అమ్మాయిలు సక్సెస్ సాధిస్తే మగాళ్లు సహించలేరు.. ఏదోటి అంటారు
ABN, First Publish Date - 2020-05-13T21:41:44+05:30
భారత మహిళా క్రికెట్ టీం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు మిథాలీరాజ్. ఆమె సారథ్యం వహించిన టీం వరల్డ్‌కప్‌లో జరిపిన ప్రదర్శనకు అందరూ ఫిదా అయ్యారు. భారత మహిళా క్రికెట్ టీం తరపున రెండు దశాబ్దాలుగా ఆడుతూ, అత్యధిక వన్డేలకు సారథ్యం వహించిన కెప్టెన్‌గా రికార్డులోకెక్కారు.
పాలిటిక్స్ అన్నిచోట్లా ఉంటాయి.. చెప్పినట్లు వినకపోతే ఎదగనివ్వరు
‘ఆటలు ఎందుకు.. దెబ్బలు తగిలితే పెళ్లెవరు చేసుకుంటార’న్నారు
క్రికెట్ వల్ల పెళ్లి సంబంధాలు తప్పిపోయాయి..సాధించాల్సింది చాలా ఉంది
నా డ్రెస్ గురించి ఆలోచించకుండా కామెంట్స్ చేస్తున్నారు
ఫైనల్ ఓడిపోయాక మా టీంలో కొందరు ఏడ్చేశారు కూడా
గెలవగానే పురుషుల టీం అయితే ఛీర్స్.. కానీ మేము మాత్రం..
సినిమా ఫీల్డ్ నుంచి రాలేదు.. బయట నుంచి కొందరు ప్రపోజ్ చేశారు..
నాకు లేడీ సచిన్‌గా గుర్తింపు వద్దు.. మిథాలీరాజ్‌గానే కావాలి
ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్
భారత మహిళా క్రికెట్ టీం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు మిథాలీరాజ్. ఆమె సారథ్యం వహించిన టీం వరల్డ్‌కప్‌లో జరిపిన ప్రదర్శనకు అందరూ ఫిదా అయ్యారు. భారత మహిళా క్రికెట్ టీం తరపున రెండు దశాబ్దాలుగా ఆడుతూ, అత్యధిక వన్డేలకు సారథ్యం వహించిన కెప్టెన్‌గా రికార్డులోకెక్కారు. తాజాగా బీబీసీ-100 మంది ప్రభావశీలురైన మహిళల జాబితాలో స్థానం సంపాదించుకున్న మిథాలీరాజ్‌తో 01-10-2017న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమం కోసం సంభాషించారు.
ఆర్కే: వరల్డ్‌కప్ గెలవకపోయినా క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నారు. శాటిస్‌ఫాక్షన్ అనిపించిందా?
మిథాలీరాజ్: ఇంకా సంతృప్తి లేదు. వరల్డ్‌కప్ ఫైనల్ వరకు వెళ్లాం. వన్డే క్రికెట్‌లో ఆరువేల పరుగులు సాధించాను. అయినా ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇంకా పరుగుల దాహం తీరలేదు.
ఆర్కే: వరల్డ్ కప్ ఫైనల్‌లో ఎదురయిన అనుభవాలేంటి?
మిథాలీరాజ్: చాలా ఉన్నాయి. ముందుగా ఇండియా సెమీఫైనల్ వరకు వెళుతుందని కూడా ఎవ్వరూ ఊహించలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 280 పరుగులు చేయడం చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. సాధారణంగా మేం పాస్‌లు అడుగుతుంటాం. కానీ ఈసారి మేం ఫైనల్ మ్యాచ్ ఆడే సమయంలో చాలా మంది మాజీ క్రికెటర్లు పాస్‌లు అడిగారు. అది చాలా సంతోషాన్ని ఇచ్చింది.
ఆర్కే: ఫైనల్‌లో ఒత్తిడి ఫీలయ్యారా?
