ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖతర్ వెనుకే భారత్!

ABN, First Publish Date - 2021-08-11T06:43:45+05:30

విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఒలింపిక్ క్రీడాపోటీలు జరిగిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా మన స్థానం గురించి ఆత్మ విమర్శ చేసుకోవడం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఒలింపిక్ క్రీడాపోటీలు జరిగిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా మన స్థానం గురించి ఆత్మ విమర్శ చేసుకోవడం, మరో నాలుగేళ్ళ వరకు మరిచిపోవడం భారతీయులకు అలవాటుగా మారింది. 121 సంవత్సరాల ఒలింపిక్స్ చరిత్రలో భారతదేశం ఇప్పటి వరకు కేవలం పది స్వర్ణ పతకాలు సాధించగా అందులో 8 కేవలం హాకీ ఆటలో మాత్రమే అని గమనించాలి.


ప్రపంచ అగ్రగామి ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా వర్ధిల్లుతున్నా క్రీడారంగంలో మాత్రం అనేక పేదదేశాల కంటే కూడా భారత్ వెనుకబడి ఉందనేది ఒక చేదునిజం. దేశ జనాభాలో యువజనులే అత్యధికంగా ఉన్నప్పటికీ భారత్ ఒలింపిక్ పతకాలు అందుకోవడంలో మాత్రం చిన్నపాటి దేశాలతో సైతం పోటీపడలేకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఒలింపిక్స్‌లో తొలిసారిగా ఏడు పతకాలు సాధించడంతో మురిసిపోతున్న మనం, వాటిని అందుకున్న ఏడుగురు విజేతలకు నిపుణులయిన విదేశీ కోచ్‌లు శిక్షణ ఇచ్చారనే విషయాన్ని మరిచిపోతున్నాం. స్వర్ణ పతకం సాధించిన నీరజ్‌చోప్రాకు జర్మన్ కోచ్ శిక్షణ ఇవ్వగా రజతం సాధించిన మన తెలుగు బిడ్డ పి.వి. సింధూకు దక్షిణ కొరియా కోచ్ మార్గదర్శకుడు. క్రీడారంగంలో నిపుణులయిన విదేశీయులతో శిక్షణ ఇప్పించే ఆనవాయితీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉంది. చిన్నపాటి గల్ఫ్ దేశాలు అనేకం ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలలో తమకంటూ ఒక ప్రత్యేకస్థానం పొందాయంటే అందుకు కారణం నిష్ణాతులైన క్రీడాదిగ్గజాలను తమ యువ క్రీడాకారులకు కోచ్‌లుగా నియమించడమే. 


క్రీడారంగంలో పురోగతికి పతకాల సాధనే గీటురాయిగా పరిగణిస్తే అమెరికాయే ప్రపంచ అగ్రగామి. టోక్యో ఒలింపిక్స్‌లో ఈ అగ్రరాజ్యం 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలు సహా మొత్తం 113 పతకాలు సొంతం చేసుకుంది. 38 పసిడిపతకాలు, 32 రజతాలు, 18 కాంస్యాలతో మొత్తం 88 పతకాలు సాధించుకున్న చైనా రెండోస్థానంలో నిలిచింది. అతిథేయి జపాన్ 27 స్వర్ణాలతో మూడోస్థానంలో నిలవగా, ఆ తర్వాత వరుసగా బ్రిటన్ (22 స్వర్ణాలు), రష్యా (20 స్వర్ణాలు) టాప్–-5లో నిలిచాయి. ప్రకాశం జిల్లా జనాభా కన్నా తక్కువ జనాభా ఉన్న గల్ఫ్‌దేశం ఖతర్ ఒలింపిక్ పతకాల సాధనలో 41వ స్థానంలో ఉంది. ఈ చిన్న దేశం రెండు స్వర్ణపతకాలు, ఒక రజతం సాధించింది. పతకాల పట్టికలో భారత్ 48వ స్థానంలో ఉంది. అంటే ఖతర్ తర్వాతే మన స్థానం!


