నా వీక్ పాయింట్స్ అన్నీ సైనాకు తెలుసు.. అందుకే..
ABN, First Publish Date - 2020-05-15T20:55:59+05:30
పీవీ రమణ, సింధు. తండ్రీకూతుళ్లయిన వీరిద్దరూ క్రీడాకారులే కావడం యాదృచ్ఛికంగానే జరిగందంటున్నారు. చిన్నప్పటి నుంచే బ్యాట్మింటన్‌పై సింధుకు ఆసక్తి అని రమణ చెబితే.. వరల్డ్ నెంబర్ వన్... అవడమే తన లక్ష్యమని సింధు చెబుతోంది. క్రీడాకారులకు డోపింగ్ టెస్ట్ సాధారణమనీ,
ప్లేయర్స్ మధ్య పాలిటిక్స్... ఎదురు కాలేదు
స్వీట్స్ తినను.. రోజూ నాన్‌వెజ్ తప్పనిసరి
ఆటోగ్రాఫ్ ఇస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది
కారును గిఫ్ట్‌గా ఇస్తానని సచిన్ చెప్పారు: సింధు
8 ఏళ్లప్పటి నుంచే సింధుకు బ్యాడ్మింటన్‌పై ఆసక్తి
గచ్చిబౌలి దగ్గరలో ల్యాండ్ ఇస్తానని కేసీఆర్ అన్నారు: రమణ
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో తండ్రీకూతుళ్లు పీవీ రమణ, సింధు
పీవీ రమణ, సింధు. తండ్రీకూతుళ్లయిన వీరిద్దరూ క్రీడాకారులే కావడం యాదృచ్ఛికంగానే జరిగందంటున్నారు. చిన్నప్పటి నుంచే బ్యాట్మింటన్‌పై సింధుకు ఆసక్తి అని రమణ చెబితే.. వరల్డ్ నెంబర్ వన్... అవడమే తన లక్ష్యమని సింధు చెబుతోంది. క్రీడాకారులకు డోపింగ్ టెస్ట్ సాధారణమనీ, ఆటల్లో పాలిటిక్స్ ఇప్పటివరకూ ఎదురుకాలేదంటోంది. ఒలంపిక్‌లో గెలిస్తే కారును గిఫ్ట్‌గా ఇస్తానని సచిన్ ప్రామిస్ చేశారనీ, చాముండి గిఫ్ట్స్‌గా అప్పుడప్పుడు కార్లను ఇస్తుంటారంటోంది. తన గురువు గోపీచంద్.. పర్‌ఫెక్ట్ ట్రైనర్ అనీ.. ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటే ఏదో ఒక దానిలో సెలెక్ట్ తప్పనిసరి అని సింధు అంటోంది. ఇంకా ఎన్నో వ్యక్తిగత, క్రీడా విషయాలను ఈ తండ్రీకూతుళ్లు..19-06-2016న ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొని పంచుకున్నారు. ఆ వివరాలు...
ఆర్కే: ఎలా ఉంది లైఫ్?
రమణ: కంఫర్టబుల్‌గా ఉన్నాను.
సింధు: బావున్నాను.
ఆర్కే: మీరు వాలీబాల్ ప్లేయర్ కదా?
రమణ: మనదేశం తరఫున ఆరు ఏషియన్ గేమ్స్‌లో ఆడాను. 2000 సంవత్సరంలో అర్జున అవార్డు వచ్చింది. అప్పుడు నా వయసు నలభై ఏళ్లు.
ఆర్కే: మరి మీ అమ్మాయికి ఎప్పుడు అవార్డ్ వచ్చింది?
