ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాటర్ గేట్ దారిలో రాఫెల్ ?

ABN, First Publish Date - 2021-04-17T06:21:27+05:30

సరైన వ్యక్తులు జాగరూకత, దృఢ వైఖరితో వ్యవహరించినప్పుడు కేవలం సంచలన వార్తలుగా ఉన్న ఆరోపణలు అంతిమంగా రాజకీయ చరిత్రను సృష్టిస్తాయి. అమెరికాలో వాటర్‌ గేట్ వ్యవహారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సరైన వ్యక్తులు జాగరూకత, దృఢ వైఖరితో వ్యవహరించినప్పుడు కేవలం సంచలన వార్తలుగా ఉన్న ఆరోపణలు అంతిమంగా రాజకీయ చరిత్రను సృష్టిస్తాయి. అమెరికాలో వాటర్‌ గేట్ వ్యవహారం వలే మన దేశంలో రాఫెల్ వివాదం కొత్తచరిత్రకు దారితీయనున్నదా? 


ఇరవయ్యో శతాబ్ది ప్రజాస్వామిక రాజకీయాలలో వాటర్‌గేట్ వ్యవహారం ఒక అప్రతిష్ఠాకర సంఘటన. అమెరికా చరిత్రలో ఒక అధ్యక్షుడికి రాజీనామా చేయడం మినహా గత్యంతరం లేని పరిస్థితిని కల్పించిన భ్రష్ట ఉదంతమది. ‘గేట్’ అనే ఒక కొత్త పద ప్రత్యయాన్ని సృష్టించిన ఉదంతమది. అవినీతి కుంభకోణాన్ని సూచించేందుకు భారత్‌తో సహా ఆనాటి కొత్త పదం ఇప్పటికీ వాడుకలో ఉన్నది. ఉదాహరణ: కోల్ గేట్.


1972 వేసవిలో డెమొక్రాటిక్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ గూఢచర్యానికి పాల్పడింది. ఈ విషయం బహిర్గతమయినప్పుడు అమెరికా మీడియా తొలుత పెద్దగా పట్టించుకోలేదు. అమిత విస్మయాన్ని వ్యక్తం చేసి, రాజకీయ ప్రాధాన్యం లేని నవ్వు పుట్టించే పలాయనంగా అభివర్ణించింది. 1970 దశకపు తొలి సంవత్సరాలలో వాషింగ్టన్‌లో జరిగిన పరిణామాలకు, న్యూఢిల్లీలో ఇటీవలి సంవత్సరాలలో సంభవించిన సంఘటనలకు మధ్య పలు సమాంతరాలు ఉన్నాయి. అయితే వాటర్‌గేట్‌పై అమెరికా మీడియా తొలిస్పందనలు భారతీయ మీడియాకు తన దృష్టి కోణాన్ని సమీక్షించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. 


1972 జూన్‌లో ఆ రాజకీయ గూఢచర్యం, 1974 ఆగస్టులో అమెరికా అధ్యక్ష పదవికి రిచర్డ్ నిక్సన్ రాజీనామా మధ్య రెండు సంవత్సరాలకు పైగా కాలం గడిచింది. ఈ సమయంలో వాటర్‌గేట్‌ను ఒక ముగిసిన వ్యవహారంగా, ఒక వినోదాత్మక ఘటనగా పరిగణించడం జరిగింది. 1972 నవంబర్‌లో అధ్యక్ష పదవీ ఎన్నికలను పురస్కరించుకుని జరిగిన రాజకీయ పోరాటంగా మాత్రమే భావించారు. వాటర్‌గేట్ గూఢచర్యం బయటకు పొక్కిన తొలిరోజుల్లో ఆ ఉదంతంపై వార్తాసేకరణకు నియుక్తమైన విలేఖరులలో పాత్రికేయ వృత్తిలోకి కొత్తగా ప్రవేశించిన లెస్లే స్తాహ్, ‘వాషింగ్టన్ పోస్ట్’ విలేఖరి బాబ్ ఊడ్‌వార్డ్ ఉన్నారు. తాను ఒక దశలో బాబ్‌తో ‘ఇది ముగిసిపోయిన వ్యవహారం. మనం అందులోకి ఎంతగా వెళ్ళాలో అంతగా వెళ్ళాం. ఇక దానికి  సంబంధించి కొత్త సమాచారమేదీ లభించద’ని అన్నానని లెస్లే ఒక సందర్భంలో తెలిపారు. బాబ్ వెంటనే ఇలా ప్రతిస్పందిస్తూ, ‘వాటర్‌గేట్ వ్యవహారం ముగియలేదని, దానికి సంబంధించిన వార్తా సేకరణలోనే ఉండండ’ని ఆమెతో అన్నారు. 


