అధికార దుర్వినియోగం!
ABN, First Publish Date - 2021-02-11T06:21:00+05:30
తొలిదశ ఎన్నికల పోలింగ్‌లో అధికార దుర్వినియోగంపై టీడీపీ నాయకులు భగ్గుమంటున్నారు.
- కౌంటింగ్‌లో పక్షపాత వైఖరిపై భగ్గుమంటున్న టీడీపీ
- పోలీసులు, ఎన్నికల అధికారుల తీరుపై ఆరోపణలు
- స్వల్ప ఓట్ల తేడాతో పలు చోట్ల ‘టీడీపీ’ ఓటమి
కర్నూలు, ఆంధ్రజ్యోతి: తొలిదశ ఎన్నికల పోలింగ్‌లో అధికార దుర్వినియోగంపై టీడీపీ నాయకులు భగ్గుమంటున్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. అయినా చాలాచోట్ల వైసీపీకి దీటుగా తమ మద్దతుదారులు నిలబడ్డారని, ప్రజలు ఆశీర్వదించారని చెబుతున్నారు. స్వల్ప తేడా ఉన్న చోట్ల టీడీపీ మద్దతుదారులు రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసినా అధికారులు పట్టించుకోలేదు. కొన్నిచోట్ల టీడీపీ ముఖ్య నాయకుల వైఫల్యం కూడా ఆ పార్టీ మద్దతు దారుల ఓటమికి కారణమైనట్లు తెలుస్తోంది.
ఎక్కడెక్కడ ఏమైంది?
మహానంది మండలం మసీదుపురంలో టీడీపీకి పట్టు ఉంది. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఓడిపోవడానికి అధికార పార్టీ నాయకుల బెదిరింపులు కారణమని, పింఛన్లు, రేషన్ కార్డులు కట్ చేస్తామని హెచ్చరించారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి స్వగ్రామమైన వెలుగోడు మండలంలోని వేల్పనూరులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఈ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా సోదరుడు, వైసీపీ రాష్ట్ర నాయకుడు బుడ్డా శేషారెడ్డి బలపర్చిన సద్దామ్‌మియ్య 321 ఓట్లతో గెలుపొందారు. బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సొంత గ్రామంలో టీడీపీ ఓటమిపాలవ్వడం చర్చనీయాంశమైంది. ఆయన సొంత మండలమైన వెలుగోడులో 8 గ్రామపంచాయతీల్లోనూ వైసీపీ మద్దతుదారులే విజయం సాధించారు.
బండి ఆత్మకూరు పంచాయతీలో టీడీపీకి మంచి పట్టుఉంది. గత సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారే సర్పంచ్‌గా గెలిచారు. ప్రస్తుతం టీడీపీ మద్దతుదారు అభ్యర్థి సుబ్బమ్మ ఓడిపోయారు. రేషన్ కార్డులు, పింఛన్లు, తదితర పథకాలు తీసేస్తామని అధికారపార్టీ నాయకులు బెదిరింపులకు దిగారని టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఆళ్లగడ్డలో నాయకత్వ లోపం
నాయకత్వ లోపంతోనే చాగలమర్రి, శిరివెళ్ల, ఎర్రగుంట్ల, రుద్రవరం మేజర్ పంచాయతీల సర్పంచ్ పదవులను టీడీపీ పొగొట్టుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాయకులు సమష్టిగా పని చేసి ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవని చెబుతున్నారు. దీన్ని వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకుంది. 2013 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ బలపరచిన సర్పంచు అభ్యర్థులు 53 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత పోలింగ్ జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం టీడీపీ మద్దతుదారులే విజయం సాధించారు. ప్రస్తుతం 76 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 22తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
స్వల్ప ఓట్లతో తేడాతో..
చాగలమర్రి మండలం తోడేండ్లపల్లె సర్పంచ్ పదవికి వైసీపీ బలపరచిన అభ్యర్థి చేతిలో 6 ఓట్ల తేడాతో టీడీపీ మద్దతుదారు ఓడిపోయారు. గొడిగనూరు గ్రామ పంచాయతీకి టీడీపీ బలపరచిన అభ్యర్థి కేవలం 7 ఓట్లతో ఓటమి చెందారు. ఈ రెండు గ్రామ పంచాయతీల్లో రీకౌంటింగ్ నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారులను ప్రాధేయపడినా పట్టించుకోలేదు.