రమణ: పద్దెనిమిదేళ్ల వయసులో సింధుకు అర్జున అవార్డు వచ్చింది (నవ్వులు). నేను సాధించింది మా అమ్మాయి త్వరగా సాధించింది. నేను వాలీబాల్ టీమ్‌లో ఆడాను కాబట్టి కాస్త ఆలస్యంగా అవార్డు వచ్చింది. సింధు అలా కాదు.. బ్యాడ్మింటన్‌లో ఇండివిజువల్‌గా అవార్డ్ సాధించటంతో పాటు పద్మశ్రీ కూడా. చాలా సంతోషంగా ఉంది.
ఆర్కే: అర్జున అవార్డ్, పద్మశ్రీ బిరుదు పొందిన మీకు విజయగర్వం తలకెక్కిందా?
సింధు: అదేంలేదు. ఇరవయ్యేళ్ల వయసులో గొప్ప అవార్డులు అందుకోవటం హ్యాపీగా ఉంది. నేను ఆడాల్సిన గేమ్స్ ఎన్నో ఉన్నాయి. ఎన్నో పతకాలు సాధించాలి.
ఆర్కే: ఫాదర్స్‌డేకు మీరు ఇచ్చే గిఫ్ట్?
సింధు: గ్రీటింగ్, ఫొటో ఫ్రేమ్స్ ఇస్తుంటా.
ఆర్కే: ఏ ఫీల్డ్‌లోని పేరెంట్స్ ఆ ఫీల్డ్‌లోకే పిల్లలను తీసుకెళ్తారు. మరి సింధుని బ్యాడ్మింటన్‌లోకి ఎందుకు తీసుకొచ్చారు?
రమణ: పిల్లల్లో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. తల్లిదండ్రులుగా వారి ఆసక్తిని మనం గమనించాలి. ఎనిమిదేళ్ల వయసులో సింధు బ్యాడ్మింటన్‌పై ఆసక్తి చూపేది. సిన్సియారిటీ, సీరియస్‌నెస్, డెడికేషన్ ఉన్న అమ్మాయి సింధు. ఉదయాన్నే నిద్రలేచి ప్రాక్టీస్‌కోసం రెడీగా ఉండేది. తీసుకెళ్లకపోతే మాత్రం ఏడ్చేది. ఆ కమిట్‌మెంట్‌ను గమనించి బ్యాడ్మింటన్‌లో ఎంకరేజ్ చేశాను. నాకు ముందునుంచీ తెలిసిన బ్యాడ్మింటన్ ప్లేయర్ గోపీగారు. ‘టాలెంట్ ఉన్న అమ్మాయి’ అని ఆయన నాతో చెప్పారు.
ఆర్కే: అసలు నీకెలా బ్యాడ్మింటన్‌పై ఆసక్తి కలిగింది?
సింధు: మా నాన్న వాలీబాల్ ఆడుతుండేవారు. నా ఫ్రెండ్స్ కూడా వచ్చేవారు. వాలీబాల్ కోర్టు పక్కన బ్యాడ్మింటన్ స్టేడియం ఉండేది. ఫన్ కోసం బ్యాడ్మింటన్ ఆడాను. ఆ తర్వాత గేమ్‌పై ఆసక్తి పెరిగింది. అలవాటయ్యింది. ఆ తర్వాత గోపీసార్ దగ్గర శిక్షణకు వెళ్లాను. అప్పటినుంచీ అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నా.
సింధుకు ఎండోర్స్‌మెంట్స్ లేవు
ఆర్కే: వాలీబాల్ ప్లేయర్ అవ్వడానికి ముందు మీ నేపథ్యం?
రమణ: నా చిన్నపుడే మా నాన్నగారు పోయారు. మా అన్నయ్య బాలనగర్ దగ్గర్లోని ఐడిపిఎల్‌లో ఉండేవారు. ఆయన దగ్గరే పెరిగాను. ఐడిపిఎల్‌లో ఉన్నపుడు అన్ని స్పోర్ట్స్ ఆడాను. విజయవాడలో డిగ్రీ చదవటానికి వెళ్లినపుడు వాలీబాల్ స్టార్ట్‌చేశాను. హైజంప్‌లో ఫస్ట్ ఉండేవాడ్ని. దీని వల్ల సంవత్సరంలో త్వరగా షైన్ అయ్యాను. వెంటనే స్టేట్ తరఫున ఆడాను. ఆ తర్వాత నేషనల్ టీంలో అవకాశం వచ్చింది. నన్ను గుర్తించి రైల్వేశాఖ స్పోర్ట్స్‌కోటాలో ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం రైల్వేలో స్పోర్ట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నా.
