వైసీపీ ఎమ్మెల్యేల మధ్య కోల్డ్‌వార్!
ABN, First Publish Date - 2021-09-16T05:12:04+05:30
వైసీపీ ఎమ్మెల్యేలు..
తాడికొండ ఎమ్మెల్యే వర్సెస్ గుంటూరు సిటీ ఎమ్మెల్యేలు
ఇళ్ల స్థలాల పనులపై పెత్తనం కోసం ఆరాటం
ఇన్‌చార్జి మంత్రి పర్యటనను బహిష్కరించిన ఎమ్మెల్యే శ్రీదేవి
స్థలాల పరిశీలనను మధ్యలోనే ముగించిన మంత్రి శ్రీరంగనాథరాజు
గుంటూరు(ఆంధ్రజ్యోతి): ఇళ్ల స్థలాల్లో పనులపై పెత్తనం కోసం వైసీపీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఈ విషయంలోనే గుంటూరు నగర ఎమ్మెల్యేలకు, తాడికొండ ఎమ్మెల్యేకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. పేరేచర్ల, లాం లోని స్థలాలు తన నియోజకవర్గం పరిధిలో ఉన్నందున మౌలిక సదుపాయాల కల్పన తన కనుసన్నలలోనే జరగాలని తాడికొండ ఎమ్మెల్యే భావిస్తున్నారు. లబ్ధిదారులంతా తమ నియోజకర్గాల పరిధిలోని వారేనని వారి పనులు మేము దగ్గరుండి జరిపిస్తే తమకు ప్రయోజనం అని భావిస్తూ గుంటూరు నగర ఎమ్మెల్యేలు ఇప్పటికే అక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు.
ప్రభుత్వం జగనన్న కాలనీల కోసం గుంటూరు నగరవాసులకు సమీపంలోని పేరేచర్ల, లాం గ్రామాల్లో ఇళ్లస్థలాలను కొనుగోలు చేసింది. ఇందులో ప్రస్తుతం రూ.కోట్లు వ్యయం చేసి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. లెవలింగ్, అంతర్గత రోడ్లు, విద్యుదీకరణ, డ్రైనేజ్ వంటి సౌకర్యాలను ఏర్పాటుచేయాలి. ఈ స్థలాలను పరిశీలించేందుకు హౌసింగ్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం గుంటూరు నగరానికి వచ్చారు. ముందుగా ఆయన తాడికొండ నియోజకవర్గ పరిధి పేరేచర్లలోని స్థలాల వద్దకు వెళ్లారు.
ఈ పర్యటనలో ఆయనతో పాటు గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తాఫా, మద్దాలి గిరిధర్‌లతో పాటు నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు. అయితే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఆ తర్వాత అదే నియోజకవర్గం పరిధిలోని లాంలో స్థల పరిశీలనకు ముందుగా నిర్ణయించిన ప్రోగ్రాం ప్రకారం ఇన్‌చార్జి మంత్రి వెళ్లాల్సి ఉంది. అయితే ఆయనకు అప్పటికే పరిస్థితి అర్థమవటంతో లాం పర్యటనను రద్దుచేసుకొని వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన పొలాల వ్యవహారంలో కూడా అప్పట్లో స్థానిక ప్రజాప్రతినిధులకు ఎక్కడికక్కడ భారీఎత్తున ముడుపులు అందాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఒక్కో ఎకరానికి రైతుల నుంచి రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు ప్రజాప్రతినిధుల పేరు చెప్పి వసూలు చేశారు. అంతటితో సరిపెట్టుకోకుండా ఇప్పుడు ఆ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కేటాయించే కోట్లాది రూపాయలుపై ప్రజాప్రతినిధుల కన్నుపడింది. ఇప్పటికే స్థలాల మెరక పేరుతో భారీగా నిధులు నొక్కేసారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూతుమంత్రంగా మట్టి తోలించారు. అదేమంటే ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి కొట్టుకుపోయిందనే వాదన వినిపిస్తున్నారు.
పేరేచర్లలో 390 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి సుమారు 14,000మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అలాగే లాంలో 115 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి దాదాపు 5,420 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ స్థలాల పనుల్లో పెత్తనం కోసమే గుంటూరు నగర ఎమ్మెల్యేలకు, తాడికొండ ఎమ్మెల్యేకు మధ్య వివాదం తలెత్తిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Updated Date - 2021-09-16T05:12:04+05:30 IST