పెరిగిన నేరాలు
ABN, First Publish Date - 2021-12-31T06:36:15+05:30
నేరాలు పెరిగాయి. కేసులూ పెరిగాయి. అదే సమయంలో రికార్డు స్థాయిలో చోరీ కేసుల్లో రికవరీ నమోదైంది.
రికవరీలూ అధికమే
పది అంశాల్లో జిల్లా టాప్
92 శాతం రికవరీతో అగ్రస్థానం
విజయవాడ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : నేరాలు పెరిగాయి. కేసులూ పెరిగాయి. అదే సమయంలో రికార్డు స్థాయిలో చోరీ కేసుల్లో రికవరీ నమోదైంది. ఇదీ ఈ ఏడాది జిల్లా పోలీసు ప్రగతి. ఈ ఏడాది వార్షిక నేర గణాంకాలను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గురువారం వెల్లడించారు. విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాకు ఈ వివరాలను విడుదల చేశారు. 2020 కంటే 2021లో నేరాల సంఖ్య 18 శాతం పెరిగింది. 2020లో జిల్లాలో మొత్తం 20,911 కేసులు నమోదవగా, ఈ ఏడాది ఆ సంఖ్య 24,862కి చేరింది. వివిధ కేసులకు సంబంధించిన చార్జిషీటు దాఖలులో 66 శాతం ప్రగతి కనిపించింది. 2020లో ఆయా కేసుల్లో 16,417 చార్జిషీట్లు దాఖలు చేయగా, ఈ ఏడాది 27,396 చార్జిషీట్లను దాఖలు చేశారు. గత ఏడాది రోజుకు 37 కేసులను దర్యాప్తు చేసిన పోలీసులు, ఈ ఏడాది 75 కేసులు దర్యాప్తు చేశారు. గత ఏడాది ఒక కేసు దర్యాప్తుకు 68 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు 34 రోజుల్లో పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 1,651 కేసులు నమోదు చేశారు. గత ఏడాది ఇది 1,229గా ఉంది.
ఎక్సైజ్ కేసుల్లో నెంబర్ వన్
ఎక్సైజ్ కేసుల నమోదులో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన ఏడాది 5,253 కేసులు నమోదు చేయగా, ఈ ఏడాది ఆ సంఖ్య 5,420కి పెరిగింది.
నాటు సారా కేసులూ ఎక్కువే
లంక గ్రామాల్లో నాటు సారా నిషేధం విషయంలో గడిచిన ఏడాది 764 కేసులు నమోదు చేశారు. 2021లో 1,026 కేసులు నమోదు చేసి, 1,093 మందిని అరెస్టు చేశారు. 14,216 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు. దీని విలువ రూ.52లక్షల13వేల689. ఈ ఏడాది 60 కేసుల్లో రూ.29లక్షల35వేల660 విలువ గల 1239 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గుట్కా కేసుల నమోదులో నెంబర్ వన్
గుట్కా విక్రయాలకు సంబంధించి 1,054 కేసులు నమోదు చేసి 1,220 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.కోటి 25లక్షల16వేల758 విలువ చేసే సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల నమోదులో రాష్ట్రంలో కృష్ణా ప్రథమ స్థానంలో నిలిచింది.
పేకాట, కోడిపందేల కేసులు 10,818 నమోదు చేసి, 12,737 మందిని అరెస్టు చేశారు. ఈ కేసుల నమోదు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలోనే అత్యధికం.
నేరాల నియంత్రణలో భాగంగా ఈ ఏడాది 3,265 మందిని బైండోవర్ చేశారు. గడిచిన ఏడాది 1,811 మందిని బైండోవర్ చేశారు.
వివిధ చోరీ కేసుల్లో కోల్పోయిన సొత్తును స్వాధీనం చేయడంలోనూ జిల్లా ముందు వరుసలో నిలిచింది. 2020లో 497 దొంగతనాలు జరగ్గా వాటిలో 309 కేసులను పోలీసులు ఛేదించారు. ప్రజలు రూ.3.83 కోట్ల సొత్తును కోల్పోగా, రూ.2.03 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది 702 కేసుల్లో 632 కేసులను ఛేదించారు. ఈ చోరీల్లో మొత్తం రూ.7.1కోట్ల సొత్తును ప్రజలు కోల్పోయారు. అందులో రూ.6.5 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రికవరీలో జిల్లా పోలీసు విభాగం 92 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ ఏడాది జిల్లాలో మొత్తం 892 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 379 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఐటీఎస్‌ఎస్‌వో (ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్) విషయంలో దేశంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. దిశ యాప్‌ను జిల్లాలో 17లక్షల7వేల401 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ డౌన్‌లోడ్‌లోనూ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.
ఇప్పటి వరకు పోలీసులకు మాత్రమే సహకార పరపతి సంఘం ఉండేది. ఈ ఏడాది హోంగార్డులకు కూడా ప్రత్యేక సహకార పరపతి సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా వారి ఆర్థిక అవసరాలకు రుణాలు మంజూరు చేయడం మొదలుపెట్టారు.
మరింత స్ఫూర్తితో పనిచేస్తాం
పనితీరు పరంగా 2021 ఎంతో సంతృప్తిని ఇచ్చింది. కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. మొత్తం పది అంశాల్లో జిల్లా పోలీసు విభాగం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఘనత జిల్లా పోలీసులందరికీ దక్కుతుంది. త్వరలోనే శిథిలావస్థకు చేరుకున్న ఠాణాలకు కొత్త భవనాలను నిర్మిస్తాం. అటు సిబ్బంది సంక్షేమాన్ని, ఇటు ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని పనితీరును మరింత మెరుగు పరుచుకుంటాం. మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి ఈ ఏడాది గణాంకాలు పరిశీలిస్తే కేసులు పెరిగినట్టు కనిపిస్తోంది. వాస్తవానికి ఇది పెరుగుదల కాదు. మహిళలకు సేవలను, రక్షణను పెంచడంగా భావించాలి. - సిద్ధార్థ కౌశల్, జిల్లా ఎస్పీ
Updated Date - 2021-12-31T06:36:15+05:30 IST