ఆర్కే: మీకెంతమంది పిల్లలు?
రమణ: మా పెద్దమ్మాయి పీజీ చేస్తోంది. సింధు తెలివైన అమ్మాయి. గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. ఈ మధ్యకాలంలో చాలామంది స్పోర్ట్స్ ఆడే పిల్లలు చదువుల్లో కూడా అదే కమిట్‌మెంట్ చూపిస్తున్నారు. ఇది మెచ్చుకోదగినది.
ఆర్కే: స్పోర్ట్స్ ప్లేయర్స్‌కు స్పాన్సర్‌షిప్ విషయంలో సమస్య వస్తుంటుంది కదా?
రమణ: స్టార్టింగ్‌లో మేమే డబ్బులు పెట్టుకున్నాం. తర్వాత సింధు ప్రతిభను చూసి స్పాన్సర్‌షిప్స్ వచ్చాయి. చాముండీ గారు ఎంకరేజ్‌మెంట్ ఇస్తారు. రెండు కార్లు సింధుకు ఇచ్చారు. అలా ఎంకరేజ్‌మెంట్ ఇస్తే పిల్లలు మరింత రాణిస్తారు. ప్రైజ్‌మనీని బట్టి ఆయన గిఫ్టులు ఇస్తుంటారు.
ఆర్కే: స్పోర్ట్స్ పర్సన్స్‌కు ఎండోర్స్‌మెంట్స్ ఎక్కువ కదా?
రమణ: సింధుకు ఎండోర్స్‌మెంట్స్ లేవు. ఇప్పుడైనా తనను గుర్తించి ఎండోర్స్‌మెంట్స్ వారు వస్తే సంతోషం.
ఆర్కే: గేమ్ ఆడిన తర్వాత ఎవరికీ కనిపించవట?
సింధు: సోషల్‌లైఫ్‌లో ఎక్కువగా కనిపించను. ఎక్కువగా గేమ్ ప్రాక్టీస్‌లో బిజీగా ఉంటాను.
రమణ: ఏది అనుకుంటే అది సాధించేవరకూ తల్లిదండ్రులుగా ఎంకరేజ్ చేస్తుంటాం. టోర్నమెంట్‌కు నేనో, మా ఆవిడో వెళ్తుంటాం.
ఆర్కే: ఇండియాలో ఆటకంటే ఎండోర్స్‌మెంట్స్‌లో ఎక్కువగా కనిపిస్తారు కదా?
సింధు: నాకు ఆటే తొలి ప్రాధాన్యం.
రమణ: పి.ఆర్. గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు క్రీడాకారిణిగా ఆమె పేరు తెచ్చుకోవాలి.
ఆర్కే: ఇంకా పదేళ్లు ఆడాలి కదా?
రమణ: మేం క్రీడాకారులం కాబట్టి సింధు డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. సింధే గురువుగారు మాకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. సింధు ఇంకా కనీసం ఏడెనిమిదేళ్లు ఆడగలదు.
ఆర్కే: డైట్ విషయంలో మీకు చీటింగ్ డే ఉంటుందా?
సింధు: చీట్ చేయాలనిపిస్తుంది. నాకోసమేగా అని ఆలోచిస్తాను. నాకోసం మా ఇంట్లోవారూ త్యాగం చేస్తారు.