మిథాలీరాజ్: ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. గతంలో వరల్డ్‌కప్ ఆడినా కూడా ఫైనల్ మ్యాచ్ అంటే లిటిల్ బిట్ నెర్వ్‌సనెస్ ఉంటుంది. టీంలో చాలా మందికి ఇది ఫస్ట్ వరల్డ్‌కప్. గతంతో పోల్చితే ఉమెన్స్ వరల్డ్‌కప్‌కు ఆదరణ పెరిగింది. ఫైనల్ మ్యాచ్‌కు స్టేడియం కిక్కిరిసిపోయింది. సోషల్‌మీడియాలోనూ ఎక్కువ వైరల్ అయింది.
ఆర్కే: మీరు రనౌట్ అయి ఉండకపోతే మ్యాచ్ గెలిచేవారా?
మిథాలీరాజ్: అఫ్‌కోర్స్. అనుభవం ఎప్పుడూ కౌంట్ అవుతుంది. తప్పకుండా గెలిచేవాళ్లం. మంచి అవకాశం కోల్పోయామని బాధపడ్డాను. అయితే అందరం చాలా కష్టపడ్డాం. ఆ విషయంలో మాత్రం సంతోషంగా ఉన్నాను.
ఆర్కే: కొన్ని విషయాల్లో మీరు షార్ప్‌గా రియాక్ట్ అవుతుంటారు. మేల్ క్రికెటర్స్‌లో మీ ఫేవరేట్ అని అడిగితే అదే ప్రశ్న వాళ్లను ఎందుకు అడగరు? అని రియాక్ట్ అయ్యారు. అంటే ఉమెన్స్ క్రికెటర్స్‌కు తగిన ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదనే బాధ ఉందా?
మిథాలీరాజ్: అది అంత ఫోకస్ చేస్తారని నేనూ అనుకోలేదు. అది వరల్డ్‌కప్ ప్రెస్ కాన్ఫరెన్స్ స్టేజ్. అక్కడ ఒక మీడియా పర్సన్ ఆ ప్రశ్న అడిగారు. నాకనిపించింది అక్కడ మాట్లాడుతోంది ఉమెన్స్ క్రికెట్‌కు సంబంధించి! ఆ విషయాలు వదిలేసి మెన్ క్రికెటర్స్ గురించి అడగడం ఎందుకు? అదే మెన్ వరల్డ్‌కప్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉమెన్స్ క్రికెట్ గురించి ప్రశ్నలు వేస్తారా? అది చేయరు.
ఆర్కే: మీ సమాధానం తరువాత రెస్పాన్స్ ఎలా ఉంది?
మిథాలీరాజ్: చాలా మంది రియాక్ట్ అయ్యారు. ఎక్కువ మంది పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు.
ఆర్కే: నెగెటివ్ రియాక్షన్ ఎలా ఉంది?
మిథాలీరాజ్: ‘ఆ ప్రశ్నలో తప్పేముంది’ అన్నారు. కానీ చాలా మందికి తెలియదు ప్లాట్‌ఫామ్ అది కాదని. నార్మల్ ఇంటర్వ్యూస్‌లో అయితే అలాంటి ప్రశ్న అడగొచ్చు. కానీ, ఆ టైంకి ఆ ప్రశ్న సంబంధం లేనిది! కరెక్ట్ కాదు.
ఆర్కే: ఇటీవల డ్రెస్‌పై వచ్చిన కామెంట్లకు కూడా అలాగే రియాక్టయినట్టున్నారు?
మిథాలీరాజ్: సోషల్ మీడియాలో ఎవ్వరైనా అభిప్రాయాలు చెప్పొచ్చు. అయితే ఎదుటి వారు బాధపెట్టేలా ఉండకూడదు. రెండు లైన్లు కామెంట్స్ పెడదాం అని పెట్టేస్తుంటారు. కానీ వాటివల్ల ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరిపైనా ఎఫెక్ట్ ఉంటుంది. అది ఆలోచించాలి.
ఆర్కే: బ్యాట్ పట్టుకుని రెండు దశాబ్దాలు అవుతోంది కదా?
