సింగరేణి అంటేనే ఇప్పుడు..!
ABN, First Publish Date - 2020-12-23T03:18:46+05:30
సింగరేణి అంటేనే కార్మికులు, చెమటోడ్చే శ్రమజీవులు. ఇది ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడు కాలం మారింది. కార్మికులు భారీగా తగ్గిపోయారు. యంత్రాలు పుట్టుకొచ్చాయి. పనిలో..
సింగరేణి అంటేనే కార్మికులు, చెమటోడ్చే శ్రమజీవులు. ఇది ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడు కాలం మారింది. కార్మికులు భారీగా తగ్గిపోయారు. యంత్రాలు పుట్టుకొచ్చాయి. పనిలో వేగం పెరిగింది.
కాలానుణంగా గనుల్లోకి తట్టా, చమ్మాస్ నుంచి అత్యాధునిక హై కెపాసిటీ లాంగ్‌వాల్ లాంటి యంత్రాలు చేరాయి. వీటి రాకతో కార్మికుల భాగస్వామ్యం తగ్గుతూ వస్తోంది. 1991లో సంస్థలో లక్షకు పైగా కార్మికులు ఉండగా ఇప్పుడా సంఖ్య 45 వేలకు పడిపోయింది. వచ్చే రెండేళ్లలో ఉద్యోగ విరమణలతో సింగరేణిలో కార్మికుల సంఖ్య 25 వేలకు తగ్గనుందని అంచనా వేస్తున్నారు.
ఖాళీ అవుతున్న ఉద్యోగాల స్థానంలో కొత్త నియామకాలు జరగకపోగా, తక్కువ ఖర్చు, ఎక్కువ ఉత్పత్తి కోసం భూగర్భ గనుల కంటే ఓపెన్ కాస్ట్‌లకే యాజమాన్యం మొగ్గు చూపుతోంది. దీంతో కార్మికులకు ఉపాధి తగ్గిపోతోంది. అదే సమయంలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరగడంతో తక్కువ జీతాలతో ఎక్కువ పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఒకప్పుడు సింగరేణి వ్యాప్తంగా భూగర్భ గనులే ఉండేవి. ఆ గనుల్లో మొదట్లో యాంత్రాలను వినియోగించడం సాధ్యం ఆయ్యేది కాదు. తర్వాత ఓపెన్ కాస్ట్ గనులు వచ్చాయి. ఇప్పుడు ఓపెన్‌కాస్ట్ గనులన్నీ యంత్రాలతో నిండిపోతున్నాయి. కొన్నేళ్లుగా కొత్త భూగర్భ బొగ్గు గనుల ప్రారంభం పూర్తిగా నిలిచిపోయింది. కొత్తగా తవ్వే గనులన్నీ ఓపెన్‌కాస్ట్‌లుగానే మార్చేస్తున్నారు. కాలక్రమేణా భూగర్భగనుల తగ్గుదల, ఓసీపీలు పెరగడం, యాంత్రీకరణతో కార్మికుల సంఖ్య తగ్గుతోంది.
సింగరేణిలో మొదట్లో ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌ల్లో మాత్రమే భారీ యంత్రాలను వినియోగించారు. ఇప్పుడు భూగర్భ గనుల్లోనూ ఎస్‌డీఎల్, ఎల్‌హెచ్‌డీ, కంటిన్యూయస్ మైనర్, లాంగ్‌వాల్, హైవాల్ టెక్నాలజీతో బొగ్గు తవ్వుతున్నరు. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌లతో సమానంగా ఆసియా ఖండంలోనే తొలిసారిగా సింగరేణిలో అడ్రియాల ప్రాజెక్ట్‌లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఓసీపీల్లో బొగ్గు తీసేందుకు గతంలో 35 టన్నులు, 60 టన్నులు, 85 టన్నుల కెపాసిటీ ఉన్న డంపర్లను వాడగా.. ఇప్పుడు 100 టన్నుల కెపాసిటీ ఉన్న డంపర్లు ఉపయోగిస్తున్నారు. గతంలో ఒక క్యూబిక్ మీటర్ షావల్ స్థానంలో ప్రస్తుతం15 క్యూబిక్ మీటర్ల షావల్స్‌ను వినియోగిస్తున్నారు.
గతంలో అండర్‌గ్రౌండ్ గనుల్లోకి కార్మికులు కాలినడకన వెళ్లేవారు. ఇప్పుడు యాంత్రీకరణ వచ్చిన తర్వాత మ్యాన్‌రైడింగ్ సిస్టం ప్రతి గనిలో పనిచేస్తోంది. అన్ని గనుల్లోనూ సాంకేతికతను వినియోగిస్తున్నారు. గతంలో మనుషులు చేసే పనులన్నీ ఇప్పుడు యంత్రాలతో చేయిస్తున్నారు. ఫలితంగా కార్మికుల భాగస్వామ్యం క్రమంగా తగ్గిపోతోంది.
- సప్తగిరి గోపగాని, చీఫ్ సబ్‌ఎడిటర్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
Updated Date - 2020-12-23T03:18:46+05:30 IST