ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసుల అన్నానికి ‘ఆధార్‌’ అడ్డు

ABN, First Publish Date - 2021-05-21T06:07:26+05:30

రెండోవిడత కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే నెల చివరి వరకూ కర్ఫ్యూ విధించారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో సామాజికంగా, ఆర్థికంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండోవిడత కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే నెల చివరి వరకూ కర్ఫ్యూ విధించారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో సామాజికంగా, ఆర్థికంగా అత్యంత వెనుకబడిన వర్గమైన ఆదివాసీలకు, ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు సక్రమంగా బట్వాడా చేయడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు గూర్చి చర్చించడం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో ఉన్న 35 ఆదివాసీ మండలాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ నడుస్తున్న తీరును అర్థం చేసుకోవడానికి విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 28 మండలాలను ఎంపిక చేసుకొని సమాచారాన్ని విశ్లేషించాం. 


2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అర్హత కలిగిన కుటుంబాలన్నిటికీ చెలామణీలో ఉన్న రేషన్‌కార్డులు రద్దు చేసి కొత్త (బియ్యం) రేషన్ కార్డులు ఇస్తామని, దరఖాస్తు చేసిన ఐదు రోజుల్లో కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలసరి ఆదాయం, భూమి, విద్యుచ్ఛక్తి వినియోగం, నాలుగు చక్రాల వాహన యాజమాన్యం తదితర అంశాల ఆధారంగా బియ్యం కార్డు అర్హత ప్రమాణాలు ప్రభుత్వం నిర్దేశించింది. ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్ కుటుంబాలు బియ్యంకార్డుల నుండి మినహాయించారు. 


గ్రామ వాలంటీర్ కుటుంబ సర్వే సమాచారం ప్రకారం మేము పరిశీలించిన 28 ఆదివాసీ మండలాలలో 2021 మార్చి నాటికి 3.86 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి. కానీ అందులో 3.5 లక్షల కుటుంబాలకు మాత్రమే బియ్యం రేషన్‌కార్డులు ఉన్నాయి. అంటే దాదాపు 36 వేల కుటుంబాలకు కార్డులు లేవు. ఇందులో కొంత మందికి ఆధార్, బయోమెట్రిక్ విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి రేషన్ కార్డు లేని వారైతే, మరి మిగిలిన వారు గతంలో రేషన్ కార్డు ఉండి ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బియ్యం కార్డు పొందలేకపోయిన వారు. గణాంకాలు పరిశీలిస్తే 2019 డిసెంబర్ నుంచి 2021 మార్చి మధ్యలో 7 వేల పైచిలుకు కుటుంబాలు రేషన్ కార్డులు కోల్పోయాయి. ఐతే 2019 డిసెంబర్‌లో రేషన్ పొందుతున్న లబ్ధిదారులు 10.2 లక్షలు ఉంటే 2021 నాటికి ఆ సంఖ్య 10.7 లక్షలకు పెరిగింది. అంటే రేషన్ కార్డులు తగ్గినప్పటికీ, లబ్ధిదారుల సంఖ్య మాత్రం పెరిగింది. దీనికి ప్రధాన కారణం కారణం అమ్మ ఒడి పథకం కోసం పిల్లల పేర్లు రేషన్ కార్డులలో ఎక్కించడం. స్థూలంగా చెప్పాలంటే మేము పరిశోధన చేసిన 28 మండలాలలో దాదాపు లక్ష మందికి రేషన్ పొందడానికి కావలసిన రేషన్(బియ్యం) కార్డులు లేవని తెలుస్తుంది. 