మిథాలీరాజ్: ఇంటర్నేషనల్ క్రికెట్ 18 ఏళ్లుగా ఆడుతున్నాను.
ఆర్కే: ఏ వయస్సులో ఆడటం మొదలుపెట్టారు?
మిథాలీరాజ్: పదేళ్ల వయస్సులో.
సరియైన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటా
ఆర్కే: క్లాసికల్ డ్యాన్సర్ అవుదామనకుని క్రికెటర్ ఎలా అయ్యారు?
మిథాలీరాజ్: చిన్నప్పుడు నేను చాలా లేజీ. ఉదయం చాలా లేటుగా నిద్రలేచే దాన్ని. ఆ లేజీనెస్ పోవడానికే ఫోర్స్‌గా క్రికెట్‌లో జాయిన్ చేశారు. క్రికెట్ అంటే పొద్దున్నే లేచి గ్రౌండ్‌కు వెళ్లాలి కదా!
ఆర్కే: అంటే... మీ ఫాదర్ ఇష్టంతోనే క్రికెట్‌లో చేరారా?
మిథాలీరాజ్: అవును. మా ఫాదర్ ఛాయిస్. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. క్రికెట్ కన్నా ముందు డ్యాన్స్ నేర్చుకున్నాను.
ఆర్కే: మీరు తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ సెటిలయ్యారా?
మిథాలీరాజ్: లేదు. హైదరాబాదే! మా తాతయ్య వాళ్లు పాండిచ్చేరీ. మా నాన్న వాళ్లు ఇక్కడికి వచ్చి సెటిలయ్యారు.
ఆర్కే: ప్రభుత్వం ఈ మధ్య క్రీడాకారులకు నగదు ప్రోత్సాహం ప్రకటిస్తోంది. దీనివల్ల క్రీడాకారులు ఇక చాల్లే సెటిలయ్యాం అనుకునే అవకాశం ఉంటుందా?
మిథాలీరాజ్: ప్రభుత్వం గుర్తించింది అంటే ఆట వల్లనే! ఆ ఆటను మరిచిపోకూడదు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు కృషి చేయాలి.
ఆర్కే: వరల్డ్‌కప్ సమయంలో ఏదో ఒక బుక్ చదువుతున్నట్టున్నారు. ఆ పుస్తకం పేరేంటి?
మిథాలీరాజ్: అవును. ‘రూమీ... ద లైఫ్ ఎసెన్షియల్స్’ అని లైఫ్ ఫిలాసఫీకి సంబంధించిన పుస్తకం అది. నాకు ముందు నుంచి చదివే అలవాటు ఉంది. అది నాకు మ్యాచ్ సమయంలోనూ హెల్ఫ్ అవుతూ ఉంటుంది.
ఆర్కే: ఫైనల్ ఓడిపోయాక మీ టీం మేట్స్‌లో ఎవరు బాగా డిజపాయింట్ అయ్యారు?
మిథాలీరాజ్: యంగ్ గాళ్స్ ఎక్కువ డిజపాయింట్స్ అయ్యారు. ఏడ్చేశారు కూడా! బాగా ఫీలయ్యారు.
ఆర్కే: మ్యాచ్‌లో గెలవగానే పురుషుల టీం అయితే ఛీర్స్ అని చెప్పి ఎంజాయ్ చేస్తారు. మరి మీరు?
మిథాలీరాజ్: మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తాం.
ఆర్కే: శాంపెన్ ఓపెన్ చేయరా?
మిథాలీరాజ్: ఉమెన్‌కి శాంపెన్ ఇవ్వరుకదా! మెడల్స్ ఇస్తారు అంతే.
ఆర్కే: డ్రెస్సింగ్ రూం పాలిటిక్స్ ఉంటాయా?
మిథాలీరాజ్: ఎమోషన్స్ ఉంటాయి. ఈచ్ అదర్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. పర్సనల్‌గా ఎవ్వరూ తీసుకోరు.
