ప్రాణవాయువు
ABN, First Publish Date - 2021-04-20T06:19:10+05:30
ఉపద్రవం ఉధృతి రోజురోజుకి పెరిగిపోతోంది. కరోనా వైరస్ మన దేశంలోకి అడుగుపెట్టి, క్రమక్రమంగా విస్తరించినప్పుడు, ప్రజలు కలవరపడినప్పటికీ...
ఉపద్రవం ఉధృతి రోజురోజుకి పెరిగిపోతోంది. కరోనా వైరస్ మన దేశంలోకి అడుగుపెట్టి, క్రమక్రమంగా విస్తరించినప్పుడు, ప్రజలు కలవరపడినప్పటికీ ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి కావలసిన సమయం చిక్కింది. వివాదాస్పదమైన లాక్‌డౌన్ నిర్ణయం కారణంగా, సమస్త వ్యవస్థలను సన్నద్ధం చేయడానికి వెసులుబాటు దొరికింది. వ్యాధి సోకినవారు, దానితో జీవన్మరణ పోరాటం చేసినవారు, దానికి బలయినవారు-.. వీరి సంఖ్యలన్నీ విపరీతంగా పెరిగేనాటికి, ఆరోగ్య వ్యవస్థలకు వ్యాధిని అదుపు చేయగలిగిన సామర్థ్యం కూడా చాలా వరకు అలవడింది. కానీ, గత నెల రోజులుగా జరుగుతున్న కొత్త వ్యాప్తి వేగం అనూహ్యంగా ఉన్నది. వైరస్ వెనుకపట్టు పట్టిందని కాస్త అలక్ష్యంగా ఉన్న వ్యవస్థలన్నిటికీ సవాల్ విసురుతోంది. గత ఏడాది కూడా కొరతలు కొంతమేరకు ఉన్నప్పటికీ, ఈసారి ఎదురవుతున్న ఆస్పత్రి పడకల కొరత, ఔషధాల కొరత, ప్రాణవాయువు కొరత తీవ్రమైనవి. కరోనా కల్లోలాన్ని ఎదుర్కొనడానికి నిజంగా మన దేశ విధానకర్తలకు ఏదైనా దూరదృష్టి కలిగిన వ్యూహం ఉన్నదా అన్న సందేహాన్ని ప్రస్తుత దుస్థితి కలిగిస్తున్నది.
ఏప్రిల్ 1వ తేదీన దేశంలో సుమారు లక్షమంది కరోనా వ్యాధి సోకినవారుండగా, ఆ సంఖ్య ఏప్రిల్ 16 నాటికి 17 లక్షలకు చేరింది. అంటే రోజుకు లక్షకు పైగా కొత్త కేసులు చేరుతున్నాయి. వచ్చే కొన్ని వారాల పాటు ఈ వేగం మరింత పెరిగేదే కానీ, తగ్గుముఖం పట్టే అవకాశం లేదు. గత ఏడాది కంటె ఈ ఏటి వ్యాధి తీరు తక్కువ ప్రమాదకరంగా, తక్కువ మృత్యుకారకంగా ఉన్నదన్న మాట నిజమే కావచ్చును కానీ, ప్రాణవాయువు, వెంటిలేటర్ వంటి వాటి అవసరం ఏమీ తగ్గలేదు. వైద్య అవసరాలను తీర్చగలిగేంత ఆక్సిజన్ అందుబాటులో లేదన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం నాడు దేశంలో 12 లక్షల మందికి టీకాలు వేశారని అధికారులు చెబుతున్నారు. ఇందులో మొదటి, రెండో విడత డోసులు రెండూ ఉండవచ్చును. దేశజనాభాలో కనీసం సగం మందికి ఇదే వేగంతో టీకాలు వేస్తే, కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. ప్రజల సుముఖత పెరిగిన కొద్దిరోజులకే టీకాల కొరత రావడం మరొక సన్నివేశం. ప్రభావశీలమైన రెండు టీకాలు మన దేశంలోనే ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, సార్వజనిక టీకాకరణ చేయడానికి సమర్థమైన వ్యూహం ప్రభుత్వం రూపొందించలేకపోయింది. ఒకవైపు వ్యాధి వ్యాప్తిని అరికట్టగలిగే కార్యక్రమంలో వెనుకపట్టు పట్టడం, మరోవైపు వ్యాధి సోకినవారికి చికిత్స విషయంలో అనేక మౌలిక వసతుల కొరత ఎదురుకావడం ఆందోళన కలిగిస్తున్నాయి.
