రైతు ఆత్మబంధువు మోదీ
ABN, First Publish Date - 2021-06-29T06:29:07+05:30
‘ప్రభుత్వ విధానాలు రైతుల ఆందోళనను పట్టించుకోవడంలో విఫలమయ్యాయి..’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండురోజుల క్రితం విమర్శించారు....
‘ప్రభుత్వ విధానాలు రైతుల ఆందోళనను పట్టించుకోవడంలో విఫలమయ్యాయి..’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండురోజుల క్రితం విమర్శించారు. బాధ్యత లేకుండా నాయకత్వం హక్కుల్ని అనుభవిస్తూ కాంగ్రెస్‌ను తన జేబుసంస్థగా భావిస్తున్న రాహుల్ గాంధీ ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో చేస్తున్న వ్యాఖ్యల్ని జనం సీరియస్‌గా పట్టించుకోవడం మానేసి చాలా కాలమైంది. పశ్చిమ బెంగాల్‌లో ఒక్క సీటు కూడా సాధించలేని రాహుల్, తాను ఎంపీగా గెలిచిన కేరళలో పార్టీకి సగం సీట్లు కూడా సాధించలేకపోయారు. ‘ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ చరిత్ర ఏనాడో ముగిసింది..’ అని ఇటీవల సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ సైతం వ్యాఖ్యానించడం దేశంలో ఏ పార్టీ కూడా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.
రాహుల్‌కి కానీ, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ప్రదర్శనలు ప్రారంభించి 200 రోజులు పూర్తయిందని రోజులు లెక్కపెడుతూ విమర్శిస్తున్న వారికి కానీ వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో మన వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మకమైన, కనీవినీ ఎరుగని మార్పులు సంభవిస్తున్నాయన్న విషయం ఏనాటికీ అర్థం కాదు. రాహుల్ ముత్తాతగారైన నెహ్రూ కాలంలో ఆహారధాన్యాలకోసం మనం విదేశాలపై ఆధారపడేవారమని ఎంతమందికి తెలుసు? ఆ సమయంలో అంతటా ఆహారధాన్యాల కొరత కనపడేది. రెండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఆహారధాన్యాల దిగుమతి కోసం విదేశీ రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. భారీ నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టినప్పటికీ దేశంలో అత్యధిక భూభాగం వర్షాధారితమై ఉండేది. గ్రామాల్లో అసమానతలు, పేదరికం పెరగడానికి నెహ్రూ విధానాలు ఎంతో దోహదం చేశాయి. నెహ్రూ తర్వాత ప్రధానమంత్రి పదవి చేట్టిన లాల్‌బహదూర్ శాస్త్రి సరిహద్దుల్లో సైనికుడు ఎంత ముఖ్యమో, గ్రామాల్లో రైతు అంత ముఖ్యమని దేశానికి తెలియజేశారు. ఆయన ‘జై జవాన్-–జైకిసాన్’ నినాదాన్ని చేపట్టి హరితవిప్లవానికి నాంది పలికిన తర్వాతే దేశంలో వ్యవసాయరంగంలో చెప్పుకోదగిన మార్పు కనపడింది. నాలుగో ప్రణాళికా కాలం నుంచి నూతన వ్యవసాయ వ్యూహాన్ని అవలంభించి, అధిక దిగుబడి గల పంటలను, బహుళ పంటలను వేస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులను, నీటిపారుదల సౌకర్యాన్ని విస్తరించడం మొదలుపెట్టారు. లాల్‌బహదూర్ శాస్త్రి తర్వాత మళ్లీ వ్యవసాయానికి అంత ప్రాధాన్యం లభించింది అటల్ బిహారీ వాజపేయి కాలంలోనే. 2000 సంవత్సరంలో వాజపేయి హయాంలో ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ విధానం ఆ రంగానికి కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. నేల సారం, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం, పునరుత్పాదక ఇంధన ప్రాధాన్యాలను ప్రోత్సహించింది. ఆ కాలంలోనే వ్యవసాయ ఎగుమతులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టిన ఘనత వాజపేయికే దక్కుతుంది. వాజపేయి తర్వాత వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన నేతగా నరేంద్ర మోదీ చరిత్రపుటల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు.
