రాజకీయాల్లో చేరితే పోరాటాల్లో కమిట్‌మెంట్ పోతుంది
ABN, First Publish Date - 2020-05-15T21:21:08+05:30
విద్యార్థి సంఘం నాయకుడి నుంచి.. రాష్ట్రంలో బీసీలకు పెద్ద దిక్కుగా ఎదిగిన నేత ఆర్. కృష్ణయ్య. అమ్మే తనకు తొలిగురువు అనే దగ్గరి నుంచి.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించక తప్పదనే అంశం
లోక్‌సభకైనా, రాజ్యసభకైనా ఓకే
బీసీల్లో ఇంకా కులతత్వం వీడలేదు
తెలంగాణ కంటే బీసీల సమస్యలే ముఖ్యం
వైఎస్‌పై అభిమానంతోనే జగన్‌కు గౌరవం
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో బీసీ సంఘాల నేత ఆర్. కృష్ణయ్య
విద్యార్థి సంఘం నాయకుడి నుంచి.. రాష్ట్రంలో బీసీలకు పెద్ద దిక్కుగా ఎదిగిన నేత ఆర్. కృష్ణయ్య. అమ్మే తనకు తొలిగురువు అనే దగ్గరి నుంచి.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించక తప్పదనే అంశం దాకా ఆయన తన అభిప్రాయాలను 12-11-2012న జరిగిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో వెల్లడించారు. ఆ విశేషాలు...
ఆర్కే: మీ కుటుంబ నేపథ్యం?
ఆర్. కృష్ణయ్య: మా తండ్రికి 140 ఎకరాల మాగాణి ఉండేది. మా గ్రామానికి పెద్ద కూడా. మా అమ్మే నాకు తొలి గురువు. చదువుకొమ్మని ప్రోత్సహించిందీ, నాలో పట్టుదలను పెంచింది కూడా ఆమెనే. వివేకానందుడు, బుద్ధుడు నాకు ప్రేరణ. ఇంటర్, డిగ్రీలో ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నాను.
ఆర్కే: బీసీ నేతగా ఎలా ఎదిగారు?
ఆర్. కృష్ణయ్య: ఉస్మానియా వర్సిటీలో చదువుతున్నప్పుడు విద్యార్థి నాయకుడిగా పనిచేశాను. ప్రతీ కాలేజీకి తిరిగి విద్యార్థులను సమీకరించేవాడిని. బీసీలను ఆర్గనైజ్ చేయడం అం త సులువు కాదు. మద్దతిచ్చేవారు పది మంది ఉంటే.. వెనకాల వ్యతిరేకించేవారు 50 మంది ఉంటారు.
ఆర్కే: తెలంగాణ ఉద్యమానికి ఎందుకు దూరంగా ఉన్నారు?
ఆర్. కృష్ణయ్య: ఈ ఉద్యమం ఇటీవల వచ్చింది. కానీ, దానికంటే ము ఖ్యమైనది బీసీల సమస్య. ఇప్పటికీ గ్రామాల్లో 40 శాతం బీసీ కులాల వారు.. ఎస్సీ ఎస్టీల కన్నా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ సమస్యకు రాజకీయ ఆలోచనలు ఉండవు. దీన్ని మధ్యలో వదిలేయలేను. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనేది కచ్చితంగా చెప్పలేం. కేసీఆర్‌ను ఉద్యమ నాయకుడిగా మాత్రం గౌరవిస్తా.
ఆర్కే: బీసీల్లో కొన్ని కులాలను పట్టించుకోరని ఆరోపణలు?
ఆర్. కృష్ణయ్య: అవి ఉద్యమానికి దూరంగా ఉన్నవాళ్లు చేసే ఆరోపణ లు మాత్రమే. బీసీల్లో అన్ని కులాల కోసం నేను పోరాడుతున్నా. నా వెంట గౌడ్‌లు, యాదవులు, ముదిరాజ్, మున్నూరు కాపులు ఎక్కువగా ఉంటుంటారు. మిగతా కులాలను నేను ఎప్పుడూ దూరం పెట్టను. కానీ, వారే రావడం లేదు. చైతన్యం తక్కువగా ఉండడమో, కులతత్వం ఇంకా వీడకపోవడమో దానికి కారణం కావొచ్చు.
ఆర్కే: బీసీలను వర్గీకరించాలని అంటున్నారెందుకు?
ఆర్. కృష్ణయ్య: బ్యాక్ వర్డ్, మోస్ట్ బ్యాక్‌వర్డ్‌లుగా చేయాలని కొందరు అంటున్నారు. కానీ, దానివల్ల నష్టమే జరుగుతుంది. అం దువల్ల బీసీలను.. 8 గ్రూపులుగా చేయాలని చెబుతు న్నాం. మరింతగా వికేంద్రీకరణ చేయగలిగితేనే.. అత్యం త వెనుకబడిన కులాలకు ప్రయోజనం కలుగుతుంది.
వాళ్లే ఇస్తామన్నా నేను తీసుకోలేదు.
ఆర్కే: రీయింబర్స్‌మెంట్‌తో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి?