కొత్త బియ్యం కార్డులు పొందాలనుకునే లబ్ధిదారులు, ముందుగా తమ ఆధార్ సంఖ్యల్ని, పాత రేషన్ కార్డులో ఉన్న తమ పేర్లతో తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళ పేర్లు తొలగించబడతాయి అని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆదివాసీ ప్రాంతాల్లో ఆధార్ కార్డులు లేని వారందరూ తమ కుటుంబ రేషన్ కార్డులు కోల్పోయారు లేదా వారి పేర్లు రేషన్ కార్డుల నుండి తొలగించబడ్డాయి. సంక్షేమ పథకాలకు ఆధార్ సంఖ్య అనుసంధానం తప్పనిసరి అయిన తర్వాత ఆదివాసీలకు చావు, బ్రతుకు మధ్య పందెంలో ఆధార్ కీలకమయ్యింది. కానీ మారుమూల ఆదివాసీ ప్రాంతాల్లో అవసరం మేరకు ఆధార్ కేంద్రాలు నెలకొల్పకుండా, కనీస అవస్థాపన సౌకర్యాలు అందుబాటులో తీసుకురాకుండా ఆధార్ తప్పనిసరి చేయడంతో వేలాది ఆదివాసీలు సంక్షేమ పథకాల లబ్ధిని పొందలేకపోతున్నారు. ఆధార్ లేని కారణంగా ఎవరికీ రేషన్ నిరాకరించ వద్దని సుప్రీంకోర్టు గతంలో చెప్పిన విషయం గుర్తు చేసుకోవడం అవసరం. 


గ్రామ వాలంటీర్ల నియామకం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నవశకం పేరుతో నవంబర్ 2019లో ఒక కుటుంబ సర్వే నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించడం ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. మైదాన ప్రాంతాల్లో ఈ సర్వే పరిస్థితి ఎలా ఉన్నా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సంక్లిష్ట పరిస్థితుల వలన సర్వే సక్రమంగా జరగలేదు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, సర్వే కోసం గ్రామ వాలంటీర్లకు తగినంత సమయం ఇవ్వకపోవడం, శిక్షణలో నాణ్యత కొరవడడం, ప్రభుత్వం పేర్కొన్నట్లు సంక్షేమ పథకాలకు అర్హత కలిగిన వారి జాబితాపై సోషల్ ఆడిట్‌లు నిర్వహించకపోవడం తదితర కారణాల వలన సేకరించిన సమాచారం నాణ్యత దెబ్బతింది. 


నవశకం సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న కుటుంబ స్థాయి డిజిటల్ సమాచారంతో పోల్చుకొని కొంత మందిని సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటించారు. ఈ ప్రక్రియను 6 స్టెప్ వాలిడేషన్‌గా పిలుస్తున్నారు. అర్హత ఉండి కూడా తప్పుగా అనర్హులుగా గుర్తించబడిన వాళ్ళు, తమ డిజిటల్ సమాచారం సరిచేసుకోవడానికి రూపొందించిన పద్ధతి అసలు ఆదివాసీ ప్రాంతాలకు సరిపోదు. ఉదాహరణకు 6 స్టెప్ వాలిడేషన్‌లో నాలుగు చక్రాల వాహనం ఉందనే కారణంగా పాడేరు ఐటిడిఏలో ఎవరికైనా రేషన్ కార్డు తప్పుగా తిరస్కరిస్తే వారు తమ సొంత ఖర్చులతో విశాఖపట్నం ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఆన్‌లైన్‌లో మార్చుకోవాలి. ఎంత మంది ఆదివాసీలు విశాఖ నగరానికి వేలాది రూపాయలు ఖర్చు చేసి వెళ్ళగలరు? తమ సమస్యను పరిష్కరించుకోగలరు? 


ఇక ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి జాబితాలో పేరు రావడం వలన కొంత మందికి రేషన్ కార్డులు ఆగిపోయాయి. ఈ సమస్య పరిష్కారానికి ఆదివాసీలు చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ దగ్గర సర్టిఫికెట్ తీసుకొని గ్రామ సచివాలయంలో దాఖలు చేయాలి. ఇవన్నీ చేయించుకోగలిగిన వనరులు, దక్షత ఎంత మందికి ఉంటాయి?


బియ్యం కార్డు వస్తే చాలు, కష్టాలు దూరం అయిపోయాయని కాదు. మేము పరిశీలించిన 28 మండలాల్లో సగటున 6 వేల పైచిలుకు కుటుంబాలు రేషన్ కార్డులు ఉన్నా సరే ఆధార్, బయోమెట్రిక్ సమస్యలు, నెట్‌వర్క్ సమస్యలు తదితర సాంకేతిక కారణాల వల్ల ప్రతి నెలా రేషన్ పొందలేకపోతున్నారు. ఆదివాసీ ప్రాంతాల సంక్లిష్టతలు పరిగణనలోకి తీసుకోకుండా మైదాన ప్రాంతాలకు వర్తించే నియమాలు, పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం ఆదివాసీ ప్రాంతాలకు యథాతథంగా వర్తింప చేస్తున్నారు. దీనివల్ల చాలా మంది ఆదివాసీలు సంక్షేమ పధకాలను అందుకోలేకపోతున్నారు. ఇక పధకాల లబ్ధి పొందే దశలో కూడా పలు ఇక్కట్లకు గురి అవుతున్నారు. 


ఆదివాసీ ప్రాంతాల్లో సంక్షేమం కోసం ఖర్చు చేయడం ఎంత ముఖ్యమో పబ్లిక్ సర్వీస్ డెలివరీ రాజ్యాంగ బద్ధంగా, ఆదివాసీ ప్రాంతం అవసరాలకు అనుగుణంగా జరగడం కూడా అంతే ముఖ్యం అనే స్పృహ, చిత్తశుద్ధి ప్రభుత్వాలకు, పథకాలను అమలు చేసే అధికారులకు కొరవడింది. ప్రజా పంపిణీ వ్యవస్థ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక ఆదివాసీ ప్రాంత అభివృద్ధి గిరిజన సంక్షేమ శాఖది. ఈ స్థాయిలో చట్ట ఉల్లంఘన జరుగుతుంటే ఈ రెండు ప్రభుత్వ శాఖలూ ‘మేం అడగం- మేం చెప్పం’ అన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి. 


ఏజెన్సీ ప్రాంతంలో ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా అమలు కాని పరిస్థితుల్లో కర్ఫ్యూ విధించడం వలన ఆదివాసీల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆధార్, బయోమెట్రిక్‌తో నిమిత్తం లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఉచిత రేషన్‌ను ఆదివాసీ కుటుంబాలు అన్నిటికీ ఇవ్వాలి. ఒక్క బియ్యం మాత్రమే కాకుండా పప్పులు, నూనె, సబ్బులు తదితర నిత్యావసర దినుసులు ఉచితంగా అందించాలి. రెండు నెలల రేషన్ అన్ని దినుసులతో కలిపి ఒకేసారి ఇవ్వాలి. దాని వలన రేషన్ పంపిణీ చేసే వారికి, పుచ్చుకునే వారికీ శ్రమ తగ్గుతుంది. జార్ఖండ్ రాష్ట్ర తరహాలో ఆదివాసీ ప్రాంతాల్లో బయోమెట్రిక్ లేకుండా రేషన్ బట్వాడా చేయాలి. ఢిల్లీ రాష్ట్రం ఆధార్ లేని వారికి కూడా రేషన్ పంపిణీ చేయబోతున్నామని ప్రకటించింది. అదే బాటలో ఆంధ్రప్రదేశ్ కూడా నడవాలి. ఇలా చేస్తే కరోనా సృష్టించే ఆకలి గండం నుంచి ఆదివాసీలకు కనీసం కొంతైనా సాంత్వన లభిస్తుంది.

చక్రధర్ బుద్ధ, గజ్జలగారి నవీన్ కుమార్, బి.డి.ఎస్ కిషోర్, వంతల భాస్కర్ రావు

Updated Date - 2021-05-21T06:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising