మే నెలకల్లా కాఫర్ డ్యాం
ABN, First Publish Date - 2021-03-02T09:11:41+05:30
పోలవరం ప్రాజెక్టు పనులు లక్ష్యానికి అనుగుణంగా యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాఫర్ డ్యాంను మే
స్పిల్, అప్రోచ్ చానల్స్ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టండి
ముఖ్యమంత్రి జగన్ ఆదేశం.. పోలవరంపై అధికారులతో సమీక్ష
అమరావతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనులు లక్ష్యానికి అనుగుణంగా యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాఫర్ డ్యాంను మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థను, జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకరబాబు తదితరులు హాజరయ్యారు. స్పిల్ చానల్, అప్రోచ్ చానల్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
అవి పూర్తయ్యేలోగా కాఫర్ డ్యాంకు సంబంధించి అసంపూర్ణంగా ఉన్న పనులన్నీ పూర్తి కావాలన్నారు. దీనివల్ల వరద నీటిని స్పిల్‌వే ద్వారా బయటకు పంపేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. స్పిల్‌వే పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. గేట్ల బిగింపు చురుగ్గా సాగుతోందన్నారు. భారీ వరద కారణంగా ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యాం దెబ్బతిందని.. గ్యాప్-1, గ్యాప్-2 భారీ కోతకు గురైనట్లు చెప్పారు. అలాగే ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వీలు కాదని.. కేంద్ర జల సంఘం కూడా స్పష్టం చేసిందని వివరించారు. పోలవరం వద్ద వైఎ్‌సఆర్ గార్డెన్స్‌పైనా సీఎం సమీక్షించారు. జీ-హిల్‌సైట్‌పై వంద అడుగుల ఎత్తున వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని నిర్మించనున్నట్లు అఽధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ప్రతిపాదనలు సీఎం ముందుంచారు. నిర్వహణ వ్యయం తక్కువగా ఉండేలా గార్డెన్‌ను రూపొందించాలని ఆయన సూచించారు. ప్రాజెక్టు దిగువన బ్రిడ్జిని.. అక్కడ నుంచి జీ-హిల్‌ను అనుసంధానం చేసే రోడ్డు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. నదుల అనుసంధానంపై రాష్ట్రం తరఫున ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా ఈ ప్రతిపాదనలు ఉండాలన్నారు. అయోమయం, సందిగ్ధాలకు తావులేకుండా ఉభయ తారకంగా ఉండేలా ప్రతిపాదనలు రూపొందించాలని.. వీటిని కేంద్రానికి పంపుదామని తెలిపారు.
Updated Date - 2021-03-02T09:11:41+05:30 IST