నంద్యాల మండలం అయ్యలూరులో 5 వేలకుపైగా ఓట్లు ఉన్నాయి. టీడీపీకి మంచి పట్టు ఉన్న ఈ గ్రామంలో వైసీపీ మద్దతు ఇచ్చిన ఓబులేసు సర్పంచ్‌గా గెలిచారు. టీడీపీ వర్గీయులకు నియోజకవర్గ స్థాయి నాయకుల నుంచి సాయం అందకపోవడం వైసీపీకి కలిసొచ్చిందన్న ప్రచారం సాగుతోంది.
మూడు పంచాయతీల్లో కౌంటింగ్ ఆలస్యం
నంద్యాల నియోజకవర్గంలో మంగళవారం జరిగిన పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. అర్థరాత్రి దాటాక (10వ తేదీ బుధవారం తెల్లవారు) ఫలితాలను మూడు పంచాయతీలకు ప్రకటించాల్సి వచ్చింది. నంద్యాల మండలంలోని కానాలలో 5355 ఓట్లు, అయ్యలూరులో 5081, గోస్పాడు మండలం యాళ్ళూరులో 6786 ఓట్లు ఉండటంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మూడు పంచాయతీల్లో వైసీపీ మద్దతు ఇచ్చినవారే గెలిచారు.
రీ కౌంటింగ్ చేయాల్సిందే
నంద్యాల (ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 10: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. నంద్యాల మండలం బిళ్లలాపురం, మహానంది మండలం బుక్కాపురం పంచాయతీల ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని, రీ కౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం భారీ ఎత్తున ధర్నా చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. బిళ్లలాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో 10 వార్డులకు గాను 6 వార్డుల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ సాధించారు. 4 వార్డుల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ ఓట్లు సాధించారు. చివరకు 14 ఓట్లతో వైసీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందినట్లు ఆర్‌వో ప్రకటించారు. దీంతో రీ కౌంటింగ్ జరపాలని టీడీపీ బలపరిచిన అభ్యర్థి, పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరారు. దీనికి అధికారులు అంగీకరించకపో వడంతో అర్థరాత్రి వరకు గ్రామంలో ఆందోళన చేశారు. బుక్కాపురం పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయినట్లు ప్రకటించారు. ఇక్కడ కూడా రీకౌంటింగ్ చేయాలని కోరినా ఆర్‌వో పట్టించుకోలేదు. దీంతో టీడీపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. రెండు పంచాయతీల అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయానికి బుధవారం చేరుకొని ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద జరిగిన హై డ్రామా గురించి అభ్యర్థులు ఎమ్మెల్సీ ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి వివరించారు. ఇద్దరు నాయకులు సబ్ కలెక్టర్ కల్పనా కుమారికి వినతిపత్రం ఇచ్చేందుకు కార్యాలయంలోనికి వెళ్ళారు. అయితే ఎన్నికల కేంద్రంలో ఆర్‌వోదే తుది నిర్ణయమని, దానిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదని సబ్ కలెక్టర్ కల్పనా కుమారి వారికి వివరించారు. న్యాయం కావాలంటే కోర్టును ఆశ్రయించాల్సిందేనని వారికి స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యం అపహాస్యం: ఫరూక్
వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్ ధ్వజమెత్తారు. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని, రీ కౌంటింగ్ నిర్వహించాలని అభ్యర్థులు ఆర్‌వోకి విన్నవించినా స్పందిచకుండా డిక్లరేషన్ ఫారాలను అందించడం సరికాదని అన్నారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థులకు ఇలా జరగడం చాలా బాధగా ఉందని అన్నారు. ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం సరైన పద్ధతికాదని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం కోసం దౌర్జన్యాలు, అరాచకాలు, బెదిరింపులతో వైసీపీ దుర్మార్గంగా వ్యవహరించిందని ఆరోపించారు. జగన్ పాలన హిట్లర్ పాలనకు రెండింతలుగా కనిపిస్తోందని విమర్శించారు.
ఆర్వోల తీరు సరికాదు: భూమా బ్రహ్మానందరెడ్డి
బిళ్లలాపురం, బుక్కాపురంలో ఆర్‌వోలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. కౌంటింగ్ సమయంలో అవకతవకలు జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా అభ్యర్థుల విన్నపాలను స్వీకరించి రీ కౌంటింగ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆయన అన్నారు. కానీ రెండు చోట్ల ఆర్‌వోలు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. అంతకుమునుపు బిళ్లలాపురం, బుక్కాపురం గ్రామ పంచాయతీలకు రీ కౌంటింగ్ చేయాలని బాధితులతో కలిసి తహసీల్దార్ రవికుమార్‌కు ఫరూక్, బ్రహ్మానందరెడ్డి వినతిపత్రం సమర్పించారు.
Updated Date - 2021-02-11T06:21:00+05:30 IST