బందరులోనూ పేకాట దందా!
ABN, First Publish Date - 2021-01-11T06:20:06+05:30
బందరులోనూ పేకాట దందా సాగుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు.

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర
మచిలీపట్నం టౌన్, జనవరి 10 : బందరులోనూ పేకాట దందా సాగుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని కనుసన్నల్లో పేకాట ఆటలపై చాలా కాలం నుంచి చెబుతున్నామని, పోలీసులు దాడులు చేయగా మంత్రి బంధువులు, స్నేహితులే పేకాట ఆడుతున్నట్టు తేటతెల్లమయిందని చెప్పారు. మరో మంత్రి పేర్ని నాని కనుసన్నల్లో మచిలీపట్నం నియోజకవర్గంలో భాస్కరపురం, బైపాస్‌రోడ్డు, బలరామునిపేట విచ్చలవిడిగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారన్నారు. రైల్వేస్టేషన్, బైపాస్‌రోడ్డులలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. భాస్కరపురానికి చెందిన ఒక వ్యక్తి పేకాట ఆడి ఆస్తులు అమ్ముకుని ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడంతో సీఎం జగన్‌మోహనరెడ్డికి చలిజ్వరం పుట్టిందన్నారు. సీఎం ఎన్నికల సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరే కంగా ఓటు వేస్తారని చెప్పినట్టు తెలుస్తోందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా సుప్రీం కోర్టుకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు కుంచే నాని, లంకే శేషగిరిరావు, వాడపల్లి బాలాజీ సువర్ణకుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2021-01-11T06:20:06+05:30 IST