మోదీ ప్రభుత్వం కల్పించిన ఆర్థికవనరులు, ఇతర ప్రోత్సాహకాల వల్లనే దేశంలో ఎన్నడూ లేనంత మొత్తంలో ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఈ ప్రోత్సాహకాల్లో ప్రధానమైనది కనీస మద్దతుధరను ఉత్పాదకవ్యయానికి ఒకటిన్నర రెట్లు పెంచడం. అంతేకాదు, ఇప్పటి వరకు మూడుదఫాలుగా రైతులకు రూ.6000ను ఏడాదికి అందజేయడం ద్వారా ఆదాయమద్దతును కల్పించిన ఘనత మోదీ సర్కార్‌కే దక్కుతుంది. ఇప్పటి వరకు 11.30 కోట్ల రైతు కుటుంబాలకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 1.35 లక్షల కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ చేశారని ప్రతిపక్షాలు ఎందుకు గుర్తించడం లేదు? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 8.95కోట్ల మంది రైతులు నమోదు చేసుకోవడం, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.7.3లక్షల కోట్లు సంస్థాగత రుణం మంజూరు చేసిన సర్కార్ 2021–22 నాటికి ఈ మొత్తాన్ని రూ.16.5 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం, 23 కోట్ల మంది రైతులకు నేల సార ఆరోగ్య కార్డులను మంజూరు చేయడం వ్యవసాయరంగం పట్ల మోదీ ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధకు నిదర్శనం కాదా?
కరోనా సమయంలో కూడా వ్యవసాయరంగం స్తంభించకుండా దేశప్రజలకు ఆహారాన్ని అందించడానికి మోదీ సర్కార్ నిర్విరామంగా కృషి చేసిందనడంలో సందేహం లేదు. ఈ రంగం పూర్తి శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకునేందుకు గతంలో ఏ ప్రభుత్వమూ ప్రయత్నించలేదు. ఇప్పటికే ఆలస్యం అయిందని, వ్యవసాయరంగంలో ఆధునికీకరణ చేపట్టవలసిన అవసరం ఉన్నదని ప్రధానమంత్రి తన 75వ ‘మన్ కీ బాత్’ (2021 మార్చి 27) ప్రసంగంలో పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో కొత్త ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, రైతుల ఆదాయాన్ని పెంచాలన్నా సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను అనుసరించడంతో పాటు వినూత్న ప్రత్యామ్నాయాలు, ఆవిష్కారాలను అమలు చేయాలని ఆయన అభిప్రాయ పడ్డారు. తన ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకే మోదీ రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం నిధి ఏర్పాటు చేశారు. రైతులు కలిసికట్టుగా ఉత్పత్తి చేసి అమ్ముకునేందుకు వీలుగా రైతు ఉత్పత్తి సంఘాలను(ఎఫ్‌పిఓలను) ప్రోత్సహించేందుకు గత ఏడాది రూ.6865 కోట్లను కేటాయించారు. గతంలో ఎన్నడూ లేనంతగా సేంద్రియ వ్యవసాయాన్ని, తేనెటీగల పెంపకాన్ని, సూక్ష్మ నీటిపారుదలను మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రైతులకు సబ్సిడీ కింద 12.7 లక్షల యంత్రాలను, ఉపకరణాలను సరఫరా చేశారు. వ్యవసాయోత్పత్తులు కుళ్ళిపోకుండా కాపాడేందుకు ప్రత్యేకంగా కిసాన్ రైలును ప్రారంభించారు. ఇప్పటి వరకూ అది 2.7 లక్షల టన్నుల వ్యవసాయోత్పత్తులను సరఫరా చేసింది. గతంలో 50 శాతానికి పైగా పంట నష్టం జరిగితేనే పరిహారం చెల్లించేవారు. ఇప్పుడు 33 శాతం పంట నష్టపోయినా నష్టపరిహారం చెల్లిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణించిన రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచారు.
వ్యవసాయరంగానికి సంబంధించి మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను గమనించిన వారెవరైనా అది రైతు అనుకూల ప్రభుత్వం అని అర్థం చేసుకుంటారు. చాలాకాలం వరకు బిజెపిని పట్టణప్రాంతాల పార్టీగా అభివర్ణించేవారు. అయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బిహార్ వంటి వ్యవసాయ ప్రధాన రాష్ట్రాల్లోనే ప్రజలు బిజెపికి నీరాజనాలు పట్టారు. మొట్టమొదటి సారి కేంద్రప్రభుత్వం గ్రామాల్లో రైతులకు ప్రయోజనం చేకూర్చే పనులు చేస్తున్నదని తమకు అనుభవపూర్వకంగా తెలిసిందని అనేక మంది గ్రామీణ రైతులు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో చెప్పారు. ఇందుకు కారణం గతంలో కంటే భిన్నంగా, విజయవంతంగా కేంద్రప్రభుత్వానికి చెందిన వివిధ పథకాలు గ్రామాల్లో విజయవంతంగా అమలు కావడం. మోదీ విమర్శకులు ప్రజల్లోకి వెళ్లడం, మోదీ విధానాలు ప్రజల జీవితాలపై చూపిన ప్రభావాన్ని అధ్యయనం చేయడం ఏనాడో మానేశారు. వారు చేసే విమర్శల్లో పస లేదని గ్రహించినందువల్లే ప్రజలు వారిని పట్టించుకోవడం మానేశారు.
వై. సత్యకుమార్
బిజెపి జాతీయ కార్యదర్శి
Updated Date - 2021-06-29T06:29:07+05:30 IST