రోజుకు 7 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తయారీ సామర్థ్యం మన దేశానికి ఉన్నది ఈ సామర్థ్యంలో 54 శాతం దాకా వినియోగించుకోవలసి వస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక వారం కిందట చెప్పింది. ఈ నెలాఖరుకు, మే నెల మొదటి వారానికి అవసరమయ్యే ఆక్సిజన్ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొన్ని తక్షణ చర్యలు తీసుకుంటున్నది. ఉత్పత్తిని పెంచడం, ఉన్న నిల్వలను అందరికీ అందుబాటులోకి తేవడం రెండూ మన దేశంలో సవాళ్లే. పన్నెండు రాష్ట్రాలు ప్రమాదం అంచున ఉన్నాయని ప్రభుత్వం భావిస్తున్నది. అవసరమైన రాష్ట్రాలు, ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే స్థలాలు ఒకటే అయితే సమస్య లేదు. కానీ, పరిస్థితి అట్లా లేదు. ఒకటి రెండు రాష్ట్రాలు మినహా తక్కిన అన్ని చోట్లకు ఆక్సిజన్ మొత్తంగా కానీ, అదనంగా కానీ బయటి నుంచి రావలసిందే. దేశంలో సుమారు 1500 ట్యాంకర్లు ఆక్సిజన్ రవాణాలోనే నిమగ్నమయ్యాయి. ఆక్సిజన్ కొరత అంటే లేకపోవడమే కాదు, సకాలానికి అందకపోవడం. పుణ్యకాలం కాస్తా రవాణాకే సరిపోవడం. రవాణాలో సమస్యలు లేకుండా చూడడానికి, బయటి నుంచి 50 వేల టన్నుల ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవడానికి, కొన్ని రకాల పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ వినియోగం నిలిపివేయడం వంటి చర్యలను కేంద్రం ప్రకటించింది. కానీ, ఈ చర్యల ఫలితాలు అనుభవంలోకి రావడానికి సమయం పడుతుంది. దేశంలో 100 ఆస్పత్రులలో సొంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకునేట్టు ‘‘పిఎం కేర్ ఫండ్’’ నుంచి నిధులు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిర్ణయం కూడా వెంటనే ఆదుకునేది కాదు. సుమారు 200 కోట్ల రూపాయల పెట్టుబడితో దేశంలో 150 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పాలని కేంద్రం పోయిన ఏడాది కరోనా తొలిదశలోనే నిర్ణయం తీసుకున్నది. కానీ, అందుకు కావలసిన టెండర్లను ఆహ్వానించడానికి 8 నెలలు తీసుకున్నది. ఆ తరువాత కూడా ఆరునెలల కాలం గడిచింది, ఎటువంటి పురోగతీ లేదు. ప్రధాని నిధిని ప్రకటించిన కొద్ది రోజులలోనే 3 వేల కోట్లు పోగుపడ్డాయి. ఆక్సిజన్ ప్లాంట్ల విషయమై సత్వరంగా వ్యవహరించకుండా ఎందుకు జాప్యం చేసినట్టు?
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ చెబుతున్నట్టు, టీకాలు, ఆక్సిజన్లూ అంతా కేంద్రప్రభుత్వం చేతిలో ఉన్న విషయాలు కావచ్చు. రాష్ట్రప్రభుత్వాలు కూడా ప్రజారోగ్య వ్యవస్థలను పటిష్ఠం చేయడంలో, బడ్జెట్ కేటాయింపులు పెంచడంలో శ్రద్ధ చూపించారని చెప్పలేము. అమలు చేయడంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉన్నదని కేంద్రం పదే పదే చెబుతోంది, కానీ, తగిన వనరులు ఇవ్వకుండా అమలులో స్వేచ్ఛ ఎందుకు? కరోనా ఉపద్రవం కాలంలో కాస్త రాజకీయాలకు విశ్రాంతి ఇచ్చి ఉండవచ్చు. కానీ, రాష్ట్రాలపై అజమాయిషీ చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. సమర్థత చూపించడం కోసమని లెక్కలను రాష్ట్రాలు తారుమారు చేస్తున్నాయి. గణాంకాలను బట్టి సహాయాలను అందిస్తామని కేంద్రం అంటున్నది. అన్ని రాష్ట్రాలకంటె ఎక్కువగా సమస్యను ఎదుర్కొంటున్న మహారాష్ట్ర, కేంద్రం నుంచి పూర్తి తోడ్పాటు దొరకడం లేదని బాధపడుతున్నది.
పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనడానికి కావలసిన వనరులను సమకూర్చుకోవడానికి, సన్నద్ధతను పెంచుకోవడానికి ప్రజాజీవితంలో ఉన్న అధికార, అనధికార ముఖ్యులందరూ రంగంలోకి దిగకపోతే, భవిష్యత్తులో పశ్చాత్తాపమే మిగులుతుంది.
Updated Date - 2021-04-20T06:19:10+05:30 IST