అప్పట్లో రిచర్డ్ నిక్సన్ కీర్తిప్రభలు మహోజ్వలంగా వెలిగిపోతుండేవి. మావో నేతృత్వంలోని కమ్యూనిస్టు చైనాతో సంబంధాలను ఏర్పరచుకోవడంలో ఆయన సఫలమయ్యారు. ఆనాటి అంతర్జాతీయ వ్యవహారాలలో ఇదొక మౌలిక పరిణామం. ప్రచ్ఛన్నయుద్ధంలో సోవియట్ యూనియన్‌పై అమెరికా పై చేయి సాధించింది. కమ్యూనిస్టు దేశాలకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వియత్నాం యుద్ధంలో పీకల్లోతు కూరుకుపోయి ఉన్న అమెరికా ఆ దేశం నుంచి తమ సేనలను ఉపసంహరించుకోవడం అనివార్యమయింది.


ఘోర పరాజయం పాలై వియత్నాంతో వాషింగ్టన్ ప్రభువులు శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో 1972 అమెరికా అధ్యక్ష పదవీ ఎన్నికల ముందు వాటర్‌గేట్ ఉదంతం బహిర్గతమయింది. అమెరికా రాజకీయాలలోని నైతిక భ్రష్టత్వం ప్రపంచానికి వెల్లడయింది. అయితే పలు మీడియా సంస్థలు ఆ వ్యవహారాన్ని ఒక ప్రచార సంబంధిత ఘటనగా మాత్రమే పరిగణించాయి. తమ అభ్యర్థి విజయావకాశాలను మెరుగుపరచుకునేందుకు డెమొక్రాట్లు చివరి ప్రయత్నంగా రిచర్డ్ నిక్సన్‌పై ఈ అవినీతి ఆరోపణలను గుప్పించారని మీడియా ప్రతినిధులు, ప్రజలు భావించారు. ఇందులో నిజం లేకపోలేదు. అయితే వాటర్‌గేట్ అనైతిక, అప్రతిష్ఠాకర వ్యవహారానికి అధ్యక్షుడు నిక్సన్ స్వయంగా బాధ్యుడని డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జార్జ్‌ మెక్ గోవెర్ ఆరోపించడంతో చాలా మంది ఎడిటర్లు అసలు ఆ వ్యవహారాన్ని పూర్తిగా ఉపేక్షించారు. అధ్యక్షుడు నిక్సన్ మళ్ళీ విజయం సాధించారు. చరిత్రాత్మక మెజారిటీతో గెలుపొందారు. ఆయన అనంతరం ఇంతవరకు అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికయిన ఏ పార్టీ అభ్యర్థి కూడా నిక్సన్ నెలకొల్పిన రికార్డును అధిగమించలేకపోయారు. 


ఇది మీకు ఒక సుపరిచిత వ్యవహారంగా స్ఫురిస్తోందా? 2019 సంవత్సరారంభంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బీజేపీకి చెందిన ఇద్దరు మాజీ కేబినెట్ మంత్రులు సైతం తమ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ రాఫెల్ అవినీతిని తన ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా మీడియా సంస్థలు రాఫెల్ వివాదాన్ని ఎన్నికల వ్యవహారంగా మాత్రమే చూశాయి. ప్రతిపక్షాల విమర్శల కంటే అధికార పక్ష వివరణలకు అధిక ప్రాధాన్యమిచ్చాయి. రాఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ దసో, ఆ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం కొత్తగా కుదుర్చుకున్న ఒప్పందాన్ని కాగ్ గానీ, సుప్రీంకోర్టుగానీ నిశితంగా పరీక్షించడంలో విఫలమయ్యాయి. కాగ్ తన విధ్యుక్తధర్మాన్ని నిర్వహిం చడం నుంచి వివిధ సాకులతో తప్పించుకుంది. ఇక దేశ సర్వోన్నత న్యాయస్థానం ‘ఒప్పందపు చట్టబద్ధత’ కంటే న్యాయవిచారణ ప్రమాణాలకు ప్రాధాన్యమిచ్చి రాఫెల్ కేసుపై విచారణాధికారాలు తనకు లేవని అభిప్రాయపడింది. మొత్తం మీద రాఫెల్ వివాదం విషయంలో నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు తలెత్తని రీతిలోనే రాజ్యాంగ సంస్థలన్నీ వ్యవహరించాయి. 


