్యాలు ఛందో, వ్యాకరణ దోషాలు లేకండా ఎడిట్‌ చేయడంలో నావంతు పాత్ర నేను చేశాను. అది పెద్ద బాధ్యత. ఏ పని చేసినా భగవంతుడి సేవగా భావించి చేస్తున్నాను. తిరుపతిలో సహస్రావధానం చేస్తున్నప్పుడు మైసూర్‌ పరకాల మఠం స్వామి తొమ్మిదో రోజు వచ్చారు. మొదటి రోజు చెప్పిన పద్యాలు ధారణ చేస్తుండగా చూసి ఎంతో ఆనందించారు. నన్ను మైసూర్‌ తీసుకెళ్లి ‘మహాసహస్రావధాన స్థాపనాచార్య’ బిరుదు ఇచ్చి సత్కరించారు. ఇందులో రాజకీయ ప్రాబల్యం ఏముంటుంది.


ఆర్కే: అవధాన ప్రక్రియ ఎంతకాలం కొనసాగిద్దామని ఉంది మీకు?

మేడసాని: ఇప్పటికి నాకు 60 ఏళ్లు పూర్తయింది. కానీ ఇప్పటికీ చురుగ్గా, వేగంగా చెప్పగలుగుతున్నాను. చెప్పినవి ధారణ చేయగలుగుతున్నాను. కాబట్టి చేయగలిగినంతకాలం చేస్తుంటాను. దీనికేమీ కాలపరిమితి లేదు. సరస్వతీ దేవి సేవ ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఒక దశాబ్దం పాటు బాగా కృషి చేయగలను అనుకుంటున్నాను. తరవాత అవధానం చేయకపోయినా, రచనా వ్యాసంగం చేయగలను.


ఆర్కే: మీ ప్రస్థానంలో మీకు బాగా ఆనందం కలిగించిన సంఘటనలు ఏమున్నాయి?

మేడసాని: గోవింద కల్యాణాలు పేరిట 2012లో ఏజెన్సీ గ్రామాల్లో స్వామి కల్యాణం చేయించడం, అన్నమయ్య కీర్తనలు పాడించడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. వేలాది మంది స్వామి సేవ చేసుకున్నారు.


ఆర్కే: సినీరంగంలోకి వెళ్లే ఆలోచన రాలేదా మీరు? ఆఫర్స్‌ కూడా రాలేదా?

మేడసాని: ఆ ఆలోచన లేదు. అన్నమాయ్య సినిమా తీసినప్పుడు రాఘవేంద్రరావు గారితో రెండు మూడుసార్లు చర్చించాను.


ఆర్కే: మీ పిల్లలకు కూడా మీ పాండిత్యం వచ్చిందా?

మేడసాని: వాళ్ల రంగాల్లో వచ్చినట్టుంది. ఈ రంగం కాదు. నేను బలవంతం చేయలేదు వాళ్లని. నాకు ఒక ఆశ మనసులో ఉండేది. నా తరవాత నా వారసులు ఎవరైనా అవధానం చేస్తుంటే చూడాలని. కానీ ఈ రంగంలోకి వాళ్లు రాలేదు.


ఆర్కే: రిటైరయిన తరవాత శేషజీవితానికి లక్ష్యం ఏం పెట్టుకున్నారు?

మేడసాని: నిజానికి నేను ఇప్పుడు ఇంకా తితిదే సేవలో ఉన్నా. శ్రీనివాస భక్తి వాఙ్మయ అధ్యయన సంస్థ ప్రత్యేక అధికారిగా గ్రంథాలు వెలువరించడం ఈ పనంతా చేస్తున్నాను. వ్యక్తిగతంగా కొన్ని కావ్యాలు రాసే ప్రయత్నంలో ఉన్నాను. ఆ వ్యాసంగం జరుగుతోంది.


======================================

యవనవ్యాధ పుళింద హూణ శక కంకాభీర చండాల సం

భవులుం దక్కిన పాపవర్తనులు నే భద్రాత్ము సేవించి భా

గవతశ్రేష్ఠులఁడాసి శుద్ధతనులై కళ్యాణులై యందు రా

యవికారుం బ్రభవిష్ణు నాదు మదిలో నశ్రాంతమున్‌ మ్రొక్కెదన్‌

======================================

హ్రీ కల్పాంచిత కాంతి సంకలిత దీపేప్సీడ్యమై

వేదవిత ప్రాకామ్యాంచిత సామజారం మంత్రస్ఫేతమై

కష్టిచేకోకాకోల శుభాంకు చూచెదరు భక్తులు తిరుమలను

భక్తహృద్‌సాకల్పోత్సవ వేళ దైవతవతంస ప్రాభవంబొప్పగన్‌

======================================

ఒక పెద్దాయన ప్రవచనం చెబుతుంటే విన్నాను. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి దశరథ మహారాజు చెబితేనే రాముడు సీతను పెళ్లి చేసుకున్నాడని చెప్పారు. ఇప్పుడు అలా కుదరదు. వినేవారికి ఆసక్తికరంగా ఉండొచ్చు. ఇప్పుడు వధూవరులు కాసేపు మాట్లాడుకోవాలి. వాళ్ల భావాలు పంచుకోవాలి. భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. దీనికి అనుగుణంగా మనం చెప్పాలి.


సీతాదేవికి రాముడి కంటే సమయస్ఫూర్తి ఎక్కువ. జటాయువు వచ్చి రావణుని ఎదుర్కొని రక్షిస్తానన్నప్పుడు వెంటనే చెబుతారు అమ్మవారు... ‘స్వామీ, నీ బలం చాలదు వీడిని ఎదిరించడానికి. నువ్వు చేయవలసిన మహోపకారం ఏమంటే... వెంటనే వెళ్లి రాముడిని తీసుకొని రా. వీడిని చంపేస్తాడు.’ అని చెప్పినా వినకుండా ఎదిరిస్తాడు. ఆమె చెప్పినట్లు చేసి ఉంటే అక్కడకు అయిపోయేది రామాయణం.


రామాయణంలో మనం తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సీతాదేవి కూడా లక్ష్మణుడి మాట విని ఉంటే ఆపద వచ్చేది కాదు. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో తెలుసుకోవాల్సిన నిత్య సత్యాలు కూడా చాలా అందులో ఉన్నాయి. దానికి అనుగుణంగా ఇప్పుడు మనం చెప్పగలగాలి.


అన్నమాచార్య ప్రాజెక్టు అధికారిగా నేను బాధ్యతలు తీసుకున్నప్పుడు వార్షిక బడ్జెట్‌ రూ.8 లక్షలు. నేను రిటైర్‌ అయ్యేరోజు బడ్జెట్‌ రూ.10 కోట్లు.

 

నా అష్టావధానం చూసిన పి.వి.ఆర్‌.కెప్రసాద్‌ గారు అన్నమాచార్య ప్రాజెక్టులో రీసెర్చ్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇప్పించారు. తరువాత అదే ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌ను అయ్యాను.

 

ఎన్టీఆర్‌గాను నా గద్యం విని ఆనాటి అల్లసాని వారే ఈనాటి మేడసాని వారా అన్నట్టుంది అన్నారు. ఆ మాట గుర్తొస్తే పులకరించినట్టవుతుంది.

 

తిక్కన, విశ్వనాథ సత్యనారాయణల కన్నా ఎక్కువ చందస్సులు చెప్పాలనే తాపత్రయం ఉంది. అందుకు కృషి చేస్తున్నాను.


ఒకసారి అవధానంలో ఒక పండితుడు పెప్సీ, మాజా, కోకాకోలా, థమ్సప్‌.. ఈ నాలుగు పదాలతో తిరుమల బ్రహ్మోత్సవాలు వర్ణించండి అని అడిగాడు.నేను చెప్పిన పద్యం విని ఆ మహాపండితుడు చాలా సంతోషించాడు. ఆ పద్యం చెప్పడానికి నలభైసెకన్లు మాత్రమే పట్టింది.

 

మరోసారి సమంత, తమన్నా, ఇలియానా, ప్రియాంక.. ఈ నాలుగు పదాలతో సరస్వతీ దేవి స్తోత్రం చెప్పమన్నారు. ఈ నాలుగు పదాలతోనూ సులువుగా స్తోత్రం చెప్పేశాను.

 

కొంతమంది పాండిత్యం తెలియకుండా అడిగే ప్రశ్నలు ఇబ్బందిలోకి నెడుతుంటాయి. ఒకసారి ఒక రాజకీయనేత నాకు కూడా నాలుగు పదాలు ఇవ్వాలనుంది అన్నారు. సరే ఇవ్వండి అన్నాను. ఏం పదాలు గుర్తురావడం లేదండి అని ఎండమావులు, అంతరంగాలు, రుతురాగాలు, సుఖదుఃఖాలు... ఈ సీరియల్స్‌ గుర్తొస్తున్నాయి. ఈ పదాలతో మా నాయకురాలు సోనియాగాంధీని వర్ణిస్తూ పద్యం చెప్పండి అన్నారు. ఆయన తెలియకుండా అడిగిన ప్రశ్నఇది. ఒక్క నిమిషం కళ్లు మూసుకుని సరస్వతీ దేవిని తలుచుకున్నాను. అమ్మా విషమపరీక్షను ఎట్లా గట్టెక్కిస్తావు అని. అద్దంలో చూసినట్టుగా కనిపించింది సమాధానం.


‘‘ పదవిని ఎండమావులుగా భావనము చేసి

భారత అంతరంగాలలో ఫరిడవిల్లె

కాని ఎన్నికల రుతురాగాలలోన

సోనియా సుఖదుఃఖాలు చూచుచుండె’’ అని చెప్పాను.

Updated Date - 2020-05-13T21:25:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising