విజయసాయికి పూర్ణకుంభం
ABN, First Publish Date - 2021-09-04T08:21:12+05:30
విజయసాయికి పూర్ణకుంభం
విశిష్ట అతిథులకు ఇచ్చే గౌరవమిది
ఆ హోదా లేకున్నా ఈవో హడావుడి
ధర్మకర్త అశోక్‌ను గతంలో కొవిడ్ పేరిట కనీసం స్వాగతించని అధికారులు
వివాదాస్పదంగా మారుతున్న సింహాచలం అధికారుల వైఖరి
సింహాచలం, సెప్టెంబరు 3: దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులను తుంగలోతొక్కి, రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవాలయం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలకడం వివాదాస్పదంగా మారింది. శుక్రవారం సింహాద్రి అప్పన్న దర్శనానికి వచ్చిన ఆయనకు దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ, కొందరు ట్రస్టుబోర్డు సభ్యులతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవదాయ శాఖ కమిషనర్ 2017 డిసెంబరు 28న జారీచేసిన సర్క్యులర్ ప్రకారం విశిష్ఠ అతిథులకు మాత్రమే పూర్ణకుంభ స్వాగతం పలకాల్సి ఉంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ దేవస్థానం అధికారులు సింహగిరిపై ప్రధాన విచారణ కేంద్రం వద్ద ప్రత్యేక బోర్డును కూడా ఏర్పాటుచేశారు. ఇదిలావుండగా ఈ ఏడాది జూన్ 16న ఆలయ అనువంశిక ధర్మకర్త హోదాలో అప్పన్న దర్శనానికి విచ్చేసిన మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుకు కరోనా నిబంధనల నెపంతో పూర్ణకుంభం ఆహ్వానం పలకలేదు సరికదా, కనీసం దేవస్థానం ఈఓ సూర్యకళ అక్కడకు రాలేదు.
ధర్మకర్తవా...అధర్మకర్తవా?: సాయిరెడ్డి
సింహాచలం దేవస్థానం, విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ భూములపై బహిరంగ చర్చకు రావాలని వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ పూసపాటి అశోక్‌గజపతిరాజుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం వరాహలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అసలు నువ్వు ధర్మకర్తవా..అధర్మకర్తవా...’ అంటూ అశోక్‌నుద్దేశించి మండిపడ్డారు. ‘‘గత కొన్నేళ్లుగా సుమారు రూ.ఎనిమిది వేల కోట్ల విలువైన భూములు పరాధీనమవుతుంటే ప్రేక్షక పాత్ర వహించారు. ఈ వ్యవహారంలో మీ భాగస్వామ్యం ఉందా? లేదా? చిత్తశుద్ధి ఉంటే బహిరంగ వేదికపైకి వచ్చి నేను వేసే ప్రశ్నలకు బదులివ్వాలి. అదే వేదికపై మీరు వేసే ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు నేను సిద్ధం. మహిళల పట్ల గౌరవం ఉంటే కుటుంబసభ్యుల్లో ఒకరికి చైర్మన్ పదవి ఇవ్వవచ్చు. తప్పు చేయకుంటే కోర్టులను ఆశ్రయించి, వ్యవస్థలను ఎందుకు మేనేజ్ చేయాలి?’’ అని విజయసాయి ప్రశ్నించారు.
Updated Date - 2021-09-04T08:21:12+05:30 IST