రాఫెల్ ఒప్పందంలో మార్పుల విషయమై మీడియా నిశితంగా ప్రశ్నించడాన్ని మోదీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ప్రధాని మోదీకి ఇబ్బంది కల్పించే ప్రశ్నలు ఎన్నడూ వేయని ఎబిపి స్టార్ ప్రెజంటెర్ రుబిక లియాకత్ సైతం ప్రధాని మోదీ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. దసోతో కుదుర్చుకున్న కొత్త ఒప్పందం అనిల్ అంబానీకి అనుకూలంగా కుదుర్చుకున్నది కాదా అని ప్రశ్నించినందుకు ఆమె తీవ్ర వ్యతిరేకత నెదుర్కోవలసివచ్చింది. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ప్రభుత్వ వైఖరి మరింత కఠినమయింది. రాఫెల్ ఒప్పందాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకున్న రాహుల్ గాంధీని, రెండు సంవత్సరాల అనంతరం కూడా అధికారపక్షం వారు తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నారు. రాఫెల్‌ను ఒక ఎన్నికల అంశంగా, ఒక రాగా (రాహుల్ గాంధీ) అంశంగా మాత్రమే పరిగణించడమే మీడియాకు క్షేమకర విషయంగా ఉన్నది. ఒక కుంభకోణంగా లేదా నిశిత పరిశోధనకు అవకాశం గల అంశంగా భావిస్తే ఇబ్బందులు ఎదుర్కోవలసిరావడం అనివార్యమవుతోంది. 


కానీ నిజం దాచేస్తే దాగుతుందా? ఫ్రెంచ్ వెబ్‌సైట్ ‘మీడియా పార్ట్’ రాఫెల్ ఒప్పందంపై సంచలనాత్మక కథనాలను ప్రచురించింది. ఆ యుద్ధ విమానాల తయారుచేసే దసో కంపెనీ 2017లో ఒక భారతీయ మధ్యవర్తికి పదిలక్షల యూరోలను చెల్లించినట్టు వెల్లడించింది. ఆ మధ్యవర్తి గతంలో జరిగిన రక్షణ కొనుగోళ్ళ కుంభకోణాలలో కూడా నిందితుడు కావడం గమనార్హం. దసో తనకు ఇచ్చిన ముడుపులకుగాను ఒప్పంద చర్చల్లో పాల్గొన్న భారతీయ ప్రతినిధి బృందపు రహస్య డాక్యుమెంట్లను అతడు ఆ కంపెనీకి అప్పగించినట్టు మీడియాపార్ట్ ఆరోపించింది. కాప్టర్‌గేట్‌గా పేరు పొందిన ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తుకు సంబంధించిన పత్రాల ఆధారంగా మీడియా పార్ట్ రాఫెల్ అవినీతిని బహిర్గతం చేయగలిగింది. 


రాఫెల్ ఒప్పందంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు మీడియా పార్ట్ సంచలనాత్మక కథనాల అనంతరం, ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మరింత దృఢంగా కనిస్తున్నాయి. ప్రధానమంత్రి మొదటి ప్రతివాదిగా ఒక కొత్త పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఎంతైనా ఉంది. దీని వల్ల, గత సార్వత్రక ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలు రుజువయినట్టు భావించనవసరం లేదు. అయితే ప్రధానమంత్రి కార్యాలయ నిజాయితీని సంశయించక తప్పదన్న రాహుల్ మాటలో నిజం ఉందని స్పష్టమవుతుంది. చాలా మంది భారతీయ పాత్రికేయులు ఈ విషయాలను కొట్టివేస్తారనడంలో సందేహం లేదు. రాజకీయచరిత్రలో కొన్ని సంఘటనలకు ఒక విశిష్ట చరిత్ర ఉంటుంది. ఆ సంఘనటలు సంభవిస్తున్న క్రమంలో అమిత ప్రాధాన్యం కలిగినవిగా కన్పించవు. వాటర్‌గేట్ కూడా అలాంటి సంఘటనలలో ఒకటి. వివిధ కారణాల వల్ల ఆ సంఘటనలను మనం ఎంతగా ఉపేక్షించినప్పటికీ అవి అంతిమంగా చరిత్రను సృష్టిస్తాయి. సరైన వ్యక్తులు జాగరూకత, దృఢవైఖరితో వ్యవహరించినప్పుడు కేవలం ఒక వార్తగా మాత్రమే ఉన్న ఆరోపణ అంతిమంగా రాజకీయచరిత్రను సృష్టించే పరిణామంగా సంభవించే అవకాశం మెండుగా ఉంది. దేశ హితులు ముఖ్యంగా పాత్రికేయులు ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా వారిని ఉద్దేశించే ‘అది ముగిసిన వ్యవహారం కాదు. ఆ వార్తా సేకరణలోనే ఉండండి’ అని బాబ్ ఉడ్‌వార్డ్ చెప్పి ఉంటారు. 


రఘు కర్నార్డ్

 (ది వైర్) 


Updated Date - 2021-04-17T06:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising