గిరిప్రదక్షిణ చేసే భవానీ భక్తులకు సౌకర్యాలు కల్పించాలి
ABN, First Publish Date - 2021-12-19T06:58:53+05:30
గిరిప్రదక్షిణ చేసే భవానీ భక్తులకు సౌకర్యాలు కల్పించాలి
రహదారుల దుస్థితిపై కలెక్టరు దృష్టికి తీసుకువెళ్లండి
డయల్ యువర్ ఈవో’లో ఓ భక్తుడి ఫిర్యాదు
అధ్వాన రహదారుల పరిస్థితిపై సీపీ కాంతిరాణా ఆరా
విజయవాడ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): భవానీ దీక్షల విరమణ ఉత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భవానీ భక్తులు జగన్మాత కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షిణ చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటరు ప్రాంతానికి చెందిన భక్తుడు సత్యనారాయణ దుర్గగుడి ఈవో డి.భ్రమరాంబకు విజ్ఞప్తి చేశారు. దేవదాయశాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రతినెలా ఒకటో శనివారం, మూడో శనివారాల్లో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈవో భ్రమరాంబ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈవో భ్రమరాంబ శనివారం తొలిసారిగా నిర్వహించిన ’డయల్ యువర్ ఈవో’ కార్యక్రమానికి విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటరుకు చెందిన సత్యనారాయణ ఫోన్ చేశారు. ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న భవానీ దీక్షల విరమణ ఉత్సవాలకు తరలివచ్చే భక్తులు గిరిప్రదక్షిణ చేసేందుకు కొండ చుట్టూ రహదారులు సరిగా లేవని, రోడ్ల మధ్యలో ఏర్పడిన గోతులు, కంకర రాళ్లతో అడుగడుగునా భక్తులకు సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులపై శనివారం ’భక్తులకు పరీక్ష’ శీర్షికతో ’ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం గురించి ఆయన ప్రస్తావించారు. భవానీ భక్తులు గిరిప్రదక్షిణ చేసేందుకు సౌకర్యవంతంగా ఉండేలా రహదారులకు మరమ్మతులు చేయించాల్సిన ఆవశ్యకతను కలెక్టరు దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఈవో భ్రమరాంబకు సూచించారు. ఆమె సానుకూలంగా స్పందించారు. మరోవైపు నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా కూడా భవానీ భక్తులు గిరిప్రదక్షిణ చేసే రహదారుల దుస్థితిపై ఆరా తీశారు. శనివారం ఉదయం భవానీపురం పోలీసుస్టేషన్ నూతన భవనాన్ని సందర్శించిన ఆయన.. ఇంద్రకీలాద్రిపై ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న భవానీ దీక్షల విరమణ ఉత్సవాలకు బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్షించారు. ఆలయ పరిసరాల్లో రహదారులు, భవానీ భక్తులు గిరిప్రదక్షిణ చేసే రూటులో రోడ్ల పరిస్థితి ఎలా ఉందని స్థానిక పోలీసు అధికారులను అడిగారు. ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ ఉండే రోడ్లు భవానీపురం వైపు బాగానే ఉన్నాయని, చిట్టినగర్ ప్రాంతంలో రహదారుల పరిస్థితి అస్తవ్యస్తంగానే ఉందని పశ్చిమ జోన్ ఏసీపీ డాక్టర్ కె.హనుమంతరావు చెప్పారు. శనివారం వెలువడిన ’ఆంధ్రజ్యోతి’ కథనం కూడా ఇదే విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు ప్రారంభం కావడానికి వారం రోజులే ఉంది. ఈలోపు అధికారులు స్పందించి రహదారులకు కనీసం మరమ్మతులైనా చేయించి గిరిప్రదక్షిణ చేసే భవానీ భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దాలని అమ్మవారి భక్తులు కోరుతున్నారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చిట్టినగర్ ప్రాంతంలోని తన నివాసం నుంచి రోజూ అధ్వానంగా ఉన్న ఆ రహదారుల మీదుగానే తన కార్యాలయానికి వెళుతుంటారని, నగర ప్రథమ పౌరురాలిగా ఆమె ప్రత్యేక చొరవ తీసుకుని చిట్టినగర్ సెంటరు నుంచి ధ్వంసమైన రహదారులను యుద్ధప్రాతిపదికన పునర్నిర్మించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Updated Date - 2021-12-19T06:58:53+05:30 IST