ఆర్. కృష్ణయ్య: ఇంజనీరింగ్ విద్య ప్రమాణాలను పెంచాలని, గ్రామీణ విద్యార్థులు ఇంగ్లీష్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించాం. మరిన్ని మార్పులు, సంస్కరణలు తీసుకురావాల్సి ఉంది. మొదట్లో నాకు ఈ లోతు తెలియదు. దీనిపై సీఎంకు, ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశాను. అయితే.. ఈ పథకానికి సరిగా నిధులు విడుదల చేయకపోవడం.. అనర్హుల పేరిట పథకానికి కోత పెట్టడాన్ని నిరసిస్తూ ఉద్యమం చేస్తున్నాం.
ఆర్కే: బీసీ రిజర్వేషన్లపై చైతన్యం వచ్చిందా?
ఆర్. కృష్ణయ్య: బీసీల్లో ఇటీవల రాజకీయ చైతన్యం పెరిగింది. పంచాయతీ రాజ్ రిజర్వేషన్ల వల్ల రెండో స్థాయి నాయకత్వం బలపడింది. జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ వచ్చింది. చెన్నారెడ్డి, ఎన్టీఆర్‌లకు బీసీల విషయంగా మంచి ఆలోచనలుండేవి. కోట్ల విజయభాస్కర రెడ్డి పంచాయతీరాజ్ రిజర్వేషన్లను పెంచారు.
ఆర్కే: వైఎస్‌తో సన్నిహితత్వం ఎలా?
ఆర్. కృష్ణయ్య: నేను ఆయనతో సన్నిహితంగా ఉండడం అనేకంటే.. ఆయనే నన్ను సన్నిహితం చేసుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తొలుత మూడేళ్లపాటు వైఎస్‌తో పోరాడాను. కానీ, నిరాహార దీక్ష చేస్తానన్నప్పుడు.. నన్ను పిలిపించి మాట్లాడారు. నేను చేసిన డిమాండ్లన్నింటినీ ఒప్పుకొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మీద ఉన్న అభిమానంతోనే ఆయన కుమారుడు జగన్‌ను గౌరవిస్తా అంతే.
ఆర్కే: రక్షణ స్టీల్స్ వివాదం సంగతి?
ఆర్. కృష్ణయ్య: దానికి సంబంధించి తొలుత నాకు పూర్తి వివరాలు తెలియవు. అనంతపురానికి చెందిన సంఘాలు నన్ను అప్పటికప్పుడు పిలిపించడంతో.. వెళ్లి మాట్లాడాను. అలాంటి వాటిని వెంటనే సర్దుకున్నాను. వైఎస్ చేసిన మేలు వల్లే అలా చేశాననడం సరికాదు. బీసీ డిక్లరేషన్ ప్రకటించాక చంద్రబాబు దగ్గరికి అన్ని సంఘాలతో వెళ్లాం. సన్మానం చేశాం. అంతమాత్రాన ఆయనతో కలిపేస్తారా?
ఆర్కే: చట్టసభల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా?
ఆర్. కృష్ణయ్య: రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఒత్తిడి తీసుకొస్తే.. రిజర్వేషన్లు వస్తాయని ఆశ. అందుకే వైఎస్‌తో ప్రయత్నించాం. ఇవాళ కాకపోతే రేపు.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వక తప్పదు.
ఆర్కే: ఎమ్మెల్యే అవాలనే ఆలోచన ఎందుకు లేదు?
ఆర్. కృష్ణయ్య: నాకు మొదటి నుంచీ ఆ ఆలోచన లేదు. 1983లోనే ఎన్టీఆర్ టికెట్ ఇస్తానన్నారు. కానీ, నాది పేద ప్రజల కోసం చేసే పోరాటం. రాజకీయాల్లో చేరితే పోరాటాల్లో కమిట్‌మెంట్ పోతుంది. ఇప్పుడు ఏదైనా అవకాశం వస్తే.. లోక్‌సభకో, రాజ్యసభకో వెళ్లాలని ఉంది. అది కూడా అన్ని పార్టీలూ కలిసి పంపితేనే! ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా వైఎస్ కూడా ఆఫర్ ఇచ్చారు.
ఆర్కే: కాలేజీలు నెలనెలా ‘సొమ్ము’ ఇస్తాయని ఆరోపణలు?
ఆర్. కృష్ణయ్య: అలాంటిదేం లేదు. వాళ్లంతట వాళ్లే ఇస్తామన్నా నేను తీసుకోలేదు. ఎవరైనా స్నేహితుల నుంచి మాత్రమే విరాళాలు తీసుకుంటాను. కాలేజీల నుంచి విరాళాలు తీసుకుంటే.. వాటికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతాను?
ఆర్కే: మీరు సాధించదలచుకున్నది?
ఆర్. కృష్ణయ్య: దోపిడీ, పీడన, వివక్ష లేని సమాజం కావాలి. రాజకీయ ప్రక్షాళన జరుగకుండా సమాజంలో మార్పు రాదు. చట్ట సభల్లో రిజర్వేషన్లు సాధించాలి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను సాధించాలనేది నా తపన
Updated Date - 2020-05-15T21:21:08+05:30 IST