సుప్రీం తీర్పు కేంద్రానికి చెంపపెట్టు : వడ్డే శోభనాద్రీశ్వర రావు
ABN, First Publish Date - 2021-05-04T20:09:36+05:30
మోదీ ప్రభుత్వం కుంభకర్ణ నిద్ర నుంచి లేచేదెన్నడు? అని తెలుగుదేశం సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వర రావు నిలదీశారు.
అమరావతి: మోదీ ప్రభుత్వం కుంభకర్ణ నిద్ర నుంచి లేచేదెన్నడు? అని మాజీ పార్లమెంట్ సభ్యులు వడ్డే శోభనాద్రీశ్వర రావు నిలదీశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌నకు ఐదు రోజుల క్రితం బ్రిటన్ నుంచి 500, ఐర్లండ్ నుంచి 700 ఆక్సిజన్ కాన్సెంటేటర్లు వచ్చాయన్నారు. అలాగే మే 2న అమెరికా నుంచి 1000 ఆక్సిజన్ కాన్సెంటేటర్లు, ఉజ్బెకిస్థాన్ నుంచి 150 ఆక్సిజన్ కాన్సెంటేటర్లు మన దేశానికి కోవిడ్ బాధితులకు సహాయంగా వచ్చాయని తెలిపారు. ఢిల్లీతో సహా కొన్ని రాష్ట్రాలు తీవ్రమైన ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటుంటే యుద్ధప్రాతిపదికన ఆయా రాష్రాలకు పంపించాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీనమేషాలు లెక్కిస్తున్నారని వడ్డే శోభనాద్రీశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం ఇప్పటికైనా బాధ్యతతో నడుచుకోని ఆయా రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను పంపించి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఢిల్లీకి వచ్చిన ఆక్సిజన్‌ను వెంటనే రాష్ట్రాలకు అందించాలనే తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం అహంకారాన్ని వీడాలని చెప్పారు. ఈసమయంలో ప్రముఖుల సలహాలను తీసుకోవాలని వడ్డే శోభనాద్రీశ్వర రావు సూచించారు.
Updated Date - 2021-05-04T20:09:36+05:30 IST