ఇచ్చారు.. ఆపేశారు
ABN, First Publish Date - 2021-08-22T08:27:51+05:30
కోర్టు ఆదేశించింది. ‘మా ఉపాధి నిధులు ఎప్పుడో ఇచ్చేశాం’ అని కేంద్రం తేల్చేసింది. ఉపాధి పథకం పనుల తీరుపై తనిఖీల కోసం రేపోమాపో రాష్ట్రానికి రానుంది. అయినా..ఉపాధి బిల్లుల్లో కిరికిరి కొనసాగుతూనే ఉంది. సర్కారుకు..
ఉపాధి బిల్లుల చెల్లింపుల్లో కిరికిరి
కోర్టు ఆదేశించినా.. కేంద్రమే నేరుగా రంగంలోకి దిగుతున్నా మారని శైలి
చెల్లించేశామని కోర్టుకు నివేదన
పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ
చెల్లింపులు మాత్రం చేయడం లేదు
గత ప్రభుత్వంలో చేసిన పనులివి
అప్పటి సర్పంచులు ఇప్పుడు మాజీలు
చెల్లింపులపై నేతల రాజకీయ ఒత్తిళ్లు
సర్పంచులను కలవాలని మెలికలు
ఇవ్వొద్దని ఎంపీడీవోలు, పంచాయతీ
కార్యదర్శులకు పైనుంచి హుకుం
కొన్నిచోట్ల ఆమ్యామ్యాల వసూలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కోర్టు ఆదేశించింది. ‘మా ఉపాధి నిధులు ఎప్పుడో ఇచ్చేశాం’ అని కేంద్రం తేల్చేసింది. ఉపాధి పథకం పనుల తీరుపై తనిఖీల కోసం రేపోమాపో రాష్ట్రానికి రానుంది. అయినా..ఉపాధి బిల్లుల్లో కిరికిరి కొనసాగుతూనే ఉంది. సర్కారుకు హైకోర్టు మొట్టికాయలువేసి.. ఉపాధి బిల్లుల్లో కొంత ఇప్పించినా, ‘విడుదల’లోని మతలబులతో పనులు చేయించిన మాజీ సర్పంచులకు ఇంతవరకు పైసా అందలేదు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లుల కోసం కోర్టుకు వెళ్లిన మాజీ సర్పంచులకు ఇప్పటికీ ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. కోర్టు ఆదేశాలతో ఉపాధి నిధులు గ్రామ పంచాయతీ ఖాతాలకు చేరాయి. ఇదే విషయం కోర్టుకు అధికారులు చెప్పారు.
అయితే, పనులు చేయించిన మాజీ సర్పంచులకు చాలాచోట్ల డబ్బులు అందలేదు. బిల్లుల కోసం న్యాయపోరాటంచేసి అనుకూల తీర్పును మాజీ సర్పంచులు తెచ్చుకున్నారు. నిధులు విడుదలచేయడంతోపాటు అవి వారిచేతికి అందేలా చూస్తేనే కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించినట్టు అవుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, పనిచేసిన వారంతా ‘టీడీపీ వారే’ననే భావనతో చాలాచోట్ల గ్రామస్థాయి అధికారులు ఇబ్బందిపెడుతున్నారు. స్థానిక వైసీపీ నేతల నుంచి ఎమ్మెల్యేల వరకు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తుంటే, అంత ఈజీగా బిల్లులు చెల్లించేయొద్దని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, ఎంపీడీవోలకు ఉన్నతాధికారులు నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. చెల్లించాల్సివచ్చిన సందర్భంలోనూ.. ‘మా వాటా ఎంత?’ అంటూ కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు బహిరంగంగానే బేరాలాడుతున్నట్టు తెలుస్తోంది. సర్పంచులుగా తమ గ్రామాలకు అవసరమైన ఉపాధిపనులను సొంత జేబు నుంచి ఖర్చుపెట్టినవారిలో అత్యధికులు ఇప్పుడు ‘మాజీ’లు అయ్యారు. అధిక వడ్డీలకు అప్పులుచేసి తెచ్చిన డబ్బులతో చేసిన పనులకు రెండున్నరేళ్లుగా బిల్లులు కాక తల్లడిల్లిపోతున్నారు.
కోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా...
రాష్ట్రంలో ఉపాధి పథకం ద్వారా చేపట్టిన పనులకు బకాయిలను ఆయా గ్రామ పంచాయతీలకు నెలలోపు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖను గతంలో హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రానికి కేంద్రం ఏయే తేదీల్లో నిధులు విడుదల చేసిందో వివరాలివ్వాలని, నిబంధనల ప్రకారం నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. దీంతో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ దృష్టి మన రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖపై పడింది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఇప్పటికే చెల్లించామని, ఈ పనులకు సంబంధించిన పాత బకాయిలు ఎందుకు చెల్లించలేదని అడిగిన కేంద్ర అధికారులనూ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టించింది. ఇప్పటి వరకు ఎఫ్‌టీవోలను టీసీఎస్ సాఫ్ట్‌వేర్ ద్వారా జనరేట్ చేస్తున్నామని, ఇక నుంచి సీఎ్‌ఫఎంఎస్ అమల్లోకి తీసుకొస్తున్నందున నిధుల విడుదల ఆలస్యమైందని కేంద్రానికి రాష్ట్రం లేఖ రాసింది. పెండింగ్ బిల్లులు త్వరలో చెల్లిస్తామని కూడా చెప్పింది.
