ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొరుగు సంస్థే ‘అమూల్యం’

ABN, First Publish Date - 2021-01-08T08:16:45+05:30

ఏపీ డెయిరీ ఫెడరేషన్‌ ఆస్తులు పరాధీనం కానున్నాయి. కోట్ల విలువైన ఫెడరేషన్‌ ఆస్తులను ‘అమూల్‌’ సంస్థకు ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అమూల్‌కు ఏపీ ‘డెయిరీ’ ఆస్తులు
  • లీజు ముసుగులో ధారాదత్తానికి సిద్ధం
  • సొంత డెయిరీలు నిర్వీర్యం చేసి పొరుగు సంస్థపై ఉదారత

అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఏపీ డెయిరీ ఫెడరేషన్‌ ఆస్తులు పరాధీనం కానున్నాయి. కోట్ల విలువైన ఫెడరేషన్‌ ఆస్తులను ‘అమూల్‌’ సంస్థకు ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో అమూల్‌ ప్రాజెక్టు అమలు కోసం రూ.6,651 కోట్లతో 9,899 గ్రామాల్లో ఆటోమేటిక్‌ పాల సేకరణ కేంద్రాలు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, ప్రొసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన జగన్‌ సర్కారు.. ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లోని దాదాపు 400 గ్రామాల్లో అమూల్‌ కోసం పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్‌ కోఆపరేటీవ్‌ ఫెడరేషన్‌’ ఆస్తులన్నీ అమూల్‌కు అప్పగించేందుకు చర్యలు చేపట్టింది.


దీనిలో భాగంగా ఫెడరేషన్‌ ఆస్తుల్ని అమూల్‌కు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. లీజు విలువను ఖరారు చేసేందుకు న్యాయ, రెవెన్యూ, ఆర్థిక, పరిశ్రమలు, పశుసంవర్థక శాఖల ఉన్నతాధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది. డెయిరీ ఫెడరేషన్‌ భూములు, భవనాలు, ప్లాంట్లు, మిషనరీని ఎంతకు లీజుకు ఇవ్వవచ్చో ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఫెడరేషన్‌ ఆస్తుల విలువ, వాటి పనితీరు, ఇతర అంశాలను పరిశీలించి కమిటీ లీజును ఖరారు చేస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే లీజు ముసుగులో రూ.కోట్ల విలువైన ఫెడరేషన్‌ ఆస్తులను అమూల్‌కు ధారాదత్తం  చేయడానికి ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నట్లు సమాచారం.


డెయిరీల మనుగడకే ముప్పు

ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ డెయిరీని దెబ్బతీసేందుకు రాష్ట్రప్రభుత్వం అమూల్‌ సంస్థకు ఊతమిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ చర్యలతో హెరిటేజ్‌తో పాటు మరికొన్ని ప్రైవేటు డెయిరీల మనుగడకు ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చింది. అలాగే సహకార రంగంలోని 7 డెయిరీలు పూర్తిగా నిర్వీర్యమవడం ఖాయంగా కన్పిస్తోంది. పాల సేకరణలో ఎప్పటినుంచో నాణ్యమైన, నమ్మకమైన సేవలందిస్తున్న డెయిరీలను విస్మరించి అమూల్‌ను ప్రభుత్వమే రాష్ట్రంలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఒప్పందం అమలుకు ప్రభుత్వం జిల్లాకో ప్రత్యేక అధికారిని సైతం నియమించింది. అయితే అమూల్‌ తొలి దశలో చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో పాల సేకరణ చేపట్టింది. ఈ మూడు జిల్లాల్లో ప్రభుత్వమే ఆ సంస్థకు మౌలిక వసతలు కల్పించింది. తాజాగా మరో అడుగు ముందుకేసి లీజు రూపంలో డెయిరీ ఫెడరేషన్‌ ఆస్తులను కూడా అప్పగించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డెయిరీ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఉన్న చిత్తూరు, ఒంగోలు, కృష్ణవేణి, గోదావరి వంటి 7 డెయిరీలను అమూల్‌కు అప్పగించేందుకు లీజును ప్రతిపాదించింది. రాష్ట్రంలోకి అమూల్‌ రంగప్రవేశంతోనే ప్రభుత్వం సహకార రంగంలో ఉన్న డెయిరీలు పూర్తిగా కనుమరుగయ్యేలా వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తాయి.


ఇప్పుడు తాజాగా లీజు నిర్ణయం వాటికి మరింత బలం చేకూరుస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ డెయిరీ ఫెడరేషన్‌లో పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) ద్వారా గుజరాత్‌ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని ఆఫర్‌ చేసింది. కొన్నేళ్లుగా ఈ డెయిరీలు ఒడిదుడుగుల్లో ఉన్నాయి. జీతాలు సరిగా అందడం లేదు. దీంతో రెగ్యులర్‌ ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ ప్యాకేజీకి ఆకర్షితులవుతున్నారు. ఇదే అదునుగా ఫెడరేఫన్‌ ఆస్తులను అమూల్‌కు లీజుకివ్వడం ద్వారా ఆ సంస్థ బలపడటానికి ప్రభుత్వమే దోహదం చేస్తోంది. దీనివల్ల విలువైన ఆస్తులు పరాధీనం కావడం ఖాయమని డెయిరీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక డెయిరీలను విస్మరించి, పొరుగు సంస్థకు ఉదారంగా నిధులు వెచ్చించడం, ఏకంగా ఫెడరేషన్‌ ఆస్తులనే అప్పగించడం వంటి చర్యలను డెయిరీ రంగ నిపుణులు తప్పుబడుతున్నారు. వాస్తవంగా పాలు ఉత్పత్తి చేసే పశుపోషకులకు లీటర్‌కు రూ.4 అదనంగా బోనస్‌ రూపంలో ఇస్తామని ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ప్రకటించి, అధికారం చేపట్టాక, బోనస్‌ విషయాన్ని వదిలేసి, అమూల్‌కు పాలు పోయడం వల్ల లీటరు పాలకు రూ.4 అదనంగా వచ్చేలా చేశామని ప్రభుత్వ పెద్దలు చెప్పడాన్ని పాల ఉత్పత్తిదారులు కూడా ఆక్షేపిస్తున్నారు.

Updated Date - 2021-01-08T08:16:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising