మీకో దండం.. ఇక్కడ ఉండం!
ABN, First Publish Date - 2021-08-03T08:39:28+05:30
వైసీపీ సర్కారుపై విపక్షం చేస్తున్న విమర్శ ఇది! ఇది అక్షరాలా నిజమని రుజువవుతోంది.
- వేధింపులతో విసిగిపోయిన ‘అమరరాజా’
- విస్తరణ ప్రణాళికలకు గుడ్‌బై.. చెన్నైవైపు చూపు
- పరిస్థితి మారకుంటే ప్రధాన ప్లాంట్ కూడా తరలింపు!
- ఇప్పటికే ఆహ్వానం పలికిన తమిళనాడు సీఎం
- ఎన్టీఆర్ పిలుపుతో ఏర్పాటు చేసిన రామచంద్రనాయుడు
- ఇప్పుడు చైర్మన్‌గా ఆయన కుమారుడు గల్లా జయదేవ్
- అధికారంలోకి రాగానే అమరరాజాపై వైసీపీ గురి
- కాలుష్యం పేరిట మూసివేత నోటీసులు జారీ
- తనిఖీలంటూ రెండురోజులకో శాఖ దండయాత్ర
- రాజకీయ కక్షతో విసిగిపోయిన వ్యవస్థాపకుడు
వచ్చీ రాగానే అమరావతిని అటకెక్కించారు.
ఆ తర్వాత... విశాఖతోపాటు రాష్ట్రానికి రావాల్సిన అనేక పెట్టుబడులను ‘రివర్స్’ బాట పట్టించారు.
ఇప్పుడు... దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, రాష్ట్రంలో అతిపెద్దదైన ప్రైవేటు సంస్థ ‘అమరరాజా’ బ్యాటరీస్‌ను వెంటాడి, వేధించి... రాష్ట్రం నుంచి వెళ్లిపోయే పరిస్థితులు కల్పిస్తున్నారు. రాజకీయ కక్షతో బంగారంలాంటి పరిశ్రమలను వెళ్లగొట్టడం రాష్ట్రంలోనే కాదు... బహుశా దేశంలోనే ఇదే మొదటిసారి కావొచ్చు.
(అమరావతి - ఆంధ్రజ్యోతి):
జేసీబీ... గిట్టని వాళ్ల కట్టడాలు పడగొట్టేందుకు ప్రయోగించే మంత్రం!
ఏసీబీ... పాత అంశాలను తవ్వి, లేని హడావుడి చేసి కేసులు పెట్టే తంత్రం!
పీసీబీ... ప్రత్యర్థులకు చెందిన పరిశ్రమలపైకి ఉసిగొల్పి, వాటిని మూయించే కుతంత్రం!
వైసీపీ సర్కారుపై విపక్షం చేస్తున్న విమర్శ ఇది! ఇది అక్షరాలా నిజమని రుజువవుతోంది. జగన్ సర్కారు ‘రాజకీయ కక్ష’ను భరించలేక అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అమరరాజా బ్యాటరీస్ సంస్థ రాష్ట్రంలో విస్తరణ ప్రణాళికలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుంది. పరిస్థితి మారకపోతే, మరింతగా దిగజారితే... మొత్తం ప్లాంటును మరో రాష్ట్రానికి తరలించక తప్పదని భావిస్తోంది. తిరుపతి పొలిమేరల్లోని కరకంబాడి వద్ద అమరరాజా ప్రధాన కార్యాలయం ఉంది. ఎక్కడో అమెరికాలో వ్యాపారం చేసుకుంటున్న గల్లా రామచంద్రనాయుడు మాతృభూమిపై మమకారంతో వచ్చి ఈ సంస్థ ఏర్పాటు చేశారు. ఇంతింతై, వటుడింతై అన్నట్లుగా ఎదిగి.. బ్యాటరీల తయారీ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన అమరారాజా బ్యాటరీస్... ‘ఈ వేధింపులు భరించలేం! ఆ అవసరం కూడా మాకు లేదు’ అంటూ పొరుగురాష్ట్రాల వైపు చూస్తోంది.
కక్షకట్టి... వేటాడి...
‘అమరరాజా’ యజమాని గల్లా రామచంద్రనాయుడుకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. ఆయన సతీమణి గల్లా అరుణ కుమారి, కుమారుడు గల్లా జయదేవ్ రాజకీయాల్లో ఉన్నారు. టీడీపీలో చురుకైన యువ నాయకుల్లో ఒకరైన గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా ఉన్నారు. హుందాగా మాట్లాడుతూ, గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తారని ఆయనకు పేరు. జగన్ ప్రభుత్వంపై, ఆయనపై ఎప్పుడూ పరుషమైన విమర్శలు చేయనేలేదు. అయినా సరే... అమరరాజాపై సర్కారు కక్షకట్టింది. ఒకటీ రెండూ కాదు... అరడజను ప్రభుత్వ శాఖలను ప్రయోగించింది. అన్నింటికంటే ముఖ్యంగా... ‘మీ కర్మాగారం నుంచి పరిమితికి మించిన కాలుష్యం వెలువడుతోంది. వెంటనే ప్లాంట్లను మూసేయండి’ అని పీసీబీ ఏప్రిల్ నెలాఖరులో నోటీసులు ఇచ్చింది. హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి సరిపోయింది...లేదంటే ప్రభుత్వమే తాళాలు వేసేది. ఇది ఇంతటితో ఆగలేదు. కార్మిక శాఖ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆరోగ్య శాఖ... ఇలా ఒకరి తర్వాత ఒకరు రెండ్రోజులకోసారి కరకంబాడిలోని అమరరాజా ఫ్యాక్టరీకి వెళ్లడం... తనిఖీల పేరుతో వేధించడం నిత్యకృత్యమైపోయింది.
నివేదికలో ‘కాలుష్యం’
కాలుష్యం పేరిట అమరరాజా ప్లాంట్లను మూసివేసేందుకు సర్కారు రకరకాల ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి వెళ్లిన బృందం... అక్కడ పెద్దగా తప్పుపట్టేంత కాలుష్యం వెలువడటంలేదని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో... సంతృప్తిచెందని సర్కారు చెన్నై నుంచి మరో బృందాన్ని పిలిపించి తమకు అనుకూలంగా నివేదిక తెప్పించుకుందని, దాని ఆధారంగా ఫ్యాక్టరీ మూసివేతకు నోటీసులు ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ మూసివేత ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే... తమ సంస్థను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడితో సౌమ్యుడు, వివాదరహితుడు అయిన రామచంద్రనాయుడు మాత్రం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇక్కడ తమ కార్యకలాపాలను మరింత విస్తరించడం అనవసరమనే అంచనాకు వచ్చినట్లు సమాచారం.
పొరుగు రాష్ట్రాల స్వాగతం
అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు ఏపీ సర్కారు కంకణం కట్టుకున్నట్లు బయటకి పొక్కడంతో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తమిళనాడులో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నుంచి గల్లా జయదేవ్‌కు వర్తమానం వచ్చినట్లు తెలిసింది. ‘‘మధ్యవర్తులు ఎవరూ అక్కరలేదు. మీకు అక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మా రాష్ట్రానికి రండి. అన్ని వసతులు కల్పిస్తాం. ఇప్పుడు మీకున్న సదుపాయాలకంటే ఎక్కువే ఇస్తాం. ఇక మీదే ఆలస్యం’’ అని స్టాలిన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పుడున్న ప్లాంటుకు సమీపంలో ఉండటంతోపాటు ఓడరేవు కూడా ఉన్న నేపథ్యంలో... తమిళనాడు తమకు అనుకూలమని ‘అమరరాజా’ భావిస్తోంది. విస్తరణ ప్రాజెక్టులన్నింటిని చెన్నైలో ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తోంది. ప్రస్తుతానికి తమ లిథియమ్ యూనిట్‌ను తమిళనాడులో ఏర్పాటు చేసే దిశగా చర్చలు తుదిదశకు వచ్చాయని తెలుస్తోంది.
ప్రధాన ప్లాంటు కూడా!?
పీసీబీ ‘మూసివేత’ నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. లేకపోతే... ఇప్పటికే కరకంబాడిలోని ప్లాంట్లను మూసివేయాల్సి వచ్చేది. దీనిపై న్యాయపోరాటం కొనసాగుతోంది. అయినా సరే... సర్కారు వేధింపులు ఆగలేదు. ఈ కక్షసాధింపు ఇలాగే కొనసాగిస్తూ, ‘మూసివేసేదాకా వదలం’ అనే ధోరణిని ప్రభుత్వం విడనాడకపోతే... ప్రధాన యూనిట్‌ను కూడా రాష్ట్రం నుంచి తరలించక తప్పదని ఫ్యాకర్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘35 ఏళ్లుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాం. ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించాల్సిన ఆలోచన, ప్రతిపాదన మాకు లేవు. కానీ... ఇప్పటికే మూసివేయాలని పీసీబీ ద్వారా నోటీసులు ఇప్పించారు. రెండు రోజులకొక శాఖ నుంచి తనిఖీల బెదిరింపులు వస్తున్నాయి. అలాంటప్పుడు ప్రత్యామ్నాయం చూసుకోక తప్పదు కదా!’’ అని ఫ్యాక్టరీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికైతే చిత్తూరు జిల్లాలోనే ఏర్పాటు చేయాలనుకున్న విస్తరణ ప్రాజెక్టులను తమిళనాడు దిశగా తరలించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాయి.
తండ్రి అలా.. కొడుకు ఇలా
అమరరాజా విస్తరణ ప్రణాళికల కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బంగారుపాళ్యం వద్ద కొంత స్థలాన్ని కేటాయించారు. రాళ్లు, రప్పలతో నిండిన ఆ ప్రాంతాన్ని చదును చేస్తూ నెమ్మదిగా నిర్మాణ పనులు చేపట్టారు. అయితే, జగన్మోహన్‌రెడ్డి సర్కారు వచ్చీరాగానే ఆ భూమిని వెనక్కి తీసుకుంటూ నోటీసులు జారీ చేసింది. నిర్ణీత సమయంలో పనులు పూర్తికానందున భూమిని వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
Updated Date - 2021-08-03T08:39:28+05:30 IST