వీహెచ్ బర్త్ డే వేడుకకు 200 మంది
ABN, First Publish Date - 2020-06-22T09:53:22+05:30
రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావుకు ఆదివారం కరోనాపాజిటివ్‌గా నిర్ధారణ
పరీక్షల కోసం ఆస్పత్రులకు క్యూ
బర్కత్‌పుర/రాంనగర్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావుకు ఆదివారం కరోనాపాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో వీహెచ్‌తో సన్నిహితంగా ఉండే ముఖ్య అనుచరులు, కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా వీహెచ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్య అనుచరులు, కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆయన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని సన్నిహితంగా ఉన్నారు.
ఈ నెల 16న వీహెచ్ బర్త్‌డే సందర్భంగా ఆయన్ని చాలామంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు వారంతా ఆందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్ నేతలు కరోనా పరీక్షలు నిర్వహించుకోవడానికి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కొంతమంది ముఖ్య అనుచరులు నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రి, కింగ్‌కోఠి ఆసుపత్రులలో పరీక్షలు చేయించుకున్నట్లు తెలిసింది.
వీహెచ్ బర్త్‌డే వేడుకలో 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముందు వీహెచ్ తన నివాసంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. మాజీమంత్రి కె.జానారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఈ దీక్షలో పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ మూడు రోజుల క్రితం వీహెచ్ నివాసానికి వెళ్లి దాదాపు మూడు గంటల పాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. వరంగల్ డీసీసీ అధ్యక్షుడు కూడా ఇటీవల వీహెచ్‌ను కలిసిన వారిలో ఉన్నారు. వీరంతా ప్రస్తుతం హోంక్వారంటైన్‌లో ఉండడం గమనార్హం.
Updated Date - 2020-06-22T09:53:22+05:30 IST