రమణ: బరువు ఎక్కువైతే మోకాళ్లపై బరువు ఎక్కువ పడుతుంది. దీనివల్ల త్వరగా గాయాలవుతాయి. అందుకే డైట్ పర్ఫెక్ట్‌గా మెయిన్‌టైన్ చేయాలి. బరువు తగ్గాలి. సింధు గురువు డైట్ విషయంలో స్ట్రిక్ట్.
ఆర్కే: డోపింగ్ టెస్ట్‌లు జరిగాయా?
సింధు: క్రీడాకారులకు డోప్ టెస్ట్ సర్వసాధారణం. వరల్డ్ ఫెడరేషన్ వారు మేము ఇచ్చిన టైంలో వచ్చి డోప్ టెస్ట్ తీసుకుంటారు.
రమణ: మనం మూడు నెలల ముందు ఎక్కడ ఉంటాము, ఏ టోర్నమెంట్ ఆడుతున్నాము అనే విషయాల్ని ఫిల్ చేయాలి. ఈ పని మా ఆవిడ చూసుకుంటుంది. సింధు షెడ్యూల్ మారితే దాన్ని మళ్లీ చేంజ్ చేయాలి. అంతెందుకూ మొన్నే సింధు గేమ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఆ టైంలో జర్మనీ నుంచి కొందరు వ్యక్తులు వచ్చారు.
ఇక్కడైనా నేషనల్ ప్లేయర్స్ ఆడతారా అని గోపీనే ఆడిగారు. ‘నేషనల్ ప్లేయర్ ఉంది. తన పేరు పి.వి.సింధు’ అని చెప్పారు. వెంటనే ఆమె ఐపాడ్‌లో చెక్ చేసుకున్నాక.. ‘మేము డోపింగ్ టెస్ట్‌కోసం వచ్చాం’ అని ఆమె ఐడీ చూపించిందట. అలా డోపింగ్‌కోసం ఏ సమయంలో ఎవరొస్తారో తెలీదు. ఆ తర్వాత రోజు టెస్ట్ చేశారు. ఒలంపిక్స్ వెళ్లేవారిని పరీక్షించటానికి వచ్చిన టీమ్ అది.
మీడియాలో నాపై ఆర్టికల్స్ చూసి చాలాసార్లు బాధపడ్డా
ఆర్కే: అసలు డోపింగ్‌లో ఎక్కువ మంది ఎందుకు పట్టుపడతారు?
రమణ: మనదేశంలో చిన్నప్పటినుంచీ అలవాటు లేనివారు హైలెవల్లో అలా వెళ్లరు. ఎలాగైనా పతకం గెలవాలని కొందరు కకృత్తి పడి అలా చేస్తారేమో. కొందరు తెలీక మెడిషన్ వేసుకున్నపుడు అవి వెస్టర్న్ కంట్రీస్‌లో బ్యాన్. సింధు సిక్ అయినపుడు గోపీ, అక్కడ ఉండే ఫిజియో కిరణ్‌ను అడిగే ట్రీట్‌మెంట్ తీసుకుంటాం. మా జాగ్రత్తలో మేముంటాం.
ఆర్కే: టోర్నమెంట్‌కు వెళ్లేసమయంలో మెడల్ తీసుకురావాలని చెబుతుంటారు. అలాంటప్పుడు మీరు ఒత్తిడికి గురి అవుతారా?
సింధు: అందరూ చెప్పేది వింటాను. గెలిస్తే పాజిటివ్‌గా పొగడటం, ఓడిపోతే నెగెటివ్‌గా ఆడలేదని చెప్పటం సహజమే. అందుకే నా ఆట నేను ఆడతాను.
ఆర్కే: స్పోర్టివ్‌గా తీసుకోవటమనే స్వభావం వచ్చిందా?
రమణ: బాగా ఏడుస్తుంది.
