సుప్రీం తదుపరి సీజేఐగా తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ
ABN, First Publish Date - 2021-04-06T17:15:45+05:30
జస్టిస్ ఎన్వీ రమణ 48వ భారత ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని ఓ రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2000 జూన్‌లో నియమితులయ్యారు.
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వేంకట రమణ పేరుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. జస్టిస్ బాబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయబోతున్న సంగతి తెలిసిందే. జస్టిస్ బాబ్డే 47వ సీజేఐగా 2019 నవంబరులో ప్రమాణ స్వీకారం చేశారు. మార్చిలో జస్టిస్ రమణ పేరును కేంద్ర న్యాయశాఖకు సీజేఐ బోబ్డే ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఇవాళ ఆమోదముద్ర పడింది. ఏప్రిల్ 24న కొత్త సీజేఐగా జస్టిస్ రమణ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
జస్టిస్ ఎన్వీ రమణ 48వ భారత ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని ఓ రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2000 జూన్‌లో నియమితులయ్యారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ ఎస్ఏ బాబ్డే తర్వాత సీనియర్ మోస్ట్ జడ్జి.
జస్టిస్ రమణ ఏప్రిల్ 24న ప్రమాణ స్వీకారం చేస్తారు. 1957 ఆగస్టు 27న జన్మించిన జస్టిస్ రమణ 2022 ఆగస్టు 26 వరకు సీజేఐగా కొనసాగుతారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నుంచి సీజేఐగా నియమితులయ్యే రెండో సీజేఐగా ఆయన రికార్డు సృష్టించబోతున్నారు. సీజేఐగా తొలిసారి బాధ్యతలు నిర్వహించిన తెలుగు తేజం జస్టిస్ కోకా సుబ్బారావు. ఆయన 1966-1967 మధ్య కాలంలో సీజేఐగా వ్యవహరించారు. అంతకుముందు ఆయన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. జమ్మూ-కశ్మీరులో ఇంటర్నెట్ సస్పెన్షన్‌ను తక్షణమే సమీక్షించాలని రూలింగ్ ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ రమణ కూడా ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి పదవి సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని చెప్పిన జడ్జీల ప్యానెల్‌లో కూడా ఆయన ఉన్నారు.
Updated Date - 2021-04-06T17:15:45+05:30 IST