ఆర్కే: మెన్స్ క్రికెట్ టీంలో తీసుకుంటే బెస్ట్ బ్యాట్స్‌మెన్, బెస్ట్ బౌలర్‌గా పేరు రాగానే సినిమా హీరోయిన్స్ వెంటపడుతుంటారు. మరి మీ వెనకాల పడలేదా?
మిథాలీరాజ్: ఇప్పటి వరకైతే రాలేదు. నాకైతే రాలేదు. మా టీం మెంబర్స్ గురించి తెలియదు. అడగాలి.
ఆర్కే: ఇప్పటి వరకు మీకెవరూ ప్రపోజ్ చేయలేదా?
మిథాలీరాజ్: సినిమా ఫీల్డ్ నుంచి కాదు కానీ, బయట ప్రపోజ్ చేశారు.
ఆర్కే: పెళ్లి చేస్తామని ఇంట్లో వాళ్లు అనడం లేదా?
మిథాలీరాజ్: అనుకున్నారు. కానీ, నేను ఎప్పుడు చేసుకోవాలని అనిపిస్తే అప్పుడే చేసుకుంటాను. నాకు సరియైన వ్యక్తి దొరికినప్పుడు చేసుకుంటాను. స్పోర్ట్స్ పర్సన్‌గా నా లైఫ్‌స్టయిల్ డిఫరెంట్‌గా ఉంటుంది. సాధారణ మహిళ మాదిరిగా ఉండదు. నన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి కూడా అది అర్థం చేసుకోవాలి.
కెప్టెన్‌గా వరల్డ్‌ప్‌ను తీసుకోవాలని ఉంది
ఆర్కే: ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి?
మిథాలీరాజ్: మహిళ అని చిన్నచూపు చూడకూడదు. నా సక్సెస్ పట్ల తను సంతోషంగా ఉండాలి. నా కెరీర్‌కు సహాయ సహకారాలు అందించాలి.
ఆర్కే: హైదరాబాద్ నుంచి ఒక స్పోర్ట్స్ పర్సన్ గెలిచారు అంటే చాముండి (చాముండేశ్వరీనాథ్) కారు గిఫ్ట్‌గా ఇస్తుంటాడు. ఇప్పటికి మీకు రెండు ఇచ్చాడు కదా?
మిథాలీరాజ్: అవును. మొదటి కారు 2007లో ఇచ్చారు. ఆ సమయంలో ఉమెన్స్ క్రికెట్ బిసిసిఐ అండర్‌లో లేదు. మహిళా క్రికెట్‌కు అంత పెద్దగా ప్రాధాన్యం లేదు. నాకు కారు ఇచ్చిన సమయంలో ప్రజలకు నేను పెద్దగా తెలియదు కూడా! ఈ రోజు అందరికీ తెలుసు.
ఆర్కే: వరల్డ్‌కప్ తరువాత వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి?
మిథాలీరాజ్: చాలా వచ్చాయి. ఒకటి మాత్రం నా మైండ్‌లో ఉండిపోయింది. లీగ్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఓడిపోయిన తరువాత చాలా మంది విమర్శించారు. ఆ రోజు నేను చాలా స్లోగా ఆడాను. ఆ రోజు ఎలాంటి పరిస్థితుల్లో అలా ఆడాల్సి వచ్చిందో నాకు మాత్రమే తెలుసు. ఆ రోజు సచిన్ ఒక ట్వీట్ చేశారు. ‘‘కంగ్రాచ్యులేషన్స్. ఈ రోజు ఇన్నింగ్స్ చాలా బాగా ఆడావు’’ అని! ఏ మెంటల్ సెటప్‌లో నేను ఆడానో తను అర్థం చేసుకున్నాడు. నా ఇన్నింగ్స్ తను చూశాడు. ఆ కాంప్లిమెంట్‌ను ఎప్పుడూ మరిచిపోలేను.
ఆర్కే: మిమ్మల్ని లేడీ సచిన్ టెండూల్కర్ అంటుంటే ఏమనిపిస్తుంది?