సింధు: ఏడుస్తాను. మా గోపీ అన్నతో మాట్లాడటం. మిస్టేక్స్ తెలుసుకోవటం చేస్తుంటా. సేమ్ మిస్టేక్స్ రిపీట్స్ అవుతుంటాయి. ప్రతి ప్లేయర్‌తో డిఫరెంట్‌గా ఆడాలి. 11 పాయింట్స్ ఉన్నపుడు ఇలా ఆడు, అలా ఆడమని చెబుతుంటారు.
ఆర్కే: గెలిస్తే మీడియా ఆకాశానికెత్తేస్తుంది, ఓడిపోతే చెత్తగేమ్ అంటారు కదా?
సింధు: అలాంటి అనుభవాలు చాలాసార్లు అయ్యాయి. మనసుకు తీసుకోను. ప్రతిరోజూ హండ్రెడ్ పర్సెంట్ ఆడలేము కదా. అప్పుడప్పుడు బ్రిలియంట్‌గా ఆడుతుంటాం, ఒక్కోసారి మిస్టేక్స్ అవుతుంటాయి. మనం ఆడినా టైం కలిసి రావాలి కదా.
రమణ: సింధు గురించి బాగా రాశారని అనిపిస్తుంది, ఏంటి ఇలా రాశారనిపిస్తుంది. ఏ హ్యూమన్‌బీయింగ్‌కైనే అంతే. రాయచ్చు తప్పులేదు. ఏం జరిగిందో తెల్సుకుని రాస్తే బావుండు.
ఆర్కే: మీడియాలో ఆర్టికల్ చదివిన తర్వాత బాధపడ్డావా?
సింధు: చాలాసార్లు జరిగాయి.
ఆర్కే: కాంపిటీటర్స్‌తో ఆడేందుకు ఎలా ప్రిపేర్ అవుతావు?
సింధు: కాంపిటీటర్స్ ఆడిన మ్యాచ్‌లు చూస్తుంటా. నేను వారితో ఆడిన మ్యాచ్‌ల్లోని మిస్టేక్స్ గమనిస్తుంటా. కోచ్ కూడా డిస్కస్ చేస్తుంటారు. అవతలి ప్లేయర్ వీక్‌నెస్‌లు బ్రేక్‌లో కోచ్‌లు చెబుతుంటారు.
రమణ: మెచ్యూర్డ్ ప్లేయర్ అవతలి వారు ఎక్కడ బలహీనంగా ఉన్నారో తెల్సుకుని వెంటనే ఆడతారు. వెంటనే ఆ కన్‌క్లూజన్‌కు రావాలంటే ఎక్కువ టోర్నమెంట్స్ ఆడాలి.
ఆర్కే: దినచర్య ఏంటీ?
సింధు: తెల్లారుజామున నాలుగున్నర నుంచి ఆరున్నర వరకూ ప్రాక్టీస్ చేస్తా. తర్వాత బ్రేక్. ఉదయం 8.30 గంటలనుంచీ 12.00వరకూ ప్రాక్టీస్. లంచ్, బ్రేక్. సాయంత్రం 4.30 నుంచి 7.30 వరకూ ప్రాక్టీస్ చేస్తాను.
ఆర్కే: అవతలి వారు చాలా ఇబ్బందిపెట్టినా గెల్చిన మ్యాచ్ ఏదీ?
సింధు: రెండు సంవత్సరాల కితం వరల్డ్ చాంపియన్ షిప్‌లో పతకం వచ్చిన మ్యాచ్, గతేడాది డెన్మార్క్‌లో ఆడిన మ్యాచ్ బాగా అనిపించింది.
ఆర్కే: ఎవరితో ఆడటం ప్రాబ్లం వస్తుంది?
సింధు: చైనా అమ్మాయి, థాయ్ అమ్మాయి బాగా ఆడతారు. ఆరోజు ఎవరు స్ట్రాటజీగా ఆడతారో వారిదే పై చేయి. ఒకరు టఫ్ అని ప్రత్యేకంగా చెప్పలేము.
రమణ: కలిసొచ్చిన రోజు బాగా ఆడతారు.
