హిందూ ద్రోహి జగన్
ABN, First Publish Date - 2021-01-09T09:15:30+05:30
కొత్త వేషంతో వచ్చి ఆలయాలకు శంకుస్థాపన చేసినంత మాత్రాన సీఎం జగన్ చేసిన పాపాలు కొట్టుకుపోవని, ఆయన నిలువెత్తు హిందూమత ద్రోహి అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం వ్యాఖ్యానించారు.
- దివ్యదర్శనం, నదీ హారతులు నిలిపివేశారు
- దేవదాయ నిధులు, భూములు మళ్లించారు: పట్టాభి
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): కొత్త వేషంతో వచ్చి ఆలయాలకు శంకుస్థాపన చేసినంత మాత్రాన సీఎం జగన్ చేసిన పాపాలు కొట్టుకుపోవని, ఆయన నిలువెత్తు హిందూమత ద్రోహి అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘అమరావతిలో రూ.150 కోట్లతో నిర్మించ తలపెట్టినశ్రీవారి ఆలయ నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలిపివేసింది. పేదలు దేవాలయాలను దర్శించుకోవడానికి ప్రారంభించిన దివ్యదర్శనం కార్యక్రమాన్ని రద్దు చేసింది. కృష్ణా, గోదావరి సంగమ ప్రదేశంలో కొన్నేళ్లపాటు రోజూ నిర్వహించిన నదీ హారతిని నిలిపివేసింది. దేవదాయ శాఖ నిధులు రూ.144 కోట్లు ఇతర పథకాలకు మళ్లిస్తూ గతేడాది జనవరిలో జీఓ.18 ఇచ్చింది. ఆలయాల నిర్వహణ కోసం దాతలు ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాల కోసం తీసుకోవచ్చని గత జూలై 4న జీఓ జారీ చేసింది. చేయాల్సినవన్నీ చేసి ఇప్పుడు నటిస్తే ఆ పాపాలు పోవు’ అని పట్టాభి మండిపడ్డారు. రాష్ట్రంలో విధ్వంసానికి గురైన ఒక్క దేవాలయాన్ని కూడా జగన్ ఇంతవరకూ సందర్శించలేదని, తనపై వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవడానికే ఇప్పుడు ఆలయాల నిర్మాణం పేరుతో హడావుడి చేస్తున్నారని పట్టాభి విమర్శించారు. జగన్ ఫేక్ క్రైస్తవుడని, క్రైస్తవ మతం ప్రబోధించిన విశ్వాసాలేవీ ఆయన ఒంటపట్టించుకోలేదన్నారు. ‘క్రైస్తవ మతం పాటించే దళితులపై అమానుషంగా దాడులు జరిగినా, జగన్ పట్టించుకోలేదు. రూ.వేల కోట్ల ప్రభుత్వ సొమ్ము కాజేయాలని ఏ బైబిల్ ఆయనకు చెప్పింది? దళిత ఎంపీ అర్ధాంతరంగా మరణిస్తే వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించే ఆలోచన కూడా ఆయనకు రాలేదు. వేల కోట్ల ఆస్తులున్నా జగన్ రెడ్డి గానీ, ఆయన బావ అనిల్ గానీ తమ సంస్థల పేరుతో ఎక్కడైనా ఒక్క సేవాకార్యక్రమమైనా అమలు చేశారా? దోచుకొని తినడం తప్ప, ఇతర క్రైస్తవ సంస్థలు చేసినవాటిలో కనీసం ఒకవంతు కూడా వారు చేయలేదు’ అని ఆయన ఆరోపించారు. ముస్లిం మైనారిటీలను కూడా ఈ ప్రభుత్వం వదిలిపెట్టలేదని, నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొందని పట్టాభి గుర్తుచేశారు.
Updated Date - 2021-01-09T09:15:30+05:30 IST