విశాఖలో సీన్ రివర్స్... ఇలా అయ్యిందేంటి..!?
ABN, First Publish Date - 2021-03-15T06:20:58+05:30
మహా విశాఖ నగర పాలక సంస్థలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
- మారిన బలాబలాలు
- వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న..
- గాజువాక, పెందుర్తి, భీమిలి నియోజక వర్గాల్లో టీడీపీకి మెజారిటీ వార్డులు
- టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నార్త్, ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో వైసీపీకి ఆధిక్యం
- ‘సౌత్’లో హోరాహోరీ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మహా విశాఖ నగర పాలక సంస్థలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, గాజువాక నియోజకవర్గాలు పూర్తిగా వుండగా, భీమిలి, పెందుర్తి, అనకాపల్లి ప్రాంతాలు పాక్షికంగా కొంత భాగమే ఉన్నాయి. సిటీలోని నాలుగు నియోజకవర్గాల్లోని మూడింటికి (తూర్పు, పశ్చిమ, ఉత్తర) తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి టీడీపీ నుంచి ఎన్నికైనప్పటికీ వైసీపీ గూటికి చేరారు. గాజువాక, భీమిలి, పెందుర్తిల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా వారి నియోజకవర్గాల్లో కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి పూర్తిస్థాయిలో పనిచేశారు. ఎవరెంతవరకు సఫలీకృతమైందీ ఆదివారం సాయంత్రం ఫలితాల ద్వారా వెల్లడైంది.
తూర్పులో .. విశాఖ తూర్పులో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గత 12 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ప్రజల బాగోగులు చేస్తున్నారు. అక్కడ 15 వార్డులు ఉన్నాయి. అందులో తెలుగుదేశం పార్టీకి 3, వైసీపీకి 9, వార్డులు దక్కాయి. జనసేన ఒకటి గెలుచుకోగా, మరొకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అక్కరమాని విజయనిర్మల వ్యవహరిస్తున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన పీతల మూర్తియాదవ్ జనసేనలో చేరి 22వ వార్డు నుంచి గెలుపొందారు.
పశ్చిమంలో ... పశ్చిమ నియోజకవర్గానికి తెలుగుదేశం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ 14 వార్డులు ఉన్నాయి. అందులో టీడీపీకి 5, వైసీపీకి 9 వార్డులు లభించాయి. ఈ నియోజవర్గానికి వైసీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ వ్యవహరిస్తున్నారు. అలాగే అదేస్థాయిలో పనిచేసే బెహరా భాస్కరరావు కూడా ఇక్కడ కీలకంగా పనిచేశారు.
ఉత్తరంలో.. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపుగా 18 నెలలు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దాంతో కేడర్ కొంత చెదిరిపోయింది. ఈ నియోజకవర్గంలో వైసీపీకి కేకే రాజు ఇన్‌చార్జిగా ఉన్నారు. ఎలాగైనా గంటాపై పట్టు సాధించాలని గట్టిగా కృషి చేశారు. ఇక్కడ 17 వార్డులు వుండగా అందులో వైసీపీకి 15, టీడీపీకి 1, బీజేపీకి 1 వచ్చాయి. దాదాపుగా వైసీపీ విజయఢంకా మోగించిందని చెప్పొచ్చు. ఇక్కడ టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది.
దక్షిణంలో... విశాఖ దక్షిణంలో వైసీపీ తరఫున వాసుపల్లి గణేశ్‌కుమార్ అన్ని వ్యవహారాలు చూసుకున్నారు. టీడీపీ నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన శ్రీభరత్ ఎన్నికల బాధ్యతలు భుజాన వేసుకున్నారు. ఇక్కడ మొత్తం 13 వార్డులు వుండగా, అందులో వైసీపీకి కేవలం 5 మాత్రమే వచ్చాయి. తెలుగుదేశం 4 దక్కించుకుంది. జనసేన నుంచి ఒకరు గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు గెలిచారు. వారు అంతా వైసీపీ రెబల్స్ కావడం గమనార్హం. వాసుపల్లి చేసిన కంగాళీకి అక్కడ పార్టీ అభ్యర్థులు ఓడిపోయి రెబెల్స్ గెలుపొందారు.
భీమిలిలో... భీమిలి నియోజకవర్గానికి జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సబ్బం హరి ఇన్‌చార్జిగా ఉన్నారు. జీవీఎంసీ పరిధిలో తొమ్మిది వార్డులు ఉన్నాయి. అందులో టీడీపీ 5 గెలుచుకోగా, వైసీపీ నాలుగు దక్కించుకుంది. ఇక్కడ పోటాపోటీ యుద్ధం జరిగింది.
గాజువాకలో .. గాజువాకలో వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం తరఫున పార్టీ విశాఖ పార్లమెంటు అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇక్కడ రెండు అంశాలు ప్రభావితం చేశాయి. ఒకటి స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ. దీనిపై పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అది ఆ పార్టీకి ప్లస్ అయింది. ఈ నేపథ్యంలో అక్కడ 17 వార్డులు వుండగా, వాటిలో వైసీపీకి కేవలం 7 మాత్రమే వచ్చాయి. టీడీపీకి ఏడు, టీడీపీ బలపరిచిన సీపీఐ ఒకటి, సీపీఎం ఒకటి గెలుచుకోగా, జనసేన ఒక వార్డులో విజయం సాధించింది.
పెందుర్తిలో ... పెందుర్తికి వైసీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్ సారథ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం తరఫున మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇక్కడ జీవీఎంసీలో ఆరు వార్డులు ఉన్నాయి. అందులో టీడీపీ 5 గెలుచుకోగా, వైసీపీకి కేవలం ఒకే ఒక్క వార్డు వచ్చింది. ఇక్కడ నుంచి టీడీపీ మేయర్ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు 96వ వార్డులో...వైసీపీ అభ్యర్థి శరగడం చినఅప్పలనాయుడిపై 6,290 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. జీవీఎంసీలో అత్యధిక ఓట్లు సాధించింది ఈయనే కావడం విశేషం.
అనకాపల్లిలో .. జీవీఎంసీలో అనకాపల్లికి చెందిన 5 వార్డులు ఉన్నాయి. వాటిలో వైసీపీ నాలుగు గెలుచుకోగా, టీడీపీ ఒకటి దక్కించుకుంది. అనకాపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ పనిచేశారు. తెలుగుదేశం తరఫున పార్టీ ఇన్‌చార్జి పీలా గోవింద్ బాధ్యతలు చూసుకున్నారు.
Updated Date - 2021-03-15T06:20:58+05:30 IST