ధనిక గల్ఫ్‌దేశాలను పక్కన పెడితే, భారత్ కంటే ఆర్థికంగా వెనుకబడిన అనేక ఇతరదేశాలు క్రీడలలో మన కంటే చాలా ముందున్నాయి. అవి ప్రణాళికబద్ధంగా క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తూ క్రీడాకారులను తీర్చిదిద్దుతుండగా మన దగ్గరేమో క్రీడామైదానాలు మాయమై అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒలింపిక్స్‌లో పతకాలు ఆశించడమే తప్పు. ధన సంపాదనలోనే కాకుండా గల్ఫ్ దేశాలు అంతర్జాతీయ క్రీడావేదికలపై తమ ప్రాతినిధ్యంతో పాటు విజయకేతనం ఎగురవేయాలని ఆశిస్తున్నాయి. మన దేశంలో క్రికెట్‌పై ఉన్న మోజు అరబ్బు దేశాలలో ఫుట్‌బాల్‌పై ఉంటుంది. అయినప్పటికీ ఇతర క్రీడలపై కూడా ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ వాటిలో సైతం అంతర్జాతీయంగా ఆరితేరడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. బీచ్ వాలీబాల్ అంటే తెలియని ఖతర్ ఆ ఆటలో కాంస్యపతకం సాధించింది. ఇతర దేశాల యువక్రీడాకారులను తమ దేశానికి ఆహ్వానించి, వారిని ప్రోత్సహించి తమ పక్షాన ఆడించే సంప్రదాయం ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ తదితర గల్ఫ్ దేశాలలో ఉంది. అలా ఆ దేశాలు తమ ప్రజానీకానికి ప్రీతిపాత్రమైన ఫుట్‌బాల్‌తో పాటు ఇతర క్రీడలను ఆదరించి ప్రొత్సహించాయి. ఇటువంటి ఆనవాయితీ మన దేశానికి లేదు. వివిధ గల్ఫ్దేశాలు అంతర్జాతీయంగా పేరొందిన క్రీడాకారులను ఆహ్వానించి శిక్షణ అకాడెమీలను ఏర్పాటు చేయిస్తున్నాయి, హైదరాబాద్‌కు చెందిన సానియా మీర్జా దుబాయిలో ఒక అకాడెమీని నెలకొల్పారు. దుబాయి, దోహా నగరాలలో భారతీయ క్రీడా దిగ్గజాలు పలువురు ఆయా ప్రభుత్వాల ప్రొత్సాహంతో శిక్షణాలయాలను నెలకొల్పారు. పేద అరబ్, ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి వారిని తమ తమ దేశాలకు ఆహ్వానించి సకల సౌకర్యాలు కల్పించి, చివరకు తమ పౌరసత్వం కూడ ఇస్తున్నాయి. వారి ప్రతిభాపాటవాల ఆలంబనతో క్రీడారంగంలో గల్ఫ్ దేశాలు కీర్తిప్రతిష్ఠలు సముపార్జిస్తున్నాయి. 


భారత్‌లో మాత్రం అసలు సిసలైన భారతీయులే ప్రతి క్రీడలోనూ ఉన్నారు. వారికి కావాల్సింది కేవలం ప్రోత్సాహం, ఆదరణ. అయితే ఇవే వారికి అందడం లేదనేది క్రీడాభిమానుల ఆవేదన. గతంలో ఒలింపిక్స్‌లో భారతదేశానికి పతకాలు సాధించిన అనేకమంది యువక్రీడాకారులు ప్రస్తుతం కటిక దారిద్ర్యం కారణంగా పొట్టకూటి కోసం కూలీనాలీ చేసుకుంటున్నారు. వారి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. సమాజం నిరాదరణ ప్రదర్శిస్తోంది. ఇది గర్హనీయం కాదా?

మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Updated Date - 2021-08-11T06:43:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising