నిధుల లభ్యతకు ఢోకా ఉండదు
ABN, First Publish Date - 2021-09-01T10:18:00+05:30
భవిష్యత్‌లో మార్కెట్లో నిధుల లభ్యతకు ఢోకా ఉండదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.
అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం: ఆర్‌బీఐ గవర్నర్
ముంబై: భవిష్యత్‌లో మార్కెట్లో నిధుల లభ్యతకు ఢోకా ఉండదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఎలాంటి అనుకోని పరిణామాలు ఎదురైనా నిధుల లభ్యతకు ఢోకా లేకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందుకు అవరమైన విధివిధానాలూ సిద్ధంగానే ఉన్నట్టు తెలిపారు. బుధవారం జరిగిన ఒక సదస్సులో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఉద్దీపన చర్యలు వెనక్కి తీసుకుంటే, 2013లోలా ఎఫ్‌పీఐలు పెట్టుబడులు వెనక్కి తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఆర్‌బీఐ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. కొవిడ్‌తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ అనేక చర్యలు తీసుకున్నాయి. ఉద్దీపన ప్యాకేజీతో పాటు రుణ హామీ పథకం ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లు పెంచకుండా, ప్రభుత్వ రుణ పత్రాల కొనుగోలు ద్వారా మార్కెట్‌లో నిధుల లభ్యత పెంచి ఆదుకుంటోంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ రోజుకో రికార్డు సృష్టిస్తోంది. దీనికంతటికీ కారణం మార్కెట్‌లో తక్కువ వడ్డీకే పుష్కలంగా నిధులు లభించడం. దీనికి ఏ మాత్రం బ్రేక్ పడినా ఆర్థిక రంగంలో కుదుపు తప్పదు. ఈ నేపథ్యంలోనే నిధుల సరఫరాకు ఢోకా లేకుండా చర్యలు తీసుకుంటామని శక్తికాంత దాస్ ప్రకటించారని భావిస్తున్నారు.
Updated Date - 2021-09-01T10:18:00+05:30 IST