ఈ పనుల్లో అవకతవకలు జరిగాయని, విచారణ అనంతరం చెల్లిస్తామని మరో దఫా కేంద్ర అధికారులను మభ్యపెట్టారు. అనంతరం హైకోర్టు ఆదేశాలు, కేంద్ర అధికారుల ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు దిగి వచ్చింది. అంచనా విలువ రూ.5 లక్షల లోపు ఉన్న పనులకు సంబంధించిన బిల్లులను 21 శాతం తగ్గించి చెల్లిస్తామని అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే కోర్టుకిచ్చిన ఆ అఫిడవిట్ విషయం మరిచిపోవడంతో ఈ ఏడాది మార్చి 30న హైకోర్టు మరోసారి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకిచ్చిన అఫిడవిట్ ప్రకారం ఎందుకు బిల్లులు విడుదల చేయలేదని నిలదీసింది. దీనిపై సరైన సమాధానం చెప్పకపోతే సీఎ్‌సను కోర్టుకు పిలిపిస్తామని హెచ్చరించడంతో రూ.5 లక్షల లోపు అంచనా విలువ కలిగిన పనులకు సంబంధించి సుమారు రూ.400 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఈ ఉత్తర్వులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. చెల్లింపులు చేశామంటూ ఉత్తర్వుల కాపీని కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో చూపించారు. అయితే నిధులు మాత్రం విడుదల చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని మాజీ సర్పంచులు మరో దఫా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గత నెలలోనూ హైకోర్టు ధర్మాసనం మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. జూలై నెలాఖరులోపు ఉపాధి బిల్లులు చెల్లించి ఆగస్టు మొదటి వారంలో అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించిం ది. జూలై 30న సుమారు రూ.59 కోట్ల మేర సీఎ్‌ఫఎంఎ్‌సలో పెండింగ్ బిల్లులను విడుదల చేసి, ఉపాధి బిల్లులు చెల్లించామని కోర్టుకు అఫిడవిట్లు ఇచ్చారు. అనంతరం మొత్తం రూ. 400 కోట్లు పంచాయతీలకు విడుదల చేసినట్టు పేర్కొంది. ఈ బిల్లులన్నీ రూ.5 లక్షల లోపు అంచనా విలువ కలిగిన పనులవే. వాటిలోనూ 21 శాతం కట్ చేసి చెల్లించారు.
కేంద్రానికే చెబుతాం..
కేంద్రం నిధులు చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెట్టడం ఒక వైపు ఉంటే.... మరో వైపు కోర్టు ఆదేశాలకు మునుపు పంచాయతీల్లో నిధులు ఉన్నా... ఆ బిల్లులను కూడా చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని నెల్లూరు జిల్లా అల్లూరు మండలానికి చెందిన మాజీ సర్పంచ్‌లు ఆరోపించారు. వచ్చే మంగళవారం కేంద్రం నుంచి రాష్ట్రానికి తనిఖీలకొస్తున్న కేంద్ర అధికారుల దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
అరణ్యరోదన..
పంచాయతీలకు చేరిన నిధులు... పనులు చేసిన మాజీ సర్పంచులకు చేరకుండా ఎన్నెన్నో అడ్డంకులు! మరెన్నో రాజకీయ ఒత్తిళ్లు. ఇప్పుడు ‘మాజీ’లయిన అప్పటి సర్పంచుల కు బిల్లులు చెల్లించకుండా ఒక్కో గ్రామంలో ఒక్కో రకంగా వేధిస్తున్నారు. బిల్లులకు సంబంధించిన నిధులు ఆయా గ్రామ పంచాయతీల బ్యాంకు అకౌంట్లలో జమయ్యాయి. వాటిని పంచాయతీ కార్యదర్శి డ్రాచేసి, అప్పట్లో పనిచేసిన వర్క్స్ కమిటీ సభ్యుడికి అందజేయాలి. వాస్తవానికి గ్రామాభివృద్ధి కోసం ఆయా గ్రామ సర్పంచు లే పనిచేసినప్పటికీ, వర్క్స్ కమిటీ సభ్యులుగా వారి అనుచరుల పేర్లు ఉన్నాయి. ఆ బిల్లులు చెల్లించడానికి కొత్తగా నియమితులైన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బేరసారాలకు దిగినట్లు ఆరోపణలొస్తున్నాయి. బిల్లులు వెంటనే చెల్లించొద్దని తూర్పు గోదావరిలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్వయంగా పంచాయతీ కార్యదర్శులను ఆదేశించినట్లు సమాచారం. ఇంకొన్ని జిల్లాల్లో సర్పంచులను అడగాలని పంచాయతీ కార్యదర్శులు మెలిక పెడుతున్నారని చెప్తున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో తమకు ప్రత్యర్థిగా నిలిచి గెలిచిన సర్పంచులనే బిల్లుల కోసం ప్రాధేయపడాల్సిరావడం దురదృష్టకరమని మాజీ సర్పంచులు వాపోతున్నారు. కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల ఏకంగా ఎమ్మెల్యేలే జోక్యం చేసుకుని.. మాజీ సర్పంచులు స్వయంగా వచ్చి విజ్ఞప్తి చేస్తే బిల్లులు చెల్లిస్తామని చెప్తున్నారు.
Updated Date - 2021-08-22T08:27:51+05:30 IST