సిమ్లా యాపిల్ (రేగుపంట).. మండపేటలో పండింది!
ABN, First Publish Date - 2021-12-19T06:56:15+05:30
మండపేటలో ఓ యువ రైతు సేంద్రియ ఎరువులతో సిమ్లా యాపిల్ రకం రేగు పంటను సాగుచేసి సత్ఫలితాలను సాధించాడు.
మండపేట, డిసెంబరు 18 : మండపేటలో ఓ యువ రైతు సేంద్రియ ఎరువులతో సిమ్లా యాపిల్ రకం రేగు పంటను సాగుచేసి సత్ఫలితాలను సాధించాడు. ఏడాదిలో ఎనిమిది నెలలపాటు పండే ఈ పంటకు మార్కెట్‌లో మంచి డిమాండు ఉంది. గరప నేలల్లో పండే ఈ పంటను రాయవరం మండలం లొల్ల గ్రామానికి చెందిన ఈ యువ రైతు వైట్ల సతీష్ మండపేట సత్యశ్రీ రోడ్డులో ఎకరన్నర పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేపట్టారు. ప్రస్తుతం ఈ మొత్తం భూమిలో ఏడు కుంచాల్లో సిమ్లా రేగుపంట వేయగా, ఈ సీడ్ మొక్కలను గత జూన్‌లో ఆయన భద్రాచలం నుంచి తీసుకువచ్చి నాటారు. ఎటువంటి ఎరువులను వాడకుండా కేవలం సేంద్రియ విధానంలో సాగు చేసి పంట పండిస్తుండడం విశేషం. ఇక ఏడాదిలో మూడు నెలలు మినహా దిగుబడి వస్తూనే ఉంటుంది. టన్ను కాయలు లక్ష రూపాయల వరకు ఉంది. చేను వద్దే కిలో రూ.100కి విక్రయిస్తున్నారు. పంట తెగుళ్ల బారిన పడకుండా పేడ, గోమూత్రం, వేపచిగుళ్ల మిశ్రమా న్ని తోటకు ఎరువుగా వేస్తున్నారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తగినంత నీటిని అందిస్తున్నారు. భద్రాచలం నుంచి మొక్క రూ.70 వంతున కొనుగోలు చేసినట్టు సతీష్ చెప్పారు. ఏడాది తర్వాత కాపు తగ్గాక మొక్కతలలు తొలగించి మూడు నెలలపాటు మధ్యంతర పంటగా తీగజాతి బీర పంట సాగు చేస్తామని, తలలు తొలగించిన ఐదారు నెలలకు ఒకసారి మళ్లీ కాపు మొదలవుతుందని చెప్పారు. ఎకరం పొలంలో 600 మొక్కలు నాటొచ్చని, పెట్టుబడి మూడు నుంచి మూడున్నర లక్షలు అవుతుందన్నారు. దిగుబడి ఎకరాకు ఐదు టన్నుల దాకా వస్తుందని, దాంతో లక్ష నుంచి లక్షన్నర వరకు ఏటా ఆదాయం పొందవచ్చని చెప్పారు. కాగా పక్కన ఆరటి తోట కూడా ఆయన సేంద్రియ విధానంలోనే సాగు చేస్తున్నారు.
Updated Date - 2021-12-19T06:56:15+05:30 IST