జడ్జిలపై పోస్టుల కేసులో ప్రతివాదులుగా ట్విటర్, యూట్యూబ్
ABN, First Publish Date - 2021-11-02T08:27:13+05:30
న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా, హైకోర్టు న్యాయమూర్తులను కించపర్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసుపై సోమవారం అత్యవసర విచారణ జరిగింది. మొత్తం 93 మందిపై నమోదైన సుమోటో కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై అడ్వకేట్
- కోర్టుకు ‘పంచ్ ప్రభాకర్’ వివరాలు
- వ్యాఖ్యలు చేసినవారు క్షమాపణలు చెప్పారు: ఏజీ
అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా, హైకోర్టు న్యాయమూర్తులను కించపర్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసుపై సోమవారం అత్యవసర విచారణ జరిగింది. మొత్తం 93 మందిపై నమోదైన సుమోటో కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ప్రతివాదులు కొందరు ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేశారన్నారు. న్యాయవ్యవస్థను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారనే విషయంలో ఎలాంటి వివాదం లేదని తెలిపారు. ఇప్పటికే కొందరు భేషరతుగా క్షమాపణ చెప్పారని, నిందితులకు నోటీసులు ఇచ్చేందుకు పత్రికా ప్రకటన జారీ చేశామని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. 2020 మే తర్వాత హైకోర్టుపై కొత్తగా ఎవరూ వ్యాఖ్యలు చేయలేదా? నిందితుల సంఖ్య పెరగలేదా? అని ప్రశ్నించింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. సామాజిక మాధ్యమాలు ట్విటర్, యూట్యూబ్‌లను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేరుస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామన్నారు. దానిని అనుమతించాలని కోరామన్నారు. అందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. అదేవిధంగా పంచ్ ప్రభాకర్‌కి సంబంధించిన వివరాలు మెమో రూపంలో కోర్టు ముందు ఉంచామని న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ తెలిపారు.
ప్రభాకర్ నివాసం, పనిచేసే స్థలం, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ వివరాలు అందులో పేర్కొన్నామన్నారు. ప్రభాకర్‌కి సంబంధించిన వివరాలు తమ వద్ద లేవని సీబీఐ చెబుతున్న నేపథ్యంలో సదరు సమాచారాన్ని కోర్టుకు అందజేశామన్నారు. ఆ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ వ్యవహారంపై మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. సీబీఐ తరఫు న్యాయవాది సుభాశ్ స్పందిస్తూ.. నిందితుల వివరాలు ఇవ్వాలంటూ సామాజిక మాధ్యమాలకు లేఖలు రాశామన్నారు.
Updated Date - 2021-11-02T08:27:13+05:30 IST