అమరావతిలో అంతా ఓకే
ABN, First Publish Date - 2021-07-20T07:16:36+05:30
రాజధాని అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న జగన్ ప్రభుత్వ వాదన వీగిపోయింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ లేదని తేల్చి.. పలువురిపై సీఐడీ ..
రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ లేనేలేదు!
భూముల క్రయవిక్రయాలపై హైకోర్టు తీర్పు సక్రమమే
తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
విస్తృతంగా విచారణ తర్వాతే నిర్ణయం
దాని పరిశీలనల్లో ఎలాంటి వక్రతా లేదు
అమ్మినవారికి ఏ నష్టమూ జరగలేదు
కొనుగోళ్లలో మోసం ప్రశ్నే లేదు
ఎందుకు కొంటున్నామో చెప్పాలని లేదు
హైకోర్టులో దీనిపై సర్కారు వాదించలేదు
అప్పీల్‌కు ఇదే కారణమని చెప్పలేదు
సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ
రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లు కొట్టివేత
ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై హైకోర్టు విస్తృతంగా విచారణ జరిపింది. హైకోర్టు తీర్పులో పేర్కొన్న పరిశీలనల్లో వక్రత లేనేలేదు.
భూ లావాదేవీల్లో ఏ విక్రయదారుడికీ నష్టం జరగలేదు. కొనుగోలుదారులు మోసం చేసిన ప్రశ్నే లేదు. భూములు ఎందుకు కొంటున్నదీ చట్ట ప్రకారం కచ్చితంగా చెప్పాలని లేదు. - సుప్రీంకోర్టు
రాజధాని అమరావతి భూముల కొనుగోళ్లకు సంబంధించి సీఎం జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ నేతలు చేస్తున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను సుప్రీంకోర్టు సైతం తోసిపుచ్చింది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా సమర్థించింది. దాని పరిశీలనల్లో ఎక్కడా తప్పులేదని తేల్చిచెప్పింది.
న్యూఢిల్లీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న జగన్ ప్రభుత్వ వాదన వీగిపోయింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ లేదని తేల్చి.. పలువురిపై సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సక్రమంగానే ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన ఆరు పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. సెక్షన్ 418కి సంబంధించి ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది చేసిన వాదన ఇక్కడ వర్తించదని తన తీర్పులో స్పష్టం చేసింది ‘భూ కొనుగోళ్లలో ఏ విక్రయదారుడికీ నష్టం జరగలేదు. కొనుగోలుదారులు మోసం చేసిన ప్రశ్నే లేదు. భూములు ఎందుకు కొంటున్నదీ చట్ట ప్రకారం కచ్చితంగా చెప్పాలని లేదు. ఈ కోణంలో రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో వాదించలేదు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లోనూ దానిని కారణంగా చూపలేదు’ అని పేర్కొంది. హైకోర్టు విస్తృతంగా విచారణ జరిపిందని, తన పరిశీలనల్లో వక్రత లేదని తేల్చిచెప్పింది.
సేల్ డీడ్‌పై వివాదమే లేదు: లుథ్రా
మరో ప్రతివాది గుడ్‌లైఫ్ ఎస్టేట్స్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌లో ఐపీసీ సెక్షన్ 418ను చేర్చలేరని తెలిపారు. సెక్షన్ 415కు సంబంధించిన అంశాలు సరిపోలినప్పుడే సెక్షన్ 418 వర్తిస్తుందన్నారు. దుర్వినియోగం జరిగినప్పుడు సెక్షన్ 415 వర్తిస్తుందని, కానీ ఈ కేసులో ఈ సెక్షన్ వర్తించదని హైకోర్టు తీర్పులో పేర్కొందన్నారు. విక్రయదారు, కొనుగోలుదారు మధ్య రిజిస్టర్డ్ సేల్‌డీడ్ ఉందని, గత ఆరేళ్లుగా సేల్‌డీడ్‌పై ఎక్కడా వివాదం లేదని గుర్తు చేశారు. ‘‘అకస్మాత్తుగా ఎవరో వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వం మారిందని దవే అన్నారు. అసలీ కేసులో ప్రభుత్వం మారడమే సమస్య. అది మారిన తర్వాత తొందరపాటు (ఫ్లర్రీ) ప్రాసిక్యూషన్‌ను మొదలుపెట్టారు’ అని వ్యాఖ్యానించారు. ఇరుపక్షాల మధ్య ఒప్పందం ఉన్నప్పుడు సెక్షన్ 415 ఎలా వర్తిస్తుందని అడిగారు. భూకొనుగోళ్లలో వివాదం ఉందంటూ ఎవరూ రిజిస్ట్రార్‌ను అశ్రయించలేదని ప్రస్తావించారు. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారమే భూలావాదేవీలు జరిగాయని తేల్చిచెప్పారు. రాజధాని అమరావతికి సంబంధించి జరిగింది భూసేకరణ కాదని.. అది భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) అని గుర్తుచేశారు. రాజధాని ఎక్కడ వస్తుందో పబ్లిక్ డొమైన్‌లో ఉందని హైకోర్టు కూడా గుర్తించిందన్నారు. రాజధాని ఏర్పాటుపై 2014 ఫిబ్రవరి 18న పార్లమెంటులోనూ చర్చ జరిగిందన్నారు. ఆ ఏడాది అధికారంలోకి వచ్చిన పార్టీ మేనిఫెస్టోలో కూడా పేర్కొందని, వార్తల్లోనూ రాజధానిపై చర్చ జరిగిందని వివరించారు. కాబట్టి ఆస్తుల బదిలీ చట్టంలోని సెక్షన్ 55 ప్రకారం.. విక్రయదారుడికి కొనుగోలుదారు ఈ విషయాన్ని వెల్లడించలేదనడం సరికాదన్నారు. ‘భూమి విలువ పెరిగిందంటున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక అక్కడ ఆస్తుల విలువ పడిపోయింది. ప్రభుత్వం చెబుతున్నట్లు 20 రెట్లు పెరగలేదు’ అని తెలిపారు. ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని, ఈ కేసులో ఏ వివాదం లేదని, కాబట్టి ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని అభ్యర్థించారు.
అసలు విషయం దాచారు: కుహాడ్
భూముల కొనుగోలు సమయంలో కొనుగోలుదారులు అసలు విషయం దాచారని, ఉద్దేశపూర్వకంగానే రాజధాని విషయాన్ని చెప్పలేదని.. సీఐడీకి ఫిర్యాదు చేసిన సలివేంద్ర సురేశ్ తరఫున సీనియర్ న్యాయవాది పారస్ కుహాడ్ తెలిపారు. ‘మీరు సేల్ డీడ్ కుదర్చుకోలేదు కదా..’ అని ధర్మాసనం ప్రశ్నించగా.. తాము సేల్‌డీడ్‌ను కుదుర్చుకోలేదని, క్రిమినల్ మోషన్‌ను ఎవరైనా దాఖలు చేయవచ్చని కుహాడ్ బదులిచ్చారు. ఇది ఒక వ్యక్తికి సంబఽంధించిన కేసు కాదని, వేల ఎకరాలతో ముడిపడిన రాజధాని అంశమని తెలిపారు. ఇందులో పెద్ద రాజకీయ నేతల ప్రమేయం ఉందని, నేర తీవ్రతను వాస్తవాలతో తెలియజేశామని, దర్యాప్తు కొనసాగాలని, ఎలా ఆపుతారని ప్రశ్నించారు. రాజధాని ఏర్పాటుకు సంబంధించి 2014 జూన్ నుంచి పబ్లిక్ డొమైన్‌లో ఉందని అంగీకరించారు. అయితే 2014 అక్టోబరులో ‘ఆంధ్రజ్యోతి’తో పాటు మరో ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాలను ప్రస్తావించారు. తుళ్లూరు మండంలోని 17 గ్రామాల పరిధిలో రాజధాని వస్తుందని ‘ఆంధ్రజ్యోతి’ పేర్కొందని తెలిపారు. కానీ ఆలోపు జూన్ నుంచి సెప్టెంబరు వరకు కొనుగోళ్లు జరిగాయన్నారు. 2015 ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు.
హైకోర్టు తీర్పు నిష్పక్షపాతం: శ్యామ్ దివాన్
పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న కిలారు రాజేశ్, శ్రీహాస తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. హైకోర్టు తీర్పు నిష్పక్షపాతంగా, సమతుల్యంగా ఉందన్నారు. వక్రీకరణ లేదని, తీర్పును సవాల్ చేయడానికి అసలు కారణమే లేదని స్పష్టం చేశారు. ‘పరిస్థితులు, వాస్తవాల ఆధారంగా కేసులో జోక్యం చేసుకునే అధికారం హైకోర్టుకు ఉంటుంది. నిరుడు సెప్టెంబరు 7న సీఐడీకి ఫిర్యాదు చేస్తే.. అక్టోబరు 16న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఫిర్యాదుదారు భూములను విక్రయించినవారు కాదు. విక్రయదారులకు లేని అభ్యంతరం.. ఈ మూడో వ్యక్తికి ఎందుకని హైకోర్టు సరిగ్గా ప్రశ్నించింది. భూలావాదేవీలు జరిగిన 6 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేశారు. దీనిని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు బహిరంగంగా అందుబాటులో ఉన్నప్పుడు ఇందులో మోసం, విశ్వాస ఘాతుకం ఎక్కడుంది? ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు ఇక్కడ ఆస్కారమే లేదు. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు’ అని స్పష్టం చేశారు. ధర్మాసనం జోక్యం చేసుకుని.. ఐపీసీ సెక్షన్ 418, ఆస్తుల బదిలీ చట్టంలోని సెక్షన్ 55 వర్తింపుపై వాదించాలని సూచించింది. దివాన్ వాదనలు కొనసాగిస్తూ.. ‘ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్ 420, 409, 406, 120బీలను చేర్చారు. ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తే సెక్షన్ 418 వర్తిస్తుంది. అయితే ఇక్కడా పరిస్థితి లేదు. ఆస్తుల బదిలీ చట్టంలోని సెక్షన్ 55 కూడా ఇక్కడ వర్తించదు. హైకోర్టు తన తీర్పులో ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అన్ని సెక్షన్లనూ కూలంకషంగా చర్చించింది. రాజధాని విజయవాడ-గుంటూరు ప్రాంతాల్లో వస్తుందని పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ పరిణామాల రీత్యా భూకొనుగోళ్లకు సంబంధించి సివిల్ ఒప్పందం జరిగి ఆరేళ్లు గడచిన తర్వాత మూడో వ్యక్తి ఎవరో ఫిర్యాదు చేస్తే క్రిమినల్ చర్యలను ప్రారంభించడం సరికాదు’ అని తెలిపారు. స్పందించిన దవే.. సెక్షన్ 154 ప్రకారం ఏ వ్యక్తి అయినా నేరాలకు సంబంధించిన సమాచారాన్ని అందించవచ్చని తెలిపారు. రాజధాని ఏర్పాటుపై 2015 ఏప్రిల్ 23న రాష్ట్రప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ‘2014 భూలావాదేవీలపై 2020లో ఎందుకు ఫిర్యాదు చేశారని దివాన్ అడిగారు. 2019లో ప్రభుత్వం మారింది. అందుకే అప్పుడు ఫిర్యాదు వచ్చింది. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి దీనిని ఆలస్యమని అనలేం’ అని అన్నారు. దాంతో న్యాయమూర్తులు పెద్దగా నవ్వారు.
సెక్షన్ 418ని పరిగణనలోకి తీసుకోలేదు: దవే
విచారణ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ‘ఈ కేసులో చాలా ముఖ్యమైన ఐపీసీ సెక్షన్ 418ను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ సెక్షన్ ప్రకారం.. తెలిసి మరీ మోసం చేయడం నేరం. హైకోర్టు తీవ్రమైన పొరపాటు చేసింది. ఆస్తుల బదిలీ చట్టంలోని సెక్షన్ 55ను తీర్పులో ప్రస్తావించింది. కానీ అదే సెక్షన్‌లోని సబ్ క్లాజ్ 5(ఏ) ప్రకారం.. భూముల విలువ పెరుగుదలకు సంబంధించి విక్రయదారులకు కొనుగోలుదారులు వెల్లడించాలి. ఈ సెక్షన్‌లో ఇదే ముఖ్యమైన కోణం. కానీ ఈ అంశాన్ని హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించలేదు. ప్రభుత్వానికి దగ్గరగా ఉండడం వల్ల.. రాజధాని కచ్చితంగా ఎక్కడ వస్తుందోనన్న సంగతి కొనుగోలుదారులకు ముందే తెలుసు. విక్రేతలకు తెలియదు. ప్రచారం జరిగినా, ముందే ఊహించినా కచ్చితంగా ఎక్కడ వస్తోందో కొన్నవారికి తెలుసు. విక్రయదారులకు ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పాల్సిందే. లేదంటే మోసం చేసినట్లవుతుంది. అప్పుడు ఐపీసీ సెక్షన్ 418 వర్తిస్తుంది. ఆస్తుల బదిలీ చట్టంలోని సెక్షన్ 55లోని సంబంధిత అంశాన్నీ హైకోర్టు విస్మరించింది. సెక్షన్ 482ను ఉపయోగించుకుని ప్రతి ఫిర్యాదుకూ సంబంధించి పోలీసుల, ట్రయల్ కోర్టుల అధికారాలను తీసుకోడానికి భజన్‌లాల్ కేసు హైకోర్టులకు లైసెన్సు కాదు. ట్రయల్ జరుగుతున్నప్పుడు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయడం నిందితుల హక్కు. కానీ ప్రాథమిక స్థాయిలోనే హైకోర్టు జోక్యం చేసుకుని దర్యాప్తును నిలిపివేయడం సరికాదు. సివిల్ వివాదమైనంత మాత్రాన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయరాదనడం కుదరదని గతంలో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. మేం (రాష్ట్రప్రభుత్వం) ఇప్పుడు ఎవరినీ దోషిగా తేల్చడం లేదు. దర్యాప్తును కొనసాగనివ్వాలి. అసాధారణ కేసుల విషయంలో హైకోర్టుకు కొన్ని పరిమితులు ఉంటాయి. హైకోర్టు తీర్పులో రాజ్యాంగ హక్కులు అని ఒక చోట ప్రస్తావించారు. క్రిమినల్ కేసుతో రాజ్యాంగ హక్కులకు సంబంధం ఏమిటో? నేరం జరిగిందా లేదా అన్నది ట్రయల్, దర్యాప్తు తేల్చుతాయి. నిందితులు నిర్దోషులు కావచ్చు. కానీ ఆ విషయాన్ని దర్యాప్తు, ట్రయల్ కోర్టు తేల్చాలి. ఈ భూలావాదేవీలు చట్టపరంగా మోసపూరితం’ అని పేర్కొన్నారు.
Updated Date - 2021-07-20T07:16:36+05:30 IST