వైద్య శిఖరం.. కాకర్ల కన్నుమూత
ABN, First Publish Date - 2021-04-17T09:04:59+05:30
ప్రఖ్యాత రేడియాలజిస్టు, నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) రూపశిల్పి, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కాకర్ల సుబ్బారావు(97) ఇక లేరు.
సుప్రసిద్ధ రేడియాలజిస్టుగా గుర్తింపు
నిమ్స్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా విశేష సేవలు
మాజీ సీఎం ఎన్టీఆర్‌కు సన్నిహితుడిగా పేరు
అబ్దుల్ కలాంతో అనుబంధం.. రేడియాలాజికల్,
ఇమేజింగ్ ఎడ్యుకేషనల్ సైన్సెస్ ట్రస్టు ఏర్పాటు
2000లో పద్మశ్రీతో కేంద్రం సత్కారం
కాకర్ల మృతిపై పలువురు ప్రముఖుల సంతాపం
‘‘అడుగుపెట్టెడు నొకసారె అవనియందు
సేవ చేయదు జనులకు చిత్తశుద్ధి
వ్యర్ధ పరచక కాలంబు స్పర్థలందు
మనిషినైరాను పుడమికి మరలనేను’’...
ఈ మాటలను తన స్వీయ రచనలో రాసుకోవడమే కాదు, తుది వరకూ ఆచరించారు కాకర్ల సుబ్బారావు.
హైదరాబాద్ సిటీ/కూచిపూడి/చల్లపల్లి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత రేడియాలజిస్టు, నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) రూపశిల్పి, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కాకర్ల సుబ్బారావు(97) ఇక లేరు. వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలతో కొన్నాళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. శుక్రవారం ఉదయం 7.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. తన 97 సంవత్సరాల జీవితంలో 70 ఏళ్లు వైద్య రంగానికే అంకితం చేశారు. అది కూడా బోధనలోనే ఎక్కువకాలం గడిపారు. రెండేళ్ల కిందటి వరకూ ఆయన వైద్య కళాశాలల్లో బోధన చేశారు.
కృష్ణా జిల్లా నుంచి...
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెదముత్తేవిలో కాకర్ల వెంకటరత్నం, మాణిక్యమ్మ దంపతులకు 1925 జనవరి 25న కాకర్ల సుబ్బారావు జన్మించారు. చల్లపల్లి జమిందారు పాఠశాలలో ఎస్‌ఎ్‌సఎల్సీ పూర్తి చేసిన తర్వాత మచిలీపట్నం హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్‌లో చేరారు. అదే సమయంలో ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. మంచి మార్కులతో ఇంటర్మీడియ్‌ట్ పూర్తి చేసిన సుబ్బారావు.. ఇంజనీరింగ్ చదవాలన్న ఆకాంక్షతో చెన్నైలోని గిండి కాలేజీకి దరఖాస్తు చేశారు. అప్పుడే మెడిసిన్‌కూ దరఖాస్తు చేసిన సుబ్బారావుకు ఆంధ్రా మెడికల్ కాలేజీలో సీటొచ్చింది. మిత్రుడు పద్మనాభయ్య సాయంతో 1946లో వైద్యవిద్యలో చేరారు. విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రిలో ఇంటర్నషిప్ చేశారు.
రేడియాలజీలో నిపుణత...
ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్షతో 1951లో అమెరికా వెళ్లిన సుబ్బారావు అక్కడి బ్రాంక్స్ ఆస్పత్రిలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ, న్యూయార్క్ వర్సిటీలో రేడియాలజీలో ఎంఎస్ పూర్తి చేశారు. ఎయిమ్స్‌లో అవకాశం కల్పిస్తానని నాటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అమృత్‌కౌర్ హామీ ఇవ్వడంతో 1956లో స్వదేశానికి తిరిగొచ్చారు. కానీ, అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల ఆమె పదవి కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో సుబ్బారావు హైదరాబాద్ వచ్చారు. నిజాం ప్రభుత్వ మాజీ పాలనాధికారి మెహదీ నవాజ్‌జంగ్ సహకారంతో రూపాయి గౌరవ వేతనంతో ఉస్మానియా ఆస్పత్రిలో రేడియాలజిస్టుగా చేరారు. అదే ఏడాది ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికయ్యారు.
ఐదేళ్లలోనే ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 1969 వరకు ఆచార్యుడిగా సేవలందించారు. 1969లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జరిగిన ఘర్షణ కారణంగా మరుసటి ఏడాదే అమెరికా వెళ్లారు. అంతకు ముందే ఫెలో ఆఫ్ అమెరికన్ కాలేజీ ఆఫ్ రేడియాలజీ, ఫెలో ఆఫ్ రాయల్ కాలేజీ ఆఫ్ రేడియాలజీ పట్టాలు అందుకున్నారు. అమెరికాలో శుశ్రుత్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ సంస్థ ద్వారా ఎంతో మంది భారతీయ వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. తానా వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలందించారు. అమెరికన్ బోర్డు ఆఫ్ రేడియాలజీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సలహాదారుడిగా వ్యవహరించారు. మెడికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ జనరల్‌కు గౌరవ ఎడిటర్‌గా ఉన్నారు.
2000లో పద్మశ్రీ పురస్కారం
కాకర్ల సుబ్బారావు 1992లో మారిషస్ ప్రభుత్వ వైద్య సలహాదారుడిగా వ్యవహరించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ నుం చి 2003లో డాక్టర్ ఆఫ్ సైన్సెస్ పట్టా పొందారు. రేడియాలజీలో తన అనుభవాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో 2007లో రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ ఎడ్యూకేషనల్ సైన్సెస్(క్రెస్టు)ను నెలకొల్పారు. తుది వరకు నిమ్స్, కిమ్స్ వైద్యకళాశాలలో వారానికి రెండు రోజులు ఆయన పాఠాలు బోధించారు. గతంలో బసవతారకం కేన్సర్ ఆస్సత్రికి ట్రస్టీగానూ ఉన్నారు. తన తండ్రి స్ఫూర్తితో 1993లో షేక్‌పేట్ వద్ద ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించారు. విద్య, వైద్య రంగాల్లో విశిష్ట సేవలందించిన కాకర్ల సుబ్బారావు సాహితీ ప్రియుడు కూడా.
శ్రీశ్రీ, జాషువా, గోపీచంద్, దాశరథి రచనలతోపాటు సమకాలీన సాహిత్యం, ముఖ్యంగా తెలంగాణ కథలను ఇష్టంగా చదువుతుంటానని ఒక సందర్భంలో ఆయన వెల్లడించారు. 2000లో కాకర్ల సుబ్బారావును భారత ప్రభు త్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రేడియాలజిస్టు ఆఫ్ మిలీనియం అవార్డుతో పాటు తెలుగు ఆత్మగౌరవ పురస్కారం, ఉత్తమ వైద్యుడు, జాతిరత్న, పరమశ్రీ, రాజీవ్ రత్న, సన్ ఆఫ్ ఇండియా, కుముదిని నాయక్ గోల్డ్‌మెడల్‌ను కాకర్ల అందుకున్నారు.
కలాంతో స్నేహం...
మాజీరాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కాకర్ల సుబ్బారావుకు ఆత్మీయ అనుబంధం ఉంది. హైదరాబాద్ డీఆర్‌డీవోలో కలాం పనిచేస్తున్న సమయంలో ఒకసారి నిమ్స్‌ను సందర్శించారు. అప్పటి నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. కలాం తలకు గాయమైనప్పుడు.. కాకర్ల చికిత్స అందించారు.
ఇష్టపడి కొన్న కారు అమ్మేసి..
కాకర్ల సుబ్బారావు అమెరికా వెళ్లిన తొలినాళ్లలో చాలా ఇష్టంగా ‘షెవర్లేట్ ఇంపాలా’ కారు కొన్నారు. తర్వాత స్వదేశానికి తిరిగొస్తూ కారును అక్కడే వదిలేయలేక కార్గో షిప్‌లో ఇక్కడకు తెప్పించారు. అప్పట్లో ఆ మోడల్ కారు హైదరాబాద్‌లో ఒక్క సుబ్బారావు వద్దే ఉండేదట. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కారును సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావుకు అమ్మినట్లు కాకర్ల ఒక సందర్భంలో తెలిపారు.
చండ్ర రాజేశ్వరరావు పాఠాలు...
కాకర్ల సుబ్బారావు హైస్కూలులో చదువుతున్న సమయం లో గాంధీజీ అక్కడికి వచ్చారు. అదే స్ఫూర్తితో ఆయన ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక... కాకర్ల సుబ్బారావు పాఠశాల చదువుకుంటున్నప్పుడే ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు సాయంకాలం పాఠా లు చెప్పేవారు. తనలో కమ్యూనిస్టు భావజాలానికి చండ్ర పాఠాలే కారణమని కాకర్ల చెప్పేవారు. సుబ్బారావుకు సతీమణి లక్ష్మి, కుమార్తెలు సబిత, అమిత, కుమారుడు శుశ్రుత్ ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానం లో సుబ్బారావు అంత్యక్రియలు నిర్వహించారు.
కాకర్ల మృతి తీరనిలోటు: చంద్రబాబు
కాకర్ల సుబ్బారావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుబ్బారావు ప్రజల హృదయాల్లో నిలచిపోయారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. కాగా, తానా వ్యవస్థాపకులు, ప్రథమ అధ్యక్షులు డాక్టర్ కాకర్ల మృతి తమను దిగ్ర్భాంతికి గురిచేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రస్తుత అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకర్ల సుబ్బారావు గొప్ప వ్యక్తి అని తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ కొనియాడారు.
నిమ్స్‌కు తొలి డైరెక్టర్
తెలుగు నాట ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆస్పత్రి నిర్మించాలనే ఆశయంతో కాకర్ల సుబ్బారావును నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వదేశానికి ఆహ్వానించారు. అలా అమెరికా నుంచి తిరిగొచ్చిన ఆయన 1985 డిసెంబరు 2న నిమ్స్ తొలి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎముకల దవాఖానగా పేరుబడ్డ నిజాం ఆస్పత్రిని కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దారు. నిమ్స్‌కు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చారు. ఆనాటి రాజకీయ పరిణామాల కారణంగా 1991లో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అప్పుడు కొంతకాలం మెడ్విన్ ఆస్పత్రి చైర్మన్‌గా వ్యవహరించారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి పాలకమండలి చైర్మన్‌గానూ పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యసలహాదారుడిగా సేవలందించారు. 1997 మే 9న మళ్లీ నిమ్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కాకర్ల 2004 వరకూ కొనసాగారు.
Updated Date - 2021-04-17T09:04:59+05:30 IST