సింధు: అందరూ బాగా ఆడతారు. కష్టపడతారు. బ్రెయిన్ వాడాలి. టెక్నిక్ ఉండాలి.
ఆర్కే: మీ బలమేంటీ?
సింధు: అటాకింగ్ నా బలం. ఎత్తు ఉండటం వల్ల అందరూ కింద కిందనే ఆడతారు. నన్ను డిఫెన్స్‌లో పెడతారు. నేనూ దానికి తగ్గట్లుగా ఆడతాను. ఎత్తు ఉండటం వల్ల వంగి ఆడటం కష్టం. అడ్వాంటేజ్ ఏంటంటే అటాకింగ్ పవర్ బావుంటుంది. రమణ: ఫుట్‌వర్క్ బావుంటే అదీ అధిగమించవచ్చు.
ఆర్కే: ఇతర దేశస్తులు మనకంటే హైట్ ఉండరు కదా?
రమణ: అలాంటిదేం లేదు చైనా వారు హైట్‌గా ఉన్నారు. ఇపుడు ఆడేప్లేయర్స్ అంతా దాదాపు 5.8 అడుగులు ఉన్నారు. కొరియన్స్ 5.11 అడుగులు ఉన్నారు. ఎవరు దేనికి పనికొస్తారో తెల్సుకుని ఆ దేశాల్లో అలా తయారు చేస్తారేమో.
ఆర్కే: ఏ దేశంలో ప్లేయర్స్‌కి ఎంకరేజ్‌మెంట్ ఉంది.
సింధు: చైనాలో ప్లేయర్స్‌కు ఎంకరేజ్‌మెంట్ ఎక్కువ. కొరియా, థాయ్‌లాండ్‌లోనూ. మనదేశంలో గవర్నమెంట్‌నుంచి మంచి ఎంకరేజ్‌మెంట్ ఉంది.
రమణ: గవర్నమెంట్ ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. ముందు పిల్లల తల్లిదండ్రులు ‘ మాపిల్లలు ఇంజినీర్, డాక్టర్ అవ్వాలి’ అనుకుంటారు. ఎవరూ స్పోర్ట్స్‌లోకి పిల్లలను తీసుకురావాలనీ ఈరోజుల్లో కూడా ధైర్యం చేయరు. ఇపుడున్న స్కూల్స్‌లో గ్రౌండ్ ఉండదు, చదువేలోకం. తల్లిదండ్రుల్లోనూ మార్పులేదు. తల్లిదండ్రులు స్పోర్ట్స్‌కు పిల్లల్ని పంపిస్తే చాలా మంది ప్లేయర్స్ వస్తారు. స్కూల్స్ ఎంకరేజ్‌మెంట్ ఉండాలి. మంచి గ్రౌండ్స్ ఉండాలి.
ఆర్కే: గవర్నమెంట్‌నుంచి క్యాష్ అవార్డ్ వచ్చిందా?
రమణ: క్యాష్ అవార్డ్స్ ఇచ్చారు. కేసీయార్ గారు గచ్చిబౌలికి దగ్గరలో ల్యాండ్ ఇస్తామన్నారు. లెటర్ కూడా ఇచ్చారు.
ఆర్కే : క్రికెటర్స్‌ను చూసి టెన్నిస్ వాళ్లు ఏడుస్తుంటారు. టెన్నిస్ వాళ్లని చూసి బ్యాడ్మింటన్ వాళ్లు ఏడుస్తుంటారు. ఎక్కువ సంపాదిస్తున్నారని. ఇదంతా మీకెలా అనిపిస్తుంది?
సింధు: టెన్నిస్‌లో స్పాన్సర్స్ ఎక్కువుంటారు. ఆదాయం ఉంటుంది. ఫిజియో, కోచ్ , ఇతర ఖర్చులు కూడా ఎక్కువే ఉంటాయి. బ్యాడ్మింటన్‌లో ఆదాయం తక్కువుంటుంది. ఇతర గేమ్స్‌తో పోల్చితే ప్రైజ్‌మనీ కూడా తక్కువే.