మిథాలీరాజ్: సచిన్ పేరు చాలా పెద్దది. ఆయన సాధించినవి ఎవ్వరూ సాధించలేరు. అలాంటి ప్లేయర్‌తో నన్ను పోల్చడం చాలా పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తాను. అయితే నేను మిథాలీరాజ్‌గా కెరీర్‌ను ప్రారంభించాను. అలాగే గుర్తింపు కావాలి!
ఆర్కే: ఉమెన్స్ ఐపీఎల్ క్రికెట్ కూడా ఉంటే బాగుంటుంది అని అంటున్నారు కదా!
మిథాలీరాజ్: ఇది కరెక్ట్ సమయం. యంగ్ ప్లేయర్స్‌కి ఎక్స్‌పోజర్ వస్తుంది. ఇలాంటి లీగ్ ఆర్గనైజ్ చేయడానికి ఇంకా కొన్నేళ్లు పడుతుంది.
ఆర్కే: మ్యాచ్‌లో సిల్లీ మిస్టేక్స్ చేస్తుంటారా?
మిథాలీరాజ్: చాలా జరుగుతాయి. అయితే నెక్ట్స్ డే రియలైజ్ అవుతాం. టీం మేట్స్‌తో డిస్కస్ చేస్తాం. ఆ ఎక్స్‌పీరియన్స్ తరువాత ఉపయోగపడుతుంది.
ఆర్కే: మరి, మరపురాని ఎక్స్‌పీరియన్స్‌లు ఏమున్నాయి?
మిథాలీరాజ్: ఓడిపోతామనుకున్న మ్యాచ్ గెలిచినప్పుడు ఆ ఆనందం చెప్పలేం!
ఆర్కే: క్రికెట్ ప్లేయర్ అవుతానని అన్నప్పుడు మీ మదర్ అభ్యంతరం చెప్పలేదా?
మిథాలీరాజ్: లేదు. మమ్మీ చాలా సపోర్టివ్‌గా ఉండేది. మమ్మీకి డ్యాన్స్ ఇష్టం. క్రికెట్ నుంచి రిటైరయ్యాక మళ్లీ డ్యాన్స్ నేర్చుకుంటానని చెప్పా. ఎప్పుడైనా బాగా దెబ్బలు తగిలి స్టిచె్‌సతో వచ్చినప్పుడు అందరూ... ‘ఎందుకు అమ్మాయిని స్పోర్ట్స్‌లో వేశారు. అలా దెబ్బలు తగిలితే, ఎవ్వరు పెళ్లి చేసుకుంటారు’ అనేవాళ్లు.
ఆర్కే: ఖాళీ సమయంలో ఏం చేస్తారు?
నిద్రపోతాను. చదువుతాను. కొన్నిసార్లు స్కెచ్ వేస్తాను.
ఆర్కే: ప్రతి ప్లేయర్‌కీ ఒక గోల్ ఉంటుంది కదా. మీక్కూడా అలా ఉందా?
మిథాలీరాజ్: వరల్డ్‌కప్ సాధించాలని ఉంది. కెప్టెన్‌గా వరల్డ్‌ప్‌ను తీసుకోవాలని ఉంది.
పాలిటిక్స్ అన్ని చోట్లా ఉంటాయి
ఆర్కే: రిటైరైన తరువాత అకాడమీలు పెట్టి కోచింగ్ ఇస్తున్నారు కదా! మీకు కూడా ప్లానింగ్ ఉందా?
మిథాలీరాజ్: ఉమెన్స్ క్రికెట్ అకాడమీ పెట్టాలని ఆలోచన ఉంది. ఇండియాలో ఇప్పటి వరకు అలాంటి అకాడమీ లేదు. హైదరాబాద్‌లో అకాడమీ పెట్టి అమ్మాయిలకు కోచింగ్ ఇవ్వాలని ఉంది.
ఆర్కే: మీ కెరీర్‌లో, పర్సనల్ లైఫ్‌లో బ్యాడ్ ఎక్స్‌పీరియెన్సెస్ ఏంటి?
మిథాలీరాజ్: పర్సనల్ లైఫ్‌లో టూ, త్రీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఎందుకంటే నా క్రికెట్ కెరీర్ మూలంగా నేను టైమ్ స్పెండ్ చేయలేకపోవడం. పేరెంట్స్ పెళ్లి సంబంధాలు చూడటం, నా కెరీర్ మూలంగా అవి తప్పిపోవడం జరిగింది. అవి నాకు హర్ట్‌ఫుల్ ఇన్‌సిడెంట్స్! అయితే ఆ సమయంలో నాకు క్రికెట్ హెల్ప్ చేసింది. కెరీర్‌లో ఒక టైమ్‌లో ఇంజ్యూరీస్ ఉండేవి. నొప్పితోనే ఆడాను.
ఆర్కే: సాధారణంగా ఉమెన్స్ స్పోర్ట్స్‌లో ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుందని అంటుంటారు. కోచ్‌లు చెప్పినట్టు వినకపోతే టాలెంట్ ఉన్నా అవకాశం రాకుండా చేస్తారని అంటుంటారు. నిజమేనా?
మిథాలీరాజ్: ఉమెన్స్ క్రికెట్‌లో ఎక్స్‌ప్లాయిటేషన్ నా విషయంలో జరగలేదు. మా టీమ్‌లో ఇతర సభ్యుల విషయంలో జరిగినట్టుగా ఫిర్యాదులు లేవు. అయితే పాలిటిక్స్ అన్ని చోట్లా ఉంటాయి. టాలెంట్ ఉన్నా వాళ్లు చెప్పినట్టు వినకపోతే అవకాశం రాకుండా చేస్తారు కావచ్చు. అయితే పది అవకాశాలు రావాల్సిన చోట ఒక్క అవకాశం తప్పకుండా వస్తుంది. అలాంటప్పుడు ఆ ఒక్క అవకాశాన్ని వినియోగించుకుని టాలెంట్ నిరూపించుకోవాలి.
అమ్మాయిలు సక్సెస్ సాధిస్తే పురుషులు సహించలేరు. వాళ్లు సాధించలేనిది ఒక అమ్మాయి సాధిస్తే తట్టుకోలేరు. ఏదో ఒకటి అనడానికి ప్రయత్నిస్తారు.
మహిళల్లో చైతన్యం చాలా పెరిగింది. పురుషులతో పాటు మహిళలూ సమానంగా సక్సెస్ సాధిస్తున్నారు.
ఆత్మవిశ్వాసంతో ఉన్న మహిళపై కామెంట్స్ చేస్తే అవే కామెంట్లు తిరిగి వాళ్లను తాకుతాయి.
బయటి విషయాలు, ఇతర అంశాలు గురించి ఆలోచిస్తే ఎప్పుడూ సహజమైన ఆటను ఆడలేరు.
ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే వాళ్లు ఎవ్వరూ కూడా ఇతర విషయాలు పట్టించుకోరు. మెంటల్లీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు.
మహిళల క్రికెట్ మరింత ముందుకెళ్లాలంటే క్రీడాకారిణులు మెరుగైన ప్రదర్శన చూపాల్సిందే. ఉమెన్స్ క్రికెట్‌లో చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో కూడా పాలిటిక్స్ ఉంటే కష్టం.
మన దేశంతో పోల్చితే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో మహిళా క్రికెట్‌కు అధిక ప్రాధాన్యం ఉంది. సౌత్ ఆఫ్రికా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది.
100 వన్డే క్రికెట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాను. చాలా ఎక్స్‌పీరియెన్స్ ఉంది. ఇంకో వరల్డ్‌కప్ వరకు ఫిట్‌గా ఉంటాను. సచిన్ 38 ఏళ్ల వరకు ఆడాడు. నేను కూడా అలాగే. సచిన్ నాకు ఇన్‌స్పిరేషన్.
ఆర్కే: రాబోయే రోజుల్లో ఇండియాకు ఉమెన్స్ వరల్డ్‌కప్ తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్యూ వెరీ మచ్ మిథాలీ.
Updated Date - 2020-05-13T21:41:44+05:30 IST