రమణ : మేం ఆడే రోజుల్లో 20 వేలు ఇచ్చేవారు. పన్నెండు మంది పంచుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది. తల్లిదండ్రులు సైతం ఆదాయం బాగా ఉండే గేమ్స్‌నే పిల్లలతో ఆడిస్తున్నారు. సమ్మర్ క్రికెట్ క్యాంప్ అంటే ఎంతమంది పిల్లలు వస్తున్నారో చూడండి.
ఆర్కే : ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం కిక్ ఇస్తుందా?
సింధు : హ్యాపీగా అనిపిస్తుంది. నాక్కూడా ఒక గుర్తింపు వచ్చింది కదా అనిపిస్తుంది.
ఆర్కే : డిగ్రీ ఎక్కడ చదివారు?
సింధు : సెయింట్ ఆన్స్ కాలేజ్.
ఆర్కే : ఇంత గుర్తింపు వచ్చాక కాలేజ్‌కు వెళ్లావా?
సింధు : వెళుతుంటాను. ఎగ్జామ్స్ ముందు వెళుతుంటాను. అందరూ బాగా మాట్లాడతారు. టీచర్స్ కూడా అభినందిస్తారు. మళ్లీ మళ్లీ రావాలని అడుగుతారు. బాగాఎంకరేజ్ చేస్తారు.
ఆర్కే : సింధు సక్సెస్‌లో గోపీచంద్ కాకుండా తండ్రిగా మీ రోల్ ఏంటి?
రమణ : ఎంకరేజ్‌మెంట్, తప్పులు చేస్తుంటే చెప్పడం, సరిదిద్దడం. సింధును చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నాను. ఇతర ప్లేయర్స్‌ను గమనించడం, సింధుకు చెప్పడం ఇలాంటివన్నీ చేస్తుంటాను.
సింధు : నాన్న స్పోర్ట్స్‌పర్సన్ కాబట్టి ఎలా అడాలో తెలుసు. తప్పులను గుర్తించి చెబుతుంటారు.
ఆర్కే : సైనా, జ్వాల...గైడ్ చేస్తుంటారా? ప్రొఫెషనల్ జెలసీలు ఉన్నాయా?
సింధు : గెలిచినపుడు విష్ చేస్తుంటారు. గైడ్ చేయడమంటూ ఏముండదు. టోర్నమెంట్స్‌కు వెళ్లినపుడు డిన్నర్‌కు కలిసి వెళ్లడం, మాట్లాడుకోవడం చేస్తుంటాం.
రమణ : ఇది ఇండివిడ్యువల్ గేమ్. టీమ్‌గేమ్ అయితే వేరేగా ఉంటుంది. మ్యాచ్‌లు ఉన్నప్పుడు ఎవరికి వారే ఉంటారు. మ్యాచ్‌కు అరగంట ముందు కోర్టులో ఉండాలి. కాబట్టి అందరూ కలవడం తక్కువే.
ఆర్కే : ప్లేయర్స్ మధ్య పాలిటిక్స్ ఉన్నాయా?
సింధు : అలాంటివేమీ లేవు. నాకైతే ఎప్పుడూ ఎదురు కాలేదు.
ఆర్కే : గురువుగా గోపీచంద్‌కు ఎన్ని మార్కులు వేయొచ్చు?
సింధు : 100కి 100 ఇవ్వొచ్చు. ఆయన వల్లే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను.
ఆర్కే : గోపీచంద్ అకాడమీలో శిక్షణకు ఎంత తీసుకుంటారు?
రమణ : షటిల్స్ కోసం 1500 తీసుకుంటారు. అయన దగ్గర శిక్షణ తీసుకుంటే ఏదో ఒక దానికి సెలక్ట్ కావడం జరుగుతుంది. ఆయన ఎంపిక కూడా అలానే ఉంటుంది.
ఆర్కే : ఇప్పుడు వరల్డ్ ర్యాంక్ ఎంత?
సింధు : 10
ఆర్కే : సూపర్ సీరిస్ గెలవలేకపోయాననే బాధ ఉందా?
సింధు : కొంచెం ఉంది. ఫైనల్స్ వరకు వచ్చి ఓడిపోవడం కొంచెం బాధగానే ఉంటుంది.
ఆర్కే : చైనా వాళ్లతో ఆడే సమయంలో ఏదైనా బెరుకు ఉంటుందా?
సింధు : అలా ఏముండదు.
ఆర్కే : ఒలంపిక్‌లో గెలిస్తే కారు ప్రెజెంట్ చేస్తానన్నారట కదా. ఎవరు?
సింధు : అవును, సచిన్ అన్నారు.
ఆర్కే : మరి ప్రాక్టీస్ చేస్తున్నావా?
సింధు : చేస్తున్నాను. ఇంకా రెండు నెలల సమయమే ఉంది. మొదటిసారి కాబట్టి ఎగ్జయిటింగ్‌గా ఉంది.
ఆర్కే : సచిన్ ఏ అకేషన్‌లో చెప్పారు?
సింధు : లాస్ట్ టైం వరల్ట్ చాంఫియన్ షిప్ తరువాత స్విఫ్ట్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అప్పుడు చెప్పారు.
ఆర్కే : ఆట కాకుండా ఇతర హాబీస్ ఉన్నాయా?
సింధు : టీవీ, సినిమాలు చూస్తాను. షాపింగ్‌కు వెళతాను. క్రికెట్ చూస్తాను.
ఆర్కే : పెళ్లెప్పుడు?
రమణ : ఇప్పుడైతే ఆలోచన లేదు. తను ఈ ఒలంపిక్ కాకుండా నెక్ట్స్ ఒలంపిక్ ఆడే ఏజ్ ఉంది.
ఆర్కే: నీలో ఉన్న మైనస్‌లు ఏంటి?
సింధు : తొందరగా అప్‌సెట్ అవుతుంటాను. ఈ పాయింట్ రావాల్సింది అని ఆలోచిస్తుంటాను.
ఆర్కే : వరల్డ్ వైడ్‌గా ఎంతోమందిని ఓడించావు కదా? సైనాతో ఎందుకు తడబడుతుంటావు?
సింధు : అలా అని కాదు. ఆడతాను, తను ఎంతో ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్. నా వీక్ పాయింట్స్‌ను అన్నీ తనకు తెలుసు.
ఆర్కే : గోపీ ఎప్పుడైనా తిట్టాడా?
సింధు : మిస్టేక్స్ చేసినపుడు చెబుతుంటారు. అంటే హార్ష్‌గా చెప్పరు. నీకు అర్థం కావాలని ఇలా చెబుతున్నానని అంటారు.
ఆర్కే : నీ గోల్ ఏంటి?
సింధు : ఆల్ ఇంగ్లండ్ గెలుచుకోవాలి. వరల్డ్ నెంబర్ వన్ అనిపించుకోవాలి.
బి.కాం చదివాను. భారతపెట్రోలియంలో తొలుత కాంట్రాక్ట్ ఉద్యోగిగా తీసుకున్నారు. ప్రస్తుతం పర్మినెంట్ చేశారు.
ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం రియో ఒలంపిక్స్‌లో మెడల్ సాధించటమే.
రోజూ నాన్‌వెజ్ ఉంటుంది. స్వీట్స్ జోళికెళ్లను. ప్రాక్టీస్ తర్వాత ప్రొటీన్ డ్రింక్ తీసుకుంటా.
మా సిస్టర్‌తో క్లోజ్‌గా ఉంటాను. తను నెట్‌బాల్ ప్లేయర్.
Updated Date - 2020-05-15T20:55:59+05:30 IST